Pulivendula Elections: పులివెందుల పులి పిల్లి శాపనార్థాలు
ABN, Publish Date - Aug 17 , 2025 | 04:00 AM
ధర్మో రక్షతి రక్షితః ..ధర్మాన్ని నీవు రక్షిస్తే ధర్మం నిన్ను రక్షిస్తుంది. పులివెందుల–ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి చేసిన విమర్శలు విన్న తర్వాత ఈ సూక్తి గుర్తుకురాకుండా ఉండదు. ‘ఈ ఎన్నికలలో అధికార కూటమి...
ధర్మో రక్షతి రక్షితః ..ధర్మాన్ని నీవు రక్షిస్తే ధర్మం నిన్ను రక్షిస్తుంది. పులివెందుల–ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి చేసిన విమర్శలు విన్న తర్వాత ఈ సూక్తి గుర్తుకురాకుండా ఉండదు. ‘ఈ ఎన్నికలలో అధికార కూటమి అరాచకంగా వ్యవహరించింది. దొంగ ఓట్లతో గెలిచిన గెలుపు కూడా ఒక గెలుపేనా? ఇలా అయితే ప్రజాస్వామ్యం ఏమి కావాలి? ముఖ్యమంత్రి నరకానికి పోతాడు!’ అని జగన్‌రెడ్డి అండ్ కో చేస్తున్న ఆక్రందనలు రాజకీయ ప్రత్యర్థులకు శ్రవణానందకరంగా ఎందుకు మారాయి? జగన్‌రెడ్డి పరోక్ష మద్దతుదారులు, అభ్యుదయవాదుల ముసుగులో ఉన్న జగన్‌రెడ్డి శ్రేయోభిలాషులు కూడా ‘ఇది అన్యాయం’ అని గట్టిగా ఎందుకు నిలదీయలేకపోతున్నారు? మనం విత్తే విత్తును బట్టే ఆ చెట్టు కాయలు ఉంటాయని జగన్‌రెడ్డి ఇటీవల తరచుగా చెబుతున్నట్టుగానే అధికారంలో ఉన్నప్పుడు ఆయనగారు చేసిన అరాచకాలు ఇప్పుడు ఖర్మ రూపంలో ఎదురొస్తున్నాయి. ఖర్మ ఫలాన్ని అనుభవించాల్సిందే. అందుకే పులివెందులలో జరిగినవి ఎన్నికలే కాదని జగన్ అండ్ కో ఆక్రోశిస్తున్నా అన్యుల చెవికి ఎక్కడం లేదు. అయినా ‘పులి బిడ్డ’, ‘పులివెందుల పులి’ అని కీర్తించబడుతున్న జగన్‌రెడ్డి పిల్లి శాపనార్థాలు పెట్టడం ఏమిటి? బెబ్బులి పులిలా గాండ్రించకుండా.. ముసలివాడైన చంద్రబాబు రామా కృష్ణా అనుకోకుండా ఇలా ఎందుకు చేస్తున్నాడు? ‘నరకానికి పోతాడు.. బహుశా ఆయనకు ఇవే చివరి ఎన్నికలు’ అని పిల్లి శాపనార్థాలు పెట్టడం ఏమిటి? పులికి బేలతనం ఉండదు కదా? ఆకలితో అలమటిస్తున్నా పులి గడ్డి మాత్రం తినదు. మన జగన్‌రెడ్డి కూడా ప్రతీకారం తీర్చుకోవడానికి అదను కోసం వేచిచూడకుండా బీద అరుపులు, పిల్లి శాపనార్థాలు పెట్టడం ఏమిటి? తాను మాత్రం ఉట్టి కట్టుకొని నూరేళ్లపాటు ఊరేగుతానని, 75 ఏళ్ల వయసుకు చేరుకున్న చంద్రబాబు పరిస్థితి ఇవాళో రేపో అన్నట్టుగా ఉందని వాగడం ఏమిటి? ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కూడా వచ్చే నెలతో 75 ఏళ్లు నిండుతాయి. ఆయనను కూడా ఇవాళో రేపో అని అనగలవా? అంతెందుకు, ప్రపంచ దేశాలను, మరీ ముఖ్యంగా మన దేశాన్ని సుంకాల పేరిట వేధిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు 79 ఏళ్లు. ఈ వాస్తవాలను మరిచి చంద్రబాబు జీవించి ఉన్నంత కాలం ఆయనతో నేను రాజకీయంగా పోటీ పడలేను అన్నట్టుగా జగన్ రోదన ఉంది. పులివెందుల అంటే అది తమ కుటుంబ అడ్డా అని, అక్కడ మరొకరికి చోటు లేదు బిడ్డా అన్నట్టుగా ఇంతకాలం విర్రవీగడం వల్లనే ఇప్పుడు ఈ ఆవేదన. రాజ్యాలు, సామ్రాజ్యాలు కుప్పకూలిపోయాయి. రాజులు, చక్రవర్తుల చిరునామాలు గల్లంతయ్యాయి. ఒకప్పుడు రవి అస్తమించని సామ్రాజ్యంగా కీర్తించబడిన బ్రిటన్ ప్రస్తుత పరిస్థితి ఏమిటి? అలాగే పులివెందుల అయినా మరొకటి అయినా ఏదీ ఎవరికీ సొంతం కాదు. ప్రజాస్వామ్యంలో అలా సాధ్యం కాదు కూడా. ఇంతకూ పులివెందులలో ఏమి జరిగింది? జగన్‌రెడ్డి కథ అడ్డం తిరగడానికి కారణం ఏమిటి? నిజంగా జగన్ అండ్ కో ఆరోపిస్తున్నట్టుగా దొంగ ఓటర్లు వచ్చి పడటం వల్లనే వైసీపీకి డిపాజిట్ కూడా గల్లంతయిందా? లేక ప్రజల్లో నిజంగానే జగన్ పట్ల విముఖత ఏర్పడుతోందా? అన్నది పరిశీలించాలి.
తన హయాంలో జరిగిన స్థానిక ఎన్నికల సందర్భంగా జగన్‌రెడ్డి అన్ని హద్దులూ దాటారు. ప్రత్యర్థి పార్టీకి చెందిన వాళ్లను నామినేషన్లు కూడా వేయనీయలేదు. ఇప్పుడు పులివెందులలో పోలింగ్ కేంద్రాలలో తమ పార్టీ ఏజెంట్లను కూడా ఉండనివ్వలేదు అని జగన్‌రెడ్డి వాపోతున్నారు. ఇప్పుడు కనీసం నామినేషన్లు అయినా వేసుకోనిచ్చారు కదా అని సంతృప్తిపడటం మంచిదేమో. తిరుపతి పార్లమెంటు స్థానానికి జరిగిన ఉప ఎన్నిక సందర్భంగా తిరుపతి పట్టణంలో విచ్చలవిడిగా దొంగ ఓట్లు వేయించుకోలేదా? అప్పుడు అదంతా న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా జరిగిందని చెప్పుకొన్నారు కదా? ఆనాడు మీరు ఏర్పరిచిన దారిలోనే ఇప్పుడు కూటమి ప్రభుత్వం నడిచి ఉంటుంది. అందుకే జగన్ అండ్ కోను ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేదు. అప్పట్లో 90 శాతానికి పైగా స్థానిక సంస్థలలో జయకేతనం ఎగురవేశామని సంబరపడ్డారు కదా? ప్రజల్లో ప్రభుత్వం పట్ల సానుకూలత పెరిగిందని మీ చర్యలను సమర్థించుకున్నారు కదా? ఇప్పుడు కూటమి నేతలు కూడా అదే పనిచేస్తున్నారు. నిజానికి స్థానిక సంస్థల ఫలితాలు అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగానే ఉంటాయి. నూటికి నూరు శాతం స్థానిక సంస్థలను కైవసం చేసుకున్నప్పటికీ సాధారణ ఎన్నికల్లో ఫలితాలను ప్రభావితం చేయలేరు. తెలంగాణలో కూడా కేసీఆర్ పార్టీ దాదాపుగా అన్ని స్థానిక సంస్థలను సొంతం చేసుకుంది. అయినా 2023లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌రెడ్డి పరిస్థితి కూడా ఇంతే. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఏం చేశారో మరచిపోతే ఎలా?
అక్కడసలు అంత సీన్ ఉందా?
