ధిక్కార ఉక్రెయిన్ భవిష్యత్తు ఏమిటి
ABN, Publish Date - Jun 19 , 2025 | 04:48 AM
రెండు దేశాల మధ్య ఘర్షణలకు, ముఖ్యంగా సాయుధ సమరాలకు కారణాలను కేవలం వర్తమానంలోనే చూడకూడదు. గత చరిత్రలోకి కూడా వెళ్ళాలి. ఇది, ప్రస్తుతం భీకర యుద్ధంలో ఉన్న ఉక్రెయిన్, రష్యా విషయంలో మరింత అవసరం. 24, ఫిబ్రవరి 2022న ఉక్రెయిన్‌పై...
రెండు దేశాల మధ్య ఘర్షణలకు, ముఖ్యంగా సాయుధ సమరాలకు కారణాలను కేవలం వర్తమానంలోనే చూడకూడదు. గత చరిత్రలోకి కూడా వెళ్ళాలి. ఇది, ప్రస్తుతం భీకర యుద్ధంలో ఉన్న ఉక్రెయిన్, రష్యా విషయంలో మరింత అవసరం. 24, ఫిబ్రవరి 2022న ఉక్రెయిన్‌పై రష్యా పెద్ద ఎత్తున సైనిక దాడిని ప్రారంభించడంతో ఆ రెండు దేశాల మధ్య ఘర్షణ పూర్తి స్థాయి యుద్ధంగా మారింది. ఈ చర్యకు ముందు– 2021 చివర, 2022 ప్రారంభంలో శిక్షణ విన్యాసాలు పేరుతో ఉక్రెయిన్ సరిహద్దుల వెంబడి 1,00,000 మందికి పైగా తన సైనికులను రష్యా సమీకరించింది. ఫిబ్రవరి 21, 2022న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒక ప్రసంగంలో ఉక్రెయిన్‌ను సార్వభౌమ దేశంగా గుర్తించడాన్ని తిరస్కరించారు. అది సోవియట్ యూనియన్ సృష్టి అని, పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌ను రష్యాకు వ్యతిరేకంగా యుద్ధానికి రెచ్చగొడుతున్నాయని ఆరోపించారు. తూర్పు ఉక్రెయిన్‌లోని రష్యా మద్దతు గల, స్వయం–ప్రకటిత ప్రాంతాలైన డొనెట్స్‌క్, లుహాన్స్‌క్‌లను స్వతంత్ర రాష్ట్రాలుగా గుర్తిస్తున్నట్టు అదే ప్రసంగంలో ఆయన ప్రకటించారు. పిదప, మూడు రోజుల తర్వాత (ఫిబ్రవరి 24) ఉక్రెయిన్‌పై ప్రత్యేక సైనిక చర్యకు పుతిన్ ఆదేశించారు.
రష్యా సైన్యం రష్యా, బెలారస్, ఆక్రమిత క్రిమియా నుంచి బహుళ దిశలలో ఉక్రెయిన్‌పై దాడి చేసింది. కీవ్, ఖార్కివ్, డాన్‌బాస్ ప్రాంతంలోని కీలక నగరాలను లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడి, 2014 నుంచి కొనసాగుతున్న సంఘర్షణను తీవ్రతరం చేసింది. నాటో, యూరోపియన్ యూనియన్‌తో ఉక్రెయిన్ సన్నిహితంగా ఉండకుండా నిరోధించడం, ఆ దేశంపై రష్యా నియంత్రణను పూర్తి స్థాయిలో స్థాపించడం అనే భౌగోళిక, రాజకీయ లక్ష్యాలు ఆ దాడి వెనుక ఉన్నాయి. ఉక్రెయిన్ లాంటి ఒక చిన్న దేశం పొరుగున ఉన్న ఒక అగ్రరాజ్యంతో తలపడటంలో (అమెరికా, ఐరోపా దేశాల మద్దతుతోనే అయినప్పటికీ) ఆ చిన్న దేశ ప్రజలు, మేధావుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవలేదు. ఇందుకు బలమైన కారణాలు తప్పక ఉంటాయి. ఈ కోణంలో చరిత్ర విలోకిస్తే ఉక్రెయిన్, రష్యాల మధ్య శతాబ్దాల ప్రగాఢ సంబంధాలు ఉన్నాయి. సాంస్కృతిక, రాజకీయ సంబంధాలూ బలంగానే ఉండేవి. అదే సందర్భంలో విభేదాలు, హింసతో కూడిన సంఘటనలు చాలానే ఉన్నాయి.
