ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కెనడాకు మోదీ

ABN, Publish Date - Jun 11 , 2025 | 06:07 AM

ఐదురోజుల్లో ఆరంభంకాబోతున్న జీ7సదస్సులో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొనబోతున్నారు. ఇందుకోసం పదేళ్ళ తరువాత కెనడాలో అడుగుపెట్టబోతున్నారు. కెనడా ప్రధానిగా జస్టిన్‌ ట్రూడో ఉండగా ఇరుదేశాల...

ఐదురోజుల్లో ఆరంభంకాబోతున్న జీ7సదస్సులో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొనబోతున్నారు. ఇందుకోసం పదేళ్ళ తరువాత కెనడాలో అడుగుపెట్టబోతున్నారు. కెనడా ప్రధానిగా జస్టిన్‌ ట్రూడో ఉండగా ఇరుదేశాల సంబంధాలను ఉప్పూనిప్పూగా మార్చివేసిన విషయం తెలిసిందే. ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్‌సింగ్‌ నిజ్జర్‌ హత్య ఘటనతో ఏడాదిన్నరకాలంగా రెండుదేశాల మధ్య పూడ్చలేనంత అగాధం ఏర్పడింది. ట్రూడో హద్దులు దాటిన వ్యాఖ్యలతో, నిరాధారమైన ఆరోపణలతో దౌత్యసంబంధాలను దెబ్బతీశారు. ఇరుదేశాలు వాగ్బాణాలు విసురుకున్నాయి, దౌత్యసిబ్బందిని బహిష్కరించుకున్నాయి, వాణిజ్యచర్చలను సైతం నిలిపివేశాయి. ప్రస్తుత ప్రధాని మార్క్‌ కార్నీ భారత ప్రధానికి ఫోన్‌చేసి జీ7 సదస్సుకు ఆహ్వానించడం ద్వారా ఆ ప్రతిష్ఠంభనను తొలగించారు. అయితే, ఇందుకు ఆయన స్వదేశంలో విమర్శలు ఎదుర్కోవాల్సివచ్చింది, వివరణలూ ఇచ్చుకోవాల్సివచ్చింది. జనసంఖ్యలో తొలిస్థానంలోనూ, ఆర్థికవ్యవస్థలో ఐదోస్థానంలోనూ ఉంటూ, ప్రపంచ సరఫరావ్యవస్థల్లో ముఖ్య భూమిక నిర్వహిస్తున్న భారత్‌ను ఆహ్వానించకుండా ఎలా ఉంటాం? అని ఆయన ఎదురుప్రశ్న వేశారు. భౌగోళికార్థిక, రాజకీయ ప్రాధాన్యతలరీత్యా పిలిచారే తప్ప, మనమీద గౌరవంతో కాదని కొందరు చేస్తున్న వ్యంగ్యవ్యాఖ్యలను అటుంచితే, భారత్‌ను కాదనగలిగే స్థితిలో ఆ అగ్రరాజ్యకూటమి లేదన్నది వాస్తవం. కెనడాకు ఇది రాజీకావచ్చు. భారతదేశానికి మాత్రం గౌరవమే. అయితే, మేనెల తొలివారంలోనే ఆహ్వాన ప్రక్రియను పూర్తిచేయాల్సిన కెనడా ఆ మేరకు మనల్ని వెనక్కునెట్టి, కాసింత కక్షతీర్చుకున్నట్టే కనిపిస్తోంది. ప్రత్యేకాహ్వానితులకు సైతం నెలక్రితమే పిలుపులు వచ్చి, వస్తున్నామన్న వారి సందేశాలు కూడా వెనక్కు చేరిపోయినా, మనలను మాత్రం వారం ముందువరకూ పిలవకుండా ఊరుకోవడం విచిత్రమే.

