G Krishna Rao: కశ్మీర్ విసురుతున్న సరికొత్త సవాళ్లు
ABN, Publish Date - Apr 30 , 2025 | 04:12 AM
పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాదులు చేసిన దాడి భారతదేశంలో భద్రతా వ్యవస్థపై చర్చను నడిపించగా, మోదీ ప్రభుత్వం ఈ ఘటనపై చేపట్టిన చర్యలు సమర్థవంతమైనవిగా కనిపించడం లేదు. ఈ దాడి జమ్ముకశ్మీర్‌లో సాంకేతిక మరియు రాజకీయ పరిణామాలపై కొత్త దిశలో చర్చకు దారితీసింది.
రాజ్యాలు, ప్రభుత్వాలు అత్యంత బలంగా ఉన్నప్పుడు విముక్తి పోరాటాలైనా, విచ్ఛిన్నకర పోరాటాలైనా ఎంత సుదీర్ఘకాలం జరిగినా విజయవంతమయ్యే అవకాశాలు లేవని ఐరిష్ రిపబ్లికన్ ఆర్మీ నుంచి ఎల్‌టీటీఈ వరకు అనేక సంస్థలు నిర్వహించిన సంఘర్షణలు రుజువు చేస్తున్నాయి. ప్రజాస్వామిక స్ఫూర్తితో పాటు ప్రజాచైతన్యం వెల్లువలా లేనంతవరకూ, శక్తియుక్తులపై సరైన అవగాహన లేనంతవరకూ నెత్తురు టేరులు పారడం తప్ప వేరే ప్రయోజనం ఉండదు. కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న సంస్థలకు ఎంత పొరుగు దేశం నుంచి మద్దతు అందుతున్నా మొత్తం భారతదేశ ప్రజల ఆకాంక్షలను అధిగమించి విజయం సాధించడం ఏనాడూ సాధ్యం కాదని ఇప్పటికే తేలిపోయింది. అయినా పహల్గామ్ ఘటనలో అమాయకులైన పర్యాటకుల్ని పొట్టనపెట్టుకోవడం ఉగ్రవాదులకే కాదు, వారిని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌కు కూడా స్వయంఘాతుక చర్యగా మారిందనడంలో సందేహం లేదు. ‘సర్జికల్ దాడుల తర్వాత మోదీ ప్రభుత్వం సీమాంతర ఉగ్రవాదాన్ని దాదాపు అరికట్టింది..’ అని హోంమంత్రి అమిత్ షా గత ఏడాది ప్రకటించారు. ఈ ఏడాది ఏప్రిల్ 6–8 తేదీల్లో జమ్ముకశ్మీర్‌లో విస్తృతంగా పర్యటించిన అమిత్ షా సరిహద్దుల్లో భద్రతా చర్యలను సమీక్షించారు. అన్ని భద్రతా ఏజెన్సీలు కలిసికట్టుగా సమన్వయంతో జమ్ము కశ్మీర్‌లో శాంతి భగ్నం కాకుండా చూడాలని కోరారు. వాస్తవాధీన రేఖ వద్ద అధునాతన ఎలెక్ట్రానిక్ నిఘా వ్యవస్థల్ని ప్రవేశపెట్టే విషయం కూడా ఆయన చర్చించారు. జమ్ముకశ్మీర్‌లో అమిత్ షా పర్యటించి వచ్చి రెండు వారాలు కాకముందే ఉగ్రవాదులు పహల్గామ్‌లో పెద్ద ఎత్తున పర్యాటకుల్ని కాల్చి చంపారు. 20 నిమిషాల పాటు పర్యాటకుల్ని కాల్చి చంపుతున్నప్పుడు రాష్ట్ర పోలీసుల కానీ, సీఆర్‌పీఎఫ్ కానీ ఒక్కరు కూడా దరిదాపుల్లో లేరు రా, సైన్యం, ఐబీ, బీఎస్‌ఎఫ్, పోలీసు లేదా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఏమి చేస్తున్నాయి? ఈ సంఘటన తర్వాత దేశ ప్రజల రక్తం మరిగిపోయినట్లు దేశ వ్యాప్తంగా వెల్లువలా వచ్చిన ప్రతిస్పందనలు స్పష్టమవుతున్నాయి.
కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలైంది. కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేసి ఆరు సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ 11 సంవత్సరాల్లో అడపాదడపా ఉగ్రవాద ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని చర్యలు తీసుకున్నా ఉగ్రవాదుల నెట్‌వర్క్ విచ్ఛిన్నమైనట్లు దాఖలాలు కనపడడం లేదు. 2016లో యూరిలో 14 మంది, 2018లో కుల్గామ్, పుల్వామాలో 56 మందిని, 2023లో రియాసీలో 9 మందిని చంపడం పెద్ద ఘటనలు కాగా అయిదుగురి లోపు బలిగొన్న సంఘటనలు ఎన్నో. మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 2024 జూన్ 9 నుంచి 2025 వరకు ఉగ్రవాదుల హింసాకాడకు 60 మందికి పైగా ప్రజలు బలయ్యారు. వీరిలో 33 మంది సైనికులు కూడా ఉన్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే పహల్గామ్‌లో ఇంత పెద్ద సంఖ్యలో పర్యాటకుల్ని మతం అడిగి చంపడం ఒక ఎత్తు. 2000 సంవత్సరంలో అమరనాథ్ వెళుతున్న 32 మంది యాత్రికుల్ని ఇదే పహల్గామ్‌లోని నున్వాన్ బేస్ క్యాంప్ వద్ద కాల్చి చంపారు. ఈ నేపథ్యంలో జూలై 3 నుంచి ఆగస్టు 9 వరకు జరగాల్సిన అమర్‌నాథ్ యాత్ర పరిస్థితిపై ఆందోళన నెలకొన్నది. పర్యాటకులపై దాడి చేసి స్థానిక ఆర్థిక వ్యవస్థల్ని భగ్నం చేయాలన్న ఒక దీర్ఘకాలిక ప్రణాళికతో ఈ పహల్గామ్ దాడి జరిగినట్లు పాక్ సైనికాధ్యక్షుడు ఆసిమ్ మునీర్ మాటల్ని బట్టి అర్థమవుతుంది. మరి మనకెందుకు ఉప్పందలేదు? సీమాంతర ఉగ్రవాదం కశ్మీర్‌లో ప్రజలను ఇంకెంతకాలం బలిగొంటుంది? నిజానికి ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుంచి వచ్చి, మొక్కవోని జాతీయవాద దృక్పథం ఉన్న నరేంద్రమోదీ వంటి బలమైన నాయకుడు గతంలో ఎప్పుడూ లేరని ఆయన అభిమానులు సందర్భం వచ్చినప్పుడల్లా చెప్పుతూ ఉంటారు. ‘నా కవిత్వం యుద్ధ ప్రకటనతో సమానం. అది ఊకదంపుడు కాదు.
