ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Imperialism: సామ్రాజ్యవాద అంతిమ బుసలు

ABN, Publish Date - Jul 08 , 2025 | 01:42 AM

అమెరికా సామ్రాజ్యవాదులు తమ తొత్తు నెతన్యాహు ఫాసిస్టు ప్రభుత్వాన్ని రంగంలోకి దింపటమే కాకుండా, యుద్ధం ఆరంభమైన పదవ రోజున ఇరాన్‌పై ప్రత్యక్షంగా బంకర్‌ విధ్వంసక బాంబు దాడులు జరిపి, అణు ఇంధన పరిశోధన, అభివృద్ధి కేంద్రాలను ధ్వంసం చేశారు.

మెరికా సామ్రాజ్యవాదులు తమ తొత్తు నెతన్యాహు ఫాసిస్టు ప్రభుత్వాన్ని రంగంలోకి దింపటమే కాకుండా, యుద్ధం ఆరంభమైన పదవ రోజున ఇరాన్‌పై ప్రత్యక్షంగా బంకర్‌ విధ్వంసక బాంబు దాడులు జరిపి, అణు ఇంధన పరిశోధన, అభివృద్ధి కేంద్రాలను ధ్వంసం చేశారు. ఇది ఇరాన్‌ సార్వభౌమాధికారాన్నీ, ఐరాస నిబంధనావళినీ, అంతర్జాతీయ చట్టాన్నీ ఉల్లంఘించడమే. అమెరికా దాడులకు ఇరాన్‌ గట్టిగా బదులివ్వడంతో డొనాల్డ్‌ ట్రంప్‌ ఇజ్రాయెల్‌–ఇరాన్‌ మధ్య కాల్పుల విరమణ ప్రకటించక తప్పలేదు. ఇరాన్‌ అణ్వాయుధాల తయారీకి సిద్ధమవుతున్నదనే అమెరికా ప్రకటనలు దొంగ ప్రచారమే. రసాయనిక ఆయుధాలున్నాయనే సాకు చూపి ఇరాక్‌పై అమెరికా అక్రమంగా దాడి చేసిన విషయం ప్రజలు మరచిపోలేదు.

అమెరికా నేతృత్వంలోని పాశ్చాత్య సామ్రాజ్యవాదులు తమ ఆధిపత్యాన్ని ఇరాన్‌ సవాల్‌ చేసినందుకే ఇజ్రాయెల్‌ జియోనిస్టు, జాత్యహంకార పాలకుల్ని ఉసిగొల్పి దారుణ మారణకాండకు పాల్పడ్డారు. సిరియాలో అస్సాద్‌ ప్రభుత్వాన్ని కూలదోసి తమ అనుకూల టెర్రరిస్టు ముఠాను అధికారంలోకి తీసుకువచ్చారు. సిరియా, లెబనాన్‌, యెమెన్‌ భూభాగాలను దురాక్రమించారు. గాజాలో నెత్తురుటేరులు పారుతున్నాయి. వేల సంఖ్యలో మరణాలు, లక్షల సంఖ్యలో క్షతగాత్రులు, ఇంకా అనేకమంది శరణార్థులు– ఇదీ నేటి పశ్చిమాసియా రణరంగ దృశ్యం.

