ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

A Tale of Two Vice Presidents: సర్వేపల్లి నుంచి చంద్రాపురం దాకా

ABN, Publish Date - Sep 10 , 2025 | 01:21 AM

అనుకున్నట్లుగానే ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో పెద్ద ఆశ్చర్యాలు ఏమీ లేవు. ఎన్డీఏ అభ్యర్థి చంద్రాపురం పొన్నుసామి రాధాకృష్ణన్‌కే మెజారిటీ ఓట్లు ఉన్నాయి కనుక ఆయన అవలీలగా ఉపరాష్ట్రపతిగా ఎంపికయ్యారు...

అనుకున్నట్లుగానే ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో పెద్ద ఆశ్చర్యాలు ఏమీ లేవు. ఎన్డీఏ అభ్యర్థి చంద్రాపురం పొన్నుసామి రాధాకృష్ణన్‌కే మెజారిటీ ఓట్లు ఉన్నాయి కనుక ఆయన అవలీలగా ఉపరాష్ట్రపతిగా ఎంపికయ్యారు. ఇరుపక్షాల మధ్య బొటాబొటి ఓట్ల తేడా ఉంటే ఈ ఎన్నిక ఆసక్తికరంగా ఉండేది. కాని ఎన్డీఏ మిత్రపక్షాలన్నీ కలిసికట్టుగా ఉండడమే కాక, ఎన్డీఏ యేతర పార్టీలు కూడా కొన్ని మద్దతు ప్రకటించడం, కొన్ని పార్టీలు తటస్థంగా ఉంటామని ప్రకటించడంతో ఈ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో ముందుగానే స్పష్టమైపోయింది. సీపీ రాధాకృష్ణన్‌కు రావాల్సిన ఓట్ల కంటే ఎక్కువ రాగా ప్రతిపక్షాల అభ్యర్థి జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి పడాల్సిన ఓట్ల కంటే తక్కువ పడ్డాయి. ప్రతిపక్షాలకు చెందిన 315 మంది ఎంపీలూ ఓటు వేశారు అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాంరమేశ్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి 300 ఓట్లు వచ్చాయని రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ప్రతిపక్షాల శిబిరం నుంచే క్రాస్ ఓటింగ్ జరిగిందన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. ప్రజాస్వామ్యంలో ఇది అనూహ్యం కాదు. ఆశ్చర్యకరమయిన విషయం ఏమంటే ఇరుపక్షాలు వర్క్‌షాప్‌లు, మాక్ ఓటింగ్‌లు నిర్వహించినా 15 ఓట్లు చెల్లకుండా పోయాయి!

ఉపరాష్ట్రపతి పదవి మన దేశంలో రెండవ అత్యున్నత రాజ్యాంగ హోదా. ఇది కూడా లాంఛనమైన పదవి అయినప్పటికీ జగదీప్‌ ధన్‌ఖడ్ రాజీనామా తర్వాత జరిగిన ఈ ఎన్నికకు ప్రాధాన్యత పెరిగింది. మోదీ ప్రభుత్వమే ఏరి కోరి తెచ్చుకున్న జగదీప్ ధన్‌ఖడ్ వారికే తలనొప్పిగా మారడంతో ఆయనను వదిలించుకున్నారన్న విషయం స్పష్టమే అయినప్పటికీ ఉపరాష్ట్రపతి పదవికి ఉన్న ప్రాధాన్యత తగ్గలేదు. అందుకు కారణం తొలి ఉపరాష్ట్రపతి అయిన సర్వేపల్లి రాధాకృష్ణన్ నుంచి ఎందరో ఆ పదవికి వన్నె తెచ్చారు. రాజ్యసభ చైర్మన్‌గా కూడా ఉపరాష్ట్రపతి పదవి చర్చలో ఉంటుంది కనుక ఆ పదవిలో ప్రాధాన్యతను విస్మరించలేనిది. వారి ప్రతి చర్యనూ ప్రజలు గమనించే అవకాశం ఉంటుంది. రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికైన రాధాకృష్ణన్ సాధు స్వభావి, మృదుభాషి. ఉపరాష్ట్రపతి పదవికి ఉన్న ప్రాధాన్యతను కాపాడేందుకు ఆయన ప్రయత్నిస్తారనడంలో సందేహం లేదు. రాధాకృష్ణన్‌కు ఉన్న నేపథ్యం, సైద్ధాంతిక నిబద్ధత రీత్యా ఆయనను ధన్‌ఖడ్ మాదిరి వదిలించుకునే అగత్యం బీజేపీ అగ్రనేతలకు రాకపోవచ్చు. అంత సాహసం కూడా వారు చేసే అవకాశం లేదు.

