ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Ranganayakamma Revolutionary Movements : విప్లవ నాయకుల లొంగుబాట్లు అప్పుడూ ఇప్పుడూ

ABN, Publish Date - Nov 09 , 2025 | 05:02 AM

ఇటీవల మావోయిస్టు పార్టీలోని కొందరు ‘అగ్ర’నాయకులు ప్రభుత్వానికి లొంగిపోయినప్పటి దృశ్యాలూ, వార్తలూ కొన్ని చూశాను. వాటిని చూశాక, మార్క్సిజంతో ఏకీభావం వున్న వ్యక్తిగా...

ఇటీవల మావోయిస్టు పార్టీలోని కొందరు ‘అగ్ర’నాయకులు ప్రభుత్వానికి లొంగిపోయినప్పటి దృశ్యాలూ, వార్తలూ కొన్ని చూశాను. వాటిని చూశాక, మార్క్సిజంతో ఏకీభావం వున్న వ్యక్తిగా, నాకు తోచింది చెప్పాలనిపించింది.

మావోయిస్టు పార్టీ నాయకులు, 2000లోనూ, 2004లోనూ, బూర్జువా ప్రభుత్వాలతో చర్చలు జరపాలనుకున్నప్పుడు, నేను పత్రికల్లో 5 వ్యాసాలు రాశాను. ‘చర్చలు జరగవలిసింది ప్రభుత్వంతో కాదు, తోటి విప్లవ గ్రూపులతో’ అన్నది ఆ వ్యాసాల సారాంశం. అలాగే, అబద్ధపు ఎన్‌కౌంటర్లు జరిగినప్పుడు గతంలోనూ, ఇటీవల కాలంలోనూ కూడా నేను ప్రభుత్వాలను ఖండిస్తూనూ; మావోయిస్టుల అవగాహనలోనూ, ఆచరణలోనూ కనపడే లోపాలను విమర్శిస్తూనూ కూడా 5, 6 వ్యాసాలు రాశాను. పెద్ద ఎత్తున లొంగుబాట్లు జరుగుతున్న ఈ సందర్భంలో, చర్చించవలిసిన విషయాలు ఎన్నో వున్నా, విప్లవ నాయకుల లొంగుబాట్లలో కనపడే తేడాల గురించి మాత్రమే చెప్పదల్చుకున్నాను.

