ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

తరాల వలస వేదనతో ‘గిర్మిటియా’ కవిత్వం

ABN, Publish Date - Mar 17 , 2025 | 12:23 AM

బ్రిటిష్ ఆక్రమిత ప్రాంతాల్లో బానిసత్వాన్ని రద్దూ చేస్తూ బ్రిటన్‌ పార్లమెంట్‌ 18౩3లో చట్టాన్ని తీసుకురావడంతో ప్రత్యామ్నాయాల వేట మొదలైంది. భారత దేశంలోని బ్రిటిష్‌ ప్రభుత్వం తన వలస...

బ్రిటిష్ ఆక్రమిత ప్రాంతాల్లో బానిసత్వాన్ని రద్దూ చేస్తూ బ్రిటన్‌ పార్లమెంట్‌ 18౩3లో చట్టాన్ని తీసుకురావడంతో ప్రత్యామ్నాయాల వేట మొదలైంది. భారత దేశంలోని బ్రిటిష్‌ ప్రభుత్వం తన వలస పాలనలో ఉన్న ఇతర దేశా లకు భారతీయులను ఒప్పంద కార్మికులుగా ఎగుమతి చేయటం ప్రారంభించింది. తమ పాలనలో నాలుగు వేర్వేరు ఖండాల్లో ఉన్న పలు దేశాలకు– అక్కడి చక్కెర, రబ్బరు, తేయాకు, కోకో తోటలలో పనిచేయడానికి– 13 లక్షల మంది భారతీయ ఒప్పంద కార్మికులను హిందూ మహా సముద్రం మీదుగా పంపించింది. ఆయా దేశాల తోటల్లో ఐదు నుంచి పదేళ్ళ పాటు పనిచేయడానికి భారతీయులు తెలిసో తెలియకో చేసుకున్న రాతపూర్వక ఒప్పందాన్ని ‘గిర్మిట్’ అన్నారు (ఇది ‘అగ్రిమెంట్‌’ అన్న పదానికి భ్రష్ట రూపం).

భారత దేశం నుంచి ఇలా ఇతర బ్రిటిష్‌ పాలిత దేశాలకు వలస వెళ్లిన ఒప్పంద కార్మికులు పాడుకున్న జానపద గీతాల నుంచి, వారి వారసులు తమ పూర్వీకుల గురించి తెలుసుకున్న లేదా దర్శించిన జీవితానుభవాల నుంచి పుట్టినది ‘గిర్మిటియా’ కవిత్వం. ఈ కవిత్వంలో ఆవేదనా ఆక్రోశం ఉంది. పూర్వీకుల పట్ల గౌరవమూ ఉంది.


‘‘మేము కలకత్తా చేరాక మా కష్టాలు పెరిగాయి/ మా అందమైన బట్టలన్నీ తీయించేసారు/ జపమాల పూసలు, యజ్ఞోపవీతాలూ/ బెంగాలీ గుడ్డలే మమ్మల్ని అలంకరించాయి/ సాధువుల తలవెంట్రుకలు గొరిగేయబడ్డాయి/ సాధువులు, దొమ్మర్లు, చర్మకారులు, ఇంకా దళితులు/ అందరినీ ఒకే గదిలో పడేశారు’’ – అని ఈ ఒప్పంద కార్మికులను ఓడల్లో ఎక్కించే ముందు వారికి ఎదురైన అనుభవాల గురించి రాస్తాడు బ్రిటిష్ గయానాకు చెందిన వతుక్ వేద ప్రకాశ్.

