ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Montha Cyclone Be the Wake Up Call: మొంథా తోనైనా మేల్కొందాం

ABN, Publish Date - Nov 06 , 2025 | 05:19 AM

ఇటీవల సంభవించిన మొంథా తుపాను రైతాంగాన్ని నిలువునా ముంచేసింది. 3 లక్షల ఎకరాలకు పైగా పంట దెబ్బతిని వేలాదిమంది రైతులు నష్టపోయారు. ఇందులో 70 శాతం వరి పంటలే ఉన్నట్లు తెలుస్తోంది...

ఇటీవల సంభవించిన మొంథా తుపాను రైతాంగాన్ని నిలువునా ముంచేసింది. 3 లక్షల ఎకరాలకు పైగా పంట దెబ్బతిని వేలాదిమంది రైతులు నష్టపోయారు. ఇందులో 70 శాతం వరి పంటలే ఉన్నట్లు తెలుస్తోంది. వేలాది ఎకరాల్లో మొక్కజొన్న, మినుము, పత్తి, కూరగాయలు, ఉద్యాన పంటలకు నష్టం జరిగింది. పలు విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయాయి. రహదారులు దెబ్బతిన్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ తుపాను కారణంగా వివిధ రంగాలకు రూ. 5,265.51 కోట్ల మేర నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా.

ప్రతి ఏటా రాష్ట్రంలో ఇదే పరిస్థితి. హుదూద్, తిత్లీ, పెథాయ్, నివర్, ఇప్పుడు మొంథా... ఇలా వరుస ప్రకృతి వైపరీత్యాలతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోతోంది. గత 37 ఏళ్లలో సుమారు 65కు పైగా ప్రకృతి బీభత్సాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. గత వందేళ్లలో 105కు పైగా తుపాన్లు ఆంధ్రప్రదేశ్‌ను చుట్టుముట్టాయి. ప్రతీ రెండు, మూడేళ్లకోసారి భారీ తుపానో, వరదో రాష్ట్రాన్ని చిగురుటాకులా వణికించేస్తోంది. సాధారణంగా అక్టోబరు, నవంబరు నెలల్లో రాష్ట్రానికి తుపాన్ల ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఈశాన్య రుతుపవనాల సమయంలో సముద్ర ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. ఈ సమయంలో బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడడానికి పరిస్థితులు అనుకూలిస్తాయి. అవి క్రమేపీ వాయుగుండాలు, తుపాన్లుగా మారతాయి. వీటి ప్రభావం ఆర్థిక వ్యవస్థ పైనే కాకుండా... విధాన నిర్ణయాలు, రాజకీయ సుస్థిరత, సాధారణ జనజీవనం పైనా పడుతోంది. ప్రకృతి కన్నెర్రజేస్తే ప్రమాదం ఏ స్థాయిలో ముంచుకొస్తుందనేందుకు ఈ తుపాన్ల విధ్వంసమే నిదర్శనం. ఐరాస విపత్తు నష్ట నివారణ కార్యాలయం విడుదల చేసిన నివేదిక ప్రకారం– వివిధ ఉత్పాతాల కారణంగా భారతదేశం ఏటా రూ.65 వేల కోట్ల వరకూ ఆర్థికంగా నష్టపోతోంది. అందులో తుపాన్ల వల్ల సంభవించే నష్టం ఏటా రూ.4 వేల కోట్ల పైమాటే. విపత్తు మరణాల్లో 16.7 శాతం కేవలం తుపాన్ల వల్లే సంభవిస్తున్నాయి. గత రెండు దశాబ్దాలలో మన దేశంలో తుపాన్ల వల్ల మరణించిన వారి సంఖ్య దాదాపు 20 లక్షలు.

ప్రతీ ఏటా సంభవిస్తున్న ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు ‘జాతీయ విపత్తుల నివారణ సంస్థ’ను ఏర్పాటు చేసుకుని మనం మరింత అప్రమత్తం కాగలుగుతున్నాం. సైనిక సిబ్బందిని, అధికార సిబ్బందిని మోహరించడంతో పాటు, ప్రజలను సైతం మానసికంగా సన్నద్ధం చేస్తున్నాం. కేవలం ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్లనే ఉధృతమైన ఉపద్రవాలలో ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించుకోగలుగుతున్నాం.

