Periyar Self Respect Movement: ఆత్మగౌరవ ప్రవక్త పెరియార్
ABN, Publish Date - Sep 17 , 2025 | 02:41 AM
ఈ నెల మొదటి వారంలో బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ‘The Self-Respect Movement and its Legacies’ పేరుతో పెరియార్ ఆత్మగౌరవ ఉద్యమంపై రెండు రోజుల సమావేశం జరిగింది. ఆత్మగౌరవ ఉద్యమానికి నూరేళ్లు నిండిన సందర్భంగా...
ఈ నెల మొదటి వారంలో బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ‘The Self-Respect Movement and its Legacies’ పేరుతో పెరియార్ ఆత్మగౌరవ ఉద్యమంపై రెండు రోజుల సమావేశం జరిగింది. ఆత్మగౌరవ ఉద్యమానికి నూరేళ్లు నిండిన సందర్భంగా ఈ సమావేశం జరిగింది. ఆసియా, ఆఫ్రికా, అమెరికా ఖండాల నుంచి 25 దేశాలకు చెందిన చరిత్రకారులు, పరిశోధకులు మేధావులు ఇందులో పాల్గొన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో పెరియార్ చిత్రపటాన్ని ఆవిష్కరించారు. సామాజిక న్యాయం, మహిళా సాధికారత, హేతువాదం తరఫున పెరియార్ చేసిన పోరాటానికి ఇది ఘనమైన నివాళి.
పెరియార్ అసలు పేరు ఈరోడ్ వేంకటరామస్వామి నాయకర్. 1879 సెప్టెంబర్ 17న మద్రాసులో ఈరోడ్‌లో జన్మించారు. 23 ఏళ్ళ వయస్సులో 1904లో జరిగిన ఒక సంఘటన పెరియార్ ఆలోచనలను మార్చివేసింది. అప్పటికే ఆయనలో ఆధ్యాత్మికత చింతన ఉండేది. ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా కాశీని సందర్శించారు. ఒకరోజు తీవ్రమైన ఆకలితో ఆహారం కోసం వెతుకుతున్నారు. ఒక సత్రం వద్ద రకరకాల ఆహార పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. చాలామంది భోజనం చేస్తున్నారు. పెరియార్ కూడా లోపలికి వెళ్లబోయారు. కానీ అక్కడి నిర్వాహకులు ‘‘బ్రాహ్మణేతరులకు భోజనం చేసే అనుమతి లేదు’’ అంటూ ఆయనను బయటికి తోసివేశారు. ఈ సంఘటన పెరియార్ ఆలోచనలలో మార్పుకు కారణమైంది. ఈ ఘటనతోనే ఆయనలో సామాజిక అసమానతలు, మత అంధ విశ్వాసాలు, కులవివక్షకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలన్న బీజం పడింది.
1919లో గాంధీజీ స్ఫూర్తితో పెరియార్ స్వాతంత్ర్య సమరంలో అడుగుపెట్టారు. ఈరోడ్ మున్సిపాలిటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సత్యాగ్రహాలు, సహాయనిరాకరణ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొన్నారు. కానీ 1922–25 మధ్య జరిగిన కొన్ని సంఘటనలు పెరియార్‌ను జాతీయ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేలా చేశాయి. అంతేకాక, ఆయనను గాంధీజీకి వ్యతిరేకిగా కూడా మార్చేశాయి. ఈ పరిణామాలే చివరికి 1925లో ఆత్మగౌరవ ఉద్యమం ప్రారంభానికి దారితీశాయి.
1922లో తిరుప్పూరులో మద్రాస్ ప్రావిన్షియల్ కాంగ్రెస్ సమావేశం జరిగింది. విద్య, ఉద్యోగాలలో కులాల వారీ రిజర్వేషన్ కల్పించాలని పెరియార్ ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. ప్రతినిధులు వర్గాలవారీగా చీలిపోవడంతో ఈ తీర్మానం విఫలమైంది. దీనిని బట్టి కాంగ్రెస్‌కు సామాజిక సమానత్వంపై స్పష్టమైన దృష్టి లేదని పెరియార్ భావించారు.
