ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Indian Judiciary: మురికితనం కరుకుతనం పాలైన మేధ

ABN, Publish Date - Nov 01 , 2025 | 06:47 AM

తొలి ప్రేమ నవ యవ్వన కాలాన్ని దాటదు. తరుణప్రాయంలో అంకురించిన మేధా ఆసక్తులు తాత్కాలికమైనవి కాక జీవితపర్యంతం వర్ధిల్లడం కద్దు.

తొలి ప్రేమ నవ యవ్వన కాలాన్ని దాటదు. తరుణప్రాయంలో అంకురించిన మేధా ఆసక్తులు తాత్కాలికమైనవి కాక జీవితపర్యంతం వర్ధిల్లడం కద్దు. అటవీ సామాజికుల చరిత్రకారునిగా నేను నా విద్వత్‌ వృత్తి జీవితానికి శ్రీకారం చుట్టాను. బ్రిటిష్‌ వలసపాలనలో మొరటుగా ధ్వంసమైన జీవితాలు వారివి. క్రమంగా నా ఆసక్తులు, పరిశోధనలు, రచనా వ్యాసంగాలు విభిన్న అంశాల వైపుగా వికసించాయి. అయినప్పటికీ నేను తొట్టతొలుత సాగుచేసిన మేధా క్షేత్రంతో నా అనుబంధాన్ని కొనసాగిస్తూ వస్తూన్నాను. నిజానికి గత వారం రోజులూ ఒక యువ పరిశోధకుడి డాక్టొరల్‌ థీసిస్‌ చదువుతూ గడిపాను. ఇప్పుడు జార్ఖండ్‌ రాష్ట్రంగా విలసిల్లుతున్న ప్రాంతాల సామాజిక, పర్యావరణ చరిత్రను శోధించిన సిద్ధాంత వ్యాసమది. అది నన్ను బాగా ప్రభావితం చేసింది. ఎంతగా అంటే ఈ కాలమ్‌లో దాని గురించి రాసి తీరాలనే బలీయమైన ప్రేరణను నాలో పాదుకొల్పింది. బ్రిటిష్‌ పాలనలో సింగ్‌భూమ్‌ ప్రాంతంలోని ఆదివాసీ సమాజంలో సంభవించిన పరివర్తనల పూర్వాపరాలను ఆ థీసిస్‌ విశ్లేషించింది. ఈస్టిండియా కంపెనీ క్రమంగా ఆ ప్రాంతంపై సైనిక, పాలనాపరమైన నియంత్రణను సాధించిన వైనాన్ని తొలుత వివరించింది. ఆ తరువాత ఆ ప్రాంత ప్రాకృతిక ఆవరణాన్ని, ఆర్థిక, రాజకీయ వ్యవస్థలను వలసపాలన ఎలా పునర్వ్యవస్థీకరించిందో పేర్కొంది. వలసపాలకుల అటవీ విధానం వ్యాపార ప్రయోజనాలకు ఇచ్చిన ఎనలేని ప్రాధాన్యం, కొత్త పాలకులతో సంప్రతింపుల బాధ్యతలు నిర్వర్తించే గ్రామ పెద్ద హోదాలో చోటు చేసుకున్న మార్పులు, తమ జీవితాలలో వలసపాలన తెస్తున్న మార్పులపట్ల ఆదివాసుల ప్రతిస్పందనలు మొదలైన అంశాలను ఆ థీసిస్‌ విపులంగా స్పృశించింది. పర్యావరణం, సమాజం, రాజకీయాలపై దృష్టిని కేంద్రీకరిస్తూ మేధా చరిత్రపై కూడా తగు శ్రద్ధ చూపిన అధ్యయనమది. సింగ్‌భూమ్‌ గిరిజనులపై యూరోపియన్‌ అధికారుల, భారతీయ మావన శాస్త్రవేత్తల మేధా కృషిని నిశితంగా విశ్లేషించింది. ఈ యువ చరిత్రకారుని పరిశోధనా కృషిలో ఆరు విశిష్ట వైదుష్య లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొదటిది– జార్ఖండ్‌, విశాల భారత ప్రాంతాల ఆదివాసుల జీవనరీతులపై గతించిన కాలంలో విఖ్యాతులు, విస్మృతులు వెలయించిన రచనలపై సమగ్ర సాధికారత; రెండోది– విస్తృత శ్రేణి ప్రాథమిక ఆధారాలను కనుగొని, ఉపయోగించుకున్న సమర్థత. జాతీయ, రాష్ట్ర, జిల్లా ఆర్కైవ్‌లలో లభించే సమాచారాన్ని ఈ పరిశోధకుడు కూలంకషంగా అధ్యయనం చేసిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.