ఏదిఏమైనప్పటికీ గత నెల రోజులుగా ఉపరాష్ట్రపతి పదవిపై మీడియాలో విస్తృత చర్చ జరిగింది. సీపీ రాధాకృష్ణన్ ఎక్కడా పెద్దగా నోరు విప్పనప్పటికీ, ప్రతిపక్షాల శిబిరం తరఫున పోటీ చేసిన జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ఉధృతంగా ప్రచారం చేశారు. వివిధ రాష్ట్రాల్లో తిరిగి అక్కడి నేతల్ని, ప్రజాప్రతినిధులను కలుసుకున్నారు. రాజ్యాంగ విలువల్ని కాపాడేందుకు, ప్రజాస్వామ్యం ఆరోగ్యంగా ఉండేందుకు ఉపరాష్ట్రపతి పదవి అనేది ఎంత ముఖ్యమో అని ఆయన వివరించారు. ఈ పదవి పార్టీలకు అతీతమైనదని, ఎంపీలు స్వేచ్ఛగా ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాజకీయాల్లో అంతర్గత ప్రయోజనాలే కాని అంతరాత్మ ప్రబోధాలు ఎక్కడ పనిచేస్తాయి?

ఉపరాష్ట్రపతి పదవీ ఎన్నిక ప్రతిపక్షాలు సంఘటితం అయ్యేందుకు దోహదం చేసింది. ఓట్ చోరీ, బిహార్‌లో ఎస్ఐఆర్‌కు వ్యతిరేకంగా వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్షాలు కలిసికట్టుగా ఉభయసభల్ని స్తంభింపచేశాయి. పహల్గామ్‌పై జరిగిన చర్చలో ప్రభుత్వాన్ని అనేక అంశాలపై నిలదీశాయి. అనుకున్న దానికంటే కొన్ని ఓట్లు తగ్గినప్పటికీ ఉపరాష్ట్రపతి ఎన్నికల ఫలితం ప్రతిపక్షాల ఐక్యతపై పెద్దగా ప్రభావం చూపే అవకాశాలు లేవు. పై పెచ్చు ఎన్డీఏకూ, ఇండియా కూటమికీ మధ్య ఉన్న సైద్ధాంతిక వ్యత్యాసాల్ని స్పష్టంగా చెప్పేందుకు ఈ ఎన్నికలు అవకాశం కల్పించాయి. బాల్యం నుంచీ హిందూత్వ భావజాలంతో ఎదిగిన సీపీ రాధాకృష్ణన్‌కు పోటీగా సోషలిస్టు భావజాలం గల సుదర్శన్‌రెడ్డిని అన్ని పక్షాలు ఏకగ్రీవంగా తమ అభ్యర్థిని ఎంచుకోవడమే ఈ సైద్ధాంతిక వ్యత్యాసానికి నాంది పలికింది. రాజ్యాంగ నైతికత, అందరికీ సామాజిక న్యాయం, ప్రతి ఒక్కరికీ సమాన విలువ అన్న అంశాలపై సుదర్శన్‌రెడ్డి ప్రచారం చేశారు. ఒకరకంగా ప్రతిపక్షాలకు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఇదివరకు లేని ఒక సిద్ధాంతవేత్త రూపంలో సుదర్శన్‌రెడ్డి లభించారని చెప్పవచ్చు. ఇండియా కూటమి అభ్యర్థి ఓటమి చెందినప్పటికీ ఆయన ప్రచారం చేసిన అంశాల ప్రాధాన్యత మాత్రం తగ్గిపోయే అవకాశం లేదు.