జగన్‌రెడ్డి రాజకీయాల్లోకి ప్రవేశించక ముందు వరకు తెలుగునాట రాజకీయాల్లో కొన్ని ఉన్నత ప్రమాణాలు పాటించేవారు. రాజశేఖరరెడ్డి, చంద్రబాబు నాయుడు ప్రధాన ప్రత్యర్థులుగా తెలుగునాట రాజకీయాలు సాగినప్పుడు కూడా ఈ ప్రమాణాలను పాటించారు. రాజశేఖరరెడ్డిని పులివెందులలో ఓడించడానికి, కుప్పంలో చంద్రబాబును ఓడించడానికి వారు ఇరువురూ ప్రత్యేకంగా వ్యూహాలు రచించి అమలు చేయలేదు. నిజానికి పులివెందులలో వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి బయట ప్రచారం జరుగుతున్న స్థాయిలో ప్రజలలో మద్దతు లేదు. 1996 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఈ విషయం రుజువైంది. అప్పుడు కడప లోక్‌సభ స్థానం నుంచి రాజశేఖర రెడ్డి పోటీ చేశారు. చంద్రబాబు అప్పుడే ముఖ్యమంత్రి అయ్యారు. జిల్లా ఎస్పీగా ఉమేష్ చంద్ర ఉన్నారు. ఎన్టీఆర్‌ను ధిక్కరించి పార్టీని సొంతం చేసుకున్న చంద్రబాబుకు నాటి ఎన్నికలు విషమ పరీక్షగా మారాయి. దీంతో మెజారిటీ స్థానాలు గెలుచుకోక తప్పని పరిస్థితి చంద్రబాబుది. ఈ నేపథ్యంలో కడప పైన కూడా ఆయన దృష్టి కేంద్రీకరించారు. ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేలా చూడాలని ఆయన జిల్లా ఎస్పీ ఉమేష్ చంద్రను ఆదేశించారు. ఉమేష్ చంద్ర పులివెందులపై దృష్టి కేంద్రీకరించి రిగ్గింగ్ జరగకుండా కఠిన చర్యలు తీసుకున్నారు. మిగతా అసెంబ్లీ నియోజకవర్గాలలో కూడా ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేలా ఏర్పాట్లు చేశారు. దీంతో వైఎస్ రాజశేఖర రెడ్డి ఓడిపోయే పరిస్థితి ఏర్పడింది. చివరి నిమిషంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు మనసు మార్చుకొని పులివెందులలో కాస్త చూసీ చూడనట్టు వెళ్లవలసిందిగా అధికారులను ఆదేశించారు. ఫలితంగా కేవలం ఐదు వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఆ ఎన్నికల్లో రాజశేఖరరెడ్డి గట్టెక్కి పరువు దక్కించుకున్నారు. దీన్నిబట్టి ఓటర్లకు స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించగలిగితే పులివెందులలో వైఎస్ కుటుంబానికి చెప్పుకొనేంత సీన్ లేదని అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పులివెందుల, ఒంటిమిట్ట ఫలితాలను చూడాల్సి ఉంది. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబును జగన్‌రెడ్డి వేధింపులకు గురిచేసి ఉండకపోతే ఇప్పుడు పులివెందులలో డిపాజిట్లు కోల్పోయే పరిస్థితి ఏర్పడేది కాదు. నేను చేస్తే సంసారం– ఇతరులు చేస్తే వ్యభిచారం అన్నట్టుగా జగన్‌రెడ్డి ఇప్పుడు మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఇప్పుడు ధర్మం–న్యాయం అని కలవరిస్తున్న జగన్‌రెడ్డి అప్పుడు చేసిందేమిటి? ఆనాడు పోలీసులను దుర్వినియోగం చేయడం ద్వారా మీరు దారి ఏర్పరిచారు. ఇప్పుడు కూటమి నేతలు అదే దారిలో వెళ్లకూడదు అని కోరుకునే నైతికత జగన్‌రెడ్డికి ఉంటుందా? 