ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Sumati Shatakam Analysis: సుమతీ శతకంలో చేరని పద్యాలు

ABN, Publish Date - May 05 , 2025 | 03:31 AM

సుమతీశతకం యొక్క తాళపత్ర ప్రతులలో ఉన్న, ముద్రిత సంచికల్లో లేకపోయిన పద్యాలను భట్టు వెంకటరావు ఎంపిక చేసి భావవివరణతో అందించారు. ఈ పద్యాలు 1811లో కరుటూరి అచ్చన రాసిన తాళపత్ర ప్రతిలో లభించాయి, వాటిలో కొన్నింటి చివరి పాదాలు మాత్రమే నష్టపోయినవిగా ఉన్నాయి.

ప్పుడు మనకి దొరికే ‘సుమతీశతకం’ పుస్తకం లోని 100 లేక 107 పద్యాలను పంతొమ్మిదవ శతాబ్దం పూర్వార్థంలో నాటి పండితులు తాళపత్రాలలో దొరికిన 150 పైచిలుకు పద్యాలలోంచి ఏరి ఒకచోట కూర్చారు. ఇందులో చేరని పద్యాలు కొన్ని ఇప్పటికీ ఆ తాళపత్ర గ్రంథాలలోనే ఉండిపోయాయి. చెన్నైలోని ‘ప్రభుత్వ ప్రాచ్య లిఖిత భాండాగారం’లో ‘సుమతీశతకం’ పూర్వ ప్రతులు మూడు ఉన్నాయి. వాటిల్లో ఒకటి తాళపత్ర ప్రతి. మిగతావి రెండు రాత ప్రతులు. ఈ రెండు రాతప్రతులు సిపి బ్రౌన్ తయారు చేయించినవి. ఇందులోని ఒక ప్రతిలో ‘సుమతీశతకం’ పద్యాలకు బ్రౌను ఆంగ్లానువాదం కూడా ఉంది. రెండవది ‘సుమతీశతకం’ పద్యాల పద సూచి (word index).

ప్రమోదూత నామ సంవత్సరం, ఫాల్గుణమాసం, బహుళ పంచమీ శుక్రవారం వరకు కరుటూరి అచ్చన రాయడం పూర్తి చేసిన తాళపత్ర ప్రతిలో 115 పద్యాలు ఉన్నాయి (ప్రమోదూత సంవత్సరాలు మనకు 1990–91, 1930–31, 1870–71, 1810–11, 1750–51... ఇలా వచ్చాయి. వాటిల్లో ఫాల్గుణమాసం, బహుళ పంచమి శుక్రవారానికి 1811 ఫిభ్రవరి 15వ తేదీ సరిపోతుంది). బ్రౌను తయారు చేయించిన ‘సుమతీశతకం’ రాత ప్రతికి ఆధారమైన మూల ప్రతి ఏదో తెలియదు. బ్రౌను ‘సుమతీశతకం’ రాత ప్రతిలో 150 పద్యాలు ఉన్నాయి. ఈ రెండు ప్రతులలోని పద్యాలను పోల్చి చూసుకుంటే బ్రౌను రాతప్రతిలో లేని పద్యాలు కొన్ని అచ్చన రాసిన తాళపత్ర ప్రతిలో ఉన్నాయి. అలాగే అచ్చన తాళపత్ర ప్రతిలో లేని పద్యాలు కొన్ని బ్రౌను రాతప్రతిలో ఉన్నాయి. అయితే, ప్రస్తుతానికి బ్రౌను తయారు చేయించిన ‘సుమతీ శతకం’ రాత ప్రతిలో లేకుండా, కరుటూరి అచ్చన 1811 ఫిబ్రవరిలో రాసిన తాళపత్ర ప్రతిలో ఉన్న పద్యాలను ఎంచి చూపించడం ముఖ్యమని నాకు అనిపించింది. కారణం– ఆ పద్యాలు ఇప్పటి దాకా ఆ తాళపత్ర ప్రతిలోనే ఉండిపోయాయి.


