గాంధీ నమ్మకాన్ని నిలబెట్టుకున్నామా
ABN, Publish Date - Jun 22 , 2025 | 01:19 AM
ఆయుధాల మీద, సైన్యం మీద ఆధారపడని స్వేచ్ఛాయుత భారతదేశం ఆవిష్కృతం అవుతుందని గాంధీ కలలు కన్నారు. కానీ, స్వాతంత్య్రానంతర భారతదేశం తన కలను నెరవేర్చదనే అనుమానం కూడా ఆయనకు ఉండేది. 1920లో గాంధీ ఇలా అన్నారు...
ఆయుధాల మీద, సైన్యం మీద ఆధారపడని స్వేచ్ఛాయుత భారతదేశం ఆవిష్కృతం అవుతుందని గాంధీ కలలు కన్నారు. కానీ, స్వాతంత్య్రానంతర భారతదేశం తన కలను నెరవేర్చదనే అనుమానం కూడా ఆయనకు ఉండేది. 1920లో గాంధీ ఇలా అన్నారు: ‘‘ప్రపంచంపట్ల భారతదేశానికి ఒక కర్తవ్యం ఉంది. ఈ దేశం యూరప్‌కు ఒక గుడ్డి నకలు కాదు. భారతదేశం ఆయుధ వాదాన్ని అంగీకరించిన రోజు నాకు పరీక్షా కాలం. ఆ రోజును ఎదుర్కోగలనని నమ్ముతున్నాను’’.
ఆ తర్వాత తొమ్మిదేళ్లకు ‘యంగ్ ఇండియా’ పత్రికలో ఇలా రాసారు: ‘‘భారతదేశం అహింసా మార్గంలో నిలబడితే, ఎప్పటికీ ఒక గొప్ప సైనిక శక్తి కావాలని కోరుకోదు. తన ఆత్మచైతన్యం స్వేచ్ఛాస్థాయికి ఎదిగితే, ప్రపంచం విలువలు మారుతాయి, యుద్ధ సామాగ్రి అంతా నిరుపయోగమౌతుంది. కానీ అదంతా నా పగటి కల. కానీ అహింసా మార్గంలో దేశం స్వేచ్ఛ సాధిస్తే అలాంటిది సాధ్యమే అనిపిస్తుంది’’.
ఏళ్ళు గడుస్తున్న కొద్దీ, రాజకీయ స్వాతంత్ర్యం దగ్గరవుతున్న కొద్దీ, కాంగ్రెస్ కానీ, ప్రజలు కానీ, రాజకీయ స్వాతంత్ర్యం తర్వాత కూడా అహింసా సూత్రాన్ని నిబద్ధతతో అంగీకరించరన్న విషయం గాంధీకి అర్థమవుతూ వచ్చింది. భారతదేశానికి వెంటనే స్వేచ్ఛ ఇచ్చే షరతు మీద రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్‌కు పూర్తి సహకారాన్ని కాంగ్రెస్ ప్రకటించినప్పుడు గాంధీ ఇలా అన్నారు: ‘‘నా మరణం ముందే నేను చావకూడదు. భారతదేశాన్ని సైనికచర్యకు నేను సంసిద్ధం చేయలేను. కాంగ్రెస్ శక్తివంతమైన సంస్థ అనే విషయంలో సందేహం లేదు. కానీ కాంగ్రెస్ అంటే మొత్తం భారతదేశం కాదు. కాంగ్రెస్‌కు సైన్యం లేకపోవచ్చు, కానీ అహింస అంటే నమ్మకం లేని వారికీ సైన్యం ఉండవచ్చు. కాంగ్రెస్ కూడా లొంగిపోతే, నిస్సైనిక మనస్తత్వానికి ప్రాతినిధ్యం వహించే వాళ్ళు ఉండరు. ఇది సంక్షిప్తంగా నా వాదన. కానీ కాంగ్రెసును ఒప్పించడంలో విఫలమయ్యాను’’.
1940 ఆగస్టులో గాంధీ ఇలా రాశారు: ‘‘సైనిక సంసిద్ధత గురించి మాట్లాడేటప్పుడు మనం బలమైన హింస ద్వారా ఇతరుల హింసను ఎదుర్కోవడం గురించి ఆలోచిస్తున్నాం. అలాంటి స్థితికి ఎన్నడైనా సిద్ధమైతే, భారతదేశం ప్రపంచ శాంతికి పెనుముప్పుగా మారుతుంది. మనం ఆ దారిని ఎంచుకున్నట్టయితే యూరోపియన్ దేశాలు ఎంచుకున్న దోపిడీ మార్గాన్ని మనం కూడా ఎంచుకోవాల్సి వస్తుంది’’.
సెప్టెంబర్ 2, 1946న ఏర్పడిన ప్రభుత్వంతో, నెహ్రూ ప్రధానమంత్రిగా, భారతీయుల చేతుల్లోకి దేశం వచ్చింది. కానీ సైనిక బడ్జెట్‌ను నిషేధించడం కానీ, తగ్గించడం కానీ జరగలేదు. అధికారికంగా స్వతంత్రం రాకముందు, సంధి దశలో, సైన్యం బలం పెరిగింది. రాబోయే కాలానికి సంకేతాలు కావచ్చు. గాంధీ తన ప్రజలు సైనిక మార్గం నుండి ప్రేమ మార్గం ఎంచుకోవాలని అనుకున్నాడు. వాళ్ళు ఎంచుకోకపోతే ‘‘అది దేశానికీ, ప్రపంచానికి మంచిది కాదు. దాని అర్థం స్వేచ్ఛకు వీడ్కోలు పలకడమే. అది సైనిక నియంతృత్వం కూడా కావచ్చు’’. సైనిక నియంతృత్వంలో స్వేచ్ఛ లేదు. తెల్ల సైనిక పాలన స్థానంలో గోధుమరంగు సైనిక పాలన కావాలని గొడవ చెయ్యడంలో అర్థమే లేదని స్వాతంత్ర్యానికి రెండు దశాబ్దాల ముందు గాంధీ ప్రకటించారు. ఎందుకంటే రెండవ దానిలో కూడా ప్రజలు అదే విధమైన, లేక ఇంకా అన్యాయమైన దోపిడీకి గురవుతారు.