14 మాసాల క్రితం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ప్రజలెవరూ మరచిపోలేకపోతున్నారు. అందుకే అన్యాయం జరిగిందని జగన్ అండ్ కో ఘోషిస్తున్నా మద్దతు లభించడం లేదు. కుప్పంలో చంద్రబాబును ఓడించడానికి చేయని ప్రయత్నం అంటూ లేదు కదా! ‘వై నాట్ 175?’ అన్నప్పుడు న్యాయం, ధర్మం గుర్తుకురాలేదా? అసెంబ్లీలో ప్రతిపక్షానికి ప్రాతినిధ్యమే ఉండకూడదని అనుకున్నారు కదా? అందుకే ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా తీర్పు ఇచ్చారు. 2019 ఎన్నికలతో పోల్చితే 2024లో పులివెందులలో జగన్‌రెడ్డి మెజారిటీ 30 వేలకు పైగా తగ్గింది. అయినా తన పట్ల ప్రజల్లో విముఖత ఏర్పడుతోందని జగన్‌రెడ్డి గుర్తించలేకపోయారు. సొంత బాబాయిని హత్య చేసిన, చేయించిన వాళ్లకు వత్తాసు పలుకుతూ, తల్లినీ చెల్లినీ దూరం చేసుకున్న జగన్‌రెడ్డి నిజస్వరూపాన్ని పులివెందుల ప్రజలు కూడా గుర్తించారు. అయినా 2024 ఎన్నికల్లో పూర్తిస్థాయిలో స్వేచ్ఛగా ఓట్లు వేసుకోలేకపోయారు. ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. వైసీపీకి డిపాజిట్ కూడా దక్కకుండా చేశారు. స్థానిక ఓటర్లు ఓటు వేయపోతే కేవలం దొంగ ఓట్లతోనే ఎవరూ ఈ స్థాయి విజయాన్ని అందుకోలేరు. నా పుట్టలో వేలు పెడితే నేను ఊరుకుంటానా అన్నట్టుగా కుప్పంలో నాడు వేలు పెట్టినందుకు చంద్రబాబు ఇప్పుడు ప్రతీకారం తీర్చుకున్నారు. నిజానికి పులివెందులలో జగన్ పార్టీకి డిపాజిట్ కూడా దక్కదని తెలుగుదేశం నాయకులు కూడా ఊహించలేదు. గెలవడం ఎలా? అన్న దానిపైనే తర్జనభర్జన పడ్డారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 14 మాసాలే అయినందున ఉప ఎన్నికలు ఏవి జరిగినా ఫలితాలు కూటమికి అనుకూలంగానే ఉంటాయి. అయితే ఉప ఎన్నికలు జరిగిన రెండు స్థానాలు కడప జిల్లాలో ఉండటం, అందులో ఒకటి జగన్‌రెడ్డి సొంత నియోజకవర్గంలో ఉన్నందున ఈ ఎన్నికలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఫలితాలు కూటమి నాయకుల అంచనాలకు భిన్నంగా వచ్చాయి. రాజకీయాల్లో ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలియకుండా జగన్‌రెడ్డి మూర్ఖంగా వెళతారు. ఈ పోకడలను ఆయనను గుడ్డిగా అభిమానించే వారు కీర్తిస్తున్నారు. దీంతో తాను నిజంగానే పులిని అని ఆయన నమ్ముతున్నారు. తాను తలపండిన రాజకీయ నాయకుడు చంద్రబాబుతో తలపడుతున్న విషయం మరచిపోతున్నారు. ప్రస్తుతానికి తల బొప్పి కట్టింది. భవిష్యత్తులో తల పగలకూడదు అనుకుంటే రాజకీయంగా ఆచితూచి అడుగులు వేయాలి. మొరటుతనం అన్ని వేళలా పనికిరాదు. పెళ్లిళ్లు పేరంటాలకు వెళ్లినప్పుడు తోలుకెళ్లిన జనంతో హడావిడి చేసి ప్రభంజనం అని మురిసిపోవడం వల్ల ప్రయోజనం ఉండదు. ప్రజలు తనను అంతలా ఎందుకు తిరస్కరిస్తున్నారో ఆత్మపరిశీలన చేసుకోకుండా ఆత్మవంచనతో ముందుకు సాగితే ఫలితాలు ఇలా ప్రతికూలంగానే ఉంటాయి.
నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా!