‘‘గోదాంలో కాగితం చేతిలో పెట్టారు/ పర్యవసానాలు తెలియక/ దానిమీద వేలుముద్ర పెట్టాను/ చీకటి సంద్రాన్ని ఎలా దాటగలమని/ గొణుక్కుంటూ ఏడ్చుకుంటూ తెరచాపల పడవ మీద/ ఆశ్చర్యంలో కూరుకుపోయాను,’’ అని ఓడ ఎక్కిన తరువాత ఒక భారతీయ కార్మికురాలు వాపోయింది. ‘‘అపారమైన సముద్ర ప్రయాణంలో భారతదేశం వెనక్కు మళ్లుతోంది, ఇప్పుడు నీరు తప్ప దిగంతం లేదు, నీరు, నీరు, నీరు తప్ప మరేమీ లేదు...’’ అని ట్రినిడాడ్ టొబాగో ప్రఖ్యాత కవయిత్రి రామాబాయి ఎస్పినెట్ దుఃఖించింది. పేదరికం, బాగుపడతామన్న ఆశలే ఎక్కడైనా వలసలకు ముఖ్య కారణాలు.

‘‘వాళ్లు/ ఓడల గుంపులో వచ్చారు/ మందలా వచ్చారు/ పశువుల్లా/ గోధుమరంగు పశువుల్లా/ కళ్లు నిర్మలంగా, పశువుల్లా... చస్తూ అందరూ/ ఒకేరీతిగా వచ్చారు వాళ్లు.. అందరూ ఒకేరీతిని/ నల్ల సముద్రాన్ని దాటుకుంటూ/ బ్రాహ్మణులు, చర్మకారులూ ఒకేలా’’ అని బ్రిటీష్ గయానా ప్రముఖ కవయిత్రి మహదాయ్ చెప్పుకుంది.


వలసదారులకు వాగ్దానం చేయబడ్డ భూమిలో ఎదురైన కొత్త జీవిత వాస్తవాలు వారికున్న ఆదర్శవాద కల్పనల్ని తొందరగా పంటాపంచలు చేసాయి. ‘‘మారిషస్ దీవి పేరు వినగానే../ బంగారం వెతుక్కోవచ్చని ఇక్కడికి వచ్చాం/ బదులుగా వెదురుబెత్తం దెబ్బలు తిన్నాం/ కూలీల వెనుక చర్మం ఒలిచిందది/ చెరకు తీయడానికి గానుగెద్దులమయ్యాం/ అయ్యో! కూలీలుగా మారడానికా మన దేశం విడిచిపెట్టాం’’ – అని అక్కడకు చేరుకున్నాక మొత్తుకున్నారు.

‘‘చిన్న తప్పులకే సర్దార్లు కొరడా ఝుళిపించే వారు. విపరీతమైన ఎండలున్నా, వర్షం వచ్చినా, ఉరుములొచ్చినా పని చేయాల్సిందే.’’ – అని అక్కడ బాధితులు చెప్పుకున్నారు. కొన్నిసార్లు వారి బాధల కథలు వినడానికి ఎవరూ ఉండరు. చెరకు మొక్కలు మాత్రమే సాక్షులు: ‘‘కత్తులూ కొడవళ్లతో/ పగలూ రాత్రులూ గడుస్తున్నాయి ఇపుడు/ ఆకుపచ్చని చెరకు ఆకులకు తెలుసు/ మా అన్ని కష్టాలూ’’ అని తోటల్లో పనిచేస్తున్న మహిళ చెప్తుంది. పని స్థలాల్లోనే కాదు, ఇళ్లల్లో సైతం దుర్భర జీవన పరిస్థితులు వారిని వేధించేవి: ‘‘ఆరడుగుల వెడల్పు/ ఎనిమిదడుగుల పొడవు గదిలోనే/ అన్ని సౌఖ్యాలూ/ అందులోనే కొడవళ్లు పనిముట్లు/ అదే సొంత ఇల్లు/ అందులోనే వంటచెరకు/ రుబ్బురోలు పొయ్యి కూడా/ అందులోనే మా పడక’’. భారతదేశం నుండి ఆర్కటీలు అని పిలవబడే దళారీలు, భవిష్యత్తును గురించి తప్పుడు వాగ్దానాలతో చాలామంది మహిళలకు ఎర వేసేవారు. తమను తప్పుదారి పట్టించిన ఆ దళారీలను గుర్తుతెచ్చుకుని మహిళలు తిట్టుకుంటూ ఉండేవారు: ‘‘ప్రేమికుడ్ని వదిలేసి/ దేశం నుండి పారిపోయి వచ్చాను/ నాకు పెళ్లి కాకుండా చేసిన/ ఆ చేర్పించినవాడు తప్పకుండా చావాలి.’’


