New Seed Bill: ఆ చట్టం...వ్యవసాయానికి ఉరితాడు
ABN, Publish Date - Dec 03 , 2025 | 02:45 AM
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ‘2025 విత్తన చట్టం’ ముసాయిదా కార్పొరేట్లకు లాభాలు కట్టబెట్టడం కోసమే. ప్రతిపాదిత చట్టంలో కేంద్ర విత్తన కమిటీకి చైర్మన్ సహా మరో 27 మందిని ఎన్నుకోవాలనీ...
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ‘2025 విత్తన చట్టం’ ముసాయిదా కార్పొరేట్లకు లాభాలు కట్టబెట్టడం కోసమే. ప్రతిపాదిత చట్టంలో కేంద్ర విత్తన కమిటీకి చైర్మన్ సహా మరో 27 మందిని ఎన్నుకోవాలనీ, షెడ్యూల్ 1 పార్ట్–ఎలో చూపిన నామినేట్ కమిటీలో మెజార్టీ కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉన్నవారినే నియమిస్తారని వేరే చెప్పనవసరం లేదు. సెక్షన్ 9 ప్రకారం రిజిస్ట్రేషన్, సబ్ కమిటీలు, సెక్షన్ 10 ప్రకారం వేసే రాష్ట్ర విత్తన కమిటీల ఎంపికలో పారదర్శకత ఉండదు. 1966 విత్తన చట్టం, సీడ్ కంట్రోల్ ఆర్డర్ 1983 బదులుగా... 2025 విత్తనాల ముసాయిదా బిల్లును మోదీ ప్రభుత్వం విడుదల చేసింది. రానున్న వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లును ఆమోదించటానికి ముందు డిసెంబర్ 11వ తేదీలోగా ప్రజల నుంచి అభిప్రాయాలను కోరుతూ ఈ ముసాయిదా బిల్లును ప్రకటించింది.
టాటా, బిర్లా, ఐటీసీ లాంటి సంస్థలే కాక విదేశీ కార్పొరేట్ సంస్థలైన ‘మోన్‌సాంటో, బేయర్, డుపాంట్, సింజెంటా, కార్గిల్’ సంస్థలు విత్తనరంగంపై పూర్తి ఆధిపత్యాన్ని సంపాదించాయి. విత్తన ధరలను ఇష్టారీతిగా పెంచటం, నాణ్యతలేనివి, పాలినేషన్ తక్కువ ఉన్నవి రైతులకు అంటగట్టి లాభాలు పొందుతున్నాయి. వాస్తవానికి విత్తన చట్టం రాజ్యాంగం రీత్యా రాష్ట్ర జాబితాలోనిది. 2017లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని ఆమోదించకుండా కేంద్రం అడ్డుకున్నది. స్థానికంగా పరిశోధన జరిపిన విత్తనాలే రైతులకు ఉపయోగపడ్డాయి. విదేశీ వాతావరణంలో జరిపిన ప్రయోగాలు ఇక్కడ ఉపయోగపడవు. గతంలో బీటీ విత్తనాల వల్ల రైతులు అనేక విధాలుగా నష్టపోయారు. నాణ్యత లేని విత్తనాలు సరఫరా చేస్తే లైసెన్సులు రద్దు చేయటం, జైలుశిక్షలు విధించటం లాంటి పెనాల్టీలు ఈ ముసాయిదా చట్టంలో లేవు.
రైతుల ప్రయోజనాలకు అనుకూలంగా దేశీయ టెక్నాలజీని వినియోగించి వాతావరణ జోన్లలో ప్రయోగాలు, పరిశోధనలు చేసి రైతులకు అందించే విధంగా విత్తన చట్టాన్ని రూపొందించినప్పుడే రైతులకు మేలు జరుగుతుంది. విత్తన నాణ్యతపైనా, జెర్మినేషన్ పైనా మరింత స్పష్టత కావాలి. రాష్ట్రాల స్థాయిలో నిపుణులతో సమావేశాలు ఏర్పాటు చేసి విత్తన చట్ట ముసాయిదాను రూపొందించటం అవసరం. కార్పొరేట్ సంస్థలు విత్తనాల వ్యాపారం ద్వారా ఏటా వేల కోట్లు రైతుల నుంచి దోచుకుంటున్నాయి. అందుకు అవకాశం లేకుండా రైతులకు రక్షణ కల్పించేలా చట్టంలో మార్పులు చేయాలి.
రైతుల సృజనాత్మక చొరవను పెంచే గ్రామీణ విత్తన కేంద్రాల అభివృద్ధిని పాలకులు గాలికి వదిలేశారు. విత్తనాలను రైతులే సొంతంగా తయారు చేసుకునే హక్కును ప్రోత్సహించకపోగా, వారిపై దొంగ అనే ముద్రలు వేసే స్థితికి వెళ్లారు. భారతదేశ విత్తన సంపదను కాపాడవలసిన అవసరం గురించి ఏనాడో మరిచిపోయారు. విత్తన స్వావలంబనను అందుబాటులోకి తీసుకురావటం, విత్తన సరఫరాలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచటం ద్వారా రైతుల హక్కులను కాపాడే లక్ష్యాన్ని విస్మరించారు. రైతులు తయారు చేసిన విత్తనాలను ఏదో ఒక కంపెనీ కొనుక్కుని తమ బ్రాండ్ వేసుకుని మార్కెట్లో అమ్ముకుని పెద్దఎత్తున సొమ్ము చేసుకుంటున్నది. పేటెంట్ ఉన్న బ్రాండెడ్ విత్తనాలను మాత్రమే వాడాలనే ప్రమాదకరమైన అంశాన్ని ఈ ముసాయిదా బిల్లులో ప్రతిపాదించారు. ఈ బిల్లు విత్తన దిగుమతులను సరళీకరించి, బడా కార్పొరేట్ కంపెనీలకు లాభాలు తెచ్చిపెట్టే విధంగా రూపొందించారు. ప్రపంచ విత్తన వెరైటీలను భారతదేశంలోకి విచక్షణారహితంగా అనుమతించి, దేశీయ విత్తనాభివృద్ధికి సమాధి కట్టే విధంగా ఈ బిల్లు ఉన్నది. ముసాయిదా చట్టంలో రూపొందించిన నిబంధనలన్నీ బడా కార్పొరేట్ కంపెనీలు భారతదేశ విత్తన మార్కెట్లో మరింత స్వేచ్ఛగా, దూకుడుగా ముందుకు వెళ్లటానికి ఉపయోగపడతాయి. రైతు ప్రయోజనాలకు, అంతిమంగా మన వ్యవసాయ రంగానికి ఉరితాడును బిగించే విధంగా ఉన్న ఈ విత్తన బిల్లును రైతు సంఘాలు సమైక్యంగా తిప్పికొట్టాలి.
-ముప్పాళ్ళ భార్గవశ్రీ
సీపీఐ ఎంఎల్ నాయకులు
Updated Date - Dec 03 , 2025 | 02:45 AM