ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కన్నడపై కమల్‌ వ్యాఖ్యలు సబబేనా

ABN, Publish Date - Jun 05 , 2025 | 01:46 AM

సినీ నటుడు కమల్‌ హాసన్ ఇటీవల చెన్నైలో ఒక సినిమా వేడుకలో మాట్లాడుతూ కన్నడకు తమిళ భాష జన్మనిచ్చిందని చేసిన వ్యాఖ్య కన్నడనాట ఆగ్రహావేశాలు రేకెత్తించింది. ఈ వ్యాఖ్యలపై కర్ణాటకలోని పలు పోలీస్ స్టేషన్లలో కమల్‌పై కేసులు నమోదైనాయి. కన్నడ భాషకు 2,500 ఏళ్ల...

సినీ నటుడు కమల్‌ హాసన్ ఇటీవల చెన్నైలో ఒక సినిమా వేడుకలో మాట్లాడుతూ కన్నడకు తమిళ భాష జన్మనిచ్చిందని చేసిన వ్యాఖ్య కన్నడనాట ఆగ్రహావేశాలు రేకెత్తించింది. ఈ వ్యాఖ్యలపై కర్ణాటకలోని పలు పోలీస్ స్టేషన్లలో కమల్‌పై కేసులు నమోదైనాయి. కన్నడ భాషకు 2,500 ఏళ్ల చరిత్ర ఉందనీ, తమిళభాష కన్నడానికి జన్మనివ్వటం ఏమిటని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మొదలు అంతా ఆగ్రహించారు. జూన్ 5న విడుదల కానున్న కమల్ హాసన్ తాజాచిత్రం ‘థగ్ లైఫ్ ‘ప్రదర్శనలకు కర్ణాటకలో ఆటంకం ఏర్పడింది. ఇందుకు స్పందనగా కమల్ మాట్లాడుతూ చరిత్రకారుల ద్వారా తాను తెలుసుకున్న చరిత్రనే ప్రేమతో చెప్పాను తప్ప తనకు వేరే ఉద్దేశమే లేదన్నారు. తన వ్యాఖ్యను ఉపసంహరించుకోవడంగానీ క్షమాపణలు చెప్పడం కానీ చేయబోనని, ఈ విషయాన్ని చరిత్రకారులు, భాషా శాస్త్రవేత్తలకు వదిలేద్దామనీ కమల్‌ అన్నారు.