అలాగే శతాధిక సంవత్సరాల క్రితం ప్రచురితమైన పుస్తకాలు, వ్యాసాలను కూడా విస్తృతంగా సంప్రతించాడు; మూడోది– పరిశోధిస్తున్న ప్రాంతంలో క్షేత్ర కృషి ద్వారా అనుబంధ జ్ఞానాన్ని సముపార్జించేందుకు సుముఖత. ‘ఒక చరిత్రకారుడికి మందమైన నోట్‌బుక్‌తో పాటు మందమైన బూట్లు కూడా అవసరం’ అన్న ఫ్రెంచ్‌ చరిత్రకారుడు మార్క్‌ బ్లాచ్‌ (1866–1944) సూక్తిని ఈ యువ విద్వజ్ఞుడు మనసా, కర్మణా పాటించాడు (గతాన్ని సమగ్రంగా, విశ్వసనీయంగా అర్థం చేసుకోవడానికి ప్రపంచంలో కఠినమైన, ఆచరణాత్మక పని; శ్రద్ధాయుతమైన, కఠిన మేధో ప్రయత్నం రెండూ అవసరమని మార్క్‌ బ్లాచ్‌ ప్రవచించారు); నాల్గవది– తన వాదనలకు మద్దతుగా ప్రాథమిక ఆధారాల నుంచి స్ఫుటమైన, భావస్ఫోరకమైన ఉటంకింపులపై పరిపూర్ణ శ్రద్ధ పెట్టాడు; ఐదవది– తన విశ్లేషణాత్మక అధ్యయనాలను స్పష్టమైన, సూటియైన, ఆకర్షణీయమైన వచనంలో రాశాడు. ఎక్కడా ప్రత్యేక పరిభాషను ఎక్కువగా ఉపయోగించలేదు; ఆరవది– బహుళ దృక్కోణాలను అంగీకరించే వివరణాత్మక విశ్లేషణ. వాదనల సూక్ష్మ విస్తరణ ప్రశస్తంగా ఉన్నది. వలసపాలనాయుగ అధికారులు, వర్తమాన ఆదివాసీహక్కుల కార్యకర్తలలో సాధారణంగా ద్యోతకమవుతుండే గతానుగతిక భావాలను ఈ యువ పరిశోధకుడు పునరుక్తం చేయలేదు. నాటి వలస పాలకులకు వ్యతిరేకంగా ప్రజ్వరిల్లిన ఆదివాసీ తిరుగుబాట్లు, ప్రస్తుత కాలపు ఆందోళనలు, ఉద్యమాల మధ్య ఉన్న ఘటనాత్మక సామ్యాలు, సూత్రబద్ధమైన సంబంధాలపై ఆలోచనాత్మక విమర్శలు చేశాడు.