ప్రతిపక్షాలు ఎదుర్కొంటున్నది ఎన్డీఏనో, బీజేపీనో కాదు, దేశ రాజకీయాల్లో ఒక బలమైన శక్తిగా ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీని అని స్పష్టంగా చెప్పక తప్పదు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ, ఆ మాటకొస్తే అధికారంలోకి రానప్పటి నుంచీ నరేంద్రమోదీ అనేక ప్రతికూలతలను ఎదుర్కొన్నారు. గుజరాత్ అల్లర్ల నుంచీ ఎన్నో ఆటుపోట్లు ఆయనకు ఎదురయ్యాయి. ప్రధానిగా పెద్దనోట్ల రద్దు, సాగు చట్టాల నుంచి ఇటీవల పహల్గామ్ సంఘటన, అమెరికాతో విభేదాల దాకా ఆయన ఎన్నో సమస్యలను, స్వీయ ప్రతిష్ఠ దెబ్బతినడాన్ని ఎదుర్కొన్నారు. కాని ఆసక్తికరమైనదేమిటంటే ఆయన గ్రాఫ్ ఎప్పుడు పడిపోతుందో, ఎప్పుడు పెరుగుతుందో చెప్పడం కష్టం. ఆయన జాబితాలో వైఫల్యాలెన్నో విజయాలూ అంతకు మించి ఉన్నాయి. అందువల్ల ప్రధానమంత్రి అనుకూల పక్షాలే కాదు, మోదీని మనస్ఫూర్తిగా సమర్థించని ఎన్నో పక్షాలు కూడా ప్రత్యక్షంగా ఆయనను వ్యతిరేకించడానికి భయపడతాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి గెలిచినప్పటికీ ఆయనకు సమస్యలు తొలగిపోతాయని కాని, కొత్త సమస్యలు రావని కానీ, ఆయన వాటిని ఎదుర్కోలేరని కానీ చెప్పడానికి వీల్లేదు. ఆయన డిగ్రీ గురించి వివాదం తలెత్తినప్పటికీ అవతలి వారి కంటే నాలుగాకులు ఆయన ముందే చదివి ఉంటారన్నదానిలో సందేహం లేదు. రష్యా, చైనా అధినేతలు పుతిన్, జిన్‌పింగ్‌లతో ఇటీవల ఎస్‌సీఓ సదస్సులో నవ్వుతూ మాట్లాడుతున్న దృశ్యాలను చూపిస్తూ ఒక రాజకీయ నాయకుడు ‘ఈ వ్యక్తి డిగ్రీల గురించి ఎవరు పట్టించుకుంటారు?’ అని ప్రశ్నించారు.

మరోవైపు ప్రతిపక్షాలకు చాలా కాలం తర్వాత ఒక నాయకుడు దొరికాడని చెప్పవచ్చు. వారు ఆయన వెనుక నడిచేందుకు వెనుకాడడం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాహుల్ ఒక నిప్పుకణంలా మండిపడుతున్నాడు. ఓట్లచోరీతో సహా ఆయన లేవనెత్తే అంశాలకు ప్రాధాన్యత లభిస్తోంది. బిహార్‌లో ఆయన నిర్వహించిన ఓటర్‌ అధికార్‌ యాత్రకు పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు. ఆర్‌జేడీ నేత తేజస్వి యాదవే ఆయన వెంట నడవాల్సి వస్తోంది. గతంలో కాంగ్రెస్ పార్టీ అవలంబించిన సిద్ధాంతాలు ఎలా ఉన్నప్పటికీ రాహుల్ తమ పార్టీకి ఒక కొత్త సిద్ధాంతాన్ని ఏర్పర్చే ప్రయత్నం చేస్తున్నారు. విభిన్న సామాజిక వర్గాలను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే ఎన్డీఏ, ఇండియా కూటమిల మధ్య సైద్ధాంతిక వ్యత్యాసాలను నిర్ధారించేందుకు ఆస్కారం కలిగిస్తోంది. ఈ సైద్ధాంతిక పోరు ప్రతి అసెంబ్లీ ఎన్నికలోనూ, సార్వత్రక ఎన్నికల వరకు సంఘటితం చేసి తమది భిన్నమైన సైద్ధాంతిక కూటమి అని ప్రజలు అర్థం చేసుకునేలా చేయడం అంత సులభమైన విషయం కానే కాదు. కానీ రాహుల్ వెనక్కు తగ్గే అవకాశాలు లేవు.

ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్‌కు అసలు పరీక్ష ఆయన రాజ్యసభ చైర్మన్ సీటులో కూర్చున్న తర్వాతే మొదలవుతుంది. భారత తొలి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ అధిష్ఠించిన ఆసనమది. తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు, దౌత్యవేత్త అయిన సర్వేపల్లి రాధాకృష్ణన్ హిందూ ధర్మాన్ని ఒక తాత్విక అంశంగా స్వీకరించిన మహోన్నత దార్శనికుడు. తన మూలాలు భారతీయ సాంస్కృతిక వారసత్వంలో ఉన్నప్పటికీ తన ఆలోచనలు ఆధునికమని ఆయన ప్రతి సందర్భంలో నిరూపించేవారు. తొలి ఉపరాష్ట్రపతిగా, రాజ్యసభ తొలి చైర్మన్‌గా ఆయన తన తర్వాత ఆ పదవులు నిర్వహించేవారికి ఒక పథనిర్దేశం చేసి వెళ్లారు. ‘రాజ్యసభ అంటే కేవలం చట్టాలు చేసే సభ కాదు. అది చర్చించే సభ. అందరూ విలువైన చర్చలకు పూనుకునే అవకాశం ఈ సభ కల్పించింది. లోక్‌సభ, రాజ్యసభ రెండూ మన రాజ్యాంగంలో భాగమయ్యాయి కనుక ఈ వ్యవస్థను సమర్థంగా కొనసాగించడం అనేది మన పనిపైనే ఆధారపడి ఉన్నది’ అన్న ఉదాత్తుడు సర్వేపల్లి రాధాకృష్ణన్. ఉపరాష్ట్రపతిగా తన కార్యకలాపాలను రాజకీయ, దౌత్య రంగాల్లో విస్తరించి దేశ ప్రతిష్ఠను పెంచే స్వేచ్ఛ ఆయనకు లభించింది. రాధాకృష్ణన్ సభాధ్యక్ష స్థానంలో ఉన్నంతకాలం ఎటువైపూ మొగ్గు చూపే ప్రసక్తి ఉండదని, సభ్యుల హక్కులకు భంగం వాటిల్లబోదని నిరూపించారు. నెహ్రూ, భూపేశ్ గుప్తా, రాధాకృష్ణన్‌ల మధ్య జరిగే వాదనలు నిశితమూ తీవ్రమైనవి అయినా సుహృద్భావ వాతావరణంలో జరిగేవి. హెచ్ఎన్ ఖుంజ్రూ, పుచ్చలపల్లి సుందరయ్య లాంటి హేమాహేమీలు సర్వేపల్లి సభా నిర్వహణను ప్రశంసించేవారు. ‘ప్రతిపక్షాలు ప్రభుత్వ విధానాలను నిష్పాక్షికంగా, స్వేచ్ఛగా స్పష్టంగా విమర్శించడానికి అనుమతించకపోతే ప్రజాస్వామ్యం నిరంకుశత్వంలోకి దిగజారిపోయే అవకాశం ఉంది. అదే సమయంలో ప్రతిపక్షాలు సైతం పార్లమెంటు కార్యకలాపాలను ఉద్దేశపూర్వకంగా అడ్డుకునేంతగా దిగజారిపోకూడదు’ అని ఆయన రాజ్యసభ చైర్మన్‌గా సభలోనే ప్రకటించారు. 15వ ఉపరాష్ట్రపతి చంద్రాపురం రాధాకృష్ణన్ మరో సర్వేపల్లి రాధాకృష్ణన్ కాగలరా? ప్రభుత్వం, ప్రతిపక్షాలు పార్లమెంట్‌కు కలసికట్టుగా పూర్వ వైభవం సంతరింప చేయగలవా?

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

ఈ వార్తలు కూడా చదవండి..

యూరియాపై వైసీపీది అసత్య ప్రచారం.. మంత్రి సుభాష్ ఫైర్

ఆ ఐపీఎస్‌లకు మళ్లీ షాక్ ఇచ్చిన ప్రభుత్వం

For More AP News And Telugu News

Updated Date - Sep 10 , 2025 | 01:21 AM