కమల్ వ్యాఖ్య బాగోగులేమిటో చూద్దాం. దక్షిణాది భాషలైన తమిళ, కన్నడ, తెలుగు, మలయాళ, తుళు, తొద మొదలైన భాషలను ద్రావిడ భాషా కుటుంబంగా వ్యవహరిస్తారు. అతి ప్రాచీనమైన ఈ ద్రావిడ భాషలలో ఏది అత్యంత ప్రాచీన భాష అనే విషయం పరిశీలించే ముందు అసలు ద్రావిడులు అంటే ఎవరు? వారు ఎక్కడి నుంచి వచ్చారు? అనేది చూడాలి. ద్రావిడులు ఆర్యులకన్నా ముందు అప్పటి భారతదేశంలో నివసించినవారు. వారు నవీన శిలాయుగంలో నెగ్రిటో, ప్రోటో ఆస్ట్రలాయిడ్ జాతుల తరువాత భారతదేశానికి వచ్చి స్థిరపడిన మెడిటరేనియన్ జాతివారని చరిత్ర పరిశోధకుల నిర్ధారణ. ఈ జాతివారు మధ్యధరా సముద్ర ప్రాతం నుంచి వాయవ్య భారతదేశం మీదుగా నాటి భారతదేశంలో ప్రవేశించారని కొందరు పరిశోధకులు భావించారు. ఇందుకు ఆధారంగా వారు నేటి పాకిస్థాన్‌లో ఉన్న బలూచిస్థాన్‌లోని బ్రాహుయిస్థాన్ ప్రజలు బ్రాహుయి (Brahui) అనే ద్రావిడ భాషను మాట్లాడుతూ ఉండటాన్ని పేర్కొన్నారు. ద్రావిడ భాషలు మాట్లాడే మిగతా దక్షిణ భారతదేశం నుంచి 1500 కిలోమీటర్ల దూరాన ఉన్న ఈ ప్రజలు ద్రావిడ భాష అయినట్టి బ్రాహుయిని నేటికీ మాట్లాడుతూ ఉండటాన్ని బట్టి, సామాన్య శకపూర్వం (అంటే BCE) 3,000 సంవత్సరానికి పూర్వమే మధ్యధరా సముద్ర ప్రాంతంనుంచి వలస వస్తూ కొందరు ద్రావిడ జాతీయులు అక్కడ స్థిరపడి ఉంటారనే నిర్ధారణకు వచ్చారు. దక్షిణ ఆసియా భాషలపై విశేష పరిశోధనలు చేసిన ఎలీనా బషీర్, భద్రిరాజు కృష్ణమూర్తి వంటి వారి గ్రంథాలు ఈ అభిప్రాయాన్ని బలపరిచాయి. మధ్యధరా సముద్ర ప్రాంతం నుంచి ద్రావిడులు సముద్రమార్గాన దక్షిణ భారతదేశానికి వచ్చి స్థిరపడి, ఆ తరువాత క్రమంగా ఉత్తర భారతదేశానికి కూడా వ్యాపించి ఉంటారని ఇంకొందరి భావన. ఏది ఏమైనా ద్రావిడులంతా మౌలికంగా నవీన శిలాయుగంలో BCE 3,000 ప్రాంతంలో మధ్యధరా సముద్రం, పశ్చిమ ఆసియాలోని ఇరాన్ ప్రాంతం నుంచి వలస వచ్చిన వ్యవసాయ సంస్కృతి నిర్మాతలనే విషయాన్ని దాదాపుగా చరిత్రకారులందరూ అంగీకరిస్తున్నారు. పశ్చిమాసియా ప్రాంతపు తవ్వకాలలో ప్రత్యేకించి క్రీటు దీవిలో లభించిన క్రీటన్ జ్యూస్ (Cretan Zeus) విగ్రహాలు ద్రావిడులు పూజించే పిళ్ళార్ (వినాయక) విగ్రహాలకు మూలరూపాలని పరిశోధకులు తేల్చారు. నేటి టర్కీలో అంతర్భాగమైన అనటోలియాలోని లికియా (Lycia)లోని దిర్మిల్ ప్రాంతాన్ని అనాదిగా లికియన్లు త్రిమిలి అని పిలుస్తారనీ, దానినే బాబిలోనియన్లు తర్మిలా (Tarmila) అనీ, గ్రీకులు తర్మిలే (Termilae) అనీ పిలుస్తారనీ ‘త్రిమిలి’ శబ్దమే తమిళ, ద్రవిడ శబ్దాలకు మూలమని భాషావేత్తల నిర్ధారణ.


ప్రతి భాష ఏదో ఒక చారిత్రక దశలో తప్పక ఏదో మరొక భాష నుంచి వేరై ఉంటుంది. ఏ భాషా వేరుగా పుట్టింది మాత్రం కాదనేది గమనార్హం. అసలు ద్రావిడ భాషలేవీ ఏర్పడక ముందుదైన ప్రాగ్ద్రావిడ భాష నుంచి ఈ ద్రావిడ భాషలన్నీ రూపొందాయని భాషావేత్తల అభిప్రాయం. అయితే ద్రావిడ భాషలన్నిట్లోకీ తమిళం అతి ప్రాచీనమైన భాష అనేదానికి ఎన్నో ఆధారాలున్నాయి. ఒక వాడుక భాషగా తమిళం సంస్కృతం కంటే కూడా ప్రాచీనమైనది. ఇక సాహిత్యాధారాల విషయం చూస్తే తమిళ సాహిత్యం BCE మూడవ శతాబ్ది నుంచి లభిస్తూ ఉండగా సంస్కృత సాహిత్యం BCE రెండవ శతాబ్ది నుంచి మాత్రమే లభిస్తున్నది. తమిళం నేటికీ ప్రజల వాడుక భాషగా కొనసాగుతూ ఉండగా, సంస్కృతం సామాన్య శక పూర్వం ఆరవ శతాబ్దిలోనే ప్రజల వాడుక నుంచి తప్పుకుని, కేవలం పండిత భాషగా మిగిలిపోయింది.

