Rebellions Without Reform: విధానాలను మార్చని యువత తిరుగుబాట్లు
ABN, Publish Date - Sep 17 , 2025 | 02:48 AM
కాలక్రమేణా శరవేగంగా అందుబాటులోకి వస్తున్న సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సామాజిక మాధ్యమాల వలన సమాచారం కూడా ప్రజలకు చేరువవుతోంది. ప్రత్యేకించి యువతకు సామాజిక మాధ్యమాలతో అనుబంధం బలపడుతోంది. ఈ మాధ్యమాల ద్వారా వెలువడుతున్న...
కాలక్రమేణా శరవేగంగా అందుబాటులోకి వస్తున్న సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సామాజిక మాధ్యమాల వలన సమాచారం కూడా ప్రజలకు చేరువవుతోంది. ప్రత్యేకించి యువతకు సామాజిక మాధ్యమాలతో అనుబంధం బలపడుతోంది. ఈ మాధ్యమాల ద్వారా వెలువడుతున్న సమాచారంపై విశ్వసనీయత ఏ విధంగా ఉన్నా, అది కొన్ని సందర్భాలలో ప్రభుత్వాల పతనానికి కూడా దారితీస్తోంది. ఇందుకు తాజాగా నేపాల్‌లో సంభవించిన పరిణామాలే నిదర్శనం.
పొరుగున ఉన్న నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకలోనూ దూరాన ఉన్న ఈజిప్టు, ట్యునీషియాలోనూ ప్రజాగ్రహం పెల్లుబికి ప్రభుత్వాలు పతనం కావడానికి యువజనులు, సామాజిక మాధ్యమాలే కారణమంటే సత్యదూరం కాదు. మాతృదేశాలలో ఉపాధి అవకాశాలు సన్నగిల్లి విదేశీబాట పట్టిన యువత ఆ ఆందోళనల్లో కీలకపాత్ర వహించిందనే విషయం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం నేపాల్‌లో జరిగిన తిరుగుబాటులోనూ ప్రవాస నేపాలీ యువత ప్రత్యేకించి ఖతర్, ఇతర గల్ఫ్ దేశాలలో పనిచేస్తున్న యువ నేపాలీలు క్రియాశీలకపాత్ర వహించారనే విషయం విశాల ప్రపంచానికి అంతగా తెలియదు.
15 సంవత్సరాల క్రితం ట్యునీషియాలోని ఒక మారుమూల ప్రాంతంలో వీధుల్్లో పండ్లు, రొట్టెలు విక్రయించుకుంటూ జీవించే 26 ఏళ్ళ మహమ్మద్ బజౌజీ అనే యువకుడు నిబంధనల పేర అధికారులు తనను వేధించిన తీరుకు నిరసనగా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సామాజిక మాధ్యమాల ద్వారా బహిర్గతం కావడంతో అరబ్బు దేశాలలో అలజడి చెలరేగింది. కొన్ని దేశాలలో ప్రభుత్వాలు కూలిపోయాయి. ప్రభావశీలురు అయిన దేశాధినేతలు అధికార పీఠాల నుంచి దిగిపోవల్సివచ్చింది. దీంతో అనేక దేశాలు తమ యువతకు ఉపాధికల్పన దిశగా విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టాయి.
అప్పటి వరకు విషాన్ని వెదజల్లుతూ వికృత పోకడలకు తావిచ్చే సాధనాలుగా అపకీర్తి పొందుతున్న సామాజిక మాధ్యమాలు జాతి నిర్మాణ బాధ్యతలపై యువతలో శ్రద్ధాసక్తులు పెంపొందించడంలో నిర్ణయాత్మక పాత్ర పోషించగలుగుతాయని బజౌజీ ఉదంతంతో లోకానికి తెలిసివచ్చింది.
ఒక పేద వీధి విక్రేత మరణం, ఈజిప్టు అధినేతగా ఉన్న హుస్ని ముబారక్‌ను పదవీచ్యుతుడిని చేసిందంటే యువతపై సామాజిక మాధ్యమాల ప్రభావం ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇది అరబ్బు దేశాలకు మాత్రమే పరిమితం కాలేదు. భారతీయ రాజకీయాలలోనూ సామాజిక మాధ్యమాల పాత్రను తక్కువగా ఊహించలేము. దశాబ్దం క్రితం కాంగ్రెస్ పతనానికి దారి తీసిన అన్నా హజారే అవినీతి నిర్మూలనోద్యమం దరిమిలా తాము ఓడిపోవడానికి యూట్యూబ్ చానెళ్లు ప్రధాన కారణమని తెలుగునాట ఒక ప్రముఖ నాయకుడు వాపోవడం విస్మరించలేని విషయం.
