ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నాడు కీర్తి కేసీఆర్‌కు నేడు నింద ఇంజనీర్లకు

ABN, Publish Date - Jun 19 , 2025 | 04:42 AM

నాడు కాళేశ్వరం ప్రాజెక్టుకు కర్త కర్మ క్రియ అంతా తానేనని గొప్పలు చెప్పుకున్నారు కేసీఆర్‌. కానీ నేడు కాళేశ్వరం అవినీతిపై విచారిస్తున్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పినాకి చంద్రఘోష్‌ ముందు మాత్రం పూర్తి యూటర్న్‌ తీసుకున్నారు. అర్హతలేని, అస్థిర ప్రాజెక్టుకు అప్పుడు...

నాడు కాళేశ్వరం ప్రాజెక్టుకు కర్త కర్మ క్రియ అంతా తానేనని గొప్పలు చెప్పుకున్నారు కేసీఆర్‌. కానీ నేడు కాళేశ్వరం అవినీతిపై విచారిస్తున్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పినాకి చంద్రఘోష్‌ ముందు మాత్రం పూర్తి యూటర్న్‌ తీసుకున్నారు. అర్హతలేని, అస్థిర ప్రాజెక్టుకు అప్పుడు ఎంత కీర్తి వచ్చినా ఫర్వాలేకపోయింది. కానీ ఇప్పుడు చంద్రఘోష్‌ కమిషన్ ముందు అంతా నేనే అని గొప్పలు చెబితే శిక్ష ఖాయం. అందుకే, చేసిందంతా ఇంజనీర్లేనని నేరాన్ని వారిపైకి నెట్టేశారు.

పంపు హౌస్‌హెడ్‌కు తాకేంత వరకు నీటిని నిల్వ చేయాలని తాను ఆదేశాలు ఇవ్వలేదని చంద్రఘోష్ కమిషన్‌కు చెప్పి కేసీఆర్ సురక్షితంగా తప్పించుకున్నారు. బ్యారేజీల కోసం స్థలాల ఎంపిక పూర్తిగా సాంకేతికంగానే జరిగిందన్నారు. కాళేశ్వరం నిర్మాణం కోసం నిధులు సమీకరించేందుకే ఇరిగేషన్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశామన్నారు. ప్రాజెక్టు వినియోగం ద్వారా సమకూరే నిధులతో ఆ రుణాలను తిరిగి చెల్లించాలనుకున్నామనీ, కానీ వివిధ కారణాల వల్ల అది సాధ్యం కాలేదనీ వివరించారు.

తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదంటూ తలపెట్టిన కాళేశ్వరం రీ–డిజైనింగ్, రీ–ఇంజ నీరింగ్ ప్రాజెక్టు బడ్జెట్ భారీగా పెంచి దోచుకోవడం కోసమే తప్ప, తెలంగాణ భూములకు నీళ్లు ఇవ్వడం కోసం కాదు. 2014 నుంచి 2022 వరకు కొనసాగిన బీఆర్ఎస్, బీజేపీ బంధం పరస్పర ప్రయోజనాల ప్రాతిపదికగా ఇదంతా మొదలైంది. తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదు అనే సీడబ్ల్యూసీ పత్రం బీఆర్‌ఎస్‌–బీజేపీ మైత్రిలో భాగంగా సృష్టించబడింది. ప్రతిఫలంగా రాష్ట్రపతి ఎన్నిక, వ్యవసాయ చట్టాలు, నోట్ల రద్దు తదితర బిల్లులకు బీఆర్ఎస్ మద్దతునిచ్చింది. ఈ పవిత్ర బంధం తెగిన తర్వాత కాళేశ్వరం కేసీఆర్ కుటుంబపు ఏటీఎం అన్న ఆరోపణతో మోదీ, అమిత్ షాలు, రాష్ట్ర నాయకుల మాటల తూటాలు మర్చిపోలేం.

తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదనేది ఎంత కల్పితమో కాళేశ్వరం బ్యారేజీల అవినీతి అక్రమాలపై చీల్చి చెండాడిన ఎన్డీఎస్‌ఏ నివేదిక నిగ్గు తేల్చింది. 2022–23లో మేడిగడ్డ నుంచి విడుదలైన నీరు 4,628 టీఎంసీలు. 2019–20లో 2046 టీఎంసీలు. 2021–22లో 2,671 టీఎంసీలు. 2023–24లో మేడిగడ్డ అయిదు అడుగులు కుంగి, మూడు అడుగుల వెడల్పుతో నిట్టనిలువునా చీలిన ఏడాది 1942 టీఎంసీల నీరు విడుదలైంది. పై అయిదేళ్లలో మొత్తం 13,151 టీఎంసీల నీటిని మేడిగడ్డ విడుదల చేసింది. ఇందులో 85–90 శాతం నీరు తుమ్మిడిహట్టి ప్రాణహిత నుంచి వచ్చిందే. ప్రాణహిత నది లేకపోతే మేడిగడ్డ వద్ద బ్యారేజీ అనే ఆలోచన కేసీఆర్‌కు కలలో కూడా రాదు. పచ్చి అబద్ధాలను నిజాలుగా ప్రచారం చేసి ప్రజలను వంచించగల దిట్టలు వీరు. తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్‌కి 148 మీటర్ల ఎత్తునే అనుమతిస్తామని; 152 మీటర్ల ఎత్తుకు ఒప్పుకొనేదిలేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి అన్నారని కేసీఆర్ కమిషన్ ముందు వాంగ్మూలం ఇచ్చారు. ఇందువల్లనే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నామన్నారు. 100 మీటర్ల మేడిగడ్డతో పాటు, 148 మీటర్ల తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణం కొరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రితో ఒప్పందం కుదుర్చుకున్న కేసీఆర్‌ మరి దానికి అనుగుణంగా 148 మీ. తుమ్మిడిహట్టి ఎందుకు నిర్మించలేదు? ‘వార్ధ ప్రాజెక్టు’ తదితర పేర్లతో ప్రజలను వంచించలేదా?