సామాన్య శకం 850లకు చెందిన ‘కవిరాజమార్గ’ అనే గ్రంథం కన్నడ భాషలో ఇప్పటికి లభిస్తున్న అతి ప్రాచీన సాహిత్యం. రాష్ట్రకూట పాలకుడైన మొదటి అమోఘవర్షుడు ఈ గ్రంథాన్ని తాను ఒక్కడే కానీ వేరొకరితో కలిసి గానీ రాసివుంటాడని పరిశోధకుల అభిప్రాయం. కన్నడ కవిత్వం, ఛందస్సు, వ్యాకరణం గురించి రాయబడిన అతి ప్రాచీన గ్రంథం ఇదే. ‘కావ్యాదర్శమ్’ అనే సంస్కృత గ్రంథానికి ఇది అనుకరణ అని పరిశీలకులు భావిస్తారు. ప్రాచీన కర్ణాటక చరిత్ర, నాటి ప్రజల భాషా సంస్కృతులు తెలుసుకోవాలంటే ‘కవిరాజమార్గ’ చదవాలి. జైన కవులు రాసిన కవితలే కన్నడ భాషలోని తొట్టతొలి కవితలు. పదవ శతాబ్దానికి చెందిన కన్నడ ఆదికవి పంప కన్నడ కవులలో ఆద్యుడు. ఆ జైన కవులు రాసిన రచనలన్నీ యథాతథంగా నేటికీ నిలిచివున్న కారణంగా అవి కన్నడ భాష ప్రాచీనతకు స్పష్టమైన ఆధారాలుగా ఉన్నాయి.


