ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

విశ్వ శోధకుడు వైజ్ఞానిక భావుకుడు

ABN, Publish Date - May 25 , 2025 | 03:19 AM

జయంత్‌ విష్ణు నార్లికర్‌ అచ్చమైన రోల్ మోడల్‌గా నిలిచే శాస్త్రవేత్త. అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతుడైన ఈ వైజ్ఞానికుడు జటిల శాస్త్ర విషయాలను సామాన్యుడికి సులువుగా బోధపడేలా చెప్పగలిగిన భావుకుడు. పత్రికలు, రేడియో, టెలివిజన్ వంటి జనమాధ్యమాల ద్వారా...

జయంత్‌ విష్ణు నార్లికర్‌ అచ్చమైన రోల్ మోడల్‌గా నిలిచే శాస్త్రవేత్త. అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతుడైన ఈ వైజ్ఞానికుడు జటిల శాస్త్ర విషయాలను సామాన్యుడికి సులువుగా బోధపడేలా చెప్పగలిగిన భావుకుడు. పత్రికలు, రేడియో, టెలివిజన్ వంటి జనమాధ్యమాల ద్వారా ఒకవైపు పాపులర్ సైన్స్, మరోవైపు సైన్స్ ఫిక్షన్ సృజించిన ప్రతిభాశాలి.

ఖగోళ భౌతిక శాస్త్రవేత్త అయిన నార్లికర్ 1938 జూలై 19న కొల్హాపూర్‌లో జన్మించారు. తండ్రి విష్ణు వాసుదేవ్ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో గణిత, సైద్ధాంతిక భౌతిక శాస్త్రాలలో ఆచార్యుడు. తల్లి సుమతి సంస్కృత విదుషీమణి. మేనమామ వి.ఎస్. హుజూర్ బజార్ పేరు గాంచిన సాంఖ్యాక శాస్త్రవేత్త. బాల్యం నుంచి విశేష ప్రతిభ కనబరిచిన నార్లికర్ పాఠశాల, కళాశాల ప్రథముడిగా రాణిస్తూ వచ్చారు. గణిత, ఖగోళ భౌతిక శాస్త్రాలు సబ్జెక్టులుగా 1957లో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ ఆనర్స్ పట్టా పొందారు.


కుటుంబ ప్రోత్సాహంతో ప్రతిష్ఠాత్మక కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యాభ్యాసం కొనసాగించారు. అక్కడ Fred Hoyle పుస్తకం ‘Frontiers of Astronomy’ చదివిన తర్వాత ఆయన విద్యాసక్తి ఖగోళ భౌతికశాస్త్రం వైపు మొగ్గింది. విశ్వ నిర్మాణం, పరిణామాన్ని వివరించే ‘కాస్మాలజీ’లో ఫ్రెడ్ హోయిల్ పర్యవేక్షణలో పరిశోధన ప్రారంభించారు. గురుత్వాకర్షణ సిద్ధాంతాలపై పిహెచ్‌.డి పట్టా 1963లో పొందారు. మహా విస్ఫోటనం కారణంగా ఈ జగత్తు ఒక్కదూటున ఉద్భవించిందని చెప్పే ‘బిగ్ బ్యాంగ్ థియరి’ అప్పటికి బహుళ ప్రచారంలో ఉంది. దానిని విభేదించే రీతిలో ప్రత్యామ్నాయ సిద్ధాంతంగా ‘హోయిల్–నార్లికర్ థియరీ ఆఫ్ గ్రావిటీ’ (కన్ఫార్మల్ గ్రావిటీగా పేరు గాంచినది) ప్రతిపాదించి ప్రపంచస్థాయి గుర్తింపు పొందారు. 1964లో చేసిన ఈ ప్రతిపాదన ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌ సాధారణ సాపేక్షతా పిద్ధాంతానికి కొనసాగింపు లేదా మెరుగైన జోడింపుగా మారింది. విశ్వంలోని ప్రతి వస్తువు ద్రవ్యరాశి, ఆ వస్తువు మిగతా వాటితో కలిగి ఉన్న సంబంధం, చర్య బట్టి ప్రభావితం అవుతుందనే ‘మ్యాక్‌ ప్రిన్సిపుల్’ వీరి సిద్ధాంతంలో ఆయువుపట్టు. ఐన్‌స్టీన్ ఈ సూత్రం గురించి చర్చించినా, దానిని తన సిద్ధాంతంలో అంతర్భాగంగా చేయలేదు. విశ్వం ఒక్కసారిగా కాకుండా, క్రమంగా విస్తరిస్తూ పోతోందనే సిద్ధాంతం (స్టెడి స్టేట్ థియరీ) ఫలితంగా నార్లికర్, ఆయన గురువు ఫ్రెడ్ హోయిల్‌లు ఒక్కసారిగా ప్రపంచ ప్రఖ్యాతులయ్యారు.

