ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Tummala Nageswara Rao: రైతుని దెబ్బతీస్తున్న దిగుమతి సుంకాల మాఫీ!

ABN, Publish Date - Nov 11 , 2025 | 12:43 AM

కేంద్ర ప్రభుత్వం 2025 ఆగస్టు 19న రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టి మరీ ముడి పత్తిపై 11 శాతం దిగుమతి సుంకాన్ని ఎత్తివేసింది. వస్త్ర పరిశ్రమకు ముడి పదార్థం సులభంగా అందుబాటులో ఉంచి...

కేంద్ర ప్రభుత్వం 2025 ఆగస్టు 19న రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టి మరీ ముడి పత్తిపై 11 శాతం దిగుమతి సుంకాన్ని ఎత్తివేసింది. ‘‘వస్త్ర పరిశ్రమకు ముడి పదార్థం సులభంగా అందుబాటులో ఉంచి, ఎగుమతి పోటీ సామర్థ్యాన్ని పెంచడం,’’ ఈ నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశమని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ నిర్ణయం భారతదేశంలోని పత్తి మిల్లులకు ఊరట కలిగించే చర్యగా మారింది. కానీ తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల లక్షలాది చిన్న, మధ్య తరహా పత్తి రైతులకు, మార్కెట్ ధరలలో పతనం ద్వారా, మరోసారి నిరాశను మిగిల్చింది. ప్రకటన వెలువడిన రెండు రోజుల్లోనే పత్తి ధరలు పడిపోయాయి. యవత్మాల్, జల్గావ్, వరంగల్ వంటి ప్రధాన మార్కెట్లలో జిన్నింగ్ పత్తి ధరలు కాండీపై రూ.1,000–1,200 దాకా తగ్గిపోయాయి. చౌక దిగుమతి పత్తితో పోటీపడలేక, భారత పత్తి సంస్థ (సీసీఐ) కూడా తన అమ్మకపు ధరను కాండీపై రూ.1,000 తగ్గించింది. మంచి వర్షాల తరువాత లాభదాయకమైన ధర కోసం ఎదురు చూసిన రైతులకు ఇది కోలుకోలేని దెబ్బ. ‘‘మేము క్వింటాల్‌కు రూ.8,000 వస్తుందని అనుకున్నాం. ఇప్పుడు వ్యాపారులు రూ.6,600–6,700 కంటే ఇవ్వడం లేదు. మన కాళ్ల కింద నేల లాగేసినట్టుంది,’’ అన్నాడు ఖమ్మం జిల్లాకు చెందిన ఒక సన్నకారు రైతు రాములు. ఇది ఖమ్మం జిల్లాకే పరిమితం కాదు, తెలంగాణ వ్యాప్తంగా పత్తి రైతుల వ్యథ. పత్తి ఒక్కటే కాదు, ఈ దిగుమతి సుంకాల ఎత్తివేత నమూనా ఇప్పుడు ప్రతి పంటకూ పునరావృతం అవుతున్నది. ఇటీవలి సంవత్సరాల్లో ప్రభుత్వం పత్తితోపాటు నూనె గింజలు, పప్పులు వంటి పలు పంటలపై దిగుమతి సుంకాలను తగ్గించింది. దీని లక్ష్యం ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడం లేదా పరిశ్రమలకు మద్దతు ఇవ్వడం. కానీ ప్రతిసారీ లాభం పొందేది వినియోగదారులు లేదా పరిశ్రమలు మాత్రమే; రైతులు నష్టాన్ని భరిస్తున్నారు. ఈ సందర్భంలో– గతంలో ఎడిబిల్ ఆయిల్స్ ఉదంతాన్ని ఒక హెచ్చరికగా తీసుకోవాలి. పామ్ ఆయిల్, సోయాబీన్, సన్‌ఫ్లవర్ నూనెలపై సుంకాలు సడలించిన దిగుమతి విధానాల వల్ల భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద నూనె దిగుమతిదారుగా మారింది. దానితో వేరుశనగ, సోయాబీన్ రైతులు చౌక దిగుమతి నూనెలతో పోటీపడలేక వెనుకబడ్డారు.