రాజకీయ స్వాతంత్రం సాధించిన దేశంలో పెరుగుతున్న సైనిక ఖర్చును గాంధీ సమర్థించలేకపోయారు. తన దేశ ప్రజలకు సైనికీకరణ అక్కరలేదని ప్రకటించారు. ఆ ప్రకటనకు గాంధీ కట్టుబడ్డాడు కానీ ఇతరులు కట్టుబడలేదు. బలమైన సైన్యం అనే ఆలోచనను తన ప్రజలు వదులుకుంటారని ఆయన ఆశించారు. ఆ మార్గం ఎక్కడికీ దారి తీయదు. అందులో స్వేచ్ఛకు ఏమీ విలువ ఉండదు. 1947 సెప్టెంబర్‌లో ఒక శాస్త్రవేత్త గాంధీని ఒక ప్రశ్న అడిగాడు: యుద్ధ అవసరాలకోసం, ఆటంబాంబు కోసం భారత ప్రభుత్వం పరిశోధన చేయమంటే శాస్త్రవేత్తలు ఏం చేయాలి? ‘‘అలాంటి రాజ్యాన్ని పేరున్న ప్రతి శాస్త్రవేత్త మరణం వరకు ప్రతిఘటించాలి’’ అని గాంధీ తడుముకోకుండా జవాబు ఇచ్చారు.
అంతకు మునుపు జూలైలో గాంధీ మాట్లాడుతూ, భారతదేశం తన స్వార్థ విధానం ద్వారా ప్రపంచశాంతికి ముప్పుగా మారడం, తప్పుగా ప్రజాస్వామ్యంగా చలామణి అవుతున్న ఇంకొక జపాన్, జర్మనీ లాగా మారడం తాను చూడలేనని అన్నారు. ‘‘కాంగ్రెస్ అహింసా విధానానికి కట్టుబడినట్లైతే, అది సైనికత్వానికి మద్దతు తెలపదు. ప్రజలు నా మాట వినకుండా, సైనికీకరణకు మద్దతు తెలిపితే, అది పౌర సమాజాన్ని మింగేసి, సైనిక పాలనను కొనసాగించే అవకాశం ఉంది. ఆయుధాలు లేకుండా స్వేచ్ఛ సాధించిన జాతి, ఆయుధాలు లేకుండా స్వేచ్ఛను కాపాడుకోగలదు అని నమ్మాలి’’.
రాజకీయ స్వేచ్ఛ వచ్చింది, కానీ సైన్యం అలాగే ఉండిపోయింది. గాంధీకి దగ్గరగా తిరిగిన వాళ్ళుకూడా సైనిక కార్యక్రమాలకు మద్దతు తెలిపారు. ‘‘బ్రిటిష్ పాలనలో ఆయుధీకరణకు పెద్ద ఎత్తున పెడుతున్న ఖర్చుకు వ్యతిరేకంగా మన రాజనీతిజ్ఞులు రెండు దశాబ్దాలు నిరసన తెలిపారు. రాజకీయ బానిసత్వం నుండి స్వాతంత్ర్యం రాగానే, మన సైనిక ఖర్చు పెరిగింది, ఇంకా పెరిగే ప్రమాదం ఉంది, కానీ దీని గురించే మనం గర్విస్తున్నాం! దీనికి వ్యతిరేకంగా పెగిలే గొంతులు మన శాసనసభలలో వినిపించవు. అయినా, ఇది ఎంత పిచ్చి అయినా, పాశ్చాత్య అనుకరణ అయినప్పటికీ, 1915 నుండి నిరంతరంగా 32 ఏళ్ల పాటు, ఎంత అసమగ్రమైనా కానీ, అహింసా శిక్షణలో రాటుదేలిన భారతదేశం ఈ కరాళ నృత్యం నుండి బయటపడుతుందనే విశ్వాసం నాలో మెదులుతూనే ఉంటుంది’’.
గాంధీ పట్ల విశ్వాసంతో భారతదేశం ఆయనను అనుసరించలేదు. పరిస్థితులు మారినప్పుడు, అహింసా నిరసనను, ప్రేమ మార్గాన్ని సులభంగా వదులుకుంది. ఆ వదులుకోవడంలో భారతదేశం తన ఆత్మను, స్వేచ్ఛను అల్పమైన వాటికోసం వదలుకోవడం గాంధీ చూసాడు.
(1961లో నవజీవన్ ట్రస్ట్ ప్రచురించిన ‘గాంధీ ఫేసెస్ ది స్టార్మ్’ పుస్తకంలోని ‘మిలిటరీ రూల్ ఫర్ ఇండియా’ అధ్యాయానికి అనువాదం ఇది)
మూల రచన: జీన్ షార్ప్
తెలుగు అనువాదం: మురళి కర్ణం
ఈ వార్తలు కూడా చదవండి.
విదేశాల్లో ఉద్యోగాల పేరిట మోసం
ఈ నెలాఖరులోపు బకాయిలు చెల్లించాల్సిందే
Read Latest Telangana News and National News
Updated Date - Jun 22 , 2025 | 01:19 AM