ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మేడిగడ్డపై అడ్డగోలు బుకాయింపులు

ABN, Publish Date - Jun 05 , 2025 | 01:30 AM

మేడిగడ్డ వద్ద కాంగ్రెస్ వాళ్ళే బాంబులు పెట్టివుంటారేమో అంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అక్టోబర్‌ 21, 2023 తేదీన మేడిగడ్డ కుంగడానికి బాంబులు పెట్టారే అనుకుందాం. అక్టోబర్ 21 నుండి కొత్త ప్రభుత్వం ప్రమాణం చేసే డిసెంబర్ 23 వరకు, అంటే రెండు నెలలకు...

మేడిగడ్డ వద్ద కాంగ్రెస్ వాళ్ళే బాంబులు పెట్టివుంటారేమో అంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అక్టోబర్‌ 21, 2023 తేదీన మేడిగడ్డ కుంగడానికి బాంబులు పెట్టారే అనుకుందాం. అక్టోబర్ 21 నుండి కొత్త ప్రభుత్వం ప్రమాణం చేసే డిసెంబర్ 23 వరకు, అంటే రెండు నెలలకు పైగా అధికారంలో ఉన్నది కేసీఆరే కదా? మరి పోలీసులతో దర్యాప్తు చేయించి బాంబులు ఎవరు పెట్టారో ఎందుకు తేల్చలేదు? నిర్మాణంలో వైఫల్యాల వల్లనే మేడిగడ్డ కుంగిందని మౌనంగా గ్రహించి, ఆనాడు మీరే కదా నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్ఏ) ఆదేశాల ప్రకారం మూడు బ్యారేజీలలో నిలువ నీళ్లన్నీ ఖాళీ చేసింది? 21వ శతాబ్దపు శాస్త్ర సాంకేతిక యుగపు సమాజాన్ని ఎందుకు ఇంకా వంచిస్తారు? బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో కేటీఆర్ ఐటీ పరిశ్రమలు పట్టణ శాఖామంత్రి. సుదీర్ఘకాలం అమెరికాలో అత్యాధునిక ఐటీ సాంకేతిక పరిశ్రమలో పనిచేశారు. అలాంటి కేటీఆర్‌ బ్యారేజీ పగుళ్లపై ఇలాంటి భాష మాట్లాడటం చూసి వారి అభిమానులే విస్తుపోతున్నారు!

ఎన్‌డీఎస్ఏ నివేదికను నిర్మాణ కంపెనీ ఎల్ అండ్ టీ తిరస్కరించడాన్ని కేటీఆర్ స్వాగతిస్తున్నారు. ఎల్ అండ్ టీ తిరస్కరించడంలోనూ, దాన్ని కేటీఆర్ స్వాగతించడంలోనూ పరస్పర ప్రయోజనం ఉన్నది. సరే, ఎల్ అండ్ టీ మేడిగడ్డ నిర్మాణంలో ఏ తప్పులూ చేయలేదనే అనుకుందాం. అలాంటప్పుడు నిర్మించిన నాలుగేండ్లకే మేడిగడ్డ ఐదు అడుగులు ఎందుకు కుంగింది? పునాది నుండి పై వరకు నిట్ట నిలువునా ఎందుకు చీలిపోయింది? అక్టోబర్ 21, 2023 తేదీన మేడిగడ్డ కుంగిపోయింది వాస్తవం కాదా? ఆ భౌతిక వాస్తవాన్ని కూడా ఎల్ అండ్ టీ తిరస్కరిస్తుందా? నిర్మాణమైన నాలుగేళ్లకే 25 వేల కోట్ల ప్రజాధనం ఎక్కడైనా ఇలా గంగలో కలిసిందా? ఇలా ఎందుకు జరిగిందని అత్యంత లోతుగా విశ్లేషించిన ఎన్‌డీఎస్ఏ నివేదికని హృదయపూర్వకంగా ఆహ్వానించి, నిపుణుల కమిటీ సూచనలను పాటించవలసింది పోయి, ఎల్ అండ్ టీ ఇలా రాజకీయాలను అనుసరించడం సరికాదు.