ఉక్రెయిన్ 18, 19 శతాబ్దాలలో రష్యన్ సామ్రాజ్యంలో భాగమైంది. రష్యనీకరణ విధానాలు ఉక్రెయిన్ భాష, సంస్కృతుల గుర్తింపును అణచివేశాయి. రష్యన్ విప్లవం తర్వాత ఉక్రెయిన్ స్వల్పకాలం (1917–20) స్వతంత్ర దేశంగా వర్ధిల్లింది. ఆ తరువాత సోవియట్ యూనియన్‌లో బలవంతంగా చేర్చబడింది. జోసెఫ్ స్టాలిన్ హయాం (1924–53)లో ఉక్రెయిన్‌పై కఠిన విధానాలు అమలు చేశారు. జార్ చక్రవర్తుల వలే స్టాలిన్ కూడా ఉక్రెయిన్‌ను సోవియట్ నియంత్రణలో ఉంచడానికి, రష్యనీకరణను ప్రోత్సహించడానికి శతథా ప్రయత్నించారు. ఉక్రెయిన్ సంస్కృతి, భాష, జాతీయ గుర్తింపును అణచివేశారు. మొదటి నుంచి ఉక్రెయిన్ ప్రజలలో జాతీయవాద చైతన్యం బలంగా ఉంది. ఈ విషయాన్ని నొక్కి చెప్పేందుకు Anne Applebaum (పోలిష్–అమెరికన్ జర్నలిస్ట్, చరిత్రవేత్త) తన రచన ‘Red Famine: Stalin’s War on Ukraine’ ఒక కవితను ఉటంకించారు: ‘నేను చనిపోయినప్పుడు / నన్ను నా ప్రియమైన ఉక్రెయిన్‌లో ఖననం చేయండి/ ఒక ఎత్తైన సమాధి కొండపై/ విశాలమైన సమతల భూమిలో/ అక్కడ నా కళ్లు చూడగలవు, నా చెవులు వినగలవు/ విశాలమైన పొలాలను, అపారమైన పచ్చిక బయళ్ళను/ డ్నీపర్ నది ఒడ్డును/ గర్జించే శక్తివంతమైన నది శబ్దాన్ని’.