అధికారంలో ఉన్నప్పుడు ధర్మాన్ని రక్షించి ఉంటే అది ఇప్పుడు నిన్ను రక్షించి ఉండేది. గడచిన 30 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ అనేక పర్యాయాలు అధికారంలో ఉంది. అయినా పులివెందుల జడ్పీటీసీని గెలిపించుకోలేకపోయింది. మూడు దశాబ్దాల తర్వాత ఇప్పుడు గెలుచుకోగలిగారు. అది కూడా జగన్‌రెడ్డి పార్టీకి డిపాజిట్ కూడా దక్కకుండా చేస్తూ! ఎంత దొంగ ఓట్లు అయితే మాత్రం ఫలితం ఇంత దారుణంగా ఉంటుందా? ఇక్కడే జగన్‌రెడ్డి ఆత్మపరిశీలన చేసుకోవాలి. జగన్‌రెడ్డిలో ఇప్పటికీ మార్పు కనబడటం లేదు. రాజకీయ ఎత్తుగడల్లో కూడా మార్పు లేదనిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వల్లభనేని వంశీ, కొడాలి నాని వంటి వారిని తెలుగుదేశం పైకి ఉసిగొల్పారు. ఇప్పుడు అధికారం కోల్పోయాక కాపు సామాజిక వర్గానికి చెందిన పేర్ని నాని, అంబటి రాంబాబును ప్రయోగిస్తున్నారు. ఈ రెండు సామాజిక వర్గాల వారినే తన పావులుగా ఎందుకు ఎంచుకున్నారో తెలియదు. కృత్రిమ ప్రభంజనాలను చూసుకొని మురిసిపోకుండా పులివెందుల ప్రజలు కూడా ఎందుకు తనకు అడ్డం తిరుగుతున్నారో తెలుసుకొనే ప్రయత్నం చేస్తే మంచిది. అంతేగానీ నేను చేశానని నువ్వు కూడా చేస్తావా? నువ్వు నరకానికి పోతావు! అని పిల్లి శాపనార్థాలు పెట్టడం నీ బలహీనతను చెప్పకనే చెబుతోంది. మరోవైపు పులివెందుల, ఒంటిమిట్ట విజయంతో తెలుగుదేశం నాయకులు మిడిసిపడకూడదు. 2021లో ఇలా మిడిసిపడిన వైసీపీకి 2024లో ఏం జరిగిందో మరచిపోకూడదు. స్థానిక సంస్థల ఎన్నికలు, ముఖ్యంగా ఉప ఎన్నికలు అధికార పార్టీకి అనుకూలంగానే ఉంటాయి. జగన్‌రెడ్డి ఏలుబడిలో కుప్పం మున్సిపాలిటీని సొంతం చేసుకోలేదా? ప్రజాభిప్రాయం ఎప్పుడూ స్థిరంగా ఉండదు. ప్రభుత్వం బాగా పనిచేస్తున్నంత కాలం అనుకూలంగానే ఉంటారు. రాజ్యం వీరభోజ్యం అనుకుంటే జనం వెంటనే అడ్డం తిరుగుతారు. ముఖ్యమంత్రి చంద్రబాబును రెచ్చగొట్టినందుకు జగన్‌రెడ్డి అనుభవిస్తున్నారు. తెలుగుదేశం శాసనసభ్యులు, ఇతర నాయకులు జగన్‌రెడ్డికి ప్రస్తుత దుస్థితి ఎందుకు కలిగిందా అని అనుక్షణం గమనంలో ఉంచుకోవాలి. అంతేగానీ, పులివెందులనే కొట్టాం– ఇక మాకు తిరుగు ఉండదని భావిస్తే నడ్డివిరవడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారు. పులివెందుల ఉండి ఉండకపోతే అసలు ఈ ఎన్నికల గురించి చర్చించాల్సిన అవసరమే ఉండేది కాదు. పులివెందుల విజయానికి కారణాలు ఏమిటో తెలుగుదేశం నాయకులకు తెలుసు కనుక వాపును చూసి బలుపు అనుకోవద్దు. జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలోని నాలుగు జడ్పీటీసీ స్థానాలను వైసీపీ గెలుచుకుంది. అప్పుడు ‘కుప్పంలో కూలిన చంద్రబాబు కోట’ అంటూ సంబరాలు చేసుకున్నారు. 2019 ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుకు 30 వేల మెజారిటీ మాత్రమే లభించగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి లభించిన ఓట్లు 60 వేలు అధికమని, దీన్నిబట్టి చంద్రబాబు ఓడినట్టేనని లెక్కలు కట్టి జబ్బలు చరుచుకున్నారు. ఈ లెక్కలను జగన్ రోత మీడియా ఆనందంగా అచ్చు వేసింది. సీన్ కట్ చేస్తే 2024లో చంద్రబాబుకు 40 వేల ఓట్ల మెజారిటీ లభించింది. అది కూడా ఆయనను ఓడించడానికి ఓటుకు ఐదు వేల రూపాయల వంతున పంచి భారీ స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడిన తర్వాత! నాటి వైసీపీ రోత మీడియా లెక్కల ప్రకారం ఇప్పుడు పులివెందులలో జగన్ ఓడిపోబోతున్నారని చెప్పవచ్చు. నిజానికి ఇవన్నీ కాకి లెక్కలు. నాడు జగన్‌రెడ్డి వద్ద డబ్బుతో పాటు అధికారం ఉంది.
