Education and Employment Reforms: విద్య, ఉపాధి రంగాల్లో నూతనోత్సాహం
ABN, Publish Date - Nov 22 , 2025 | 04:16 AM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నత విద్యారంగాన్ని జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు దీటుగా నిలిపేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నది. గత ప్రభుత్వంలో ఏకపక్ష నిర్ణయాల కారణంగా....
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నత విద్యారంగాన్ని జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు దీటుగా నిలిపేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నది. గత ప్రభుత్వంలో ఏకపక్ష నిర్ణయాల కారణంగా జరిగిన నష్టాన్ని పూరించేందుకు ఉన్నత విద్యామండలిని బలోపేతం చేసింది. జాతీయ సంస్థల్లో పాలనాపరమైన అనుభవం, అంతర్జాతీయంగా పరిశోధనా ప్రామాణికత కలిగిన చైర్మన్ ఆచార్య కొత్త మధుమూర్తి స్వల్పకాలంలోనే ఉన్నత విద్యామండలిని సక్రమ పద్ధతిలోకి తీసుకురాగలిగారు. ‘ఐఐటీలు, ఎన్‌ఐటీలు, సెంట్రల్ యూనివర్సిటీ’ల వంటి జాతీయ విద్యాసంస్థల్లోని ప్రతిభావంతమైన ఆచార్యులను రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు ఉపకులపతుల్ని ప్రభుత్వం నియమించింది. ఇటీవల రెండు విభజన విశ్వవిద్యాలయాలకు ఇన్‌చార్జి ఉపకులపతుల్ని ప్రభుత్వం నియమించింది. ఏలూరు కేంద్రంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయాన్ని, రాజమహేంద్రవరం కేంద్రంగా శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని పునరుద్ధరించింది.
ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి 2025–26 విద్యా సంవత్సరానికి పీజీ ప్రవేశాలను సకాలంలో పూర్తి చేసింది. కొత్తగా ఈ ఏడాది నుంచి ప్రారంభం కానున్న తెలుగు విశ్వవిద్యాలయం కూడా ఇటీవల పీజీ, డిప్లమా, పీహెచ్‌డీ ప్రవేశాల కోసం, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం ప్రకటనలు విడుదల చేసింది. రాష్ట్రంలో పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, మెడికల్ ప్రవేశాలను ఉన్నత విద్యామండలి అధికారులు ఇప్పటికే విజయవంతంగా పూర్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ కృషితో సుమారు మూడు వందల ఎంబీబీఎస్ సీట్లు, మరికొన్ని పీజీ మెడికల్ సీట్లు పెంచారు. అంటే ఈ ఏడాది నాలుగైదు కొత్త మెడికల్ కళాశాలలు రాష్ట్రానికి వచ్చినట్లే. ఎల్.ఎల్.బి, డి.ఎడ్, బి.ఎడ్ ప్రవేశాల్ని త్వరితగతిన మండలి పూర్తి చేసింది. అన్ని విశ్వవిద్యాలయాల, కళాశాలల ప్రమాణాలను తనిఖీ చేసి, మౌలిక సదుపాయాల్ని ఏర్పాటు చేయించింది. డీఎస్సీ నియామకాలు చేపట్టి పదహారు వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025–26 విద్యా సంవత్సరానికి ‘లీప్ లెర్నింగ్ ఎక్స్‌లెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్’ విధానాన్ని తీసుకొచ్చింది. రానున్న డీఎస్సీ కోసం వెంటనే టెట్ పరీక్ష ప్రకటన విడుదల చేసింది. ఎపీ సెట్ లెక్చరర్‌షిప్ పరీక్ష నిర్వహణ కోసం ఏర్పాట్లు జరుగుతున్నట్టు ఉన్నతాధికారి ఇప్పటికే వెల్లడించారు. ప్రవేశాలు, అర్హత పరీక్షల నిర్వహణ, ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా దూసుకుపోతున్నది.