సాల్వెంట్ ఎక్‌స్ట్రాక్టర్స్‌ అసోసియేషన్ (SEA) ప్రకారం, 2024–25లో భారతదేశం నూనెల దిగుమతులకే రూ.1.5లక్షల కోట్లు ఖర్చు చేసింది. అది దేశం వ్యవసాయ మద్దతు పథకాలకు ఖర్చు చేసే మొత్తానికి దాదాపు రెట్టింపు. అయినప్పటికీ, సోయాబీన్, వేరుశనగ ధరలు కనీస మద్దతు ధర (MSP) కంటే తక్కువగానే ఉన్నాయి. వ్యవసాయ ఆర్థికవేత్తల అభిప్రాయం ప్రకారం: ‘వినియోగదారులకు సహాయం చేయడానికి చేసిన సుంకాల సడలింపులు చివరికి నూనెగింజల వ్యవసాయాన్ని బలహీనపర్చాయి. మన దేశం శాశ్వతంగా దిగుమతులపై ఆధారపడే పరిస్థితికి చేరుకుంది; చిన్న రైతులు నూనె గింజల సాగు మానేశారు.’ 2016–17లో కూడా ఇలాగే వరుస కరువుల తరువాత, ప్రభుత్వం కందిపప్పు మొదలైన పప్పుల దిగుమతిపై సుంకాన్ని ఎత్తివేసింది. కానీ 2018–19లో దేశీయ ఉత్పత్తి పెరిగినపుడు మార్కెట్ చౌక విదేశీ పప్పులతో నిండిపోయింది. ఫలితంగా, మధ్యప్రదేశ్‌లోను, తెలంగాణలోను కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరలకు పప్పు దినుసులు అమ్ముకొనే దుస్థితిలోకి రైతులు నెట్టివేయబడ్డారు. దీని ఫలితంగా ‘నేషనల్‌ అగ్రికల్చరల్‌ కార్పొరేటివ్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌’ (NAFED) అత్యవసర కొనుగోలు కార్యక్రమాలు చేపట్టాల్సి వచ్చింది. ఫలితంగా వేల కోట్ల రూపాయల ప్రభుత్వ వ్యయం జరిగింది. అనిశ్చితమైన దిగుమతి విధానాల వల్లే ఈ పరిస్థితి కలిగింది. ఇక్కడ ప్రభుత్వ ప్రాధాన్యతల్లో అసమానత స్పష్టంగా కనిపిస్తున్నది. పరిశ్రమలకు రక్షణ కల్పిస్తూ, రైతులకు ప్రమాదం కలిగించేదిగా ఈ విధానాలు ఉన్నాయి. వస్త్ర, ఆహార ప్రాసెసింగ్ రంగాల సంస్థలకు ప్రభుత్వ స్థాయిలో తమ ప్రయోజనాల కోసం ఒత్తిడి చేయగల శక్తి ఉంది. కానీ రైతులు చిన్నచిన్న సమూహాలుగా ఉండటం వల్ల ధరలు పడిపోయినప్పుడు నిల్వచేయడం, లేదా మార్కెట్‌లో రక్షణాత్మక చర్యలు తీసుకోవడం వారికి వీలు కాదు. ప్రస్తుత దిగుమతి సుంకాల మాఫీలు వ్యవసాయానికి కాకుండా పరిశ్రమలకు మద్దతుగా మారాయి. ప్రపంచ పత్తి చౌకగా ఉంటే మిల్లులు దిగుమతి చేసుకుంటాయి; ఖరీదయితే సుంకం ఎత్తివేయమని ఒత్తిడి చేస్తాయి. కానీ రైతుకు లభించే ధర మాత్రం ఎల్లప్పుడూ తగ్గుతూనే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న దిగుమతి సుంకాల మాఫీ వంటి నిర్ణయాలు వ్యవసాయం ప్రధాన ఉపాధిగా ఉన్న తెలంగాణ వంటి రాష్ట్రాలపై ప్రత్యక్షంగా ఆర్థిక ప్రభావాన్ని చూపిస్తాయి. ప్రతిసారి సోయాబీన్, వేరుశనగ ధరలు పడిపోయినప్పుడు రాష్ట్రం అదనపు కొనుగోలు లేదా బోనస్ పథకాలతో ముందుకు రావాల్సి వస్తున్నది. 2024–25లోనే తెలంగాణ ప్రభుత్వం కేంద్ర పరిమితిని మించి రూ.574 కోట్లు వెచ్చించి పంటలను కొనుగోలు చేసింది. కేంద్రం మిల్లులను కాపాడుతుంటే, రాష్ట్రం రైతులను కాపాడటానికి తన నిధులను వెచ్చించాల్సి వస్తున్నది.