ఈ పేరంటానికి ఎంతకూ పిలుపురాకపోవడం గురించి జాతీయమీడియా తెగచర్చోపచర్చలు చేసింది. రమ్మని అనకపోతే మనకు పోయేదేమీ లేదని కొందరు విశ్లేషకులు సాధారణజనానికి ముందే సర్దిచెప్పారు. ఇప్పుడు కేవలం ఓ వారంముందు ఫోన్‌చేసి రమ్మంటే వెళ్ళిపోవడం ఏమి బాగుంటుందని కొందరి అనుమానం. వెళ్ళకపోతే అలిగామనో, అవమానపడ్డామనో అనుకుంటారు కనుక, వారిది పైచేయి కాకుండా వెళ్ళడమే మంచిదని మన నాయకులకు అనిపించివుండవచ్చు. ప్రపంచస్థాయి సదస్సులు నరేంద్రమోదీకి కొత్తేమీ కాదు కానీ, పదకొండేళ్ళ పాలన పూర్తిచేసుకున్న వారంలోనే ఆయన కెనడాలో కాలూని, ఏడుగురు దేశాధినేతలతో ముచ్చటించబోతున్నారు. ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో, ఉగ్రవాదంపై పోరు విషయంలో భారత్‌ వీసమెత్తురాజీపడబోదని మిగతా ప్రపంచానికి మరోమారు చాటిచెప్పేందుకు ఈ సదస్సు ఉపకరిస్తుంది. పహల్గాంలో పర్యాటకుల ఊచకోత, పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదుల పాత్ర, భారత్‌ ఆత్మరక్షణ హక్కు ఇత్యాది అంశాలను ఆయన వివరించవచ్చు. వాణిజ్యాన్ని ఆయుధంగా వాడి యుద్ధం నేనే ఆపానని చెప్పుకున్న అమెరికా అధ్యక్షుడితో నేరుగా సంభాషించగలిగే సందర్భం కూడా ఇదే. ఈ సదస్సుకు మోదీని ఆహ్వానించడం ఖలిస్తానీ శక్తులకు పెద్ద ఎదురుదెబ్బ అని కొందరు విశ్లేషిస్తున్నారు. ఎంత ఒత్తిడితెచ్చినా కెనడా ప్రధాని ముందడుగువేశారని ప్రశంసిస్తున్నారు. ఆర్థికంగా బలంగా ఉన్న భారత్‌కు సహజవాయువు అమ్ముకోవచ్చు, అణువిద్యుత్‌ కర్మాగారాలు నిర్మించవచ్చు, మరెన్నో ప్రాజెక్టులు నిర్మించి మనమూ బాగుపడవచ్చునంటూ కెనడా ప్రధాని నిర్ణయాన్ని అక్కడి విపక్షనాయకుడు సైతం సమర్థించుకొచ్చారు.

భారత వ్యతిరేక చర్యలకు కెనడాను వేదికగా వాడుకుంటున్న ఖలిస్థానీ వేర్పాటువాద శక్తుల పట్ల కెనడా ప్రధాని కఠినంగా వ్యవహరించినప్పుడే ఉభయదేశాల సంబంధాలు పూర్తిస్థాయిలో తిరిగిపట్టాలు ఎక్కుతాయి. శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో రెండుదేశాలు పూర్తిగా సహకరించుకుంటాయని గట్టిగా చెబుతున్న కెనడా ప్రధాని, తమదేశంలో ఖలిస్తానీల బలం, బలగంతో నిమిత్తం లేకుండా భారతదేశం ఆందోళనలకు, అనుమానాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. ఆపరేషన్‌ సిందూర్ అనంతరం పాకిస్థాన్‌తోనూ, అక్కడి ఉగ్రవాద సంస్థలతోనూ వైరం హెచ్చి, రాబోయే రోజుల్లో భారత్‌ మరింత పోరాడాల్సిన తరుణంలో, ఈ శక్తులకు కెనడానుంచి ఎటువంటి మద్దతూ లభించకుండా చూడాలి. మోదీని ఆహ్వానించడం వెనుక కెనడా స్వప్రయోజనాల పరిరక్షణ ఉన్నట్టే, భారతీయులు గణనీయంగా ఉన్న కెనడాతో నెయ్యం సాధించడం భారత్‌కూ ప్రయోజనకరమే.

ఇవి కూడా చదవండి

ఎమ్మెల్యే రాజా సింగ్ మళ్లీ హాట్ కామెంట్స్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్

Read latest AP News And Telugu News

Updated Date - Jun 11 , 2025 | 06:07 AM