Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్రకు ఉగ్ర ముప్పు.. కేంద్రం అలర్ట్
ABN , Publish Date - Jun 04 , 2025 | 05:04 PM
మరికొద్ది రోజుల్లో అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. అలాంటి వేళ.. ఉగ్రదాడికి అవకాశముందని కేంద్రం భావిస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
న్యూఢిల్లీ, జూన్ 04: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో 26 మంది మరణించారు. ఈ నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. ఈ యాత్రకు ముందు ఉగ్రదాడి జరిగే అవకాశముందని కేంద్రం భావిస్తుంది. అలాంటి తరుణంలో అమర్‌నాథ్ యాత్రికుల భద్రత కోసం ఆపరేషన్ శివను కేంద్రం చేపట్టనుంది. ఈ ఆపరేషన్‌లో భాగంగా అమరనాథ్ యాత్ర ప్రారంభం నుంచి ముగింపు వరకు ఈ యాత్రికులకు పటిష్టమైన భద్రత కల్పించనున్నారు.
ఈ అమర్‌నాథ్ యాత్ర సమయంలో ఆ మార్గంలో హై అలర్ట్ కొనసాగించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఇప్పటికే ఉన్నతాధికారులను స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో యాత్రా నివాస్ నుంచి ఈ యాత్ర కొనసాగే ప్రాంతమంతా అత్యంత భద్రతను ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఉన్నతాధికారులు, పోలీస్, పారా మిలటరీ ఉన్నతాధికారులు ఇప్పటికే ఈ మార్గంలో భద్రత చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సైతం ఈ యాత్ర భద్రతపై ఉన్నతాధికారులతో ఇప్పటికే సమీక్ష నిర్వహించారు.
ఈ మార్గంలో, బేస్ క్యాంపులు, సున్నితమైన ప్రాంతాలలో దాదాపు 50 వేల మందికిపైగా సైనికులను మోహరించనున్నారు. అలాగే డ్రోన్లు, హెలికాఫ్టర్లతో నిరంతర నిఘా కొనసాగించనున్నారు. మూడంచెల భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఈ మార్గం మొత్తం సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. యాత్రికుల భద్రతే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నారు. అమరనాథ్ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భద్రతా బలగాలు ఇప్పటికే 3డీ మ్యాపింగ్ నిర్వహించాయి. గుహలోకి వెళ్లే భక్తులు.. తిరిగి బయటకు వచ్చే మార్గాల వద్ద భద్రతను మదింపు చేస్తున్నారు. ఈ యాత్రలో యాత్రికుల భద్రత కోసం దాదాపు 50 కంపెనీలకు చెందిన పారా మిలటరీ బలగాలను రంగంలోకి దింపనున్నారు.
ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్ర జులై 3న ప్రారంభమై.. ఆగస్ట్ 9వ తేదీతో ముగియనుంది. జులై 3వ తేదీన తొలి బ్యాచ్ యాత్రికులు శ్రీనగర్ నుంచి బస్సుల్లో ఈ యాత్రకు బయలుదేరి వెళ్లనున్నారు. హిమాలయాల్లో దాదాపు 3880 మీటర్ల ఎత్తులోని అమర్‌నాథ్ గుహలో శివుడిని దర్శించుకునేందుకు ఇప్పటికే వేలాది మంది భక్తులు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకున్న సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆపరేషన్ సిందూర్‌ను ప్రధాని మోదీ ఎలా ట్రాక్ చేశారో తెలుసా..
పచ్చి బొప్పాయి తినడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా..
For National News And Telugu News