అలా తమిళ సాహిత్యం, కన్నడనాట జైన కవుల రచనలు నేటికీ యథాతథంగా లభిస్తున్న కారణంగా ఆ భాషల ప్రాచీనతకు అవి తిరుగులేని ఆధారాలుగా నిలుస్తున్నాయి. మన తెలుగునాట కడప జిల్లాలో లభించిన సామాన్యశకం 575 నాటి రేనాటి చోడ పాలకుడు ధనంజయుడి పూర్తి తెలుగు శాసనమే అతి ప్రాచీనమైనది. గుంటూరు జిల్లా భట్టిప్రోలులోని బౌద్ధ క్షేత్రంలో లభించిన సామాన్యశక పూర్వం 400 నాటి శాసనంలో కొన్ని తెలుగు పదాలు ఉన్నాయి. అలాగే ఏలూరు సమీపంలోని గుంటుపల్లి దగ్గర ఉన్న కంఠంనేనివారి గూడెం, కృష్ణాజిల్లా నందిగామ సమీపంలోని గుమ్మడిదుర్రు, కృష్ణా జిల్లా దివిసీమలోని ఘంటసాల గ్రామంలోని బౌద్ధ క్షేత్రాలలో లభించిన శాసనాలలోనూ పలు తెలుగు పదాలున్నాయి. అయితే సంస్కృత మహాభారతాన్ని ఆంధ్రీకరించిన CE 11వ శతాబ్దానికి చెందిన నన్నయభట్టు తెలుగులో ఆదికవిగా భావించబడ్డాడు. అంతకు పూర్వపు సాహిత్యమేదీ తెలుగులో లభించకపోవడమే ఇందుకు కారణం. ప్రాచీన ఆంధ్రదేశం బౌద్ధ మతానికి పట్టుగొమ్మ. బౌద్ధులు తమ ధర్మ ప్రచారాన్ని స్థానిక భాషలలోనే చేసేవారు. ఆ కారణంగా బౌద్ధ ధర్మానికి సంబంధించిన ఎన్నో తెలుగు గ్రంథాలు ఒకప్పుడు ఉండే ఉంటాయి. అయితే ఆంధ్ర దేశంలో బౌద్ధం బలహీనపడిన దశలో మహాయాన తాంత్రిక శాఖ అయినట్టి వజ్రయానం పలు దురాచారాలకు లోనై ప్రజాభిమానం కోల్పోయింది. ఆ దశలో హైందవ పునరుజ్జీవనోద్యమంలో భాగంగా బౌద్ధ స్తూపాలు, చైత్యాలు విధ్వంసం చేయబడటమే కాదు, బౌద్ధ సాహిత్యం తగులబెట్టబడి ఉంటుందని చరిత్రకారుల అంచనా. అలా తెలుగు భాష ప్రాచీనతకు సాహిత్యాధారాలు లేకుండా పోయాయి. ఏమైనా తెలుగు భాష తమిళం కంటే ప్రాచీనమైనదని ఎవ్వరూ అనటం లేదు. కమల్‌ హాసన్ కన్నడ భాషను నిందించలేదు. కించపరచలేదు. కమల్ అభిప్రాయం నచ్చనివారు దానిని తగు ఆధారాలతో తిప్పికొట్టవచ్చు. అంతేకాని, రాజకీయ ప్రయోజనాలు ఆశించి, రెండు రాష్ట్రాలలో భావోద్వేగాలు రెచ్చగొట్టేవారి దుశ్చర్యలు కూడనివి.


మరో ముఖ్యమైన విషయం. త్రిమిలి శబ్దం నుంచే తమిళ, ద్రమిల, ద్రవిడ శబ్దాలు రూపొందాయని పరిశోధనలు రుజువుపరచాయి. మధ్యధరా సముద్రంలోని క్రీటు దీవి, త్రిమిలి ప్రాంతం నుంచి వలసవచ్చి భారతదేశంలో స్థిరపడిన మెడిటరేనియన్లను అందుకే ద్రావిడులు అన్నారు. ద్రావిడ శబ్దం తమిళ శబ్దానికి పర్యాయపదంగా స్థిరపడింది. తమిళుల అభ్యున్నతి కోసం పనిచేసే పార్టీల పేరులో ద్రావిడ శబ్దం అందుకే ఉంది. ద్రావిడ భాషా కుటుంబంగా ఉన్న తమిళ, కన్నడ, తెలుగు, మలయాళ, తుళు, తొద వంటి భాషలలో తమిళ భాష అత్యంత ప్రాచీనమైనదని ఇప్పటికి లభించిన సాహిత్య, శాసనాధారాలవల్ల రుజువైంది. తమిళ భాష నుంచే మిగిలిన ద్రావిడ భాషలు ఉద్భవించాయా? లేదా? అవి మొదటి నుంచీ వేరే భాషలుగానే ఉంటూ వచ్చాయా? అనే విషయం తగు శాస్త్రీయ ఆధారాలతో చేయాల్సిన విద్యావిషయకమైన చర్చ. అంతేగానీ, భాషా జాతుల మధ్య ద్వేషాలకు దారితీసేందుకు ఎవరు ప్రయత్నించినా వారు దేశ సమగ్రతకూ, సామరస్యానికీ హాని కలిగించినట్లే, అది రాజ్యాంగ విరుద్ధమైన చర్యే.

ముత్తేవి రవీంద్రనాథ్

చరిత్ర పరిశోధకులు

For AndhraPradesh News And Telugu News

Updated Date - Jun 05 , 2025 | 01:46 AM