1923లో జరిగిన మరో సంఘటన కూడా ఆత్మగౌరవ ఉద్యమానికి పునాది వేసింది. ఆయన మున్సిపాలిటీలోని ఒక పాఠశాలలో బ్రాహ్మణేతర విద్యార్థులను తరగతి గదిలో కాకుండా వరండాలో మాత్రమే కూర్చోబెట్టేవారు. దీన్ని పెరియార్ తీవ్రంగా వ్యతిరేకించారు. అసమానతలకు వ్యతిరేకంగా బోధించాల్సిన విద్యాలయాలలోనే విద్యార్థుల మధ్య అసమానతలను పెంపొందించడం సరైనది కాదని పెరియార్ భావించారు.
జాతీయ కాంగ్రెస్, గాంధీజీ నుంచి పెరియార్ దూరం కావడానికి, 1925లో ఆత్మగౌరవ ఉద్యమం ప్రారంభం కావడానికి ప్రధాన కారణం – వైకోం సత్యాగ్రహం.
ప్రస్తుత కేరళలోని ట్రావెన్కోర్ రాష్ట్రంలో ఒక చిన్న పట్టణం వైకోం. ఇక్కడ ప్రసిద్ధ మహాదేవ ఆలయం ఉంది. ఈ ఆలయానికి వచ్చే నాలుగు రోడ్లపైనా అణగారిన జాతులు నడవకుండా నిషేధం విధించారు. దీనికి వ్యతిరేకంగా కేరళలో సామాజిక ఉద్యమకారులు పోరాటం ప్రారంభించారు. టి.కే. మాధవన్, కె. కలప్పన్ నాయకత్వంలో సత్యాగ్రహం మొదలైంది. వీరిద్దరూ కేరళ రాష్ట్రంలో సామాజిక సంస్కరణలకు, విద్యా ఉద్యమానికి ఆద్యుడైన నారాయణగురు శిష్యులు. వీరిని జైలులో పెట్టిన తరువాత, జాతీయ కాంగ్రెస్ జోక్యంతో పెరియార్ ఈ ఆందోళనకు నాయకత్వం వహించారు. పెరియార్ ఈ ఉద్యమాన్ని బలంగా నడిపించారు. జైలుకు కూడా వెళ్లాడు.
చివరికి 1925లో గాంధీజీ జోక్యంతో ఈ వివాదానికి రాజీ మార్గం దొరికింది. అయితే, పెరియార్ దీనిని పూర్తి విజయంగా భావించలేదు. ఎందుకంటే ఆలయానికి వచ్చే నాలుగు రోడ్లలో మూడింటిని అందరూ నడవడానికి అనుమతించారు. కానీ ప్రధాన వీధిలోకి అణగారిన వర్గాలకు ప్రవేశం లేదు. ఆయన దీన్ని తాత్కాలిక పరిష్కారంగా మాత్రమే భావించారు. ఈ రాజీ ఫార్ములాను తిరస్కరించి, ‘సంపూర్ణ ప్రవేశమే డిమాండ్’ అని పట్టుబట్టారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి 1925లో ఆత్మగౌరవ ఉద్యమాన్ని ప్రారంభించారు.
సామాజిక అణచివేత, అసమానతలు, లింగ వివక్ష, మత మూఢాచారాలకు వ్యతిరేకంగా ఈ ఆత్మగౌరవ ఉద్యమం మొదలైంది. ఈ ఉద్యమం ప్రధాన లక్ష్యాలు: అస్పృశ్యత నిర్మూలన, దేవాలయాలలో అణగారిన వర్గాల ప్రవేశం, విద్యా ఉద్యోగాలలో శూద్రులకు అతిశూద్రులకు ప్రాతినిధ్యం (రిజర్వేషన్), కులాంతర వివాహాలకు ప్రోత్సాహం, బాల్యవివాహాల నిర్మూలన, విధవా పునర్వివాహాలకు ప్రోత్సాహం, మహిళలకు సమాన విద్య, ఆస్తి హక్కులు మొదలైనవి.
