Talent of Persons with Disabilities: వికలాంగుల ప్రతిభను గౌరవించాలి!
ABN, Publish Date - Dec 03 , 2025 | 02:39 AM
కొన్నిసార్లు శరీర లోపాలను చూసి మనుషులను తక్కువగా అంచనా వేస్తాం. కానీ చరిత్ర చెబుతుంది-– ప్రపంచాన్ని మార్చిన మహానుభావుల్లో ఎంతమంది వికలాంగులు ఉన్నారో.....
కొన్నిసార్లు శరీర లోపాలను చూసి మనుషులను తక్కువగా అంచనా వేస్తాం. కానీ చరిత్ర చెబుతుంది-– ప్రపంచాన్ని మార్చిన మహానుభావుల్లో ఎంతమంది వికలాంగులు ఉన్నారో. ఆ లోపం వారికి అడ్డంకి కాలేదు. వారు ముందుకు సాగడంలో అత్యంత అడ్డంకి శారీరక లోపం కాదు, సమాజపు దృక్కోణమే. అంగవైకల్యం శరీరంలో ఉండాలి గాని, మనసులో కాదు. మనసులో ధైర్యం ఉన్న వారికి ప్రపంచం కూడా నమస్కారం చేస్తుంది.
వికలాంగులు ఏ పని చేయలేరని కాదు, చేయనివ్వకపోవడం మనం చేస్తున్న పెద్ద తప్పు. అవకాశం ఇచ్చే చేయి, ప్రోత్సహించే మాట, అంగీకరించే మనసు– ఇవే వారికి నిజమైన ఆసరాలు. ప్రేమ, ఆదరణ, గౌరవం– ఇవి ఎడతెగని మానవ హక్కులు. వికలాంగులకు ఇవి దయ కాదు, వారి హక్కులు. ప్రభుత్వం ఇటీవల వికలాంగులకు కల్పిస్తున్న రాయితీలు, పింఛన్లు, విద్యా సదుపాయాలు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, వైద్య పరికరాలు వంటి పథకాలు ఎంతో అభినందనీయం. కానీ పథకాలు పెరగడం సరిపోదు, వాటి చేరువ పెరగాలి. గ్రామాల దాకా, ప్రతి వ్యక్తికీ అవి చేరాలి.
వికలాంగుల విద్య మనకు ఒక గొప్ప బాధ్యత. పాఠశాలల్లో వారికి ప్రత్యేక తరగతులు, సహాయక ఉపాధ్యాయులు, ప్రత్యేక వనరులు అవసరం. చదువుతో వారు సమర్థులవుతారు, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగావకాశాలు వికలాంగులను ఆధారపడే స్థితి నుంచి ఆత్మగౌరవం దిశగా తీసుకెళ్తాయి. వారి కోసం రూపొందించే ప్రభుత్వ భవనాలు, పాఠశాలలు, కార్యాలయాలు, ఆసుపత్రులు, ప్రయాణ సదుపాయాలు వికలాంగులకు సౌకర్యం కలిగించే విధంగా ఉండాలి. ఒక ర్యాంప్ వారు నడవడానికి కాదు, వారి గౌరవం కోసం నిర్మించాలి. వికలాంగులపై కనికరం చూపడం కాదు, మనతో వారిని సమానంగా చూడడం నేర్చుకోవాలి. వారు సమాజానికి ఒక ఆస్తి. వారిలో ప్రతిభను కనుగొనడానికి మనకు మంచి సంకల్పం కావాలి. మానవత్వం అనేది మాటల్లో కాదు, అండగా నిలిచే చిన్న చిన్న పనుల్లో ఉంటుంది.
డిసెంబర్ 3ను ఒక ఉత్సవంలా జరపడం కాదు, ఒక ప్రమాణంలా స్వీకరించాలి. మనం ఎక్కడ ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, ఒక వికలాంగుడికి సహాయం చేయడానికి ముందుండాలి. వికలాంగుల ఆనందం మన ఆనందంగా భావించే రోజు వచ్చినప్పుడు, అదే నిజమైన వికలాంగుల దినోత్సవం.
– తరిగోపుల నారాయణస్వామి
(నేడు ప్రపంచ వికలాంగుల దినోత్సవం)
Updated Date - Dec 03 , 2025 | 02:39 AM