ఇక, ఉక్రెయిన్‌–రష్యా యుద్ధరంగానికి వస్తే, నాటో సేనలు రష్యా వైపుగా విస్తరించబోవు అనే హామీని సామ్రాజ్యవాదులే ఉల్లంఘించారు. ఉక్రెయిన్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయిన ప్రభుత్వాన్ని కుట్రపూరితంగా కూలదోశారు. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో నాజీ ఫాసిస్టులతో చేతులు కలిపిన బండేరాకు అనుచరులుగా వ్యవహరించిన వారిని అధికారంలోకి తీసుకువచ్చారు. అక్కడ మైనారిటీగా ఉన్న రష్యా జాతి ప్రజల మీద క్రూరమైన దాడులు చేసి వేలాది మందిని హతమార్చారు. రష్యా దేశమే దురాక్రమణ ప్రమాదాన్ని ఎదుర్కోవలసి రాగా, దీనిని నివారించాలనే లక్ష్యంతో, అది సైనిక చర్యకు పాల్పడింది. మూడు సంవత్సరాలుగా అక్కడ యుద్ధం కొనసాగుతూనే ఉంది. అంతేగాక తూర్పు ఆసియా, పశ్చిమ పసిఫిక్‌ ప్రాంతాలకు యుద్ధరంగాన్ని విస్తరింపజేసి, ఉత్తర కొరియా, చైనాలను లక్ష్యాలుగా చేసుకుని అణు యుద్ధాన్ని సైతం ఎగదోయాలని వ్యూహాలు రచిస్తున్నారు. అమెరికా నేతృత్వంలోని సామ్రాజ్యవాదులు ఒక పథకం ప్రకారం కొనసాగిస్తున్న ఈ యుద్ధాలన్నింటి లక్ష్యం. దోపిడీని, ప్రపంచాధిపత్యాన్నీ నిలుపుకోవడమే. ఆయుధ పోటీ, అణ్వస్త్రవ్యాప్తి, యుద్ధ ఉద్రిక్తతలు నిత్యకృత్యమయ్యాయి. రష్యా, చైనాల నుంచి ప్రమాదం ఉందనే పేరుతో సామ్రాజ్యవాద దేశాలు సైనిక వ్యయాన్ని భారీగా పెంచేశాయి. నాటో దేశాల మిలటరీ బడ్జెట్‌ జీడీపీలో రెండు నుంచి ఐదు శాతానికి పెరగనుంది. ఉక్రెయిన్‌–రష్యా యుద్ధంలో ప్రాణనష్టం, పాలస్తీనా ప్రజల హత్యాకాండ, స్థానిక యుద్ధాలలో సంభవిస్తున్న విధ్వంసం... ఇవన్నీ గత ప్రపంచ యుద్ధాల నాటి పరిస్థితులను తలపిస్తున్నాయి. మూడవ ప్రపంచ యుద్ధ ప్రమాదం తీవ్రమవుతోంది. మొదటి ప్రపంచ యుద్ధం సామ్రాజ్యవాదుల మధ్య యుద్ధంగా కొనసాగింది. రెండవ ప్రపంచ యుద్ధం సామ్రాజ్యవాదుల మధ్య యుద్ధంగా ఆరంభమయినా ఫాసిస్టు హిట్లరు నేతృత్వంలోని జర్మనీ, సోవియెట్‌ యూనియన్‌పై దాడి జరపడంతో ఫాసిస్టు వ్యతిరేక యుద్ధంగా పరిణమించింది. ఇప్పుడు మూడవ ప్రపంచ యుద్ధం సామ్రాజ్యవాద వ్యతిరేక యుద్ధంగా పెంపొందుతోంది. అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌, నాటో సామ్రాజ్యవాద దేశాలన్నీ ఒక కూటమిగా సమీకృతమవుతుంటే, సోషలిస్టు వారసత్వం కలిగిన పెట్టుబడిదారీ దేశం రష్యా, చైనా, ఉత్తర కొరియా, ఇరాన్‌, వియత్నాం, లావోస్‌, క్యూబా వంటి దేశాలు సామ్రాజ్యవాద వ్యతిరేక ఫ్రంట్‌గా ఏర్పడడానికి సిద్ధమవుతున్నాయి. ఫాసిస్టు వ్యతిరేక ఫ్రంట్‌లు అంతిమంగా సామ్రాజ్యవాద వ్యతిరేక లక్ష్యాలనే నెరవేరుస్తాయి. రష్యా, చైనా దేశాల్ని సోషల్‌ సామ్రాజ్యవాద దేశాలుగా పేర్కొనటం గానీ, రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధాన్ని సామ్రాజ్యవాదుల మధ్య యుద్ధంగా పరిగణించడం పూర్తి అవాస్తవికం.