ఈ విధంగా కేంద్రం నిశ్శబ్దంగా ఆర్థిక భారాన్ని రాష్ట్రాలపై మోపుతున్నది. ఇలాంటి నిర్ణయాల వల్ల ప్రధాన నష్టం చిన్న, అణగారిన రైతులకే! భారతదేశంలో 86శాతం రైతులు ఐదు ఎకరాలకు తక్కువ భూమిపై వ్యవసాయం చేస్తున్నారు. వీరికి పంట నిల్వ చేసే సదుపాయం లేదు. ధరలు పడిపోయిన వెంటనే అమ్మకాలు చేయాల్సిందే. ఎరువులు, కూలి చెల్లింపులు, మందులు వంటి ఖర్చులు పెరిగిన ఈ రోజుల్లో 10శాతం ధర తగ్గితేనే రైతుల లాభం మాయం అవుతుంది. పత్తి రైతుల విషయంలో కాండీపై రూ.1,000 ధర తగ్గితే, ఎకరాకు రూ.7,000–10,000 వరకు నష్టం వస్తుంది. అది అప్పు తీర్చగల స్థితి నుంచి అప్పుల్లో కూరుకుపోయే స్థితికి మార్పు. ఏ పంట పైనైనా దిగుమతి సుంకం మార్చే ముందు ‘‘రైతులపై అవి చూపే ప్రభావాన్ని అంచనా వేయడం (Farmer Impact Assessment) తప్పనిసరిగా చేయాలని ఆర్థికవేత్తలు, అధికారులు సూచిస్తున్నారు. ఇది ధరలలోని హెచ్చుతగ్గులు, ఎమ్‌ఎస్‌పి స్థాయిలు, కొనసాగుతున్న కొనుగోలు కార్యక్రమాలు వంటి అంశాలను పరిశీలించాలి. ఇంకో ప్రతిపాదన ఏమిటంటే ‘‘వేరియబుల్ టారిఫ్ మెకానిజం’’ – అంటే ప్రపంచ ధరలు కనీస మద్దతు ధర కంటే తగ్గితే సుంకం స్వయంచాలకంగా పెరిగే విధానం. దీని ద్వారా రైతులు దిగుమతుల ప్రభావం నుంచి రక్షించబడతారు. ‘‘ఇవి పరిశ్రమల అవసరాలు, గ్రామీణ సంక్షేమం మధ్య సమతౌల్యం కోసం అవసరమైన స్థిరత్వ విధానాలు,’’ అంటున్నారు హైదరాబాద్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌కి చెందిన వ్యవసాయ విధాన నిపుణులు. భారతదేశంలో వాణిజ్య విధానం వ్యవసాయ విధానం కంటే వేగంగా మారుతున్నది. దాని ఫలితం: ఢిల్లీలో తీసుకునే నిర్ణయాలు తెలంగాణ, విదర్భ రైతుల వాస్తవ జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. సుంకాలలో రాయితీలు పరిశ్రమలకు తాత్కాలికంగా మేలు చేసినా, రక్షణలేని విధంగా అమలు చేస్తే రైతులకు వచ్చే ధరలలో స్థిరత్వం కానరాకుండా పోతుంది. కొత్త పత్తి పంట మార్కెట్‌లోకి వస్తున్న ఈ సమయంలో, తెలంగాణ రైతులకు ఉన్న ఒకేఒక్క కోరిక – కేంద్ర ప్రభుత్వ విధానాలు రైతుల శ్రమను మరొకరి లాభాలకు బలి చేసే విధంగా ఉండకూడదు అని.

-తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి

Updated Date - Nov 11 , 2025 | 12:43 AM