1964లో యువ నార్లికర్ పేరు భారతదేశంలో విపరీతంగా ప్రచారంలోకి వచ్చి ఆయనను స్వదేశానికి ఆహ్వానించాలని పెద్ద ఎత్తున చర్చలు జరగడం చరిత్ర. 1965లో నార్లికర్ 26 ఏళ్ల వయసులో భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ పురస్కారాన్ని పొందారు. ఫ్రెడ్ హోయిల్ 1966లో కేంబ్రిడ్జిలో ‘ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ థియరిటికల్ ఆస్ట్రానమీ’ని ప్రారంభించినప్పుడు నార్లికర్‌ను భాగస్వామిగా చేశారు. జీవితకాలపు స్నేహితులుగా మారిన వారిరు వురు ‘యాక్షన్ అట్ ఎ డిస్టెన్స్ ఇన్ ఫిజిక్స్ అండ్ కాస్మాలజీ’ (1974), ‘ఎ డిఫరెంట్ అప్రోచ్ టు కాస్మోలజీ’ (2000) వంటి శాస్త్ర రచనలు చేశారు. 1972లో భారతదేశం తిరిగి వచ్చిన నార్లికర్ బొంబాయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌లో ప్రొఫెసర్‌గా చేరారు. 1989 దాకా ఈ సంస్థలో బోధిస్తూ, పరిశోధన చేస్తూ; చేయిస్తూ, మరోవైపు మూఢనమ్మకాలను పెకలించే రీతిలో ప్రసంగాలు, రచనలు వెలువరిస్తూ ప్రజాజీవితంలో కూడా ప్రసిద్ధులయ్యారు. 1989లో యూజీసీ ఆహ్వానంపై పూణేలో ఆయన వ్యవస్థాపించిన ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రో ఫిజిక్స్ (ఐ.యు.సి.ఎ.ఎ.) సంస్థకు 2003లో పదవీవిరమణ చేసే దాకా నేతృత్వం వహించారు. తద్వారా విశ్వవిద్యాలయాలలో ఖగోళ, ఖగోళ భౌతికశాస్త్ర పరిశోధనలకు పథ నిర్దేశక దిశానిర్దేశం చేశారు. అదే సమయంలో జన సామాన్యంలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి విశేష కృషి చేశారు. ఐ.యు.సి.ఎ.ఎ. వెబ్‌సైట్‌ చూస్తే ఆయన రచించిన 1200కు పైగా సైన్సు వ్యాసాలు, 140కు పైగా (ఆంగ్లం, హిందీ, మరాఠీ భాషల్లోనే కాకుండా ఇటాలియన్, రష్యన్, జపనీస్, స్పానిష్, గ్రీక్, ఇంకా తెలుగుతో పాటు పలు భారతీయ భాషలలోకి అనువాదమైన) పుస్తకాల వివరాలు విపులంగా తెలుస్తాయి.


నార్లికర్‌ రాసిన తొలి పాపులర్‌ వ్యాసం ‘డిస్కవరీ’ సైన్స్ మ్యాగజైన్‌లో 1960ల తొలినాళ్లలోనే ప్రచురితమయింది. ‘న్యూ సైంటిస్ట్’ పత్రిక కాస్మాలజీకి సంబంధించిన వ్యాసాలను నార్లికర్‌తో రాయించుకునేది. పరిశోధనలు చేయడం, పాపులర్ సైన్స్ వ్యాసాలు రాయడం మాత్రమే కాకుండా వీరు సైన్స్ విషయాల వక్తగా ఇంగ్లాండ్‌లో ప్రసిద్ధులయ్యారు. దాదాపు అదే కాలంలో వారి తొలి పుస్తకం కూడా అక్కడ నుంచే ప్రచురింపబడింది. మాతృభాష మరాఠీలోను, అలాగే తొలి రెండు దశాబ్దాల జీవితకాలం వారణాసిలో సాగడం వల్ల హిందీలోనూ మాత్రమే కాక ఆంగ్లంలో కూడా ఆయన మంచి రచయిత, వక్త. నార్లికర్‌ సైన్స్ ఫిక్షన్ నవల ‘ధూమకతు’ సినిమాగా రూపొందింది. ఆత్మకథ ‘My Tale of Four Cities’ మరాఠీ మాతృకకు 2014లో సాహిత్య అకాడమీ అవార్డు పొందింది. ఆయన మంచి క్రీడాకారుడు. సతీమణి మంగళ గణితశాస్త్రవేత్త. కుమార్తెలు గీత, గిరిజ, లీలావతి వివిధ విజ్ఞానశాస్త్ర రంగాలలో నిష్ణాతులు. కన్నుమూయడానికి ముందు రోజున కూడా మూడు గంటల పాటు పుస్తక పఠనం చేసిన ఈ జిజ్ఞాసువు గత మంగళవారం ప్రాతఃకాలంలో అనంత లోకాలకు తరలిపోయారు.

డా. నాగసూరి వేణుగోపాల్

ఇవి కూడా చదవండి

Viral Video: బస్ రన్నింగ్‌లో ఉండగా డ్రైవర్‌కు గుండెపోటు.. కండెక్టర్ లేకపోయి ఉంటే..

Daughter Marriage: కూతురు చేసిన పనికి ముగ్గురు కుటుంబసభ్యులు బలి..

Updated Date - May 25 , 2025 | 03:19 AM