Worker Rights: కార్మిక చట్టాలు కోడ్స్‌లో వెతుక్కోవాలి!
ABN, Publish Date - Nov 29 , 2025 | 01:56 AM
కార్మిక చట్టాల స్థానంలో కార్మిక కోడ్‌లను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. వీటి ద్వారా సర్వతోముఖాభివృద్ధి సాధించి దేశం ముందుకు వెడుతుందని ఊదరగొట్టే ప్రయత్నం చేస్తోంది....
కార్మిక చట్టాల స్థానంలో కార్మిక కోడ్‌లను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. వీటి ద్వారా సర్వతోముఖాభివృద్ధి సాధించి దేశం ముందుకు వెడుతుందని ఊదరగొట్టే ప్రయత్నం చేస్తోంది. కానీ అవి కార్మికుల హక్కులను హననం చేసి యాజమాన్యాల దయాదాక్షిణ్యాలకు వారిని బలి చేస్తాయి. 100 సంవత్సరాలుగా కార్మికులకు రక్షణగా నిలిచిన చట్టాలను భూస్థాపితం చేసి, యాజమాన్యాలు తమ ఇష్టారీతిన కార్మికులను ఉపయోగించుకునేలా లేబర్ కోడ్‌లను తయారు చేయడం ఆక్షేపణీయం.
విపులంగా ఉన్న చట్టాలను కుదిస్తే వాటి పరిధి పెరుగుతుందా తగ్గుతుందా? 29 కేంద్ర కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్‌లుగా సంక్షిప్తీకరించి వాటిని కార్మికుల సంక్షేమం కోసమే అని ప్రకటించడం ఎవరూ ప్రశ్నించరు అన్న ధీమాతోనే. అంతేకాక కార్మికుల హక్కుల పట్ల నిర్లక్ష్యం, కార్మిక సంఘాల పట్ల లెక్కలేనితనం, పెట్టుబడిదారులకు దోపిడీ మార్గాలను సుగమం చేయాలన్న దృఢసంకల్పంతో మాత్రమే. కార్మిక సంఘానికి ఇచ్చిన నిర్వచనంలో యాజమాన్యాలు, యాజమా న్యాలూ కలిసి ఏర్పడిన సమూహం కూడా కార్మిక సంఘంగా పరిగణించబడుతుందని చెప్పడం వెనుక అర్థమేమిటో తెలియలేదు. ఇక నుంచి వర్కర్లు వేరు, ఎంప్లాయీస్ వేరు. రూ.18,000 వేతనం పొందే సూపర్వైజరీ ఉద్యోగి వర్కర్ కాదు! కోడ్ పరిధి మారుతుంది. అన్ని రకాల వివాదాంశాలపై తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వానిదే అని ప్రకటించారు. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏదైనా లేబర్ కోడ్‌ల అంశంలో వివాదం ఏర్పడితే కేంద్రానిదే తుదినిర్ణయం.
వేతనాల నిర్ణయంపై యాజమాన్యాలదే పూర్తి బాధ్యతట. మరి ఆ బాధ్యత నెరవేర్చకపోతే పరిష్కారమేమిటో చెప్పలేదు. సమాన పనికి సమాన వేతనం అమలు పరచాలన్నప్పుడు, స్త్రీ–పురుషులకు అసంఘటిత రంగంలో సమాన వేతనం ఏర్పాటుచేసే ప్రక్రియ ఏమిటో ప్రస్తావించలేదు. పైగా ఒక నిర్దేశించిన పనికి ఎవరినైనా నియమించుకున్నప్పుడు యజమాని నిర్ణయమే అంతిమం అని ఇండస్ట్రియల్ రిలేషన్స్ అనే కోడ్‌లో స్పష్టంగా పేర్కొంటూ, సదరు యజమాని నిర్ణయాన్ని కోర్టులో కూడా సవాలు చేయరాదన్న నిబంధన ఎందుకు ఉంచినట్లు? రాత్రి పగలు తేడా లేకుండా స్త్రీలను పనుల్లో నియమించుకోవడం, కావాల్సినన్ని గంటలు పనిచేయించుకోవడం వంటివన్నీ స్త్రీల ఉద్ధరణగా ఎలా భావించగలం?
అన్నిటికన్నా క్రూరమైన ప్రతిపాదన ‘ఫిక్స్‌డ్ టర్మ్ ఎంప్లాయిమెంట్’– ‘యాజమాన్యం చెల్లించే గ్రాట్యూటీ పొందడానికి ఇప్పుడున్న ఐదు సంవత్సరాల అర్హత కాలాన్ని ఒక సంవత్సరానికి’ కుదించామని చెప్పేది. ఈ ఫిక్స్‌డ్ టర్మ్ ఎంప్లాయ్‌మెంట్ ప్రతిపాదన ద్వారా భవిష్యత్తులో ఏ ఒక్కరికీ 2 లేదా 3 సంవత్సరాలకు మించి అగ్నివీరుల్లా ఉపాధి ఉండదు! ఇంతటి క్రూరత్వాన్ని కప్పిపెట్టుకోవడానికి ఒక సంవత్సరం పనిచేసినా సరే గ్రాట్యూటీ పొందవచ్చు అనే మాయమాట చెబుతున్నారు. గ్రాట్యూటీ పేమెంట్ అనేది ఉద్యోగి పొందే వేతనాన్ని, చేసిన సర్వీస్ కాలాన్ని బట్టి ఉంటుంది. అలాంటప్పుడు ఒక సంవత్సరం పనిచేసిన ఉద్యోగి పొందే బేసిక్ ఎంత, దానికి సరిపడా ఒక సంవత్సరానికి లభించే గ్రాట్యూటీ ఎంత? నామమాత్రం! నియామక పత్రాలు పొందిన సంఘటిత రంగంలోని కొందరికి మాత్రమే గ్రాట్యుటీ చెల్లిస్తారు. 97శాతం అసంఘటితరంగ కార్మికులకు గ్రాట్యుటీ చెల్లించాలంటే ఏం చేయాలో ఈ కోడ్‌లలో ఎక్కడా లేదు.