మహిళలు ఇష్టపడ్డవారిని వివాహం చేసుకునే స్వేచ్ఛ కలిగి ఉండాలని పెరియార్ బలంగా వాదించారు. ఆత్మగౌరవ వివాహాలను ప్రోత్సహించినారు. తన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ‘కుది ఆరసు’ (Kudi Arasu) అనే పత్రికను ప్రారంభించారు. అక్కడ ఆయనతోపాటు భార్య నాగమ్మై కూడా వ్యాసాలు రాసేవారు.
పెరియార్ స్ఫూర్తితోనే 1927లో మద్రాసు ప్రెసిడెన్సీలో జస్టిస్ పార్టీ ప్రభుత్వం కులాధారిత రిజర్వేషన్లను తీసుకువచ్చింది. 1927 నవంబర్ 16న జీఓ నంబర్ 613 ద్వారా దేశంలోనే మొదటి కులాధారిత రిజర్వేషన్లు అమలులోకి వచ్చాయి. ఈ జీఓ ప్రకారం బ్రాహ్మణేతర హిందువులకు 44శాతం, బ్రాహ్మణులకు 16శాతం, ముస్లింలకు 16శాతం, ఆంగ్లో-ఇండియన్లు & క్రైస్తవులకు 16శాతం, షెడ్యూల్డ్ కులాలకు 8శాతం రిజర్వేషన్లు కల్పించారు.
1932లో బ్రిటిష్ ప్రభుత్వం దళితులకు ప్రత్యేక నియోజకవర్గాల ద్వారా రాజకీయ రిజర్వేషన్లు కల్పించింది. గాంధీజీ దీనికి వ్యతిరేకంగా ఆమరణ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంలో పెరియార్ గాంధీజీని తీవ్రంగా విమర్శించి, అంబేడ్కర్‌కు బాసటగా నిలిచారు. 1938లో అంబేడ్కర్ మద్రాస్ పర్యటన సమయంలో పెరియార్ ఆయన్ని కలుసుకొని ప్రత్యేక నియోజకవర్గాల డిమాండ్‌కు తన మద్దతు తెలిపారు. 1940లో జస్టిస్ పార్టీకి పెరియార్ నాయకత్వం వహించారు. 1944లో జస్టిస్ పార్టీని ‘ద్రావిడర్ కజగమ్’ (DK)గా మార్చాడు.
1938లో ఒక ప్రత్యేక సమవేశంలో సంఘసంస్కర్తలు, ఆయన అనుచరులు కలిసి ఇ.వి. రామస్వామికి ‘పెరియార్’ బిరుదును ప్రదానం చేశారు. పెరియార్ అనే పదానికి అర్థం ‘గౌరవనీయుడు’, ‘మహనీయుడు’. 1970లో ఆయన బతికుండగానే యునెస్కో ఆయనను ‘దక్షిణాసియా సోక్రటీస్’ బిరుదుతో గౌరవించింది. 1973 డిసెంబర్ 24న ఆయన మరణించారు. సామాజిక అసమానతలు, మహిళల పట్ల అణచివేత, వివక్ష, మత మూఢాచారాలు చర్చనీయాంశాలుగా ఉన్నంత కాలం పెరియార్ జీవించే ఉంటారు. ఆయన కీర్తి ఖండాంతరాలకు వ్యాపిస్తూనే ఉంటుంది.
మోకా సత్తిబాబు
ఐపీఎస్
(నేడు ‘పెరియార్’ జయంతి)
ఇవి కూడా చదవండి..
ఆపరేషన్ సిందూర్‌లో మసూద్ అజార్ కుటుంబం ముక్కచెక్కలు.. వెల్లడించిన జైషే కమాండర్
భారత్‌తో మా బంధాన్ని తెంచేందుకు చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి: రష్యా విదేశాంగ శాఖ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయం
Updated Date - Sep 17 , 2025 | 02:41 AM