Social Justice: అనర్హులను నియంత్రించటం తప్పా?
ABN, Publish Date - Nov 04 , 2025 | 04:15 AM
మన దేశంలో ప్రభుత్వ ప్రతి నిర్ణయాన్నీ రాద్ధాంతం చేసే కొందరు ప్రతిపక్ష నేతలున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, విపక్షంలోకి వస్తే మరో మాట మాట్లాడతారు...
మన దేశంలో ప్రభుత్వ ప్రతి నిర్ణయాన్నీ రాద్ధాంతం చేసే కొందరు ప్రతిపక్ష నేతలున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, విపక్షంలోకి వస్తే మరో మాట మాట్లాడతారు. ప్రభుత్వంపై బురద చల్లుతుంటారు. ప్రభుత్వ పథకాల్లో, చర్యల్లో లోటుపాట్లు ఉంటే చట్టసభల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, ప్రజలకు మేలు జరిగే చర్యలైతే సహకరించాలి. తాజాగా గత ప్రభుత్వం ఇవ్వాల్సిన డీఏ బకాయిల్లో ఈ ప్రభుత్వం కొంత చెల్లిస్తే ఉద్యోగులు కూడా సంతోషించారు, అయినా కొందరు విమర్శించారు. ప్రభుత్వం సామాన్య ప్రజల గురించి కూడా ఆలోచించాలి కదా అన్నారు. ఇక అనర్హులకి పెన్షన్లు రద్దుపై మరికొందరు విపక్ష నేతలు విమర్శలు గుప్పించారు. వృద్ధుల పింఛను 200 రూపాయలు ఉన్నపుడు స్థితిపరులు ఆ పింఛన్లు తీసుకోవటం నామోషీగా భావించారు. క్రమంగా ప్రభుత్వాలు రెండు వేలు, మూడు వేలు, నాలుగు వేలు అని పెంచుతూ పోతుంటే ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పెద్ద జీతాలు, ఆదాయం పొందే కొందరి తల్లిదండ్రులు తాము కూడ పేదలమని కొందరు అవినీతి ఉద్యోగుల సాయంతో పింఛన్లు పొందారు. దివ్యాంగుల విషయంలో కూడా అంగవైకల్యం లేకపోయినా పెన్షన్లు పొందటం పేపర్లలో చూస్తున్నాం. ప్రజల సొమ్మే కదా అని కొందరు ప్రభుత్వ పెద్దలు అడ్డగోలు పంపిణీకి కారణమయ్యారు. మరోవైపు నిజంగా అంగవైకల్యం ఉన్నవారికి మాత్రం లంచం ఇవ్వలేదని కొందరు ఉద్యోగులు ఏదో ఒక సాకుతో వారి పెన్షన్లు మంజూరు చేయక ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటున్నారు. తమ పింఛన్లు ఆగిపోయాయని నిజమైన పేదలు, దివ్యాంగులెవరైనా ఫిర్యాదు చేస్తే– పరిశీలించి మంజురు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా, కొందరు విపక్ష నేతలు ‘పేదలపై పిడుగులు’ అంటూ ఆందోళన చేస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగుల పింఛన్లు, రేషన్ వంటి పథకాలపై సంబంధిత అధికార బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలించి, అర్హత లేని వారినందరినీ తొలగిస్తే కోట్లాది రూపాయలు ఆదా అవుతాయి. ఇక మహిళలకు మేలు చేయాలని ప్రభుత్వం భావిస్తే– గుజరాత్‌లో వలె సంపూర్ణ మద్యనిషేధం విధించలేక పోయినా, ముఖ్యమైన కూడళ్లలో మద్యం షాపులను మూయించటం, తగ్గించటం; తెలంగాణలో వలె తాగుడు మాన్పించటానికి డీ అడిక్షన్ సెంటర్లు తెరిపించే చర్యల వంటివి చేపడితే శాంతిభద్రతలు కొంత మెరుగుపడి, మహిళలకు భద్రత లభిస్తుంది. అవసరం లేని సంక్షేమ పథకాలు పెరిగే కొద్ది ప్రభుత్వాలు మద్యం ఆదాయంపై ఆధారపడుతున్నాయి. పెరిగిపోతున్న అవినీతి, అక్రమాలు, జల్సా సంస్కృతి, తాగుడు వంటి సామాజిక రుగ్మతల దుష్ప్రభావాలపై మంత్రులు, ప్రజాప్రతినిధులు సామాన్య ప్రజానీకాన్ని చైతన్యపరిస్తే సమాజానికి మేలు జరుగుతుంది. అసలు వృద్ధుల, దివ్యాంగుల పింఛన్లు, రేషన్ వంటి సంక్షేమ పథకాల్లో నిజమైన పేదలెవరో తెలియాలంటే, తమ కుటుంబసభ్యుల వివరాలతో కూడిన డిక్లరేషన్‌ను లబ్ధిదారులు ఇవ్వాలని ప్రభుత్వం కోరాలి. విపక్షాలు సమాజానికి ప్రయోజనం కలిగించే ఇటువంటి అంశాలపై ప్రభుత్వానికి సహకరించాలి. ప్రభుత్వం కూడా మంచి పనులు చేసుకుంటూపోవాలి. అప్పుడే మన దేశం ఆర్థికంగా, సామాజికంగా చైతన్యవంతమై అభివృద్ధి చెందుతుంది.
-తిరుమలశెట్టి సాంబశివరావు గుంటూరు
Updated Date - Nov 04 , 2025 | 04:15 AM