(1) గతంలో, అగ్ర నాయకులు లొంగిపోయేటప్పుడు కొంచెం సిగ్గు మొహాలతో కనిపించేవారు. ఇప్పుడు ఏ మాత్రమూ సిగ్గూ, బిడియమూ లేకుండా, ముఖ్యమంత్రులనూ, పోలీసు ఉన్నతాధికారులనూ ఆనుకుని, ఫొటోలూ, చిరునవ్వులూ, కరస్పర్శలూ, లాల్ సలామూలూనూ! అంతేనా? ఏ రాజ్యాంగాన్నయితే, ‘దోపిడీ వర్గ రాజ్యాంగం’ అన్నారో, ఆ పుస్తకాన్నే, ‘దోపిడీ వర్గ ప్రతినిధులైన’ ముఖ్యమంత్రుల చేతుల్నించీ, వినయంగా స్వీకరించడం! (2) గతంలో, లొంగిపోయేటప్పుడు, అనారోగ్య సమస్యలతో లొంగిపోతున్నట్టు చెప్పేవాళ్ళు, పత్రికల వారి ముందు. ‘అనారోగ్యమే సమస్య అయితే, పార్టీకీ, ప్రజలకీ చెప్పి, వేరేవిధంగా సమస్యను పరిష్కరించుకోవచ్చుగదా? ప్రభుత్వం దగ్గరికి వచ్చి లొంగిపోవడం ఎందుకు?’– అనే ప్రశ్న వస్తుందనే ఆలోచనే లేదు అప్పుడూ, ఇప్పుడూ కూడా! ఇప్పుడైతే, గడుసుగా, ఎటువంటి జంకూ గొంకూ లేకుండా, ‘ఇది లొంగుబాటు కాదు. జనజీవన స్రవంతిలోకి వచ్చాము. మేము మావోయిస్టు సిద్ధాంతాన్ని వదిలిపెట్టలేదు. కాకపోతే ఇప్పుడు ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజలకోసం పోరాడుతాం’ అని దబాయిస్తున్నారు. ‘జనాల మధ్యకొచ్చి పనిచేస్తాము–అంటున్నారు కదా? ఇప్పటిదాకా పనిచేసింది ఆదివాసీల మధ్యనే కదా? మరి, ఆదివాసీలు జనాలు కాదా?’ అని ఏ పత్రికా విలేకరీ అడగటం లేదు. (3) గతంలో, లొంగిపోయిన వారికి, వారి తలలకి లక్షల్లో వెలలు కట్టి, ఆ డబ్బుల్ని, లొంగిపోయిన కొన్నాళ్ళకుగానీ ఇచ్చేవి కావు ప్రభుత్వాలు. ఇప్పుడు, చెక్కులు అయితే డబ్బులుగా మార్చుకోవడానికి ఆలస్యం అవుతుందని, ఏకంగా డిమాండ్ డ్రాఫ్టులనే ఇచ్చేస్తున్నారు. హవ్వ! డబ్బుకోసం లొంగుబాట్లా? అంటే... ఇప్పటిదాకా, బూర్జువా పార్టీ నాయకులే డబ్బుకి అమ్ముడుపోతారని జనాలు అనుకునేవారు. ఇప్పుడు, అమ్మకానికి ‘విప్లవ’ నాయకులు కూడా కొందరు సిద్ధమేనేమో–అని జనాలు సందేహించాల్సివస్తోంది! (4) గతంలో, అడివిలోనే ఉండిపోయే పార్టీవారికి తమ ఆయుధాలు అప్పగించి, ఉత్తచేతులతో లొంగిపోయేవాళ్ళు. ఇప్పుడు ఆయుధాల్ని శుభ్రం చేసి, గెరిల్లా యూనిఫారాలు తొడుక్కుని మరీ, చిరునవ్వులు చిందిస్తూ, తలలు వంచి ఆయుధాలను ముఖ్యమంత్రులకు అందిస్తున్నారు.