ఆ పద్యాల్లో కూడా కొన్ని పద్యాలు పరిష్కరణకు వీలుకాకుండా ఉన్నాయి. కారణం ఏమిటంటే, తాళపత్ర ప్రతిలో రెండు పత్రాలు పద్యం అంతమయ్యే వైపు మూలల్లో పురుగుపట్టి, పద్యంలో చివరి పాదం మూడు వంతులు కనపడకుండా అయిపోయాయి. అలా కొన్ని పద్యాలు పోగా, పూర్తిగా కొత్తవైన పది పద్యాలను స్వల్ప భావ వివరణతో ఇక్కడ ఇస్తున్నాను. ప్రతి పద్యం నాల్గవపాదం చివరన బ్రాకెట్లలో ఉన్నది తాళపత్ర ప్రతిలోని పద్య సంఖ్య.

కం. భూమీశు చిత్త మెరుగక ప్రేమముతో మనవి జెప్ప బెడగుట లెల్లం పాముకు వాకట్టెరుగక సామున చెయిచాచినట్టి చందము సుమతీ! (104) ‘వాకట్టు’ అంటే పాము విషానికి విరుగుడైన ‘వాకట్టువేరు’. రాజు సంతోష చిత్తుడై ఉన్నాడో లేడో గ్రహించకుండా ఉల్లాస పరిచే సంగతులు చెబుతూ మధ్యలో తన కోరికను వెళ్ళబు చ్చడం ఎలాంటిదంటే– ఆ వాకట్టువేరు దగ్గర లేకుండా పాము ముందు సాహసంతో చేయి చాచడం వంటిది, అని భావం.

కం. తప్పునకు తగిన దండన యప్పుడు శాయంగవలయు నవనీశుకున్ నిప్పుననుచీర జుట్టిన యాపగిదిని శాయవలయు నారను సుమతీ! (112) కట్టుకున్న చీరకు నిప్పు అంటుకుంటే ఆర్పడానికి ఎంత తొందరగా పూనుకుంటామో, అంతే తొందరను తప్పు చేసిన వ్యక్తిని దండించడంలోనూ చూపించాలి అని భావం.


కం. నగజాతకు హరుమేనను సగబాలిప్పించె మరుడు; చచ్చిన పిదపన్ పగసాధింపని మనుజుడు మగవాడా మగువగాక మహిలో సుమతీ! (105) శివపార్వతులకు జన్మించిన పుత్రుడి వలనే తారకాసురుడి బాధ తొలగుతుందని తెలిసిన ఇంద్రుడు, మన్మథుడిని శివపార్వతుల వద్దకు పంపాడు. కఠోర తపస్సులో ఉన్న శివుడు మూడవకన్ను తెరిస్తే మన్మథుడు భస్మం అయ్యాడు. చివరకు పార్వతి అభ్యర్థనతో మన్మథుడు అనంగుడవగా, పార్వతి శివుడిని చేరింది. వారి పుత్రుడు కుమారస్వామి తారకా సురుడి బాధను తొలగించాడు. ఈ కథ ఆధారంగా– మన్మథుడు మరణించి అనంగుడై నప్పటికీ పార్వతిని శివుడిలో సగ భాగం చేసి తన పగ తీర్చుకున్నాడు కదా! అని ఈ పద్యం చమత్కరిస్తుంది. మరణించినప్పటికీ పగసాధించడమే పురుష లక్షణం అని ఇందులో భావం.

కం. అరమాడజీతమైనను ధరణీశుడు తగవరైన దగ్గిరవచ్చున్ సురరాజ్యమిచ్చె నేనియు తరమెరుగని రాజు కొల్వు తగదుర సుమతీ! (107) ‘తగవరి’ అంటే రాజ్యపాలనలో తగినంత సమర్థత కనబరిచేవాడు అని అర్థం. ‘దగ్గిరవచ్చున్’ అనగా సమీపించవచ్చు, ఆ రాజు కొలువులో చేరవచ్చు అనే అర్థంలో ఉపయోగించబడింది. జీతం అత్యల్పమైనప్పటికీ సమర్థుడైన ప్రభువు కొలువులో పనిచేయవచ్చు. కానీ తన అధీనంలోని ఒక రాజ్యానికి రాజును చేస్తాను అన్నప్పటికీ, ‘తరమెరుగని’ రాజు – సమర్ధత లేని రాజు కొలువులో ఉద్యోగం పనికి రాదు అని భావం.


