ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Appajosyula Satyanarayana: జ్ఞానాంశాలు రాయమని వెంబడిస్తాయి

ABN, Publish Date - Dec 22 , 2025 | 04:52 AM

బహుముఖ ప్రజ్ఞా దురంధరుడు అనే విశేషణం అప్పాజోస్యుల సత్యనారాయణ పట్ల అక్షర సత్యం. ఆయన ప్రశస్తిగన్న కంప్యూటర్‌ శాస్త్రవేత్త. అమెరికాలో కాలిఫోర్నియా...

బహుముఖ ప్రజ్ఞా దురంధరుడు అనే విశేషణం అప్పాజోస్యుల సత్యనారాయణ పట్ల అక్షర సత్యం. ఆయన ప్రశస్తిగన్న కంప్యూటర్‌ శాస్త్రవేత్త. అమెరికాలో కాలిఫోర్నియా, విస్కాన్‌సిస్‌ విశ్వవిద్యాలయాల్లో, ముఖ్యంగా న్యూజెర్సీలోని స్టీవెన్స్‌ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్‌లో ఉన్నతోద్యోగాలు నిర్వహించారు. తన రథ సారథ్యంలో నడిచే ‘అజో విభో– కందాళం’ సాహిత్య సంస్థ ద్వారా లక్షల వ్యయంతో భరత నాట్య శాస్త్రం, కళాపూర్ణోదయం, ఆంధ్రపురాణం వంటి బృహద్గ్రంథాలను వ్యాఖ్యానాలతో పునర్ముద్రించారు. ప్రఖ్యాత రచయితల వివిధ గ్రంథాలను ప్రచురించారు. తెలుగు సాహిత్య కళా రంగాల్లో కృషి చేసిన వారికి సత్కారాలు చేస్తున్నారు. ‘ఛందస్సుందరమైన పద్య కవితా సారస్వతం’ వైపు ఆయనకు మొగ్గు మాత్రమే కాదు, అందులో కావ్య సృజనలు కూడా చేశారు. ఇటీవల తారావళి అనే అరుదైన పద్యప్రక్రియలో ‘పంచవటి’ అనే కావ్యం రాసారు. ‘తారావళి’ తెలుగువారికి అవధానం, ఉదాహరణం లాగ స్వంత ప్రక్రియ. ‘పంచవటి’ కావ్యంలో అంతరిక్ష ఇతివృత్తంతో తారావళి చదువుతూ నిమగ్నమైతే వింతల వింతల పాలపుంతల సమీప ప్రయాణాలు చేస్తున్నట్టు అనుభూతి చెందుతాం. ఈ పుస్తకం వచ్చిన సందర్భంగా ఆయనతో ముఖాముఖి:

మీరు పంచభూతాల్ని వస్తువులుగా స్వీకరించి తారావళి కావ్యాలు రాయడానికి నేపథ్య ప్రేరణలు ఏమిటి?

వర్తమాన సంఘటనలు (కరెంట్‌ ఈవెంట్స్‌) తాత్కాలికమైనవి. వీటికి ప్రాచీనత, ఆధునికత అనేవి వుంటాయి. సార్వజనీనమైన వస్తువులు నిత్యనవీనమైనవి. సృష్టి ప్రారంభానికి కారణభూతమైన అగ్నియే నేడు మనకు లభ్యమవుతున్నది. పంచభూతములు సార్వజనీనములు. సర్వకాలికమైన వస్తువులు. ఆ మహాతత్త్వాలను స్మరించుకునే ప్రయత్నం, ఆలోచనలే నేపథ్య ప్రేరణలు.

తెలుగులో మార్గ కవిత్వం అనువాద వస్తు స్వీకరణతో గాక, స్వతంత్ర వస్తు స్వీకరణతో ప్రారంభమై వుంటే అనంతర కాల సాహిత్య పరిస్థితులెలా ఉండేవంటారు?

స్వతంత్ర వస్తు స్వీకరణతో మార్గ కవిత్వం ప్రారంభమై వుంటే వరుసగా స్వతంత్ర వస్తు కావ్యాలు వచ్చి వుండేవని ఘంటాపథంగా చెప్పలేం. అలాగయితే కళాపూర్ణోదయం వచ్చిన తర్వాతైనా స్వతంత్ర వస్తువులతో కావ్యాలు వచ్చి వుండేవిగా. కాలమాన పరిస్థితులను బట్టి కావ్య సృజనలు జరుగుతూంటాయి.

