ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మోదీ హయాంలో ఆర్థిక వ్యవస్థ మెరుగుపడిందా

ABN, Publish Date - Jun 05 , 2025 | 01:24 AM

భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీకి ఎన్డీఏ పక్షాలు బాకాలు ఊదుతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థపై అసమగ్ర అంకెల గారడీతో గొప్పలు చెబుతున్నారు. ఇటీవల జరిగిన నీతిఆయోగ్‌ సమావేశంలో ప్రపంచంలోకెల్లా మన దేశ స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ) నాలుగవ స్థానానికి చేరిందని, త్వరలో...

భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీకి ఎన్డీఏ పక్షాలు బాకాలు ఊదుతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థపై అసమగ్ర అంకెల గారడీతో గొప్పలు చెబుతున్నారు. ఇటీవల జరిగిన నీతిఆయోగ్‌ సమావేశంలో ప్రపంచంలోకెల్లా మన దేశ స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ) నాలుగవ స్థానానికి చేరిందని, త్వరలో మూడవ స్థానానికి ఎగబాకుతుందని.. మోదీ పరిపాలనే ఈ దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ప్రధాన కారణమంటూ బీజేపీతోపాటు ఎన్డీఏ పక్ష నేతలు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మోదీకి భజన చేయడం అర్థరహితం. 2025 నాటికి జపాన్‌ జీడీపీ 4.186 ట్రిలియన్‌ డాలర్లు, భారత్‌ జీడీపీ 4.187 ట్రిలియన్‌ డాలర్లు. జపాన్‌ జనాభా 12 కోట్ల 30లక్షలు ఉండగా, భారత్‌ జనాభా దాదాపు 144 కోట్లు. జనాభా ఆధారంగా జపాన్‌ తలసరి ఆదాయం 39,350 డాలర్లు, అయితే భారత్‌ తలసరి ఆదాయం 2,880 డాలర్లు. దీన్ని మసిపూసి మారేడుకాయ చేసి మన దేశం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందినట్లుగా ఎన్డీఏ పక్షాలు చెప్పుకోవడం అవివేకం.

1987 వరకు చైనా, భారత్‌ ఆర్థిక వ్యవస్థలు సమాంతరంగా ఉన్నాయి. 1987లో చైనా ఆదాయం 0.27 ట్రిలియన్‌ డాలర్లుగా, భారత్‌ ఆర్థిక వ్యవస్థ సమానంగా ఉన్నది. 2025లో భారత్‌ జీడీపీ 4.19 ట్రిలియన్‌ డాలర్లు ఉంది. అంటే 0.27 ట్రిలియన్‌ డాలర్ల నుంచి 4.19కి ట్రిలియన్‌ డాలర్లకు మనం కాస్త ఎదిగాం. కానీ చైనా 0.27 ట్రిలియన్‌ డాలర్ల నుంచి 19.23 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. అంటే భారత్‌ కంటే నాలుగైదు రెట్లు అధికంగా చైనా ఆర్థిక వ్యవస్థ ఉంది. ప్రస్తుతం చైనా తలసరి ఆదాయం 13,687 డాలర్లు కాగా, భారత్‌ తలసరి ఆదాయం 2,880 డాలర్లు మాత్రమే. ఈ క్రమంలో జపాన్‌ కంటే జీడీపీలో కొద్దిగా భారత్‌ దాటింది, దీంతో ఆ తర్వాత జర్మనీని భారత్‌ దాటిపోతుందనే ప్రగల్భాలు పలుకుతున్నారు. మన దేశ ఆర్థిక వ్యవస్థను జపాన్‌తో కాదు, చైనాతో పోల్చుకోవాలి.

దేశంలో నరేంద్ర మోదీ అమలు చేస్తున్న ఆర్థిక విధానాలు కేవలం శత కోటీశ్వరులుకే మేలు చేయగా, పేదవర్గాలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఏడేళ్ళ కింద జపాన్‌లో శత కోటీశ్వరులు 45 మంది ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 39కి పడిపోయింది. అదే భారత్‌లో 2015లో శత కోటీశ్వరులు 97 మంది ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 210కి ఎగబాకింది. మోదీ శత కోటీశ్వర్లులను పెంచడంతో, భారత్‌లో జీడీపీ పేదల దరిచేరడం లేదు. భారత్‌లో ఒక శాతం జనాభా చేతిలో 40 శాతం సంపద ఉండగా, 50 శాతం మంది ఉన్న పేద వర్గాల చేతిలో కేవలం మూడు శాతం సంపద ఉంది. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలతో పేదలు పేదలుగానే ఉండగా, శత కోటీశ్వరులు మరింతగా పెరిగిపోతున్నారు.


