Madelamma Poem: మడేలమ్మ
ABN, Publish Date - Sep 22 , 2025 | 02:40 AM
సూర్యుడు కాలాన్ని మోసినట్లు క్రీస్తు శిలువను భరించినట్లు వీపులమీద కొండంత మురికి బట్టల మూట చాకిరేవుకీ ఊళ్లకీ...
సూర్యుడు కాలాన్ని మోసినట్లు
క్రీస్తు శిలువను భరించినట్లు
వీపులమీద కొండంత మురికి బట్టల మూట
చాకిరేవుకీ ఊళ్లకీ రాసిచ్చిన రాగిశాసనం బాట
వానొచ్చినా రాకపోయినా వెలుగొచ్చినా కరువొచ్చినా
చెరువు బండ మీదనే బతుకింకిపాయే!
నిలబడిన నీళ్లల్ల సవికిన కాళ్లు బర్రెజెనిగల తూట్లు
ఉస్సో ఉస్సో హైలెస్సా బండపై వరుస బతుకు దర్వులు
దరువు దరువుకు పత్తిపూల తెలుపులు
ఆరేసిన బట్టల సింగిడి మీద పిట్టల ముచ్చట్లు
ఇంట్ల ఆకలి మంటలు వీధిలో ఎగతాళి సామెతల పోటులు
ఒక్కరోజు సుస్తయినా
సాకల్ది ఇంటికే రాకపాయని ఈరంగ మేసే పెత్తందారులు
మిరాశీ ఇచ్చేకాడ మాత్రం నెత్తులు గోకుతరు
చెరువెండినా
చెలిమె అలిగినా కాలువ వొట్టిపోయినా
చెరువుమీద చాకిరేవాగలే
చావు వార్తలకు పెళ్లి పిలుపులకు
ఊరూరూ ఉత్తరమై తిరిగి ఎద్దుగిట్టల్లా అరిగిన కాళ్ళు
చాకిరేవు పిలుపు మేలుకొలుపు
పిల్లోడు బడికోయినట్లు
దినం తప్పకుండా ఇటింటి మైలగుడ్డలు
మూడురాళ్ల మీద గూనపెంకులా పొయ్యి
అరచేతిలో పులిమి పులిమి రేవు ఒడ్డున చెక్కరొచ్చే
పలక బలపం పట్టకపోయినా
ఏ ఇంటి కాయింటి ఏ అమ్మ కాయమ్మ
పిండేసిన బట్టల లెక్క మరువని లెక్కల టీచర్
సద్దిబువ్వేసినా బెల్లం గారెనేసినా ముక్కిరుసకుండా
ఊరి ఆరోగ్యమే మహాభాగ్యమని భూదేవిలా మురిసి నడిచే
చంద్రవంకలా దివిటి కోలెత్తి పెళ్లంత తానై ముందు నడిచే
అవిరేను ముందు అమ్మమ్మలా మిత్తితీసి దీవించే
చావుకర్మలల్ల రుడం తీసి అందరికన్న ముందే నీళ్లల్ల మునిగే
ఇల్లంత సున్నమేసి ఇండ్లసందాకలి ఊడ్సి
ఎంగిలి ఆకులు తీసి, ఇంటికోతమ్మా! అన్నప్పుడు
పాతచీర చేతుల పెట్టి పాడుబుద్ధిని పోనిచ్చుకోరు
పురుట్ల నెత్తురంతెత్తి పురుడుపోసే
సముర్తతే శుభ్రం చేసి మూలన బట్టపరిసి
ముట్టుగుడ్డలు పీతిబట్టలు కాన్పుబట్టలు చావుగుడ్డలు
ఇంటివెట్టి ఊరువెట్టి ఈతపొరుకై ఊడ్సే
సబ్బులు సర్ఫులు డిటర్జంట్లు లేని కాలంలో
సౌడును సబ్బుగా కనిపెట్టిన శాస్ర్తజ్ఞులు
సచ్చేదాక సేవలై తనువు బాణమైనా ఏ గౌరవాన్ని నోచుకోలే
చావిడికైనా దేవళానికైనా
కోటమైసమ్మ పండుగైనా పోశమ్మకు బోనాలైనా
గోడల బూజు దులిపి నిండుపున్నమై పూసే కుంచెలు
దేవుడి ముందు నైవేద్యమైనా దేవర ముందు యాటకోసినా
ఎర్రకూడు పచ్చకూడు తెల్లకూడు దిష్టితీసే పెద్దమ్మ
గండదీపానికీ మట్టంటకుండా అరచేతులను కోకలుగా పరిచే
సాంప్రదాయాలను మూలసుక్కలా నిలబెట్టిన తల్లి
పనంతా తనదే బరువంతా ఆమెదే ఊరిమురికంతా మింగింది చాకిరంతా మోసింది
రేవునుండి బట్టలమూటతో వాకిట్లో చంద్రకాంతి
ప్రతి ఇంటికి కడపలా ఆడబిడ్డై సేవలుచేసే మానవతామూర్తి
సాకలమ్మ లేని ఊరు బండి యాట తాడుతెగినట్లే
తెలుపు లేని నలుపు మామిడి తోరణం లేని పెళ్లే!
వనపట్ల సుబ్బయ్య
94927 65358
ఇవి కూడా చదవండి..
దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్.. సిద్ధంగా ఉండాలని పోల్ అధికారులకు ఈసీ ఆదేశం
అరుణాచల్ ప్రదేశ్, త్రిపురలో మోదీ పర్యటన
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Sep 22 , 2025 | 02:40 AM