వ్యాప్కోస్ లైడార్ సర్వే మేడిగడ్డ వద్ద నీటి లభ్యత ఉందని నిర్ణయించగా, ఆ నివేదిక ఆధారంగా బ్యారేజీల నిర్మాణంపై నిర్ణయం తీసుకున్నామని కేసీఆర్ కమిషన్ ముందు సాక్ష్యం ఇచ్చారు. ‘2023 మే 3న సీబీఐ దాడులు జరిపి వ్యాప్కోస్ సీఎండీ రాజిందర్ గుప్తా ఇంట్లో రూ.38 కోట్లు; నోయిడా తదితర ప్రాంతాలలో విలువైన రియల్ ఎస్టేట్ భూములు విల్లాల రిజిస్ట్రేషన్ పత్రాలు; భారీగా నగలను జప్తు చేసి, ఆయన్ని జైల్లో పెట్టింది. ఈ డబ్బంతా తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదనే సాకుతో బ్యారేజీ స్థలాన్ని మేడిగడ్డకు మార్చే పాపకార్యం కోసం వెచ్చించింది కాదా? ఇదంతా కాళేశ్వరం అవినీతి సొమ్ము కాదా? ఇదే వ్యాప్కోస్ తుమ్మిడిహట్టే అత్యంత అనుకూలమంటూ 2008లో వైయస్సార్ కాలంలో సర్వే నివేదిక ఇచ్చింది నిజం కాదా?

తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ కట్టలేమని నిర్ధారణకు వచ్చిన తర్వాత, గోదావరిలో ఏఏ ప్రాంతాలు బ్యారేజీ నిర్మాణానికి అనుకూలమో వ్యాప్కోస్ నివేదిక ఇచ్చింది. అంతకుముందే హై పవర్ కమిటీ సిఫారసు చేసింది. కేసీఆర్‌ రాజ్యంలో ఈ హైపవర్ కమిటీ ఒక డమ్మీ. అధినాయకుడి ఆదేశాలను తూచ తప్పకుండా పాటించడమే ఇందులోని సభ్యుల విధి. అనుకూలంగా నివేదిక ఇచ్చినందుకు, అధినాయకుడి సేవలో తరించినందుకు, ఈ కమిటీలో చాలామందిని పై పదవులు వరించాయి. పదవీ విరమణ తర్వాత కూడా వీరందరికీ కేసీఆర్ ప్రభుత్వ కాలమంతా ఎక్స్‌టెన్షన్‌ ఇచ్చి కొనసాగించారు. నిజానికి బ్యారేజీల ఎంపిక సాంకేతికమైనదీ కాదు; వ్యాప్కోస్ లేదా హైపవర్ కమిటీల నిర్ణయమూ కాదు. ఈ బ్యారేజీలన్నీ కేసీఆర్ మానస పుత్రికలు. అందువల్లనే అన్ని బ్యారేజీలు, ఎక్కడా లేని విధంగా, గోదావరి నీళ్లను ఎదురు అదేనదిలో పైకి ఒక టీఎంసీకీ కోట్ల రూపాయల ఖర్చుతో ఎత్తిపోస్తాయి. పై నుంచి వచ్చే భారీ వరద, ఎత్తిపోసిన నీళ్లను, దిగువ సముద్రం తన్నుకుపోతుంది. ఐదేళ్లలో ఎత్తిపోసిన 162 టీఎంసీల్లో, 63 టీఎంసీల ఎత్తిపోతల నీళ్లన్నీ తిప్పిపోతలై సముద్రంలో కలిశాయి.

కేసీఆర్‌ చెప్తున్నట్టు– కాళేశ్వరం కార్పొరేషన్ తీసుకున్న రుణాలను ఆ ప్రాజెక్టు వినియోగం ద్వారా సమకూరే లాభాలతో చెల్లించడం సాధ్యం కాదనేది జగమెరిగిన సత్యం. ఎందుకంటే కాళేశ్వరం భారీ ఎత్తిపోతల ప్రక్రియ, ఆర్థికంగా ఏ మాత్రం ఆచరణ సాధ్యం కానిది. లాభాలు సాధించటమనేది బోగస్. బ్యాంకులు, కేంద్ర సంస్థలు అసలు, భారీ వడ్డీలు పొందుతుండగా, ప్రజల సేవలకు భారీగా కోత పడింది. ప్రభుత్వం ద్వారా వేగవంతమైన సేకరణ, వేగవంతమైన దోపిడీ కుదరదన్న కారణంతో కార్పొరేషన్ పేరిట వేగంగా రుణాలు సేకరించారన్నది వాస్తవం. ఇప్పుడు నెలనెలా అసలూ వడ్డీలు చెల్లించేది మాత్రం కోట్లాది సామాన్య జనం!

నైనాల గోవర్ధన్

ఈ వార్తలు కూడా చదవండి..

హీరో ఫిన్‌కార్ప్‌ రూ 260 కోట్ల సమీకరణ

మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..

For National News And Telugu News

Updated Date - Jun 19 , 2025 | 04:42 AM