టెక్నాలజీ దిగ్గజం గూగుల్ సుమారు 10 బిలియన్ డాలర్ల పెట్టుబడితో విశాఖపట్నంలో ఒక గిగావాట్ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు సిద్ధమయింది. ఈ నిర్ణయం ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఆమోదించింది. ఈ నిర్మాణంతో డేటా సెంటర్ ఆపరేషన్లు, ఇంజనీరింగ్, ఐటీ వంటి రంగాల్లో ఏడాదికి సుమారు 1,88,220 ప్రత్యక్షంగానీ, పరోక్షంగానీ ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. గూగుల్ క్లౌడ్ ఉత్పాదకత ఆధారిత ప్రభావంతో ఆర్థిక వ్యవస్థలో ప్రతి ఏటా సుమారు రూ.9,553 కోట్లు అదనంగా లభిస్తుందని భావిస్తున్నారు.
రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఈ ప్రాజెక్ట్‌ను ఆంధ్రప్రదేశ్ ఐటీ ఎకో సిస్టమ్‌కు గేమ్ ఛేంజర్‌గా అంచనా వేస్తున్నది. దీంతో విశాఖపట్నం ‘ఏఐ సిటీ’గా అభివృద్ధి చెందుతుంది. డిజిటల్ ఇండియా, మేకిన్ ఇండియాలకు అనుగుణంగా ప్రపంచ స్థాయి కృత్రిమమేధ, క్లౌడ్, డేటా అనలిటిక్స్ హబ్‌గా విశాఖపట్నం అభివృద్ధి చెందుతుంది. అందుకు తగిన నిరంతర పయనంలో ఐటీ మంత్రి నారా లోకేశ్ అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. అందుకోసం దేశవిదేశాల్లో ఏపీ ప్రభుత్వం క్యాంపెయిన్ నిర్వహిస్తున్నది. ఈ డేటా సెంటర్ ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, ఈ–గవర్నెన్స్ రంగాలకు మద్దతుగా ఒక ప్రాముఖ్యమైన మౌలిక సదుపాయంగా పనిచేయనుంది. ఈ సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ‘ఇది కేవలం ఒక పెట్టుబడి కాదు, ఒక బలమైన ఆకాంక్ష నిజమవుతున్న క్షణం’ అని తెలిపారు. ప్రపంచంలోని అతి పెద్ద సాంకేతిక పెట్టుబడులకు ఆతిథ్యం ఇవ్వడం ఏపీకి గర్వకారణమని అభిప్రాయపడ్డారు. రాజధాని అమరావతి కేంద్రంగా జాతీయ, అంతర్జాతీయ విద్యాసంస్థలు, ఐటీ సంస్థలు మరికొన్ని రానుండటం రాష్ట్ర సామాజిక, ఆర్థికాభివృద్ధికి మరింత వెన్నుదన్ను కానుంది.
ఏడాది కూటమి ప్రభుత్వ పాలనలో విద్యా, ఉపాధి రంగాల మీద ప్రత్యేక శ్రద్ధ వహించింది. ఇక రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ‘సహ, సహాయక ఆచార్య’ ఉద్యోగాల భర్తీ కోసం కసరత్తు చేస్తోంది. న్యాయస్థానాల్లో అపరిష్కృతంగా ఉన్న కొన్ని కేసుల విషయంలో పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ వివాదాలను పరిష్కరించి, రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న సుమారు రెండువేల ఉద్యోగాల్లో కనీసం సగమైనా ప్రభుత్వం ఈ ఏడాది భర్తీ చేస్తుందని నిరుద్యోగ యువత ఎదురు చూస్తోంది. ఈ ఆకాంక్ష కూడా త్వరగా నెరవేరితే ఏపీ విశ్వవిద్యాలయాలు పూర్వ వైభవాన్ని సంతరించుకునే అవకాశాలు ఉన్నాయి. నవ్యాంధ్రప్రదేశ్‌లో వచ్చే ఏడాది ఏప్రిల్ 26న శతాబ్ది ఉత్సవాన్ని జరుపుకోనున్న ఆంధ్ర విశ్వవిద్యాలయం వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర విశ్వవిద్యాలయాల చరిత్ర, అభివృద్ధి గురించి వ్యాఖ్యానించవలసి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఈ లోగా ఆచార్యుల ఉద్యోగాల భర్తీ విషయంలోనూ తగిన చర్యలు తీసుకుని నూతనోత్సాహం కొనసాగిస్తుందని వర్సిటీ వర్గాలు భావిస్తున్నాయి.
జీకేడీ ప్రసాదరావు
ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నం
Updated Date - Nov 22 , 2025 | 04:16 AM