1920ల చివరలో స్టాలిన్ నిర్బంధ సమిష్టి వ్యవసాయ వ్యవసాయ విధానాన్ని ప్రవేశపెట్టారు. రైతులు తమ వ్యక్తిగత భూములను వదులుకొని సోవియట్ నియంత్రిత సమిష్టి వ్యవసాయ క్షేత్రాలలో పనిచేయవలసి వచ్చింది. ఇందుకు వ్యతిరేకించిన రైతులను, ముఖ్యంగా ‘కులక్స్’ అని పిలిచే సంపన్న రైతులను వర్గ శత్రువులుగా చిత్రీకరించి, వారి భూములు, ఇతర ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. వేలాది రైతులను సైబీరియాకు బహిష్కరించారు. మేధావులు, రచయితలు, సమిష్టి వ్యవసాయ క్షేత్రాలను వ్యతిరేకించిన రాజకీయ నాయకులను సోవియట్ వ్యతిరేకులుగా ముద్రించి అరెస్టు చేశారు. చాలా మందిని హత్య చేశారు. సోవియట్ యూనియన్ పారిశ్రామికీకరణకు నిధులు సమకూర్చడానికి ఉక్రెయిన్ నుంచి భారీ మొత్తంలో ధాన్యాన్ని సేకరించారు, దీనివల్ల స్థానిక రైతులకు ఆహార కొరత ఏర్పడింది. 1932–33లో స్టాలిన్ విధానాల ఫలితంగా హోలోడోమోర్ (Holodomor) అనే భయంకరమైన కృత్రిమ కరువు ఉక్రెయిన్‌లో సంభవించింది. ‘హోలోడోమోర్ ‘అనే పదానికి ఉక్రెయిన్ భాషలో అర్థం ‘ఆకలితో చావు’ (death by hunger). ఇది 1932 నుంచి 1933 మధ్య సోవియట్ ఉక్రెయిన్‌లో సంభవించిన ఒక మహా కాటకం. ఈ విపత్తులో 35 నుంచి 50 లక్షల వరకు ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇది సహజ విపత్తు కాదని, జోసెఫ్ స్టాలిన్ నేతృత్వంలోని సోవియట్ పాలకుల విధానాల ఫలితంగా సృష్టించబడిన విపత్తుగా చరిత్ర గుర్తించింది. దీనిని కొంతమంది చరిత్రకారులు జాతి నిర్మూలన (genocide)గా ప్రకటించారు.
స్టాలిన్ ప్రవేశపెట్టిన సమిష్టి వ్యవసాయ విధానంవల్ల ఉత్పత్తి తగ్గినప్పటికీ, సోవియట్ అధికారులు అసాధారణంగా అధిక ధాన్య సేకరణ కోటాలను విధించారు. కోటాలను పరిపూర్తి చేయలేని గ్రామాల నుంచి ధాన్యాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. రైతులను ఆహారం లేకుండా వదిలేశారు. ఉక్రెయిన్ గ్రామాలను ‘బ్లాక్‌లిస్ట్’ చేసి, ఆహార సరఫరాను నిషేధించారు. ఈ కరువు ఉక్రెయిన్ జాతీయవాదాన్ని అణచివేయడానికి, సోవియట్ నియంత్రణను బలోపేతం చేయడానికి ఉద్దేశపూర్వకంగా ఉపయోగించబడిందని చరిత్రకారులు భావిస్తారు. ఈ కరువు వల్ల గ్రామాలు ఖాళీ అయ్యాయి. వేలాది కుటుంబాలు ఆకలితో మరణించాయి. ఉక్రెయిన్ సమాజంపై ఈ కరువు దీర్ఘకాలిక ప్రభావం చూపింది. ఉక్రెయిన్లలో రష్యాపై ద్వేషం, స్వీయ జాతీయతా చైతన్యం బలపడ్డాయి.
కరువు వల్ల ఆహారం దొరకక కొంతమంది ఉక్రెయిన్ ప్రజలు బతకడానికి నరమాంస భక్షణకు (canniba-lism) పాల్పడ్డారు. సోవియట్ పోలీసు ఆర్కైవ్‌లు ఆకలితో పిచ్చివాళ్లైన వ్యక్తుల వైనాలు, క్షుధార్తులు శవాలను తిన్న సందర్భాలను రికార్డు చేశాయి. కొంతమంది తమ సొంత పిల్లలను తిన్న సందర్భాలూ ఉన్నాయి! తమని తినేస్తారని పిల్లలు తల్లిదండ్రులనుంచి పారిపోయిన సంఘటనలు అనేకం ఉన్నాయి. Robert Conqest పుస్తకం ‘The Harvest of Sorrow: Soviet Collectivization and the Terror–Famine’, పైన ప్రస్తావించిన Anne Applebaum పుస్తకం ‘Red Famine: Stalin’s War on Ukraine’లో ఈ కృత్రిమ కాటకం వివరాలు విపులంగా ఉన్నాయి.
