పుస్తకాలు ఆన్‌లైన్‌లో అమ్మడమే మంచిది
ABN, Publish Date - Mar 17 , 2025 | 12:20 AM
తిరుపతిలో ఓ సాహిత్య జీవి ఒంటి చేత్తో అరుదైన పుస్తకాలను ప్రచురించి సాహిత్య ప్రపంచానికి అందిస్తూ ఉన్నాడు. బాల సాహిత్యం, తెలుగు కథలు, నవలలు, ఇతర భాషలు, ఇతర దేశాలకు...
‘కథా ప్రపంచం’ కిరణ్
తిరుపతిలో ఓ సాహిత్య జీవి ఒంటి చేత్తో అరుదైన పుస్తకాలను ప్రచురించి సాహిత్య ప్రపంచానికి అందిస్తూ ఉన్నాడు. బాల సాహిత్యం, తెలుగు కథలు, నవలలు, ఇతర భాషలు, ఇతర దేశాలకు చెందిన రచనల తెలుగు అనువాదాలు ప్రచురిస్తున్నాడు. ఆయన పేరు కిరణ్. కథాప్రపంచం కిరణ్‌గా, తిరుపతి కిరణ్‌గా సుపరిచితుడు. ఆయనతో సంభాషణ..
మీ నేపథ్యం గురించి చెప్పండి?
మాది తిరుపతి. నాన్న టీటీడీ ఉద్యోగం చేసేవారు. నేను హైదరాబాదులో బీకాం చదువుకున్నాను. బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో మీడియా రంగంలో పని చేశాను. కొంత భక్తి ఉన్నా, సాహిత్యమంటే ప్రాణం. ఇందువల్ల సాహిత్య రంగం లోనే పూర్తి కాలం పని చేయాలని నిర్ణయించుకున్నాను. పుస్తకాలను చదవడం, మనసుకు నచ్చిన పుస్తకాలను ప్రచురించడం ఒక వ్యాపకంగా పెట్టుకున్నాను. పాఠకుల నుంచీ మంచి ఆదరణ లభిస్తుండటంతో సాహిత్య ప్రచురణ రంగంలోనే కొనసాగుతున్నాను.
సాహిత్యంతో పరిచయం ఎలా జరిగింది?
తిరుపతి కపిలతీర్థం రోడ్డులో నవభారతి స్కూల్లో ఐదవ తరగతి వరకూ చదువుకున్నాను. ఆ స్కూల్ నిర్వా హకుడు ఏనుగుల రామస్వామి నాయుడు స్కూల్‌లో సాహిత్య వాతావరణాన్ని ఏర్పరిచారు. చందమామ, బాల జ్యోతి, బాలమిత్ర, బుజ్జాయి, బొమ్మరిల్లు పత్రికలు తెప్పించేవారు. అక్కడికి వచ్చే హిందూ పత్రికలోని యంగ్ వరల్డ్ చాలా ఆసక్తిగా ఉండేది. మొదట పుస్తకాల్లో బొమ్మలంటే ఇష్టం ఉండేది. హైదరాబాద్ చేరాకా అబిడ్స్ పాత పుస్తకాలే నా ప్రపంచం. అఫ్ఝల్‌గంజ్ ల్రైబరీలో చాలా చదువుకున్నాను. తెలియకుండానే సాహిత్యం పట్ల ఆసక్తి కల్గింది.
మీ ‘కథా ప్రపంచం’ ప్రచురణల గురించి చెప్పండి?
2013 లో కథా ప్రపంచం పేరున ఫేస్‌బుక్ పేజ్, ఆ తర్వాత బ్లాగ్, వెబ్‌సైట్ మొదలుపెట్టి నిర్వహించాను. సాఫ్ట్‌వేర్ రంగానికి చెందిన వేలాదిమంది స్పందించేవారు. వారు కోరిన పుస్తకాలు, రచయితల వివరాలు సైతం అందించేవాడిని. ఇలా ముల్క్‌రాజ్ ఆనంద్, ఆర్‌కె నారాయణ్, కెఏ అబ్బాస్ వంటి రచయితల గురించి తెలుసుకున్నాను. ఇలాంటి గొప్ప రచయితల గురించి నేనే పుస్తకాలను ఎందుకు తీసుకురాకూడదనే ఆలోచన కలిగింది. ‘కథా ప్రపంచం’ ప్రచురణల ద్వారా పుస్తకాలు ప్రచురించటం మొదలుపెట్టాను.
ఎన్ని పుస్తకాలు ప్రచురించారు?
