ITDA Vacancies: ఐటీడీఏల్లో అన్నీ ఖాళీలే
ABN, Publish Date - Sep 19 , 2025 | 01:16 AM
గిరిజనుల అభివృద్ధికి కృషి చేయాల్సిన ఐటీడీఏలు సమస్యల వలయంలో చిక్కుకుని ఉన్నాయి. పర్యవేక్షణ లోపం, నిధుల మంజూరులో జాప్యం, సంస్థలో అవసరమైన ఉద్యోగాలను...
గిరిజనుల అభివృద్ధికి కృషి చేయాల్సిన ఐటీడీఏలు సమస్యల వలయంలో చిక్కుకుని ఉన్నాయి. పర్యవేక్షణ లోపం, నిధుల మంజూరులో జాప్యం, సంస్థలో అవసరమైన ఉద్యోగాలను భర్తీ చేయకపోవడంతో ఇవి సమర్థవంతంగా పనిచేయలేకపోతున్నాయి. దీంతో ప్రభుత్వ పథకాలు గిరిజనులకు చేరడం లేదు. రాష్ట్రంలో ఉట్నూరు, భద్రాచలం, ఏటూరునాగారం, మన్ననూరుల్లో ఐటీడీఏలు ఉన్నాయి. మన్ననూరును మినహాయిస్తే మిగతా మూడు ఐటీడీఏల్లో 208 పోస్టులకు గానూ 116 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆదివాసీ బిడ్డ, రాష్ట్ర మంత్రి సీతక్క సొంత జిల్లాలో కూడా ఇదే పరిస్థితి. మన్ననూరు ఐటీడీఏలో కేవలం ఒకే ఒక్క ఉద్యోగి ఉన్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. గిరిజనుల కోసం అమలు చేస్తున్న పథకాల్లో ప్రధానమైన వ్యవసాయం, పండ్ల తోటల పెంపకం, వైద్యం, ఆరోగ్యం, ఉపాధి హామీ, స్వయం సహాయక సంఘాలు, పెసా చట్టం, స్త్రీ, శిశు సంక్షేమ కార్యక్రమాలు, ఆటవీ ఆధారిత పథకాలు, విద్య, సాగునీరు, భూ అభివృద్ధి, గృహ నిర్మాణం, ఇంజినీరింగ్ విభాగం, గిరిజన సహకారం వంటి సంస్థల కార్యక్రమాలను ఇతర శాఖలతో సమన్వయం చేయడమే సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ విధి. జీవో–57 ప్రకారం ప్రీమిటివ్ ప్రాంతం అంతా సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ కిందికి వస్తుంది. అన్ని ప్రభుత్వ శాఖలు కూడా ఐటీడీఏ పీవో పరిధిలోకి వస్తాయి. పీవో ఆదేశాల మేరకు ఉద్యోగులు పనిచేయాల్సి ఉంటుంది.
ప్రభుత్వం గిరిజనుల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించకపోయినా, ప్రతి ఏడాది ఐటీడీఏకు జిల్లా పరిషత్, మండల పరిషత్ ఇయర్‌మార్క్డ్ ఫండ్స్, కేంద్ర ప్రభుత్వం నుంచి సీసీడీపీ ఫండ్స్ వస్తాయి. కానీ ఐటీడీఏ రెగ్యులర్ పీవో నిధులపై సమీక్ష చేసి ఆయా జిల్లా పరిషత్‌ల నుంచి, మండల పరిషత్‌ల నుంచి రావాల్సిన బకాయిలను రాబట్టే నాథులే లేరు. ఐటీడీఏల్లో రెగ్యులర్ అధికారులు, దిగువ స్థాయి సిబ్బంది లేకపోవడంతోనే గిరిజనాభివృద్ధి సంస్థలు గతి తప్పుతున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి ఐటీడీఏల్లోని ఖాళీలను భర్తీ చేయాలి. తద్వారా వాటి పనితీరును మెరుగుపరచాలి.
రావుల రాజేశం
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Sep 19 , 2025 | 01:16 AM