కనీసం 100 మంది వర్కర్లు పనిచేస్తున్న సంస్థలో లే ఆఫ్ లేదా రిట్రెంచ్‌మెంట్ ప్రకటించాలంటే ప్రభుత్వ అనుమతి అవసరం. ఇప్పుడు ఆ సంఖ్యను 300 చేశారు. అదే విధంగా ప్రభుత్వం ప్రకటించే స్టాండింగ్ ఆర్డర్లు కూడా కనీసం 100 మంది వర్కర్లు ఉన్న సంస్థలకు వర్తిస్తాయి, ప్రస్తుతం దీనిని 300కి పెంచారు. మరి దీని ద్వారా యాజమాన్యాలకు లాభమా, వర్కర్లకు లాభమా? ఎవరైనా యజమాని నిర్దేశిత పనికోసం ఎవరినైనా నియామక పత్రం ఇచ్చి మరీ నియమించుకున్నప్పుడు వారిని తొలగించేటప్పుడు ఎలాంటి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు.
ఇక కార్మిక సంఘాల పరిధి నామమాత్రమై పోతుంది. కార్మిక సంఘాన్ని రిజిస్టర్ చేసుకోవాలంటే కనీసం 10శాతం సభ్యులు గానీ లేదా వందమంది గానీ ఉంటే తప్ప సాధ్యపడదు. వంద మందికి మించి వర్కర్లున్న చోట వర్కర్స్ కమిటీ ఏర్పడనున్నది. ఈ వర్కర్స్ కమిటీలో యాజమాన్యం, కార్మిక సంఘాల ప్రతినిధులు సమాన సంఖ్యలో ఉంటారు. 20 మంది కన్నా ఎక్కువ కార్మికులు ఉన్న చోట ‘గ్రీవెన్స్ రెడ్రెసల్ కమిటీ’ ఏర్పాటు చేస్తారు. చైర్మన్ మాత్రం యజమాన్యం వైపు నుంచే ఉంటారు. దీన్ని బట్టి ఎవరి ప్రయోజనాల కోసం కార్మిక చట్టాల సవరణ జరిగింది? సమ్మెలను నివారించడమే లక్ష్యంగా ఈ కోడ్‌లు తయారయ్యాయి.
అసంఘటితరంగ కార్మిక సంఘాలకు నాయకత్వం వహించడానికి కనీసం 50శాతం ఆ సంస్థలో పనిచేస్తున్నవారై ఉండాలి. సంఘటితరంగం గురించి స్పష్టత లేదు. ఇలా ఏ సంఘాలకు ఎవరు నాయకులు ఉండాలో కూడా అంతిమ నిర్ణయం ప్రభుత్వమే చేస్తే ఇక కార్మికుల, వారి సంఘాల ప్రజాస్వామ్యమెక్కడ! ఇలాంటి నిబంధనలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 స్ఫూర్తికి విరుద్ధం.
గిగ్ వర్కర్లు, ప్లాట్‌ఫాం వర్కర్లకు కూడా పర్మనెంట్ ఉద్యోగుల మాదిరిగా అన్నీ సమకూరుతాయని ప్రకటించారు. కానీ గిగ్ వర్కర్లు, ప్లాట్‌ఫాం వర్కర్లకు సంబంధించిన యజమాని – ఉద్యోగి అనే అంశంపై స్పష్టత లేదు. వారికి ఇవ్వాల్సిన నియామక పత్రాల గురించి కూడా స్పష్టత లేదు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించాలి అని ఒక వైపు ప్రకటిస్తూనే 14 సంవత్సరాలు నిండిన వారందరూ కార్మిక సంఘంలో చేరవచ్చు అని కూడా ప్రస్తుతించారు. వెరసి ఈ కోడ్‌ల ద్వారా ప్రశ్నించకుండా స్వీయ ధృవీకరణ ద్వారా పరిష్కరించుకోవాలి. నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ మాదిరిగా కన్సిలియేటరీ, ట్రిబ్యునల్, గ్రీవెన్స్ రిడ్రెస్సల్, ఆర్బిట్రేటర్ వ్యవస్థలన్నీ దాటితే తప్ప కోర్టు పరిధి అందుబాటులోకి రాదు. కార్మిక సంక్షేమానికి నీళ్ళొదిలితే సమాజంలోని అని వ్యవస్థలూ తిరోగమనంలో పయనిస్తాయి.
-జి. తిరుపతయ్య
Updated Date - Nov 29 , 2025 | 01:57 AM