COP30: ఆచరణకు సంకల్పం
ABN, Publish Date - Nov 11 , 2025 | 12:38 AM
వాతావరణ మార్పుపై మానవ పోరాటానికి ఉద్దేశించిన సభ్యదేశాల మహాసదస్సు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ కాప్ సోమవారం బ్రెజిల్‌లో ఆరంభమైంది...
వాతావరణ మార్పుపై మానవ పోరాటానికి ఉద్దేశించిన సభ్యదేశాల మహాసదస్సు (కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్–కాప్) సోమవారం బ్రెజిల్‌లో ఆరంభమైంది. ఈ ఏడాది సదస్సును ‘ఇంప్లిమెంటేషన్ కాప్’ అంటున్నారు. అంటే హామీలకు పరిమితం కాకుండా, ఈ 30వ సదస్సులో ఆచరణకు కట్టుబడాలన్నది సంకల్పం. దేశాధినేతలు, పారిశ్రామికవేత్తలు, పర్యావరణప్రేమికులు, ఉద్యమకారులు, చమురు లాబీయిస్టులు, మరోపక్క మండుటెండలకు మాడి, వర్షాలూ వరదలకు ములిగిపోతున్న దేశాలనుంచి వచ్చే నిరసనకారులతో రాబోయే పదిరోజులూ బ్రెజిల్ కళకళలాడబోతోంది. ముప్పై కీలకమైన అంశాల్లో ముందడుగువేయాలని ఈ సదస్సు సంకల్పించింది. వేడెక్కుతున్న ధరిత్రిని ‘కాప్’ కాపాడుతుందని, మనిషి పట్ల ప్రేమతో అతని మనుగడకోసం నిర్దిష్టమైన నిర్ణయాలు తీసుకుంటుందన్న ఆశ నిజానికి గత ఏడాది మరింత తగ్గిపోయింది. అజర్‌బైజాన్ రాజధానిలో 29వ సదస్సు ఆరంభానికి కొద్దిరోజుల ముందే అమెరికా అధ్యక్షుడుగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యారు. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పు ఇత్యాది పదజాలానికి బద్ధవ్యతిరేకి అయిన ట్రంప్ అధికారంలో ఉన్నన్నాళ్ళూ ధరిత్రికి రక్షణ ఉండదని అందరికీ అర్థమైపోయింది. డ్రిల్ బేబీ డ్రిల్ అన్న ఒక్కమాటతో శిలాజ ఇంధనాలు తవ్విపోయడమే తన ఎజెండా అని స్పష్టంచేసిన ట్రంప్ ఏలుబడిలో ఈ ఏడాది సదస్సుకు అమెరికా ఏకంగా గైర్హాజరైంది. గతంలో మాదిరిగా మాటమార్చడమో, తప్పడమో కాదు, ఏకంగా సదస్సునే కాదనడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి. గత ఏడాది సదస్సుకు ‘ఫైనాన్స్ కాప్’ అని నామకరణం చేసుకోవడంలో ప్రధానోద్దేశం, వాతావరణంలో ప్రతికూల మార్పులమీద పోరాడేందుకు వర్థమానదేశాలకు ధనికదేశాలు అందించే ఆర్థికసాయాన్ని అధికం చేయడం. ఇప్పుడు ట్రంప్ బాయ్‌కాట్‌తో ఆ మొత్తానికి పెద్ద ఎత్తున గండం వచ్చిపడినట్టు లెక్క. ఈ సదస్సులో కొత్త తీర్మానాలు, హామీలు వద్దనీ, అనుకున్నదానిని అమలు చేయడం గురించి మాత్రమే ఆలోచించాలని బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డ సిల్వా అంటున్నారు.
ఈ సదస్సు పరిష్కారాల గురించి మాత్రమే మాట్లాడుతుందని ఆయన నమ్మకం. గ్లోబల్ వార్మింగ్ ఒకటిన్నర డిగ్రీలు దాటనివ్వకూడదని పారిస్ ఒప్పందంలో దేశాలన్నీ నిర్దేశించుకున్నాయి. అయినా కూడా, ఇప్పుడది రెండున్నర డిగ్రీల సెల్సియస్ వరకూ రికార్డవుతోంది. కర్బన ఉద్గారాలను తగ్గించుకుంటామని ఇచ్చిన హామీని ప్రపంచదేశాలు నిలబెట్టుకోకపోతే, లక్ష్మణరేఖంటూ దాటిన తరువాత కాలువెనక్కుతీసుకోవడం కూడా కష్టమైపోతుందని ప్రపంచస్థాయి సంస్థలు, నివేదికలు అనేకం హెచ్చరిస్తున్నాయి. ఈ కారణంగానే, ఐక్యరాజ్యసమితి అధినేత కూడా ముమ్మారు ‘ఆచరణ...ఆచరణ..ఆచరణ’ అంటూ సదస్సు లక్ష్యాన్ని నొక్కిచెబుతున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు నిధులు సమకూర్చడం, నష్టాలను భర్తీచేయడం, ఉద్గారాలను నియంత్రించుకోవడం వంటి పలు అంశాల్లో 2023దుబాయ్ సదస్సులో అడుగులు బాగాపడ్డాయి. మూడుదశాబ్దాల కాప్ సదస్సుల చరిత్రలో శిలాజ ఇంధనాలు అన్న పదం సంయుక్త ప్రకటనలో చేరడం అదే తొలిసారి. భూ ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయడానికి వీలుగా కర్బన ఉద్గారాలను వేగంగా తగ్గించుకొని, 2050కల్లా తటస్థత సాధించాలని ఆ సదస్సు నిర్ణయించింది. ఆ లక్ష్యానికి అనుగుణంగా విధానాలు రాసుకుంటానని అమెరికా కూడా హామీ ఇచ్చింది. ఇక, వాతావరణమార్పుపై సమర్థ పోరాటానికి వీలుగా ఎదుగుతున్నదేశాలకు ధనికదేశాలు అందించాల్సిన సాయం 1.3 ట్రిలియన్ డాలర్లు ఉండాలన్నది అంచనా. దీనికి భిన్నంగా, పదేళ్ళపాటు ఏటా మూడువందల బిలియన్ డాలర్లు ఇవ్వడానికి మాత్రమే ధనికదేశాలు గత ఏడాది సిద్ధపడ్డాయి. ఉద్గారాల్లో డెబ్బయ్‌ఐదుశాతం వాటాతో ప్రకృతిని నాశనంచేస్తున్న సంపన్న దేశాలు విపత్తులనూ, పర్యవసానాలను మాత్రం పేదదేశాలమీద రుద్దుతున్నాయి. అధిక పారిశ్రామికీకరణతో, అవధులులేని ఉత్పత్తితో లాభపడుతున్న సంపన్నదేశాల నుంచి ఆర్థికసాయంతో పాటు, పర్యావరణ అనుకూల సాంకేతిపరిజ్ఞానాలను కూడా ఉచితంగానో, చవుకగానో వర్థమానదేశాలు పొందవలసి ఉంటుంది. అయితే, ప్రపంచంలో అత్యంత ధనికదేశం, రెండవ అతిపెద్ద కాలుష్యకారక దేశమైన అమెరికా ఈ సదస్సుకు గైర్హాజరై మానవాళి సంఘటిత పోరాటాన్ని దెబ్బతీసింది. అమెరికాను వదిలిపెట్టి, ఈయూ, చైనా, భారత్ వంటివి ‘కాప్’ ఆశయాన్ని నెరవేర్చేందుకు కృషిచేయాలి.
Updated Date - Nov 11 , 2025 | 12:38 AM