(5) ‘ఇంతకాలమూ జరిపిన ఉద్యమంలో తప్పులు జరిగాయి. ఇప్పటి పరిస్థితుల్లో సాయుధ పోరాట మార్గం సరైనది కాదు. పార్టీతో మాకు విభేదాలున్నాయి’– అని లొంగిపోయిన వాళ్ళు అనడం అప్పుడూ వుంది, ఇప్పుడూ వుంది. ‘ఆ తప్పులు దిద్దుకుని, వేరే పోరాట మార్గం ఎంచుకోవచ్చునుగా, ప్రభుత్వానికి లొంగిపోవడం ఎందుకు?’ అనే ప్రశ్నలు పత్రికా విలేకరులు వెయ్యరనే ధీమా! (6) విప్లవ నాయకుల్ని అభిమానిస్తూ, మైదాన ప్రాంతాలలో వుంటూ, వారికి సహకరించే పనులు చేతనైనంత చేస్తూ, ప్రభుత్వ వేధింపులకు గురిఅయ్యేవారు ఎవరన్నా ఇలా అడిగారనుకోండి: ‘అదేమిటి కామ్రేడ్? వీర విప్లవ నినాదాలు చేసి, ఇప్పుడు ఇలా లొంగిపోవడం ఎందుకు?’ అని అడిగారనుకోండి! ఇలా అడిగినప్పుడు, గతంలో లొంగిపోయిన నాయకులు, దబాయింపులు లేకుండా మిన్నకుండేవారు. ఇప్పటి లొంగిపోయిన నాయకులైతే ఆగ్రహిస్తూ, ‘హైదరాబాదులో కూచుని, ఇక్కడి సమస్యలు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడమేమిటి?’- అంటున్నారు. విప్లవాభిమానులు ఎవ్వరూ కూడా, వీరిని ఉద్యమాల్లోకి వెళ్ళమని బలవంతపెట్టలేదే? అక్కడ సమస్యలు వుండితీరతాయని వీరికి తెలియదా? ‘విప్లవమంటే విందు భోజనం కాదని’ 1927 లోనే మావో అన్నాడని తరచూ ఉటంకించిన పార్టీలో ఎంతోకాలంగా పనిచేసిన వారే కదా వీరు? మరి ప్రశ్నించే విప్లవాభిమానుల మీద ఆగ్రహం ఎందుకు? లొంగిపోయిన నాయకులు ఒక్కొక్కరూ, ముప్పయ్యేసీ, నలభయ్యేసీ ఏళ్ళపాటు, అనేక కష్ట నష్టాలు ఓర్చి నిలబడినందుకు, విప్లవాభిమానులకు వీరంటే ఇప్పటిదాకా గౌరవమే! కానీ, అన్నేళ్ళ త్యాగాల్నీ, దోపిడీవర్గ పాలకుల పాదాక్రాంతం చేసినందుకే దిగ్భ్రాంతి! (7) ఇప్పుడు లొంగిపోయిన నాయకులు, ‘కగార్ పేరుతో సాగుతున్న నిర్బంధాన్ని తట్టుకోవడం కష్టం. కార్యకర్తల్ని రక్షించుకోవడం కోసమే ప్రభుత్వం పిలుపు మేరకు మేము సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నాం. మావోయిజాన్ని వదిలేది లేదు’ అని ప్రగల్బాలు పలుకుతున్నారు. ఈ ప్రగల్బాల మీద, ఎన్ని ప్రశ్నలైనా వెయ్యవచ్చును. గత ప్రభుత్వం ‘గ్రీన్ హంట్’ పేరుతో నిర్బంధాన్ని అమలు చెయ్యలేదా? 1969 నించీ ఎన్ని వేలమంది ఉద్యమకారుల్ని అబద్ధపు ఎదురు కాల్పులలో ప్రాణాలు తియ్యలేదూ, ఈ ప్రభుత్వాలు? అయినా, నిర్బంధాలనించీ తప్పించుకోవడానికి లొంగుబాటు తప్ప ఇంకో మార్గం వుండదా? దేశభక్తి మత్తులో తేలియాడే పాటే అయినప్పటికీ, ‘షకీల్ బదాయునీ’ అనే కవి రాసిన, చాలా ప్రసిద్ధి చెందిన ఒక పాటలో, ఒక చరణం ఇలా వుంటుంది: ‘మా తలలను నరకగలరేమో గానీ, మా తలలను వంచలేరు!’ అని. (‘సర్ కటా సక్ తే హై, లేకిన్ సర్ ఝుకా నహీ సక్ తే!’). అంతేనా? ఈ కాలపు నియంతలకన్నా, పెద్ద నియంత ఇటలీ ముస్సోలినీ, లిబియా స్వాత్రంత్ర్య యోధుల మీద అమలుపరిచిన నిర్బంధాన్ని వ్యతిరేకించిన లిబియా తిరుగుబాటు నాయకుడు ‘ఉమర్ ముఖ్తార్’ ఏమి చేశాడు లొంగిపొమ్మన్నప్పుడు? ‘లొంగిపోయే సమస్యే లేద’న్నాడు. ఆ మాటమీదే నిలబడి 73 ఏళ్ళ వయసులో, ఉరికంబం ఎక్కాడు? అతను ఎన్నడూ, ‘‘ఊగరా, ఊగరా! ఉరికొయ్య అందుకుని ఊగరా!’’ అని, పాడిన మావోయిస్టు కాడు. అతడు, వ్యక్తిగా సాధారణ మత గురువు. ఇటలీ సామ్రాజ్యవాద పాలననించీ నామమాత్రపు రాజకీయ స్వాతంత్ర్యం కోసం పోరాటం నడిపిన ఉద్యమకారుడు. అయినా, ఇప్పుడు వీరిని ఉరికంబాలు ఎక్కమనీ ఎవ్వరూ అడగడం లేదు. కానీ, లొంగుబాటు తప్ప, వేరే దిద్దుబాట మార్గం వుండదా? పైగా, చాలా ఏళ్ళుగా, పోరాట మార్గం విషయమై ఆలోచిస్తున్నట్టు వీరే చెప్పుకుంటున్నారు!