తెలుగుదేశం పార్టీకి చెందిన స్థానిక నాయకులు, కార్యకర్తలను లోబరుచుకున్నారు. ఇప్పుడు కూటమి వద్ద అధికారం, డబ్బు ఉంది. అందుకే పులివెందులలో జగన్ సొంత మనుషులు కూడా అమ్ముడుపోయారు లేదా అధికారానికి లొంగిపోయారు. ఎంపీ అవినాశ్‌రెడ్డి కూడా అధికారం లేకపోతే ఏమీ చేయలేరని రుజువైంది. అయితే సాధారణ ఎన్నికల్లో డబ్బు, అధికారం ప్రభావం నామమాత్రమే. ప్రజలు కాదనుకుంటే ఎంత అధికారం, డబ్బు ఉన్నప్పటికీ విజయాన్ని అందుకోలేరని అనేక సాధారణ ఎన్నికల్లో రుజువైంది. ప్రజల అండ లేకపోతే పులులు పిల్లులవుతాయి. నాడు కుప్పంలో తమకు జరిగిన పరాభవానికి ఇప్పుడు చంద్రబాబు ప్రతీకారం తీర్చుకున్నారనడంలో తప్పు లేదు. గతంలో కుప్పంలో ఏం జరిగిందో ఇప్పుడు పులివెందులలో అదే జరిగిందని సరిపెట్టుకుంటే ఏ గొడవా ఉండదు. ఎన్నికల్లో అక్రమాలు చోటుచేసుకోవడం ఇవాళ కొత్త కాదు. ఓటర్ల జాబితాలు తారుమారవుతాయి. అధికారంలో ఉన్నవారికి ప్రభుత్వ యంత్రాంగం ఊడిగం చేస్తుంది. తాను నియమించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని తనను ఆదుకోలేదని జగన్‌రెడ్డి ఆవేదన చెంది లాభం లేదు. నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా!
19న ఏం తేలుతుందో?
జాతీయ స్థాయిలో ఓట్ల తొలగింపు వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బిహార్ అసెంబ్లీకి త్వరలో జరగనున్న ఎన్నికలను పురస్కరించుకొని ఎన్నికల కమిషన్ అక్కడ 65 లక్షల ఓట్లను తొలగించిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ తీవ్ర స్థాయిలో ఆరోపించారు. ఈ ఆరోపణలకు బలం చేకూర్చే ఉదంతాలను ఇండియా కూటమి ముందు ఉంచి వారి మద్దతు కూడగట్టడంలో రాహుల్‌గాంధీ సఫలీకృతులయ్యారు. ఇండియా కూటమి ఎంపీలు ఢిల్లీలో ర్యాలీ కూడా నిర్వహించారు. చివరికి వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. ఓట్ల తొలగింపు అంశాన్ని తీవ్ర అంశంగా పరిగణించిన సుప్రీంకోర్టు మొత్తం తొలగించిన 65 లక్షల ఓట్ల వివరాలను
ఈ నెల 19లోపు ఎన్నికల కమిషన్ ప్రకటించాలని గురువారంనాడు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాహుల్‌గాంధీ ఆరోపణల్లో పస ఉందా? లేదా? ఎన్నికల కమిషన్ నిజంగానే ఏదో ఒక పార్టీకి మేలు చేయడానికే భారీ స్థాయిలో ఓట్లను తొలగించినదీ లేనిదీ కూడా స్పష్టమవుతుంది. ఎన్నికల కమిషన్ తప్పు చేసినట్టు ఈ నెల 19 తర్వాత రుజువైతే రాహుల్‌గాంధీ ప్రతిష్ఠ అమాంతం పెరుగుతుంది. ఎన్నికల కమిషన్ ప్రతిష్ఠ పాతాళానికి పడిపోతుంది. రాజ్యాంగ బద్ధమైన వ్యవస్థలు దారి తప్పితే దాని ప్రభావం తృతీయ ఆర్థిక శక్తిగా ఎదుగుతోందని చెప్పుకొనే భారత్‌పై పడుతుంది. ఎన్నికల వ్యవస్థ పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లితే