అది ఓడిపోయిన సైనికుడి హృదయ స్పందన కాదు, కాని విజయం సాధించాలనుకునే యోధుడి పట్టుదల’ అని అటల్ బిహారీ వాజపేయి 2000 సంవత్సరంలో కార్గిల్‌లో పాక్ చొరబాటు తర్వాత ప్రకటించారు. ఆరు రోజుల్లో భారత సైన్యం సరిహద్దులు దాటి పాకిస్థాన్‌లో ప్రవేశించేందుకు వాజపేయి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుసుకుని అప్పటి అమెరికా అధ్యక్షుడు క్లింటన్ జోక్యం చేసుకోవడంతో పాక్ చొరబాటుదారులు వెనక్కు తగ్గారు. సంకీర్ణ ప్రభుత్వం నడిపిన వాజపేయి అంత సాహసానికి సిద్ధపడితే నరేంద్రమోదీ లాంటి నాయకుడు ఇంకెంత సాహసం ప్రదర్శించాలి? కాని పహల్గామ్ ఘటన తర్వాత జరిగిన భద్రతా వ్యవహారాల కేంద్ర కేబినెట్ తొలి సమావేశంలో ప్రకటించిన చర్యలు ఎంతో మృదువుగా ఉన్నాయి. 65 సంవత్సరాల సింధు జల ఒప్పందాన్ని రద్దుచేసినా భారతదేశం పాక్‌కు ఈ నదీజలాల్ని వెంటనే ఆపగలిగిన పరిస్థితి లేదు. సింధూ లోయ నదుల నీటి సంరక్షణ కోసం నిర్మాణ పనులు చేపట్టి యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసేందుకైనా కొన్ని సంవత్సరాలు పడుతుంది. దౌత్య అధికారులను ఉపసంహరించుకోవడం, పాక్ పౌరులను వెంటనే వెళ్లిపొమ్మనడం పెద్ద చర్యలేమీ కాదు. అయినా పహల్గామ్ సంఘటన భారత రాజకీయాల తీరుతెన్నుల్ని మార్చే అవకాశం ఉన్నది. ఇక నుంచి ఏ బహిరంగ సభ జరిగినా అధికార పార్టీ నేతలు ఈ ఘటన గురించి ప్రస్తావించకమానరు. ఈ ఘటన తర్వాత హిందువులు ఏకం కావాల్సిన అవసరం కనపడుతోందని, ఏకమైతే మననెవరూ ఏమీ చేయలేరని ముంబైలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ పిలుపునిచ్చారు.బీజేపీ, సంఘ్ పరివార్ అనుబంధ సంస్థలు ఈ ఘటనను దేశ భక్తిపై భావోద్వేగాలను రగిల్చేందుకు తప్పక ఉపయోగించుకుంటాయి. ప్రజల ఓటింగ్ శైలిపై కూడా ఈ ఘటన ప్రభావం పడక తప్పదు. పహల్గామ్ నేపథ్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్‌తో సహా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు మోదీ సర్కార్ ఏ చర్య తీసుకున్నా అండగా నిలుస్తామని చెప్పాయి.
ఇది మోదీ బాధ్యతను మరింత పెంచింది. మరోవైపు ఈ ఘటన తర్వాత ఇతర రాజకీయ అంశాల గురించి, రాజ్యాంగం గురించి మాట్లాడడం కొంతకాలం వరకు అసందర్భంగా మారవచ్చు. ‘ఉగ్రవాదులు కులం అడిగి కాదు, మతం అడిగి కాల్చేశారు. వెళ్లి మోదీకి చెప్పుకోమన్నారు’ అన్న వ్యాఖ్యలు చాలా కాలం పాటు ప్రభావం చూపుతాయి. బిహార్‌లోనూ, ఇతర ప్రాంతాల్లోనూ కులసమీకరణలకు భిన్నంగా మతం కీలక పాత్ర పోషించే, కనీస ప్రజా సమస్యలు కూడా పక్కతోవన పట్టే అవకాశాలు లేకపోలేదు. దేశ రాజకీయాల్లో ముస్లింల ప్రాతినిధ్యం మరింత తగ్గిపోయేందుకు ఇది ఆస్కారం కలిగిస్తుంది. ఇండియా కూటమి రానున్న రోజుల్లో తమ వ్యూహరచన విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి. ఈ విషయం తెలిసినందువల్లే ఈ సంఘటన జరిగిన వెంటనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన విదేశీ పర్యటనను రద్దు చేసుకుని