ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Rama Chandramouli: భ్రమలు తొలగిన నైరాశ్యంలో వెలిగింది నా దీపశిఖ

ABN, Publish Date - Sep 22 , 2025 | 02:43 AM

1950 లో వరంగల్లులో జన్మించిన నేను జన్మతః కొంత సాహిత్య వారసత్వాన్ని కలిగి ఉన్నానని చిన్నప్పటి నుండీ అనుకునేవాణ్ణి. పాలకుర్తి సోమనాథుడు, బమ్మెర పోతన, వానమామలై వరదాచార్యుల నుండి నాకు వ్యక్తిగతంగా బాగా...

1950 లో వరంగల్లులో జన్మించిన నేను జన్మతః కొంత సాహిత్య వారసత్వాన్ని కలిగి ఉన్నానని చిన్నప్పటి నుండీ అనుకునేవాణ్ణి. పాలకుర్తి సోమనాథుడు, బమ్మెర పోతన, వానమామలై వరదాచార్యుల నుండి నాకు వ్యక్తిగతంగా బాగా పరిచయమున్న ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య, కోవెల సంపత్కుమారాచార్య, ప్రజాకవి కాళోజీ, పాములపర్తి సదాశివరావు, పత్రికా సంపాదకులు ఎం.ఎస్. ఆచార్య, తను రాసే ప్రతి అక్షరాన్నీ ఆచరిస్తూ జీవించే మహారచయిత వరవరరావు (నాకన్నా పదేళ్ళు పెద్ద), ప్రసిద్ధ నవలా రచయిత అంపశయ్య నవీన్... ఇత్యాదుల వైభవోపేతమైన ప్రేరణ (induction) నాలో చిన్ననాటినుండీ వాహకంలో విద్యుత్తులా ప్రవహించేది. కాళోజీ గురువుగారైన గార్లపాటి రాఘవ రెడ్డి గారి శిష్యరికంలో (మహబూబియా ఉన్నత పాఠశాలలో) తొమ్మిదవ తరగతి చదువుతున్నప్పుడు భాషా వ్యామోహంతో రాసిన నా మొట్టమొదటి కథ ‘సువర్ణ శతదళ పుష్పరహస్యం’ పిల్లల పత్రిక ‘చంద మామ’లో అచ్చయితే పొందిన పులకింత మహోద్విగ్నమైంది. కాని ఇరవై ఏళ్లు వచ్చేనాటికి ఇంజనీరింగ్ చేస్తూ ఎందుకో కవిత్వమే నా మాధ్యమమని తెలుసుకుని, ప్రయోజనకర సృజన తోనే అక్షరాన్ని సంధించాను. పుస్తకాన్ని అచ్చువేసుకోగల ఆర్థిక స్తోమత లేని స్థితిలో నా చిన్ననాటి మిత్రుడు రావుల గిరి సహకారంతో అతికష్టం మీద ఆగస్ట్, 1971లో వెలువరించిన నా మొదటి కవిత్వ పుస్తకం ‘దీపశిఖ’. ఇరవై ఏళ్ళ వయసులో అప్పుడే ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని ప్రభుత్వ పాలిటెక్నిక్, వరంగల్లులో డిమాన్‌స్ట్రేటర్‌గా చేరిన సంవత్సరమే మా కాలేజ్ ఆడిటోరియంలోనే ‘దీపశిఖ’ ఆవిష్కరణ జరిగింది. నాటి సభను అధ్యక్షించినవారు కళాప్రపూర్ణ నేరెళ్ళ వేణుమాధవ్, ఆవిష్కర్త ఆంధ్రప్రభ ఎడిటర్ పొత్తూరి వెంకటేశ్వర రావు, పుస్తక విశ్లేషణ కోవెల సుప్రసన్నాచార్య, ఎం.ఎస్. ఆచార్య, ఎడిటర్ జనధర్మ, విద్వాన్ టి.వి. సుబ్బారావు, ప్రసిద్ధ కథా రచయిత తులసి బాలకృష్ణ. ఆ పుస్తకంపై దాదాపు అన్ని పత్రికలూ, చాలా మంది మిత్రులూ పాజిటివ్‌గా స్పందించారు.

ఐతే ఇక్కడ అప్పటి ఆ పుస్తకం వెనుక నాటి నా అంతరంగ స్థితిని తెలియజేసుకోవలసిన అవసరముంది. బాల్యం నుండీ నన్ను నేను తెలుసుకుంటున్నప్పుడు క్రూరమైన హింసతో కూడిన తెలంగాణ సాయుధ పోరాటం, పోలీస్‌ యాక్షన్‌, కమ్యూనిస్ట్‌ యోధుల ఊచకోత... ఈ అతిభయంకరమైన పీడకల లాంటి గతం నా బాల్యాన్నీ, యవ్వనాన్నీ పూర్తిగా ఆక్రమించి మాయని గాయాన్ని మిగిల్చింది. భారత దేశంలో 1952 లో జరిగిన మొట్టమొదటి పార్లమెంటరీ ఎన్నికల ప్రహసనం నుండి ఇప్పటిదాకా జరుగుతూ వస్తున్నదంతా ‘ప్రజాస్వామ్యం’ పేరుతో జరుగుతున్న అతిపెద్ద దగా, మోసం, కంటితుడుపు చర్య. ఒక్క నాల్గయిదు లోకసభ ఎన్నికల తర్వాతే అసలు రంగు బయటపడి, పరాయి దోపిడీదారుల కంటే మన ఇంటిదొంగలే పరమ ప్రమాదకారులని తెలిసి ‘అంతా భ్రాంతియేనా’ అన్న నిస్సహాయ అంతర్మథనంలో కసితో రాసిన కవితల గుచ్ఛమే ఈ నా ‘దీపశిఖ’. నాకు ఆదర్శమూర్తియైన వరవరరావు తన ‘చలినెగళ్ళు’లో ఎంతో విశ్వాసంతో ఒక కవిత రాశాడు: ‘‘భళ్ళున తెల్లవారునింక భయంలేదు’’ అని. కాని ఇంకా తెల్లవారలేదు. ‘‘చలితెరలు తొలగి సూర్యుడు మిట్టమింటికి రావాలి’’ అని కూడా ఆకాంక్షించాడు వివి. కాని మిట్ట మింటికి సూర్యుడు ఇంకా రానేలేదు. కిష్కింధాకాండ ఇంకా జరుగుతూనే ఉంది. n

నా మొదటి పుస్తకం

రామా చంద్రమౌళి

ఇవి కూడా చదవండి..

దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్.. సిద్ధంగా ఉండాలని పోల్ అధికారులకు ఈసీ ఆదేశం

అరుణాచల్ ప్రదేశ్, త్రిపురలో మోదీ పర్యటన

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 22 , 2025 | 02:44 AM