ఈ ఏడాది నినాదం ప్లాస్టిక్‌ను అంతం చేద్దాం
ABN, Publish Date - Jun 05 , 2025 | 01:42 AM
ప్లాస్టిక్‌తో కాలుష్యం అంతకంతకూ పెరిగిపోతోంది. నేల, చెరువులు, నదులు, సముద్రాలన్నింటినీ ఇది కమ్మేస్తోంది. కాలువలు, నదుల ద్వారానే ఏటా 1.1 కోట్ల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాల్లోకి చేరుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2040 కల్లా 2.9 కోట్ల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు...
ప్లాస్టిక్‌తో కాలుష్యం అంతకంతకూ పెరిగిపోతోంది. నేల, చెరువులు, నదులు, సముద్రాలన్నింటినీ ఇది కమ్మేస్తోంది. కాలువలు, నదుల ద్వారానే ఏటా 1.1 కోట్ల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాల్లోకి చేరుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2040 కల్లా 2.9 కోట్ల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు సముద్రంలోకి చేరే ప్రమాదముంది.
కోయంబత్తూరు దగ్గర్లోని భారతీయార్ యూనివర్సిటీకి సమీపంలో ‘మరుదామలై’ అటవీప్రాంతం ఉంది. ఆ అటవీప్రాంతంలో ఇటీవల ఓ ఏనుగు మృతి చెందింది. డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించి ఆ ఏనుగు కడుపులో 15 కేజీల ప్లాస్టిక్ వ్యర్థాలున్నట్లు గుర్తించారు! సందర్శకుల ద్వారా అటవీప్రాంతంలోకి కూడా ప్లాస్టిక్ భూతం ఇంతగా చేరిపోయిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఏనుగులే కాదు నిత్యం ఎన్నో జీవరాసులు ఈ ప్లాస్టిక్ భూతానికి బలవుతూనే ఉన్నాయి. భవిష్యత్తులో వాటిల్లబోయే ప్రమాదాలకు ఈ ఘటనలను ముందస్తు హెచ్చరికగా భావించాలి.
ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ ఉత్పత్తి గణనీయంగా పెరుగుతోంది. కొన్నేళ్ల క్రితం ప్లాస్టిక్ ఉత్పత్తి ఏడాదికి 20లక్షల టన్నులు ఉండగా 2019లో ఇది 45 కోట్ల టన్నులకు పెరిగింది. దీనికి అడ్డుకట్ట వేయకపోతే 2060 నాటికి మూడింతలు పెరిగే ప్రమాదముంది. ఈ కాలుష్య కట్టడికి రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్లతో పాటు ఇతర ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, పరిశ్రమలు ఇలా సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఆలోచించాలి. ఆ వ్యర్థాలను పునర్వినియోగించే దిశగా అడుగులు వేయాలి. ప్రస్తుతం పది శాతం కంటే తక్కువగానే ప్లాస్టిక్ పునర్వినియోగం జరుగుతోంది. దీన్ని భారీగా పెంచాల్సిన అవసరం ఎంతైనా వుంది.
ఇప్పటికే భూమ్మీద 600 కోట్ల టన్నుల మేర ప్లాస్టిక్ వ్యర్థాలు పోగుపడ్డాయని లాన్సెట్ పత్రిక ఓ అధ్యయనంలో వెల్లడించింది. ఆ ప్లాస్టిక్ వ్యర్థాలు చాలా వరకు జల వనరుల్లో చేరుతుండడం అతి పెద్ద సమస్యగా మారింది. అక్కడ అవి సూక్ష్మ రేణువులుగా విచ్ఛిన్నమవుతున్నాయి. వాటిలోని రసాయనాలు పర్యావరణానికి, సకల జీవులకూ హాని కలిగిస్తున్నాయి. ప్రధానంగా మానవ శరీరంలోని హార్మోన్ వ్యవస్థను అస్తవ్యస్తం చేయడంతో పాటు క్యాన్సర్, మధుమేహం, సంతానలేమి వంటి ఇతర సమస్యలకు దారి తీస్తున్నాయంటున్నారు వైద్య నిపుణులు. ప్రపంచంలో ఏటా ఉత్పత్తి అవుతున్న ప్లాస్టిక్‌లో 5.2 కోట్ల టన్నులకు పైగా బహిరంగ ప్రదేశాలలో కాల్చివేస్తున్నారు. ఆ సమయంలో విడుదలయ్యే విష వాయువులు గాలిలో కలుస్తున్నాయి. ఇవి జీవుల్లో అనేక రుగ్మతలకు కారణమవుతున్నాయి. ఓ సర్వే ప్రకారం గాలి ద్వారా మనం నిత్యం 11.3 ప్లాస్టిక్ సూక్ష్మ రేణువులని పీలుస్తున్నాం.