1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తర్వాత ఉక్రెయిన్ మళ్లీ స్వతంత్ర దేశంగా ప్రభవించింది. అయితే రష్యాతో సంబంధాలలో ఉద్రిక్తత కొనసాగుతూనే వచ్చింది. సరిహద్దు, ఇంధనం ఇత్యాది విషయాలలో వివాదాలు అపరిష్కృతంగానే ఉండిపోయాయి. ఈ నేపథ్యంలో 24 ఫిబ్రవరి 2022న ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయి దాడికి రష్యా ఉపక్రమించింది. ఈ యుద్ధంలో ఇప్పటికే లక్షలాది ప్రజలు మరణించారు, మరెన్నో లక్షల మంది నిరాశ్రయులు అయ్యారు. నగరాలకు నగరాలే ధ్వంసమయ్యాయి. రష్యా పశ్చిమ దేశాలను నిందిస్తోంది. యూరోపియన్ యూనియన్/నాటోతో ఉక్రెయిన్ తన సంబంధాలను కొనసాగిస్తోంది.
చారిత్రక దృష్టికోణం నుంచి పరిశీలిస్తే ఈ యుద్ధం ఒక లోతైన సమస్య. సోవియట్ యుగం తర్వాత ఏర్పడే రాజకీయ వ్యవస్థ ఎలా ఉండాలి, సమాజం ఎలా రూపుదిద్దుకోవాలి అనే అంశాలపై జరుగుతున్న పోరాటమిది. ప్రచ్ఛన్న యుద్ధానంతర కాలంలో ఏర్పడిన ఏకధ్రువ ప్రపంచ వ్యవస్థకు పుతిన్ విసిరిన సవాలులో భాగమే ఈ యుద్ధం. అందువల్ల, ఈ ఘర్షణకు పరిష్కారం కేవలం ఉక్రెయిన్ స్థానిక స్థాయిలో సాధ్యపడదు. అంతర్జాతీయ స్థాయిలో, విశాలమైన చట్రంలో మాత్రమే దీనికి పరిష్కారం సాధ్యమవుతుంది. ఉక్రెయిన్‌లో శాంతి నెలకొల్పడం అనేది స్థానికం కాదు, ప్రపంచ స్థాయిలో చర్చించాల్సిన అంశం. అయితే వర్తమాన సందర్భంలో అది సాధ్యమయ్యేలా లేదు. ఉక్రెయిన్ నాటో సభ్య దేశమైతే అనివార్యంగా రష్యాకు పక్కలో బల్లెం అవుతుందనేది వాస్తవం. అటువంటి పరిస్థితిని నివారించుకోవటం రష్యాకు అత్యవసరం. అమెరికాతో పాటు ఐరోపా దేశాలన్నీ రష్యాకు వ్యతిరేకంగానే ఉన్నాయి. సోవియట్ యూనియన్ కాలంలో రష్యా పాల్పడిన చారిత్రక తప్పిదాలు దాన్ని ఇప్పటికీ వెంటాడుతున్నాయి. ఐరోపా దేశాల అవకాశవాదంతో పాటు, రష్యా చారిత్రక తప్పిదాలు ఉక్రెయిన్‌కి శక్తినిస్తున్నాయి. జర్మన్ తాత్త్వికుడు నీషె అన్నట్లు When you look long into an abyss, the abyss also looks into you. అవకాశవాద శక్తులనుంచి వస్తున్న సహాయంతో ఉక్రెయిన్ నిలబడగలదా?
ప్రొ. బి.తిరుపతిరావు
ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం
ఈ వార్తలు కూడా చదవండి..
హీరో ఫిన్‌కార్ప్ రూ 260 కోట్ల సమీకరణ
మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..
For National News And Telugu News
Updated Date - Jun 19 , 2025 | 04:48 AM