పాలకుల వైఖరికి భిన్నమైన వాదన కూడా ప్రజల్లోకి వెళ్ళడానికి సామాజిక మాధ్యమాలు ఉపకరిస్తున్నాయి. సహజంగానే వాటిపై పట్టు సాధించడానికి పాలకులు ప్రయత్నించడం కద్దు. అలనాటి కాలంలో బ్రిటిష్ పాలకులు టెలిగ్రాఫ్, ప్రచురణలపై నిఘా వేసినట్లుగా నేటి కాలంలో వ్యక్తిగతంగా వినియోగించే వాట్సాప్ నుంచి ‘ఎక్స్’ వరకు ప్రతి దానిపై పాలకులు కన్నేసి ఉంచుతున్నారు.
ప్రజాక్షేత్రంలో కనీస గౌరవ మర్యాదలను మంటగలుపుతూ, సామాజిక కట్టుబాట్లను ఉల్లంఘిస్తూ విచ్చలవిడిగా ప్రవర్తించే సామాజిక మాధ్యమాలపై నియంత్రణ అనేది అవసరమే, సందేహం లేదు. అయితే దాన్ని తమపట్ల అసమ్మతి గళానికి అడ్డుకట్ట వేస్తూ వేధింపులకు వాడుకోవడంతోనే అసలు సమస్య మొదలవుతున్నది, ఇప్పుడు నేపాల్‌లో జరిగింది ఇదే.
వాస్తవానికి నేపాల్‌లో సామాజిక మాధ్యమాలపై విధించిన ఆంక్షలు భారత్ తదితర దేశాలలో కంటే భిన్నంగా ఏమీ లేవు. కానీ పరిపక్వత కలిగిన సమాజం, పరిణతి చెందిన రాజకీయ నాయకత్వం పాలకుల చతురత ఇత్యాది కారణాల వలన ఈ ఆంక్షలు భారత్‌లో అంతగా వెలుగులోకి రాలేదని చెప్పవచ్చు. పైగా వాణిజ్య ప్రకటనల రాబడి దృష్ట్యా కూడా భారత్‌ను నేపాల్ లేదా ఇతర దేశాలతో పోల్చలేమనే విషయాన్నీ గమనించాలి.
మరోవైపు సరైన దశ–దిశ లేకుండా ఈ దేశాలలో యువజనులు చేసిన పోరాటాలన్నీ ఆశయ సాధనలో విఫలమయ్యాయి. ఈ కఠోర సత్యాన్ని విస్మరించకూడదు. ఆగ్రహంతో పాలకులను దించడం కంటే పాలనా విధానాలలో ఎంత వరకు మార్పు తీసుకువచ్చామనేది ముఖ్యం. అయితే దురదృష్టవశాత్తు భారత్‌లో 1977 అత్యవసర పరిస్థితి నాటి నుంచీ నేటి నేపాల్ సంక్షోభం దాకా యువత ఈ వాస్తవాన్ని గుర్తించడం లేదు. ప్రపంచంలో ప్రప్రథమంగా యువతరం వారి ఇటువంటి తిరుగుబాట్లకు శ్రీకారం చుట్టిన ప్రవాస ఈజిప్షియన్ వాయిల్ ఘోనెమి ప్రస్తుత పరిస్థితి ఏమిటని ఒక్కసారి తెలుసుకుంటే యువజనులు ఆవేశంగా కాకుండా ఆలోచనాత్మకంగా వ్యవహరించవల్సిన అగత్యం అర్థమవుతుంది.
మొహమ్మద్ ఇర్ఫాన్
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)
ఇవి కూడా చదవండి..
ఆపరేషన్ సిందూర్‌లో మసూద్ అజార్ కుటుంబం ముక్కచెక్కలు.. వెల్లడించిన జైషే కమాండర్
భారత్‌తో మా బంధాన్ని తెంచేందుకు చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి: రష్యా విదేశాంగ శాఖ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయం
Updated Date - Sep 17 , 2025 | 02:49 AM