Rahul Gandhi: ఆమె ఎవరు
ABN, Publish Date - Nov 07 , 2025 | 02:50 AM
సుప్రసిద్ధ బాలీవుడ్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం వో కౌన్ థీ తరహాలో, కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ బుధవారం ఒక మహిళ చిత్రాన్ని చూపిస్తూ, ఎన్నికల సంఘాన్ని యే కౌన్ హై అని ప్రశ్నించారు...
సుప్రసిద్ధ బాలీవుడ్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం ‘వో కౌన్ థీ?’ తరహాలో, కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ బుధవారం ఒక మహిళ చిత్రాన్ని చూపిస్తూ, ఎన్నికల సంఘాన్ని ‘యే కౌన్ హై?’ అని ప్రశ్నించారు. హర్యానాలో పాతికలక్షల దొంగ ఓట్లు ఉన్నాయన్న తన ఆరోపణలకు నిలువెత్తు నిదర్శనంగా ఆయన ఈ మహిళ చిత్రాన్ని ప్రయోగించారు. హర్యానా ఓటర్ల సంఖ్య రెండుకోట్లు కనుక, అందులో పాతికలక్షలు, అంటే, పన్నెండున్నర శాతం నకిలీ, చెల్లని, బల్క్ ఓట్ల ద్వారా బీజేపీ అడ్డదారిలో అధికారాన్ని చేజిక్కించుకుందని రాహుల్ ఆరోపణ. ఎన్నికల సంఘాన్నీ, భారతీయ జనతాపార్టీనీ ఒకేగాటన కడుతూ, చేయీచేయీ కలిపి ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తున్నాయంటూ రాహుల్ చేస్తున్న ఓట్‌చోరీ యుద్ధం ఈ తాజా ఆరోపణలతో తీవ్రస్థాయికి చేరింది. బిహార్ తొలివిడత పోలింగ్‌కు ముందురోజున, గత ఏడాది తాము బీజేపీ చేతిలో ఓడిన హర్యానా రాష్ట్రాన్ని రాహుల్ తెరమీదకు తెచ్చారు. గత ఏడాది హర్యానాలో తాము ఎలా మోసపోయిందీ తెలియచెప్పి, బిహారీలను హెచ్చరించడం రాహుల్ ఉద్దేశం కావచ్చు. కర్ణాటకలో అలంద్, మహదేవ్‌పుర అసెంబ్లీ స్థానాల్లోనూ దొంగఓట్ల సృష్టి జరిగిందని ఇటీవల ఆరోపించిన ఆయన, ఇప్పుడు కట్టలకొద్దీ కాగితాలను, వందలాది స్లయిడ్లనూ ప్రదర్శిస్తూ, హర్యానాలో ప్రతీ ఎనిమిది మంది ఓటర్లలో ఒకరు నకిలీ అని విస్పష్టంగా చెబుతున్నారు. అన్ని ఎగ్జిట్ పోల్స్ హర్యానాలో కాంగ్రెస్ ఘనవిజయాన్ని సూచించిన సంగతినీ ఆయన గుర్తుచేశారు. ‘ఆమె ఎవరు?’ అన్న ఆ ప్రశ్న రాహుల్ ఆరోపణలకు ఎంతో బలం చేకూర్చింది. హర్యానాలో 22చోట్ల ఓటువేసిందీ మహిళ అంటూ బ్రెజిలియన్ మోడల్ లారీసా నేరి ఫోటో చూపించారాయన. ఎనిమిదేళ్ళ క్రితం ఫోటోను ఇంటర్నెట్‌నుంచి తీసి, ఆ ఒక్క చిత్రంతోనే పలు చిత్రాలు చేశారు. స్వీటీ, సరస్వతి, రష్మి, విమల, సీమ ఇత్యాది పేర్లు, వేర్వేరు వయసులతో నకిలీ ఓట్లను సృష్టించారు. ఈ తరహా ఫేక్ ఫోటోలతో లక్షకుపైగా ఓట్లు తయారుచేశారని, తప్పుడు చిరునామాలతో మరో లక్ష ఓట్లున్నాయని, రెండు బూత్‌లతో రెండువందలకుపైగా ఓట్లు ఒకే ఫోటోతో ఉన్న ఘటనలు సైతం అనేకం అంటున్నారు ఆయన. డూప్లికేట్ ఓటర్లను గుర్తించే సాఫ్ట్‌వేర్ తన దగ్గర ఉన్నా ఈసీ దానిని బీజేపీ కోసం వాడలేదన్న విమర్శ ఘాటైనది.