తమ ప్రశాంత, సంప్రదాయబద్ధమైన జీవితాలలో ఆధునిక రాజ్య వ్యవస్థలు పురికొల్పిన అల్లకల్లోలానికి వ్యతిరేకంగా నాడు, నేడు ఆదివాసుల తిరుగుబాట్లను సుసంబంధంగా విశ్లేషించాడు. ఆసేతుహిమాచలం 500కు పైగా ఉన్న ఆదివాసీ సమూహాల జీవన రీతులలో విస్తారమైన వైవిధ్యాన్ని విస్మరించి సమస్త వనవాసీలను ఒక సజాతీయ సమాజంగా చిత్రించేందుకు గత కాలంలోనూ వర్తమానంలోనూ ప్రయత్నించిన రచనలలోని లోపాలను ఈ యువ మేధావి నిశితంగా విమర్శించాడు. తమ జీవనావరణాలలోకి రాజ్యవ్యవస్థల చొరబాట్లను ఆదివాసీలు ప్రతిఘటించిన తీరుతెన్నులను, కొంతమంది ఆదివాసీ పెద్దలు సొంత తెగ ప్రజలపై తమ ఆధిపత్యాన్ని పెంపొందించుకునేందుకు రాజ్యాధికారులతో కుమ్మక్కయిన వైనాలను ఈ చరిత్రకారుని సొంత పరిశోధన వివరించింది. గుణ విశేషాలు విస్తృతంగా ఉన్న ఈ థీసిస్‌లో లోపాలు, లొసుగులు లేకపోలేదు. తన అధ్యయనాలతో ప్రత్యక్ష సంబంధమున్న కొన్ని కీలక గౌణ ఆధారాలను సంప్రతించడాన్ని ఈ పరిశోధకుడు ఉపేక్షించాడు. భారతీయ మానవశాస్త్ర చరిత్రపై టీఎన్‌ మదన్‌ రచనలను ఉపయోగించుకోలేదు. జానపద గాథలు, మౌఖిక చరిత్రను మరింతగా ఉపయోగించుకుని ఉంటే పరిశోధన ఇంకా ప్రశస్తంగా ఉండేదని నేను భావిస్తున్నాను. ప్రాథమిక ఆధారాల నుంచి చేసిన ఉటంకింపులు కొన్ని సుదీర్ఘంగా ఉండి అసలు కథనాన్ని అనవసర ప్రాధాన్యాలకు మళ్లించాయి. అయినప్పటికీ నేను చదివిన భారతీయుల డాక్టొరల్‌ థీసిస్‌లలో ఇది చాలా ప్రతిభావంతమైనది. పరిపూర్ణమైన పరిశోధన, సందేహం లేదు.

ఇటువంటి ఉత్కృష్ట విద్వత్‌ ప్రమాణాలతో కూడిన థీసిస్‌ సాధారణంగా కొద్ది కాలంలోనే పుస్తకరూపంలో లోకం ముందుకు రావడం పరిపాటి. పర్యావరణ, సామాజిక చరిత్ర అధ్యయనంలో పథ నిర్దేశం చేసిన నందిని సుందర్‌ పుస్తకం ‘Subalterns and Sovereigns, మహేష్‌ రంగరాజన్‌ గ్రంథం ‘Fencing the Forest’ రెండిటి విషయంలోనూ థీసిస్‌ సమర్పణ, పుస్తక రూపంలో ప్రచురణకు మధ్య చాలా కొద్ది సంవత్సరాల వ్యవధి మాత్రమే ఉన్నది. ఇటీవలికాలంలో ప్రచురితమై, విశేష మేధా చర్చలకు ఆస్కారమైన భవానీ రామన్‌, ఆదిత్య బాలసుబ్రమణియన్‌, నిఖిల్‌ మేనన్‌, దిన్యార్‌ పటేల్‌ల చారిత్రక మోనోగ్రాఫ్‌లు కూడా డాక్టొరల్‌ థీసిస్‌గా ఆరంభమైనవే. ప్రస్తావిత పుస్తకాలు అన్నీ విద్వత్‌ ప్రపంచంలో విస్తృత అధ్యయనానికి నోచుకున్నాయి. మేధా చర్చలకు ప్రేరణ అయ్యాయి. నేను విపులంగా చర్చిస్తున్న థీసిస్‌ కూడా పుస్తక రూపంలో ప్రచురితమైతే నందినీ సుందర్‌, మహేశ్‌ రంగరాజన్‌ తదితరుల పుస్తకాల వలే విశేష ప్రశంసలకు పాత్రమవుతుందనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. విషాదమేమిటంటే నేను పేర్కొన్న థీసిస్‌ 2018లోనే న్యూఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయానికి సమర్పించడం జరిగింది. అయితే అది ఇప్పుటికీ పుస్తక రూపం పొందలేదు. ఎందుకని? ఆ పరిశోధకుడి పేరు ఉమర్‌ ఖలీద్‌ కావడమే, సందేహం లేదు. క్రూర రాజ్యవ్యవస్థకు సంకోచించే న్యాయవ్యవస్థ తోడవడంతో ప్రతిభావంతుడైన ఆ యువ చరిత్రకారుడు (నేను ఈ వ్యాసం రాస్తున్న సమయానికి) ఐదు సంవత్సరాలకు పైగా కారాగారంలో కునారిల్లుతున్నాడు. బెయిల్‌ మంజూరు చేయకపోవడమే కాదు. అసలు అతడిపై ఎటువంటి ప్రాథమిక అభియోగాలు కూడా మోపకుండా ఆ చైతన్యశీల చింతనాపరుడిని జైలు నిర్బంధంలో కొనసాగిస్తున్నారు! డాక్టర్‌ ఉమర్‌ ఖలీద్‌ను నేను ఎప్పుడూ కలుసుకోలేదు. ఆయనతో ఎన్నడూ సంభాషించలేదు. అయితే డిసెంబర్‌ 2019లో ఒక రోజున ఇరువురమూ ఒక వివక్షాపూరిత చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శనలలో పాల్గొన్నాము– ఆయన ఢిల్లీలో, నేను బెంగళూరులో.

