ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

హస్త కళాకారుల గౌరవం కాపాడాలి!

ABN, Publish Date - Jun 21 , 2025 | 08:57 AM

తరతరాలుగా తమ వృత్తినే అభిరుచిగా, ఉపాధిగా మార్చుకొని... ఆ వృత్తినే దైవంగా భావించి వివిధ కళా రంగాలలో రాణిస్తున్నారు మన తెలుగు కళాకారులు. అంతర్జాతీయ వేదికలపై మన తెలుగు రాష్ట్రాల కీర్తిని ఘనంగా చాటడంలో ఈ కళాకారుల పాత్ర మరువలేనిది.

తరతరాలుగా తమ వృత్తినే అభిరుచిగా, ఉపాధిగా మార్చుకొని... ఆ వృత్తినే దైవంగా భావించి వివిధ కళా రంగాలలో రాణిస్తున్నారు మన తెలుగు కళాకారులు. అంతర్జాతీయ వేదికలపై మన తెలుగు రాష్ట్రాల కీర్తిని ఘనంగా చాటడంలో ఈ కళాకారుల పాత్ర మరువలేనిది. ఒకప్పుడు ప్రభుత్వ శాఖలలో (సాంస్కృతిక, పురావస్తు, పర్యాటక, దేవాదాయ–ధర్మాదాయ శాఖలు) వీరి సేవలు ఎంతో కీలకమైనవిగా ఉండేవి. శిల్పులు కోరుకునేది వారి కళకు గౌరవమే.

మాజీ ముఖ్యమంత్రి కీ.శే. నందమూరి తారక రామారావు శిల్పులను, నైపుణ్య సంప్రదాయ హస్త కళాకారులను ఎంతో గౌరవించి ప్రోత్సహించేవారు. ఆనాటి స్థపతులకు, శిల్పులకు ప్రభుత్వ నిర్మాణ పనులలో పెద్దపీట వేసి కొన్ని వందల దేవాలయాలను శాస్త్రోక్తంగా పునర్నిర్మించారు. అనేక వాస్తు శిల్ప ఆగమాలను అధ్యయనం చేసిన కళా నైపుణ్యకారుల ఆధ్వర్యంలో జరిగే నిర్మాణాలు ఎంతో సుందరంగా, చెక్కు చెదరకుండా నిర్మితమయ్యాయి. ఒకప్పుడు ప్రభుత్వ శాఖలలోని కళా నిర్మాణ విభాగాలలో భర్తీ చేసే ఉద్యోగాలలో నైపుణ్యం గల హస్త కళాకారులను, వారి ప్రతిభ కొలమానంగా నియమించేవారు. వీరి ఆధ్వర్యంలోనే తెలుగు రాష్ట్రాలలోని అనేక దేవాలయాల పనులు జరిగేవి. శిల్ప శాస్త్రాలు అభ్యసించిన స్థపతుల సలహా, సూచనలతోనే ఒకప్పుడు దేవాదాయ శాఖ అధికారులు నిర్మాణాలు చేపట్టేవారు.

ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాలలోని దేవాదాయ శాఖలలోని స్థపతుల విభాగం నిద్రావస్థలో ఉన్నది. ఎంత ఆధునిక ఇంజనీరింగ్ నైపుణ్యం తెలిసిన అధికారులైన సనాతన శిల్పాగమ శాస్త్ర నిపుణుల సలహాలు, సూచనలతోనే నిర్మాణ కార్యకలాపాలు కొనసాగించాలి అనేది ప్రజల ఆకాంక్ష. దీనికి నిదర్శనంగా మన తెలుగు నేలపై వెలసిన ఎన్నో చారిత్రక దేవాలయాల నిర్మాణాలు, అందులోని శిల్ప నైపుణ్యాలను నేటికీ మనం చూస్తూనే ఉన్నాం. ఆధునిక పోకడలతో సనాతన ధర్మ శాస్త్రాలలోని విషయాలను మరుగున పడేయడంతో పాటు నైపుణ్య హస్త కళాకారుల పనితనాన్ని నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. శిల్పాచార్యుల సలహాలను పాటించకుండా చేపట్టే దేవాలయ నిర్మాణాలలో కొన్ని నష్టాలను చవిచూడాల్సి రావడం మనం గమనిస్తూనే ఉన్నాం.

ప్రాచీన శిల్ప శాస్త్ర నిపుణులైన స్థపతుల సలహాలతోనే పాత, కొత్త దేవాలయ నిర్మాణ పనులు కొనసాగించాలి. అయితే ఈ ఆచారానికి తెలుగు రాష్ట్రాలలోని కొంతమంది అధికారులు మంగళం పాడుతూ వారి సొంత ఆలోచనలతో ఎటువంటి నైపుణ్యంలేని వారితో నిర్మాణ పనులు చేయిస్తున్నారు. దాంతో వివిధ లోపాలతో జరిగిన ఆ నిర్మాణాలు కూలిపోయి ప్రభుత్వాలను ఇరుకున పెడుతున్నాయి. తెలుగేతర రాష్ట్రాలలో ప్రభుత్వ శాఖల ద్వారా జరిగే వివిధ దేవాలయ నిర్మాణ పనులలో నైపుణ్య హస్త కళాకారుల, స్థపతుల, శిల్పుల సలహాలు–సూచనలకు ఎంతో గౌరవం ఉంటున్నది. ఈ ఆదరణ, గౌరవం, ప్రోత్సాహం తెలుగు రాష్ట్రాలలో కొరవడుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నైపుణ్యం పొందిన స్థపతుల, శిల్పుల, కళాకారుల గౌరవాన్ని కాపాడాలి.

– డాక్టర్ గోవిందు సురేంద్ర

కన్వీనర్, తెలుగు స్థాపత్య కళా పరిషత్

Updated Date - Jun 21 , 2025 | 09:38 AM