ప్లాస్టిక్ నియంత్రణలో భాగంగా కొన్ని దేశాల్లోని కార్పొరేట్ సంస్థలు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ‘ప్లాస్టిక్ వ్యర్థాలు ఉండకూడదు అనుకుంటే.. దాని జోలికి వెళ్లకపోవడమే ఉత్తమం’ అనే నినాదంతో అడుగులు వేస్తున్నాయి. యూకేలో ఇప్పటికే పలు సూపర్ మార్కెట్లు కూల్‌డ్రింక్ టిన్స్, గ్రీటింగ్ కార్డ్స్, బెడ్‌షీట్స్ వంటి వాటిని ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేయడం మానేశాయి. ఉత్తర అమెరికాలోని వాల్‌మార్ట్ షాపింగ్‌మాల్లో కూడా ప్లాస్టిక్ వాడకం తగ్గించారు. స్వీడన్‌కు చెందిన ఐసీఏ రిటైల్ సంస్థ పండ్లు, కూరగాయలపై బ్రాండ్ల పేర్లను లేజర్‌తో ముద్రించే ప్రయత్నం చేస్తోంది. యూనీలివర్, జాన్సన్ వంటి సంస్థలు టూత్‌పేస్ట్, డిటర్జెంట్లను మందుబిళ్ళల రూపంలో తయారుచేసి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాయి. అమెరికాలో పాల పదార్థాలను ప్లాస్టిక్ కవర్లలో కాకుండా సీసాలు, జగ్గుల్లో విక్రయించే విధానం ఇప్పటికే మొదలైంది. ఇది అన్ని దేశాలూ ఆచరించదగిన శుభపరిణామం.
అందుకే పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మేము సైతం అంటూ ప్లాస్టిక్ వినియోగం తగ్గించే మార్గాలను అన్వేషించి ఆచరణలో పెట్టాలి. ఇటీవలి కాలంలో అందుబాటులోకి వస్తున్న బయో ప్లాస్టిక్ వస్తువులతోపాటు సంప్రదాయ గుడ్డ సంచులు, జనపనార బ్యాగులు, విస్తళ్లు, పేపర్ గ్లాసులు తదితర ప్రత్యామ్నాయాలు వాడాలి. చాలా వరకు పట్టణ ప్రాంతాల్లో ఇంటిలో చెత్తను- తడి చెత్త, పొడి చెత్తగా వేరు చేసి పారిశుధ్య కార్మికులకు అందిస్తున్నారు. గ్రామస్థాయిలో కూడా మార్పు రావాలి. ఇళ్లలో ప్లాస్టిక్ వినియోగం తగ్గించుకోవాలి. తప్పని పరిస్థితుల్లో వాడిన ప్లాస్టిక్ వ్యర్థాలను క్రమపద్ధతిలో వేరు చేసి రీసైక్లింగ్‌కు ప్రోత్సహించాలి. పిల్లలకు ప్లాస్టిక్ డబ్బాల్లో భోజనం పంపకుండా స్టీల్ బాక్సుల్లో పెట్టడం అలవర్చుకుంటే అటు పిల్లలకీ ఆరోగ్యం, ఇటు పర్యావరణ హితం కూడా. ఇలాంటి సామాజిక అంశాల పట్ల పాఠశాల యాజమాన్యాలు విద్యార్థులకు అవగాహన కల్పించాలి. యువత కూడా రీసైక్లింగ్ రంగంలోకి అడుగుపెట్టాలి. ప్రభుత్వాలు ఆ దిశగా అంకుర పరిశ్రమలను నెలకొల్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
డా. పి కృష్ణయ్య, ఐఏఎస్ (రిటైర్డ్)
చైర్మన్, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి
(నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం)
ఈ వార్తలు కూడా చదవండి..
For AndhraPradesh News And Telugu News
Updated Date - Jun 05 , 2025 | 01:42 AM