అక్టోబర్‌ 21, 2023 తేదీన సాయంత్రం 6:15 – 6:30 గంటల మధ్య మేడిగడ్డలోని ఏడో బ్లాక్‌లోని పియర్లు భూమిలోకి కుంగిపోతూ భారీ శబ్దం వచ్చింది. కేటీఆర్ అన్నట్లు అది బాంబు శబ్దంలా ఎందుకు వినిపించిందో, బ్యారేజీ భూగర్భంలో ఆ సమయంలో ఏమి జరిగిందో పరిశీలిద్దాం. బ్యారేజీలోకి నీరు వచ్చి, నిలువ నీటి హెడ్ లెవెల్ పెరుగుతుంది. గేట్ల గుండా సూపర్ క్రిటికల్ ఫ్లోతో (15 మీటర్స్ పర్ సెకండ్ వేగంతో) దిగువకు నీళ్లు వదిలిపెడుతున్నారు. భారీ శక్తితో నీరు సాండ్ బెడ్‌పై పడి భారీ స్కవర్ (కోత) ఏర్పడింది. ఈ సాండ్ బెడ్ కోత పునాది కంటే లోతుకు వెళ్ళినప్పుడు, 16 టీఎంసీల పూర్తి నీటిమట్టం ఉన్నప్పుడు, మహా ప్రకృతి శక్తితో బ్యారేజ్ పునాది కింద ఉండే ఇసుక గుండా నీరు పైపింగ్ జరిగి, నీటితోపాటు ఇసుక అంతా కొట్టుకుపోయి, బ్యారేజ్ పునాది కింద ఒక పెద్ద రంధ్రం, ఒక భారీ ఖాళీ ప్రదేశం ఏర్పడుతుంది. మేడిగడ్డ బ్యారేజీ పునాది అడుగున ఉండే రాఫ్ట్ ఫౌండేషన్, పై భాగాలన్నీ క్రిందకు భూమిలోకి కుంగాయి. రాఫ్ట్ రెండు చెక్కలై, పియర్ కూడా రెండు చెక్కలైంది. ఈ క్రాక్ బ్రిడ్జి వరకు పాకింది. దానిపైన ఉండే అనేక టన్నుల భారీ బ్యారేజీ రోడ్డు బ్రిడ్జి, భయంకరమైన మహా శక్తితో స్టీల్ గేట్లపై ఒకేసారి తటాలున పడింది. ఆ సమయంలో అది బాంబు శబ్దంలా వినిపిస్తుంది. ఆశ్చర్యపోయేదేమీ లేదు.

కేటీఆర్ అన్నట్లు ఒక్క మేడిగడ్డ బ్యారేజీలోనే బాంబు పెట్టారే అనుకుందాం. మరి ఎన్‌డీఎస్ఏ మూడు బ్యారేజీల్లోనూ ప్రముఖ వైజ్ఞానిక సంస్థలతో భూ అంతర్గత, భూ సాంకేతిక పరీక్షలు చేయించాలని ఎందుకు నిర్ణయించింది? మూడు బ్యారేజీలలోనూ మేడిగడ్డ లాంటి ప్రమాదకర పరిస్థితులే ఉన్నాయన్నది వాస్తవం కాదా? ఎన్‌డీఎస్ఏ తొమ్మిది రకాల పరీక్షలు చేయాలని సిఫారసు చేసింది. సీపేజిని గుర్తించడానికి జియో టెక్నికల్ సర్వే చేయాలని పేర్కొంది. రెండు పియర్స్ మధ్య నీటి ప్రవాహం వెళ్లే బే ప్రాంతంలో త్రీడీ స్ట్రెస్ ఎనాలసిస్ చేయాలి. సీస్మిక్ పరీక్షలు చేయాలి. రాఫ్ట్ దిగువన పడిన గుంతలను అంచనా వేయడానికి జియో ఫిసికల్ పరీక్షలు చేయాలి. సీపేజి ఎక్కడి నుంచి వస్తుందో కనుక్కోవాలి. ఇన్ని పరీక్షలు అన్ని బ్యారేజీలలోనూ ఎందుకు చేయమందో కేటీఆర్ చెప్పాలి.


బ్యారేజీ వైఫల్యానికి ఎన్‌డీఎస్ఏ ఆరు కారణాలను పేర్కొంది. వీటిలో ఐదు రకాల వైఫల్యాలతో మాకు సంబంధం లేదని ఎల్ అండ్ టీ అంటున్నది. ఎన్‌డీఎస్ఏ నివేదికను ఎల్ అండ్‌ టీ తిరస్కరించడాన్ని కేటీఆర్ సమర్థిస్తున్నారు. ఆరు వైఫల్యాలలో, ఐదు వైఫల్యాలకు కేసిఆర్ ప్రభుత్వమే దోషి అని ఎల్ అండ్ టీ అంటున్నట్టు. దీనికి కేటీఆర్ బదులేమి ఇస్తాడు? తక్కువ ఖర్చుతో పూర్తయ్యే తుమ్మిడిహెట్టి రాక్ బెడ్‌ను వదిలి కాళేశ్వరం మూడు బ్యారేజీల బలహీన ఇసుక బెడ్‌ను రీ ఇంజనీర్, రీ డిజైన్‌ చేయడమే ఈ విపత్తులకు ప్రధాన కారణం.

నైనాల గోవర్ధన్

For AndhraPradesh News And Telugu News

Updated Date - Jun 05 , 2025 | 01:30 AM