ఇప్పటిదాకా యాభై పుస్తకాలు తెచ్చాను. గోపిని కరుణాకర్ ‘మా తిరుపతి కొండ కథలు’ మొదట ప్రచురించాను. ఆ తర్వాత ఎస్వీ రంగారావు కథలు, మధురాంతకం రాజారాం బాలల కథలు, ముళ్ళపూడి శ్రీదేవి ‘రమణీయ శ్రీ రామాయణం’, ప్రేమ్‌చంద్ కథావళి, కమలాదాస్ ‘కుక్కలు’ మొదలైన పుస్తకాలు ప్రచురించాను. నేను ప్రచురించిన యాభై పుస్తకాల్లో సగం బాల సాహిత్యమే. పిల్లల కోసం బేతాళ కథలు ఏడు భాగాలు, చందమామ బాలల కథా సాహిత్యం ఐదు భాగాలు, పిల్లల పిట్ట కథలు ఐదు భాగాలు ప్రచురించాను. పరోపకారి పాపన్న కథలు, దుర్గేశ నందిని, గుండు భీమన్న కథలు వంటి పుస్తకాలను పిల్లలను దృష్టిలో ఉంచుకొని ప్రచురించాను.
పుస్తకాల అమ్మకాలు ఎలా సాగుతున్నాయి?
మొదట్లో పుస్తక విక్రేతలకు పుస్తకాలు ఇచ్చి ఇబ్బంది పడ్డాను. ఆన్‌లైన్‌లో పుస్తకాలు అమ్ముకోవడమే మంచిదనే అభిప్రాయానికి వచ్చాను. ఇప్పుడు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ ద్వారా పుస్తకాలు అందిస్తున్నాను. బుక్ ఫెయిర్లలో ‘కథా ప్రపంచం’ ప్రచురణలు అందుబాటులో పెడుతున్నాను. వేల కాపీలు వెయ్యకుండా పబ్లిష్ ఆన్ డిమాండ్ (పీఓడీ) పద్ధతిలో 200 పుస్తకాలు అచ్చు వేసి, ఆ తర్వాత డిమాండును బట్టి పుస్తకాలు పునర్ముద్రణ చేస్తున్నాను. కొత్త తరంలో పుస్తక పఠనం పెంచాలన్నదే లక్ష్యం. త్వరలో ఈ– కామర్స్ వెబ్‌సైట్ ఏర్పాటు చేస్తున్నాను.
అనువాదాల ప్రచురణలో సమస్యలు?
భాషా నైపుణ్యం ఉన్న అనువాదకులను గుర్తించడం పెద్ద సమస్య. మూల భాషలోనూ, లక్ష్య భాషలోనే కాదు, ఇరు ప్రాంతాల సామాజిక స్థితిగతుల గురించి అనువాదకులకు అవగాహన ఉండేలా చూసుకోవాలి. మూల రచయితకు సంబంధించిన కాపీరైట్స్, అగ్రిమెంట్స్, రచన ప్రతి తీసుకోవాలి. అయితే, గొప్ప రచయితల సాహిత్యాన్ని ఈ తరానికి అందించేలనే బలమైన ఆకాంక్ష ముందు ఈ సమస్యలన్నీ చిన్నవే.
ఫ్యూచర్ ప్లాన్స్ ఏమిటి?
ప్రత్యేకించి బాల సాహిత్య రంగంలో కృషి చేయాలని ఉంది. ఢిల్లీ ప్రగతి మైదాన్‌లో నిర్వహించే వరల్డ్ బుక్ ఫెయిర్‌లో తెలుగు పుస్తకాలను ప్రదర్శించాలని ఉంది. చాసో కథల్ని కన్నడలోకి తేవాలని అనుకుంటున్నాను. ఒడిశా రచయిత ఫకీర్ మోహన్ సేనాధిపతి రచనలను తెలుగులోకి తేవాలని అనుకుంటున్నాను. మొబైల్ వ్యాన్ ఏర్పాటు చేసుకొని దేశంలోని నగరాలు, పట్టణాలు, పల్లెల్లో పుస్తకం విశిష్టతను తెలియ చేయాలనే ఆశ ఉంది. కథా ప్రపంచం ద్వారా అన్ని భారతీయ భాషల్లోనూ ముఖ్యమైన పుస్తకాలను గుర్తించి ప్రచురించాలని, తెలుగులో నచ్చిన రచనలను ఇతర భాషల్లోకి అనువదించి పుస్తక రూపంలో తీసుకురావాలని ఉంది.
ఇంటర్వ్యూ : ఎం. ఆదిశేషయ్య
ఈ వార్తలు కూడా చదవండి:
Diamond Ring Robbery: టాలీవుడ్ హీరోకి షాక్ ఇచ్చిన దొంగలు..
Namrata Shirodkar: మహేశ్ బాబు ఫౌండేషన్ ద్వారా గుండె ఆపరేషన్లు మరింత విస్తృతం: నమ్రత
Updated Date - Mar 17 , 2025 | 12:20 AM