విపత్తుల తీవ్రతను తెలుసుకోవడానికే గానీ, ఇంకా వాటిని పూర్తిగా నివారించే స్థాయికి నేటి సాంకేతిక పరిజ్ఞానం ఎదగలేదు. విపత్తుల వల్ల కలిగే ముప్పును తగ్గించే అవకాశాలను ప్రకృతి సహజ సిద్ధంగానే ఏర్పాటు చేసింది. దురదృష్టవశాత్తూ ఆ సహజ రక్షణ కవచాలు మానవ జోక్యంతో నాశనమవుతున్నాయి. మడ అడవులు, సరుగుడు చెట్లు, కొండలమీద పెరిగే దట్టమైన వృక్షాలు... వంటివి తీర ప్రాంతాన్ని కంటికి రెప్పలా కాపాడుతాయి. తుపాన్ల సమయంలో అలల ఉధృతికి, తీరంలోని ఇసుక కోతలకు గురికాకుండా మడ చెట్ల వేర్లు బలమైన వలలుగా పనిచేస్తుంటాయి. రెండు దశాబ్దాల క్రితం రాష్ట్రంలో 54 వేల హెక్టార్లలో మడ అడవులు విస్తరించి ఉండేవి. ఇప్పుడు వాటిలో చాలావరకు నాశనమై పోయాయి. ప్రభుత్వ వ్యవస్థల నిర్లక్ష్యం మడ అడవుల విస్తీర్ణం తగ్గిపోవడానికి ముఖ్య కారణమని ఎం.ఎస్ స్వామినాథన్ నేతృత్వంలోని ఫౌండేషన్ గతంలోనే ఆందోళన వ్యక్తం చేసింది.

కృష్ణా, గోదావరి నదుల్లో మంచినీటి ప్రవాహం తగ్గిపోవడం, నదీజలాల్లోకి ఎగువ ప్రాంతాల్లోంచి తరలివచ్చే ఒండ్రు మట్టి తగ్గిపోవడం అడవుల కోతకు దారితీసింది. నదీ పరీవాహక ప్రాంతాల్లో ఏర్పాటైన భారీ రసాయన పరిశ్రమల వ్యర్థాలు సముద్రంలో కలవడం వల్ల జలాల్లో మార్పులు వచ్చాయి. సముద్రంలోని ఓడల నుంచి వెలువడే వ్యర్థాలు, చమురు వెలికితీత కార్యక్రమాలు, పంట పొలాల నుంచి విడుదలయ్యే రసాయనాలు సైతం తీరంలోని సహజ రక్షణ కవచాలపై ప్రతికూల ప్రభావం కనబరుస్తున్నాయి. తూర్పుగోదావరి, గుంటూరు డెల్టా పరిధిలో చాలావరకు అడవులు కబ్జాలకు గురై తరిగిపోతున్నాయి. పర్యావరణాన్ని దారుణంగా దెబ్బకొడుతున్న ఈ ప్రయత్నాలను తక్షణం అడ్డుకోకపోతే– తుపానులు, పెనుగాలులు ప్రతీసారి రాష్ట్రంలోని తీర ప్రాంతాలను అతలాకుతలం చేస్తూనే ఉంటాయి. తీరం నుంచి 500 మీటర్ల వరకూ బోర్‌వెల్స్ వేయకూడదని సి.ఆర్.జెడ్ చట్టం చెబుతోంది. దాన్ని పట్టించుకోకుండా తీరం వెంబడి బోర్లు వేసి భూగర్భ జలాలు తోడేస్తున్నారు.

కోస్తా జిల్లాల్లో మురుగు, వరద నీటి పారుదల వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టం రెట్టింపవుతోంది. చాలాసార్లు కాలువలు, చెరువు గట్లు తెగిపోవడం వల్లే ఎక్కువమంది మృతిచెందిన సందర్భాలున్నాయి. 1977 నాటి దివిసీమ ఉప్పెన తరువాత విశాఖపట్నం– కోస్తా తీరం వెంట 146 తుపాను రక్షణ కేంద్రాలను అధికారులు నిర్మించారు. అయితే సరైన నిర్వహణ లేకపోవడంతో అవి శిథిలమైపోయాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కోవాలి. ఈ కేంద్రాలతో పాటు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో విపత్తు నిర్వహణ అథారిటీలను పునరుద్ధరించాలి. తుపాన్ల తీవ్రతను తట్టుకుని నిలబడాలంటే– తీరప్రాంత వ్యాప్తంగా గ్రీన్‌బెల్ట్ ఏర్పాటు చేయాలి. తీరం వెంబడి మడ అడవులు, సరుగుడు చెట్లు, జీడిమామిడి తోటలు పెంచాలి. ఉప్పుగాలులను తట్టుకునే వనాలను తీరంలో పెంచాలి. తీరప్రాంత నియంత్రణ కోసం రూపొందించిన ‘కోస్టల్ రెగ్యులేషన్ జోన్’ నిబంధనలను కఠినంగా అమలు చేయాలి. తీర రక్షణకు అవసరమైన సహజ వనరులను విస్తారంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం, పౌర సంఘాలు నడుం బిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కూసంపూడి శ్రీనివాస్

జనసేన పార్టీ అధికార ప్రతినిధి

ఈ వార్తలు కూడా చదవండి:

Karthika Pournami: కార్తీక పౌర్ణమి.. శివ నామస్మరణతో మార్మోగిన దేవాలయాలు

PM with World Cup Winners: ప్రధాని మోదీని కలిసిన టీమిండియా.. ప్రపంచకప్ విజేతలకు పీఎం అభినందనలు

Updated Date - Nov 06 , 2025 | 05:19 AM