2015లో మోదీ అధికారంలోకి వచ్చే నాటికి దేశానికి రూ.84లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. ఇందులో స్వదేశీ అప్పులు 47.38 లక్షల కోట్లు, విదేశీ అప్పులు 37.4లక్షల కోట్లు ఉంది. 2025 నాటికి అవి రూ.224 లక్షల కోట్లు అయ్యాయి. ఇందులో స్వదేశీ అప్పులు 166.57 లక్షల కోట్లు, విదేశీ అప్పులు 57.4లక్షల కోట్లకు పేరబెట్టి, దేశాన్ని పూర్తిగా మోదీ అప్పులపాల్జేశారు. మోదీ పగ్గాలు చేపట్టిన తరువాత అంతర్జాతీయ మార్కెట్‌లో మన రూపాయి విలువ మరింత దిగజారింది. ఆయన అధికారంలోకి రాక ముందు అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఇదే రూపాయి విలువ తగ్గుదల మీద బాబా రామ్‌దేవ్‌తో సహా బీజేపీ నేతలంతా నానా యాగీ చేశారు. మోదీ అధికారంలోకి వచ్చే నాటికి మార్కెట్‌లో డాలర్‌కు రూపాయి మారకం విలువ 60రూపాయలుగా ఉండగా, ప్రస్తుతం అది 86కు చేరింది. తాజా లెక్కల ప్రకారం ఆహార సూచికలో ప్రపంచ వ్యాప్తంగా 127 దేశాల్లో కెల్లా భారత్‌ 105 స్థానానికి పరిమితమైంది. మోదీ అధికారంలోకి వచ్చిన ఈ పదేళ్లల్లో మన దేశ ఆకలి సూచీ స్కోరు 28.2 నుంచి 27.38కి మారింది. అదే కాలంలో పాకిస్థాన్‌ స్కోరు 29.8 నుంచి 27.98కి తగ్గింది. దేశ తలసరి ఆదాయం చూస్తే భారత్‌ 136వ స్థానంలో ఉంది. దివాళా తీసిన శ్రీలంక 133వ స్థానంలో ఉంది.

2014లో మోదీ ఇచ్చిన ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేకపోయారు. రైతుల సమస్యల్ని పరిష్కరించకపోవడంతో వారి ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. మద్దతు ధర పెంచకపోవడంతో రైతులు అప్పుల పాలయ్యారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తానని యువతను నమ్మించి, అధికారంలోకి వచ్చాక మోదీ మోసగించారు. విదేశాల్లో ఉన్న బ్లాక్‌ మనీని వెనక్కి రప్పిస్తానని చెప్పినా, ఇప్పుడు దాని ఊసే ఎత్తడం లేదు. బ్లాక్‌మనీ అరికట్టడానికి పెద్ద నోట్ల రద్దు డ్రామాలాడారు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన హామీల అమలు ఊసే లేదు. దేశంలో మౌలిక సౌకర్యాలు కల్పించలేదు. ధరల్ని నియంత్రించలేదు. పైపెచ్చు సమాజంలో చీలికలు తెచ్చారు. కుల, మతాల మధ్య చిచ్చు రగిలించారు. మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అవేమీ గుర్తించకుండా అంకెల గారడీతో జపాన్‌తో పోల్చుతూ, మన దేశం ముందుకు పోతున్నదన్న భ్రమలకు తెరలేపారు. మోదీకి, ఎన్డీఏ కూటమికి చిత్తశుద్ధి ఉంటే భారత్‌ ఆర్థిక వ్యవస్థను జపాన్‌తో కాకుండా చైనాతో పోటీపడే లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి.

కె. రామకృష్ణ

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్‌

For AndhraPradesh News And Telugu News

Updated Date - Jun 05 , 2025 | 01:24 AM