మా జీవన ప్రస్థానాలు భిన్న పథాలలో ఉండడం పట్ల, అందుకు కారణాల విషయమై నేను అప్పుడప్పుడూ ఆశ్చర్యపోతుంటాను. నా పరిశోధనా కృషి, రచనా వ్యాసంగం నిరాటంకంగా కొనసాగడానికి, ఉమర్ కొనసాగించలేకపోవడానికి కారణం నా మొదటి పేరు ఉమర్‌ కాకుండా, రామచంద్ర కావడమేనా? స్వయంగా ఆధునిక భారతదేశ చరిత్రకారుడిని అయినందున ఈ కాలమ్‌లో డాక్టర్‌ ఉమర్‌ ఖలీద్‌ గురించి తెలియజేశాను. ఆయన విద్వత్‌ కృషి లోతు, విశాలత, ఉత్కృష్టతను అర్థం చేసుకుని ప్రశంసించగల స్థాయిలో ఉన్నందునే నేనీ వ్యాసాన్ని రాశాను. కాగా ఈ కాలమ్‌ను ముగిస్తూ నా మనసులోని మాటను చెప్పదలిచాను. తమ రాజకీయ యజమానుల ఆదేశాల మేరకు పోలీసులు ముందూ వెనుక చూడకుండా ఆలోచనారహితంగా మోపిన అవిశ్వసనీయ ఆరోపణలతో కారాగారాలలో కృశిస్తున్న అనేక మంది ఉత్తమ వ్యక్తులు, మానవీయ మేధాశీలురుల్లో డాక్టర్‌ ఉమర్‌ ఖలీద్‌ ఒకరు. ఈ భారతీయులలో కొంత మంది తమ తమ అధ్యయన క్షేత్రాలలో వినూత్న భావ పథాలను నిర్మించిన ఉత్కృష్టులు. తమ వ్యక్తిగత జీవితాలలోను, ఎంచుకున్న కార్యరంగంలోను అహింసా పద్ధతులకు, భారత రాజ్యాంగ సంస్థాపక విలువలకు సంపూర్ణంగా నిబద్ధమైన పలువురు సామాజిక సేవకుల, పౌర సమాజ క్రియాశీలుర జీవితాలు కూడా రాజ్య క్రౌర్యాన్ని చవిచూస్తున్నాయి. బహుళత్వ వాదం, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు కట్టుబడి ఉన్నందునే వారు నిరంకుశ పాలకులతో విబేధించి జైళ్లపాలయ్యారు. అటువంటి ఉదాత్తులు ఇంకా ఎంతో మంది వివిధ సమస్యల నెదుర్కొంటున్నారు. తోటి భారతీయులు అయిన ఈ సజ్జనులు, ముఖ్యంగా యువ మేధావులు మన గణతంత్ర రాజ్య సమున్నతికి అనితరసాధ్యమైన సేవలు అందించగల మంచి వయసులో ఉన్న కాలంలో చీకటి గుయ్యారాలు, మురికి కూపాలు, ఆరోగ్యకరం కాని పరిస్థితులకు నెలవులు అయిన కారాగారాలలో మగ్గిపోవలసిరావడం మానవతకు మచ్చ కాదా? ఇది దేశానికి మేలు చేస్తుందా? ఇప్పటికే చాలా సమయం మించిపోయింది. ఇంతవరకు నిరాకరిస్తూ వస్తోన్న న్యాయాన్ని ఆ మానవీయులకు సమకూర్చేందుకు మన న్యాయమూర్తులు ఇప్పటికైనా సాహసించాలి. సమాజ జీవితంలో సముదాత్త విలువలను పరిమళింపచేయాలి.

(వ్యాసకర్త చరిత్రకారుడు)

Updated Date - Nov 01 , 2025 | 06:52 AM