Share News

Rahul Gandhi Vs Election Commission : రాహుల్ గాంధీ ఆరోపణలు.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

ABN , Publish Date - Aug 16 , 2025 | 06:07 PM

ఓట్ల చోరీ, ఓటర్ల జాబితాలో నకిలీ ఓట్లు చేర్చారంటూ ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వరుస ఆరోపణలు గుప్పించారు. ఈ నేపథ్యంలో భారత ఎన్నికలం సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.

Rahul Gandhi Vs Election Commission : రాహుల్ గాంధీ ఆరోపణలు.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ECI

న్యూఢిల్లీ, ఆగస్ట్ 16: ఓట్లు చోరీ చేసిందంటూ భారత ఎన్నికల సంఘంపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. అలాంటి వేళ.. భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) స్పందించేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది. అందులో భాగంగా సోమవారం మధ్యాహ్నం 3:00 గంటలకు న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌లో ప్రెస్ మీట్ పెట్టాలని ఈసీఐ నిర్ణయించింది. అయితే బిహార్‌లో ఎన్నికల సంఘం ఇటీవల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) నిర్వహించింది. దీని అనంతరం ఈసీఐ తొలిసారిగా స్పందించనుంది. బిహార్‌లో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఆ క్రమంలో.. ఆగస్టు మాసం ప్రారంభంలో బిహార్‌లో ఎస్ఐఆర్‌ను ఎన్నికల సంఘం నిర్వహించింది.


దీనిని లక్ష్యంగా చేసుకుని పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభంలో అధికార పార్టీని లక్ష్యంగా చేసుకుని ప్రతిపక్షాలు పలు ప్రశ్నలు సంధించిన విషయం విదితమే. మరోవైపు.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భారీ సంఖ్యలో ఓట్లు చోరీ చేసి.. బీజేపీ గెలుపునకు ఎన్నికల సంఘం పరోక్షంగా మేలు చేసిందంటూ ఇటీవల ఎంపీ రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలకు తెర తీశారు. అంతేకాకుండా.. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటకలో భారీగా నకిలీ ఓటర్లను చేర్చిందంటూ ఎన్నికల సంఘంపై ఆరోపణలు గుప్పించారు. అందుకు సంబంధించిన పలు అంశాలను ఆయన సోదాహరణగా వివరించారు.


మరోవైపు.. బిహార్‌లో ఎస్ఐఆర్ నిర్వహించడంతోపాటు ఓటర్ల జాబితాలో అవకతవకలకు వ్యతిరేకంగా.. ఓటరు అధికార్ యాత్రను నిర్వహిస్తున్నట్లు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహల్ గాంధీ ప్రకటించారు. ఆగస్టు 17వ తేదీన ససరాంలో ఈ యాత్ర ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 1వ తేదీతో పాట్నాలో ఈ యాత్ర ముగుస్తుందన్నారు. తాను చేపట్టే ఈ యాత్రలో పాల్గొనాలని ఈ సందర్భంగా ప్రజలకు రాహుల్ గాంధీ పిలుపు నిచ్చారు.


అయితే మరికొన్ని నెలల్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. లోక్ సభ స్థానాలు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఒకటైన ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ సత్తా చాటాలని ఎన్డీయే మిత్రపక్షాలు భావిస్తున్నాయి. కానీ బిహార్‌లో ఎన్డీయే పాలనకు ఎలాగైనా గండి కొట్టి.. ఆ రాష్ట్రంలో అధికార పీఠాన్ని హస్తగతం చేసుకోవాలని ఇండియా కూటమి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. అలాంటి వేళ.. ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ చేసిన సంచలన ఆరోపణలు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

భారత్‌కు చైనా మంత్రి.. ఎందుకంటే..

రిజిస్టర్డ్ పోస్ట్ మాయం.. పోస్టల్ శాఖ కీలక నిర్ణయం

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 16 , 2025 | 08:42 PM