కం. యెడ్డెడు సతివలపెరుగని జడ్డలబడి తిరుగువాడు జాణుండగునా యడ్డముదిడ్డము దిరిగితె తెడ్డెరుగునె పాలతీపి తెలియర సుమతీ! (106) రాత సరిగా లేక చదవడానికి కష్టంగా ఉన్న పద్యాలు పది వరకూ ఈ తాళపత్ర ప్రతిలో ఉన్నాయి. అటువంటి పద్యాలలో ఇది ఒకటి. రాతలో మూడవ పాదంలో అక్షరాలు ‘యడ్డముడిగటము దిరిగితె’ అని ఉన్నాయి. పద్యం భావానికి సరిపోయేట్లుగా మూడో పాదం సవరించి రాయబడింది. సరసత తెలియని వ్యక్తులతో చేసే స్నేహం వలన ఇంట్లోని భార్య పిల్లలకు కష్టమే కలుగుతుంది తప్ప ప్రయోజనం ఉండదని చెప్పడం ఇందులో భావం.

కం. చెపలత లాభము చెరుచును నెపమున పగవారి గూడి నేరము లెంచున్ అపవాదించును నమ్మిక కపటాత్మునితోడి పొందు కాదుర సుమతీ! (91) సుమతీశతకంలోని పద్యాల ముద్ర పూర్తిగా ఉన్న పద్యాలలో ఇది ఒకటి. మూడవ పాదంలో ‘ఆపలాచించ్చును నంమ్మిక’ అని రాతలో అక్షరాలను బట్టి ‘నమ్మకం అతిగా వాదించేలా చేస్తుంది’ అన్న భావం గ్రహించి, దానికి దగ్గరగా సరిచేయబడింది.


కం. పగవాడు తనకు జిక్కిన పగచంపుట మేలు చేసి పంపుట ధరలో పగవానికదియె చంపుట తగువానికి అదియె నీతి తథ్యము సుమతీ! (52) శత్రువు నిస్సహాయుడై చిక్కిన తరువాత కూడా అతడిని పగవానిగా చూడడం మానవత్వంతో కూడుకున్న పని కాదని, కరుణించి వదిలి వేయడమే సరైనది అని ఇందులో భావం.

కం. కుటిలాత్ముని నొనగూడకు పటువై సభలోన వెడల బల్కకు మతి దు ర్ఘటమగు కార్యము శాయకు నిటలాక్షుని మీద భక్తి నిల్పుము సుమతీ! (57) కుటిలస్వభావుడైన వ్యక్తితో స్నేహం చేయడం, సభలో అందరి ఎదుట అవసరాన్ని మించిన గొప్పదనపు మాటలను మాట్లాడడం, నలుగురికి హాని చేసే పనులను చేయడం వంటివి తగని పనులని, నిటలాక్షుడైన శివుడిని నిరతం ధ్యానించడం శ్రేయస్సును కలుగజేస్తుందని చెబుతుంది పై పద్యం.


కం. కనరానిది పరతత్వము వినరానిది గురువు నింద, వినికనియైనన్ అనరానిది పరుషత్వము మనరాదవివేకి తోడ మతముర సుమతీ! (73) మనిషి చూపు దైవత్వానికి సంబంధించిన సంగతులను చూడలేదు. అలాగే సత్పురుషుడు గురువును చేసే నిందను వినలేడు. ఒకరిని గురించి చెడుగా విన్నప్పటికీ, చూసినప్పటికీ కూడా పరుషంగా మాట్లాడకూడదు. అలాగే, అవివేకితో స్నేహం ఎక్కువ కాలం కొనసాగించకూడదు అని భావం.

కం. తెరవున యేనుగు పొడగని మొరయించుకు వెర్రిగండు మొరగిన భంగిన్ దొర నల్పుడెరుగ కాడిన సరిసేయగ వలదు వాని సహజము సుమతీ! (74) ఏనుగు దారిలో నడుస్తున్నప్పుడు అల్ప జంతువులు భయంతోనూ, ఆశ్చర్యంతోనూ అనవసరమైన ఆర్భాటం చేసి అభాసుపాలైనట్లుగా, అల్పుడైన వ్యక్తి విజ్ఞత కోల్పోయి మాటాడే మాటలను గురించి ఉత్తముడైన వ్యక్తి పట్టించుకోనవసరం లేదని, ఒకవేళ సరిచేసే ప్రయత్నం చేస్తే, ఆ ప్రయత్నం వలన కూడా ప్రయోజనం ఉండదని భావం.

- భట్టు వెంకటరావు

Updated Date - May 05 , 2025 | 03:32 AM