దేశంలో అరాచక పరిస్థితులు నెలకొంటాయి. మనకూ పాకిస్థాన్‌కూ పెద్ద తేడా ఉండబోదు. న్యాయ వ్యవస్థ ప్రతిష్ఠ కూడా ఈ మధ్య మసకబారుతోంది. గురువారం నాటి ఆదేశాలతో న్యాయ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది. ఎన్నికల కమిషన్ నిజంగా తప్పు చేస్తే దాన్ని సరిదిద్దే బాధ్యత సర్వోన్నత న్యాయస్థానం పైనే ఉంటుంది. మిగతా వ్యవస్థలు పతనమైనప్పుడు న్యాయ వ్యవస్థపై ఆశలు పెట్టుకోవడంలో తప్పులేదుగా? బిహార్‌లో తొలగించిన 65 లక్షల ఓట్లు అక్కడి ఫలితాన్ని తారుమారు చేస్తాయి. తొలగింపునకు గురైన ఓటర్లు అందరూ అనర్హులే అయితే ఏ పేచీ ఉండదు. ఎన్నికల కమిషన్‌ను అభినందించవచ్చు. అలా కాకుండా ఏదైనా తిరకాసు జరిగి ఉంటే దాని ప్రభావం ఎన్డీయే ప్రభుత్వంపై కూడా పడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి సంబంధం ఉన్నా లేకపోయినా తప్పు జరిగి ఉంటే ప్రభుత్వమే ఒత్తిడి తెచ్చి ఎన్నికల కమిషన్‌తో తప్పు చేయించిందని ప్రజలు నిర్ధారణకు వస్తారు. అదే జరిగితే ఎన్డీయే కూటమి ఎంతో కొంత మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది. ఈ అంశంలోనూ తలదూర్చి జగన్‌రెడ్డి తన రాజకీయ అపరిపక్వతను మరోసారి చాటుకున్నారు. రాహుల్‌గాంధీ ఏపీ గురించి మాట్లాడలేదని, రాహుల్– చంద్రబాబు– రేవంత్‌రెడ్డి ముగ్గురూ హాట్‌లైన్‌లో ఉంటారని పొంతనలేని వ్యాఖ్యలు చేసి నవ్వులపాలయ్యారు. మోదీ దయ కోసం పరితపిస్తున్న బేలతనంతో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలయ్యారు. తన మద్దతుదారులే తన రెస్క్యూకు రాని సంకట స్థితిలోకి జగన్ తనను తాను నెట్టుకున్నారు. రాజకీయ పార్టీలకు ఎన్నికల్లో జయాపజయాలు సహజం. తమకు ఓటమి ఉండకూడదు అని అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా భావించినప్పుడే అక్రమాలు, అరాచకాలకు తెరలేస్తుంది. తర్వాత కాలంలో అవే పార్టీలు బాధితులుగా మిగులుతాయి. ఒకప్పుడు కాంగ్రెస్ చేసిన తప్పులకు ఇప్పుడు ఫలితం అనుభవిస్తోంది. తరాలు మారినా చేసిన పాపం వెంటాడుతూనే ఉంటుంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్, ప్రాంతీయ స్థాయిలో జగన్‌రెడ్డి ఇందుకు సజీవ తార్కాణాలు. అందుకే ‘ధర్మో రక్షతి రక్షితః’ అని పెద్దలు చెప్పారు. మాకు ఈ నీతులు, సుద్దులు అవసరం లేదని ఎవరైనా భావిస్తే ఇవాళ కాకపోయినా రేపైనా ఫలితం అనుభవించాల్సిందే!
ఆర్కే
ఈ వార్తలు కూడా చదవండి..
తృటిలో తప్పిన ప్రమాదం.. విమాన ప్రయాణికులు సురక్షితం
రాహుల్ గాంధీ ఆరోపణలు.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
మరిన్ని తెలంగాణ వార్తలు, తెలుగు వార్తలు చదవండి..
Updated Date - Aug 17 , 2025 | 04:00 AM