భర్తలు ఒప్పంద కార్మికులుగా విదేశం వెళ్ళాక వెనకే మిగిలి పోయిన భార్యల వేదనలు నమోదు చేసిన కవితలూ ఉన్నాయి. ‘‘నా స్నేహితురాళ్లందరూ తల్లులయారు/ నేను ఒంటరిగా మిగిలిపోయాను బిడ్డలు లేకుండా/ మళ్లీ మళ్లీ వేడుకున్నాను నిన్ను వెళ్లొద్దని/ అక్కడ ఉన్న స్త్రీ, నీ హృదయాన్ని జయిస్తుందని/ పన్నెండేళ్లూ ఒక్క ముక్కయినా రాయలేదు నువ్వు/ చైత్రమాసపు రోజుల్ని నేను ఎలా గడపాలి?’’ అని కడపలో చాకలి భార్య ఆవేదన చెందింది.

ఒక సురినామ్ కవి జిత నారాయణ్ ఇలా రాస్తాడు: ‘‘తేనెలో చిక్కుకున్న ఈగలా మేము బానిసలమయాం/ నా కాళ్లు భూమిని దున్నుతున్నాయి/ నా చేతులు విత్తనాల్ని నాటుతున్నాయి.’’ వలసదారులలో సామాజిక సోపానక్రమాలు, ఆచారాల ప్రత్యేకతల స్థాయి నుంచి, అందరినీ ‘కూలీల’ స్థితికీ స్థాయికీ తగ్గించాయి. కొందరు నిరసన తెలిపారు. ‘‘మమ్మల్ని కూలీ అని ఎందుకు పిలవాలి?/ మేము ఋషుల, సాధువుల వంశాలలో పుట్టిన వాళ్లం?’’ అని ట్రినిడాడ్‌ కవి రాస్తాడు.


‘‘ఆకాశంలో సూర్యుడి వైపు చూడు ఎలా స్థిరంగా ఉందో యజమాని కన్నులాగ/ కొబ్బరిచెట్టు కావిలి కాస్తుంది పైనుండి విచారణచేసేవాడిలా/ మా కన్నెల తలలమీద దాని బరువు పడేస్తానని బెదిరిస్తూ’’ అని ప్రముఖ గయానా కవి డేవిడ్ డాబిడీన్ చెప్పుకుంటే, ‘‘మా అమ్మని కనుగొన లేకపోయాను/ మా నాన్ననీ కనుగొన లేకపోయాను/ డోలు వాయింపూ వినబడలేదు నేను ఎవరి పూర్వీకుడ్ని?’’ అని దక్షిణాఫ్రికా కవి కామౌ బ్రాథ్వైట్, తల్లిదండ్రుల్ని వెతుక్కున్నాడు. భారతదేశ విశాల చరిత్రలో ఈ గిర్మిట్ల చరిత్ర అప్పుడు గాని ఇప్పుడుగాని ఎవరూ అంతగా పట్టించుకోకపోవడం ఒక విషాదం.

ముకుంద రామారావు

99083 47273

ఈ వార్తలు కూడా చదవండి:

Diamond Ring Robbery: టాలీవుడ్ హీరోకి షాక్ ఇచ్చిన దొంగలు..

Namrata Shirodkar: మహేశ్ బాబు ఫౌండేషన్ ద్వారా గుండె ఆపరేషన్లు మరింత విస్తృతం: నమ్రత

Updated Date - Mar 17 , 2025 | 12:23 AM