సామ్రాజ్యవాద దోపిడీని ప్రతిఘటిస్తున్న దేశాలు తమ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవాలని బలంగా ఆకాంక్షిస్తున్నాయి. రష్యాపై ఆంక్షలు విధించి, దానిని ఆర్థికంగా కృంగదీయాలనే ప్రయత్నాలు విఫలమయ్యాయి. పాశ్చాత్య దేశాలకు బలమైన ఆర్థిక శక్తిగా చైనా ఎదిగింది. ప్రపంచ జీడీపీలో బ్రిక్స్‌ దేశాల వాటా గణనీయంగా పెరిగింది. లాటిన్‌ అమెరికా దేశాలలో వామపక్ష శక్తుల విజయపరంపర కొనసాగుతోంది. ఆఫ్రికా దేశాల స్వాతంత్ర్య పోరాటాలు బలోపేతమవుతున్నాయి. యూరప్‌ ప్రజలు ప్రపంచ శాంతి, సుస్థిరతల కోసం ఉద్యమిస్తున్నారు. ట్రంప్‌ నిరంకుశ విధానాలను వ్యతిరేకిస్తూ అమెరికా ప్రజలు వీధుల్లో ప్రదర్శనలు చేస్తున్నారు. భారత పాలకవర్గాలు అనుసరిస్తున్న ఇజ్రాయెల్‌, అమెరికా అనుకూల విదేశాంగ విధానం పట్ల ఇంటా బయటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రపంచ యుద్ధం ఏనాడైనా బద్దలుకానున్న ప్రస్తుత పరిస్థితులలో ఆయా దేశాల విప్లవ వ్యూహాలు ప్రపంచ విప్లవ వ్యూహంలో సంలీనం కావాలి. రష్యా, చైనా, ఉత్తర కొరియా వంటి దేశాలు రెగ్యులర్‌ సైన్యాలను కలిగివున్నాయి. కనుక అవి సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా సాయుధ యుద్ధాన్ని కొనసాగిస్తాయి. మిగిలిన దేశాలలోని విప్లవశక్తులు విస్తృత ప్రజా ఉద్యమాల నిర్మాణానికి కృషి చేయాలి. దండకారణ్య గిరిజన పోరాటాలపై కొనసాగుతున్న నిర్బంధాన్ని ఖండిస్తూ ఇటీవల విస్తృతంగా జరిగిన ప్రదర్శనలు, ఇరాన్‌పై అమెరికా దాడిని ఖండిస్తూ దేశవ్యాప్తంగా జరిగిన నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు ఆహ్వానించదగినవి. రాబోయే కాలంలో జరిగే పరిణామాలకు ఇవి ఒక ప్రతీకగా నిలుస్తాయి.

మొదటి ప్రపంచ యుద్ధానంతరం అక్టోబరు సోషలిస్టు విప్లవం జయప్రదమై సోవియట్‌ రష్యా ఆవిర్భవించింది. యూరప్‌కి చెందిన చాలా దేశాల్లో విప్లవజ్వాలలు మిన్నుముట్టాయి. రెండవ ప్రపంచ యుద్ధానంతరం చైనా, తూర్పు యూరప్‌లలో విప్లవాలు చెలరేగి సోషలిస్టు శిబిరం ఏర్పడింది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మూడవ వరుస విప్లవాలు సమీప భవిష్యత్తులో జయప్రదం కానున్నాయి. సామ్రాజ్యవాదానికి అంతిమ ఘడియలు దాపురించాయి. ప్రపంచ కార్మికులు ఏకమై తీరుతారు. సమైక్యంగా నిలిచిన పీడిత ప్రజానీకాన్ని ఏ శక్తీ ఓడించజాలదు.

-డా. శ్రీనివాస్‌ కె.ఎస్‌. మెమోరియల్‌ కమిటీ

Updated Date - Jul 08 , 2025 | 01:42 AM