బీజేపీ పాలిత యూపీలో ఓటువేసిన ఆ పార్టీ కార్యకర్తలు వేలాదిమంది హర్యానాలోనూ వేశారనీ, గత ఏడాది అక్టోబర్ ఎన్నికలకు ముందు పెద్దసంఖ్యలో ఈ రాష్ట్రంలో ఓటర్లను చేర్చడమే కాక, ముప్పై ఐదులక్షల ఓట్లను ఆఖరునిముషంలో తొలగించారన్నది పెద్ద ఆరోపణ. ‘మా వాళ్ళు ఎంతో ముందుగా పోలింగ్ జరగబోయే రాష్ట్రంలో స్థిరపడి, ఓటర్ జాబితాలో చేరిపోవడం అన్నిచోట్లా జరుగుతోంది’ అంటూ కేరళ బీజేపీ ఉపాధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలను రాహుల్ ప్రదర్శించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సాయంత్రం ఐదుగంటల తరువాత, క్యూలో మిగిలిపోయిన ఓటర్ల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ, పోలింగ్ మట్టుకు ఆఖరునిముషంలో అత్యధికంగా జరిగిందని రాహుల్ గతంలో ఆరోపిస్తూ, ఎన్నికల సంఘం నుంచి డిజిటల్ రికార్డులు, బూత్‌స్థాయి సీసీటీవీ వీడియోలు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. తన అభ్యర్థనను కాదనడమే కాక, పోలింగ్ జరిగిన నలభైఐదురోజుల్లో వీడియోలు ధ్వంసం చేయాలని ఈసీ నిర్ణయించడం తన తప్పులు కప్పిపుచ్చుకోవడానికేనని రాహుల్ ఆరోపణ. ఒక భారీ విదేశీ కుట్రలో పావుగా మారి, దేశం పరువు ప్రతిష్ఠలను దిగజార్చే లక్ష్యంతో రాహుల్ ఈ ఆరోపణలు చేస్తున్నారనీ, బిహార్‌లో ఓటమి ఖాయమని తెలిసిపోవడంతో హర్యానాను ముందుకు తెచ్చారంటూ బీజేపీ విమర్శలు చేస్తోంది. ఎన్నికల సంఘాన్ని వేలెత్తిచూపవద్దంటోంది. కానీ, రాహుల్ విమర్శలకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం మీద ఉంది. ఓటర్ల జాబితా మీద ఒక్క అప్పీలు కూడా దాఖలు కాలేదని ఈసీ ఈ విమర్శలను తేలికగా తీసిపారేస్తోంది కానీ, హర్యానా ఓటర్ జాబితాలో తప్పిదాలు డూప్లికేట్ ఓట్లకు పరిమితం కాలేదనీ, అవి పొరపాట్ల స్థాయిని దాటి జరిగాయని సంఘం గుర్తించాలి. అప్పుడే ఎందుకు చెప్పలేదు, ఫిర్యాదు చేయలేదన్న ప్రశ్నలు సబబుగా కనిపిస్తున్నప్పటికీ, అప్పీలు చేయలేదనో, అడగలేదనో వదిలివేయగలిగే చిన్నచిన్న తప్పులేమీ కావు ఇవి.
Updated Date - Nov 07 , 2025 | 02:50 AM