మీ కవిత్వంలో కనపడే అంతరిక్షస్పృహ గురించి చెప్పండి?

‘‘తనరన్‌నల్బది వేల కోట్ల దిననాథ ప్రజ్ఞమౌ పాలపుం

తనభో మండల వీధులందొకటియే – తా దృక్ష నక్షత్ర పుం

జనికుంజంబుల వేల కోట్లకును పెచ్చై యంతరిక్షంబు నం

దనువై యుంటయు భూనివాసులకు నిత్యాశ్చర్యమైపొల్చెడున్‌’’

– నలభై వేల కోట్ల సూర్యులతో (నక్షత్రాలతో కూడినది ఒకే ఒక్క పాలపుంతగా అంతరిక్షంలో కనబడుతుంది. అటువంటి నక్షత్ర సమూహాలతో కూడిన పొదరిళ్ళు ఆకాశంలో వేలకోట్లకు ఎక్కువే వుంటాయి. ఈ స్థితి భూ నివాసులకు నిత్యాశ్చర్యంగా ఉంటుంది. ఈ స్పృహ అంతరిక్ష స్పృహగా దృశ్యమానంగా చెప్పడం నా ప్రయత్నం. జ్ఞానాంశాలు నన్ను విభ్రాంతుణ్ణి చేసి రాయమని వెంబడిస్తాయి. రసదృష్టితో కవిత్వానుభూతితో రాయాలనేది నా ప్రయత్నం.

నా పావక వృత్త తారావళిలో ఒక పద్య భావాన్ని గమనించండి:

‘‘పొగను జెండాగాగల ఓ మహాగ్నీ! నీ గొప్పదైన తత్త్వాన్ని వర్ణించాలని ఊహామాత్రం చేస్తాను. నీ అద్భుత విశ్వరూపాన్ని పర్యాలోకన చేయాలని ప్రయత్నమైతే చేస్తాను. అయితే నీ సంబంధ ఊహల సమూహాలు ఎన్నెన్నో నా హృదయ సముద్రంలో వడగళ్ళ వానలా కన్పించి కురిసి అవన్నీ లీనమైపోతాయి. నిన్ను సంభావించడంలో నేను అశక్తుణ్ణే అయిపోతున్నాను.’’

విశిష్ట భావం, పటిష్ట నిర్మాణం రెండూ అఖండంగా ఉండేలా రాయాలని నా ప్రయత్నం.

మీ దృష్టిలో కావ్య రసానుభవం అంటే ఏమిటి?

ఆహారాది సౌఖ్యానుభూతులు ఉన్నాయి గదా! అందులో అందరికీ లభ్యం కాని అనుభూతుల్లో కావ్య రసానుభూతి ఒకటి. ఇతర అనుభూతుల వలెనే కావ్య రసానుభవం అనుభవైకవేద్యం.

పోతన, విశ్వనాథ, జాషువా కవుల కవిత్వాలపై మీ అభిభాషణలు, అంచనాలు చెబుతారా?

ఆ మహాకవులను జడ్జ్‌ చేయడానికి నేనెంతటివాడిని. అయినా అడిగారు కనుక చెప్పడం. మీరు పేర్కొన్న ముగ్గురు కవులూ రససిద్ధిని పొందిన కవి ప్రభువులు. విశ్వనాథ వారన్నట్లు– ‘పోతన్న తెలుగుల పుణ్యపేటి’. విశ్వనాథ వారి భావయిత్రీ శక్తి అద్భుతావహమై దిగ్భ్రమ కలిగిస్తుంది. మన మనస్సుకు తెలిసిన విషయాల్ని అబ్బుర పరిచే రీతిలో చెప్పగలిగిన అభివ్యక్తీకరణ శక్తి కవి కోకిల జాషువాది.

భవిష్యకాలంలో ఏదైనా బృహత్తరమైన మహాకావ్యం రాయాలనే ప్రణాళిక ఏదైనా ఉన్నదా?

అంతటి కావ్యవస్తువులు లభించాలి. దొరికినా నిర్వహించగలిగిన శక్తి ఉండాలి కదా! నందో రాజా భవిష్యతి!

ఇంటర్వ్యూ , సన్నిధానం నరసింహశర్మ

92920 55531

Updated Date - Dec 22 , 2025 | 04:53 AM