వచ్చి బిహార్‌లో బహిరంగ సభలో పాల్గొని ఇంగ్లీషులో హెచ్చరికలు చేశారు! అంటే పహల్గామ్‌పై అంతర్జాతీయ సమాజానికి ఒక సందేశం పంపడం కూడా ఆయన ఉద్దేశం. పహల్గామ్ నేరస్థుల్ని పాతిపెట్టేందుకు సమయం ఆసన్నమైందని, వారు ఊహించిన దానికంటే ఎక్కువ శిక్షపడుతుందని ఆయన అన్నారు. ‘తాము తక్షణం బలమైన చర్యలు ప్రారంభిస్తాం’ అని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా చెప్పారు. ఈ హెచ్చరికల అర్థం ఏమిటి? గాజాలోని హమాస్ స్థావరాలపై ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ లాగా మోదీ పాక్‌పై దాడులు చేయిస్తారా లేక కేవలం బిహార్, బెంగాల్‌లో ఎన్నికల ప్రయోజనాలు పొందేందుకే ఈ వాతావరణాన్ని ఉపయోగించుకుంటారా అన్నది వేచి చూడాల్సి ఉన్నది. ప్రజలు బహిరంగ సభల్లో ఇలాంటి హెచ్చరికలకు ఇప్పటికే అలవాటుపడ్డారు. పుల్వామా విషయంలో జరిగినట్లు కాకుండా మోదీ తన రాజకీయ ప్రయోజనాలు, మనుగడకు మించి చర్యలు తీసుకుంటారని ప్రజలు ఆశిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా దేశ వ్యాప్తంగా ప్రజల్లో మతం, జాతీయవాదం, దేశభక్తి కలిసిపోయి ప్రతిదానిపైనా ఉద్వేగపూరితంగా స్పందించే తత్వం పెరిగింది.
అనేక ప్రాంతాల్లో ప్రజలు బయటకు వచ్చి పాక్ వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు. వారిని శాంతింపచేయడం అంత సులభం కాదు. ప్రజల భావోద్వేగాలు నేతలకు అనుకూలంగా మారినప్పుడు ఆ అనుకూలతే ఒకోసారి సింహంపై స్వారీలాగా మారుతుంది. మరో వైపు కశ్మీర్ మరింత అంధకార బంధురమయ్యే పరిస్థితులు లేకపోలేదు. ‘మేమిక్కడ జన్మించడమే మా దురదృష్టం’ అని కశ్మీరీ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీత అజుర్ దా శ్రీనగర్ నుంచి పంపిన వాట్సాప్ సందేశంలో చెప్పారు. ఇటీవలి కాలంలో పహల్గామ్ తదితర అందమైన ప్రాంతాల్లో హోటళ్ల నిర్మాణం ప్రారంభమైంది. బ్లూమ్స్ బరీ లాంటి సంస్థలు కశ్మీర్ ప్రకృతి సౌందర్యంపై, మారుతున్న ప్రజా జీవనంపై కాఫీ టేబుల్ బుక్స్‌ను ప్రచురించాయి. ఇప్పుడు మళ్లీ పర్యాటక స్థలాలనన్నీ మూసివేస్తున్నారు. కశ్మీర్‌కు మంచి రోజులు వచ్చాయి అని ప్రభుత్వం ఇప్పట్లో చెప్పుకునే పరిస్థితి కనపడడం లేదు. నిజానికి 31 సంవత్సరాల క్రితమే పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1994 ఫిబ్రవరి 22న ఆక్రమిత కశ్మీర్ నుంచి పాక్ ఖాళీ చేయాలని, లేకపోతే తామే దాన్ని విముక్తం చేస్తామని పార్లమెంట్ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. అప్పుడు ప్రతిపక్ష నేతగా అటల్ బిహారీ వాజపేయి ఉన్నారు. ఈ తీర్మానాన్ని అమలు చేసేందుకు ఇప్పుడు సమయం ఆసన్నమవలేదా? గతంలో లాహోర్ వరకు మన సైన్యం వెళ్లినా అంతర్జాతీయ ఒత్తిడులకు లోనై వెనక్కి తగ్గాల్సి వచ్చింది. మోదీ వాటికి భిన్నంగా వ్యవహరిస్తారో లేదో వేచి చూడాల్సి ఉంది.
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)
Updated Date - Apr 30 , 2025 | 04:19 AM