చివరిగా, మావోయిస్టు పార్టీ వారిని ఉద్దేశించి, ఎప్పుడో, పాతికేళ్ళనాడు (2000లో), నేను రాసిన మాటల్నే ఈనాడు తిరిగి చెప్పదలిచాను. ‘‘మహా విప్లవకారులుగా ఎంతో కాలం చలామణీ అయిన మీ వెనకటి నాయకులు, పోలీసులకు తమని తాము అప్పజెప్పుకుని, డబ్బు దండుకుని, బిజినెస్‌లు చేసుకుంటూనో, వడ్డీ వ్యాపారాలు చేసుకుంటూనో, ‘మార్క్సిజం’ అనే మాట కూడా పిల్లల చెవిన పడనివ్వకుండా, పుట్టినరోజు ఫంక్షన్లతో వారిని ఆనంద పెడుతూ కాలం గడిపేస్తున్నారు. ఇంత పతనానికి మూలాలు ఎక్కడ వున్నాయో మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మీ కార్యకర్తల్లోనే అపారంగా జరిగిన త్యాగాలూ, సాహసాలూ, మరణాలూ వృథా ఎందుకు అయిపోతున్నాయో, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఎందుకు పడివుంటున్నదో గ్రహించుకోండి! రష్యా చైనాలు ఎందుకు కుప్పకూలాయో, ప్రతీ విప్లవ గ్రూపూ ఎందుకు చీలికలూ పీలికలూ అవుతోందో, కారణాలు కనిపెట్టండి! అడుగడుగునా ఫోజులూ, డంబాచారాలూ, ఆత్మ స్తుతులూ, ప్రగల్భాలూ, వ్యక్తి పూజలూ, ఇవేవీ ఒక్క అడుగు కూడా ముందుకు తీసుకుపోలేవని గ్రహించండి! చేసిన తప్పులకు సిగ్గుపడడం, దిద్దుకోవడం, సిద్ధాంత జ్ఞానం, ఇతర విప్లవ గ్రూపులతో ఐక్యతా– ఇవి మాత్రమే విప్లవ మార్గాన్ని బలహీనతల నించి రక్షిస్తాయి.

విప్లవ గ్రూపుల్లో ఎక్కడ ఎన్ని తప్పులు జరిగినా, ఎవరితో ఎవరెంత విభేదించినా, ఎంత అస్పష్టంగానైనా అందరికీ ఒకే లక్ష్యమూ, ఒకే గమ్యమూ వున్నాయి. ఆ లక్ష్యానికి అంకితమైన జనాభా వుంది. జరగవలసిందంతా ఆ జనాభా మధ్య ఐక్యత! దాని కోసం ఎన్ని చర్చలైనా చెయ్యండి! ఎన్నిసార్లు విఫలమైనా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించండి! ఆశలన్నీ విప్లవకారుల ఐక్యత మీదే పెట్టుకోండి! అది ఒక్కటే సరైన మార్గం! ఏకైక మార్గం! ముందడుగులు వెయ్యలేకపోతే, అది నేరం కాదు. వెనకడుగులు వెయ్యడం మాత్రం నేరమే!’’

రంగనాయకమ్మ

ఇవి కూడా చదవండి...

ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి.. ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు

జగన్ హయాంలో సహకార, వ్యవసాయ పరపతి సంఘాల్లో అవినీతికి పాల్పడ్డారు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 09 , 2025 | 05:07 AM