ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Google data center: అతిశయోక్తులు, అవాస్తవాలు

ABN, Publish Date - Dec 02 , 2025 | 03:56 AM

విశాఖపట్టణంలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో గూగుల్ నిర్మిస్తున్న ఒక గిగావాట్‌ హైపర్‌ స్కేల్‌ ఏఐ డేటా సెంటర్‌, మౌలిక సదుపాయాల ప్రాజెక్టు ఏర్పాటు గురించి నవంబర్ 19న....

విశాఖపట్టణంలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో గూగుల్ నిర్మిస్తున్న ఒక గిగావాట్‌ హైపర్‌ స్కేల్‌ ఏఐ డేటా సెంటర్‌, మౌలిక సదుపాయాల ప్రాజెక్టు ఏర్పాటు గురించి నవంబర్ 19న ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన గుత్తా రోహిత్ వ్యాసంలో అనేక అతిశయోక్తులు, అవాస్తవాలు ఉన్నాయి. మొదటగా గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్టులో అదానీ, ఎయిర్‌టెల్ కేవలం సహాయకులే (ఎనేబ్లర్లు) కానీ భాగస్వాములు కాదు. డేటా సెంటర్ స్థాపనకు అవసరమైన నిర్మాణాలు, గ్రీన్ ఎనర్జీ, మౌలిక వసతుల కల్పన అదానీ గ్రూప్ ఏర్పాటు చేస్తే, సముద్ర గర్భ కేబుల్స్, అంతర్జాతీయ డేటా ట్రాన్సిట్, అంతర్జాల సదుపాయాలను ఎయిర్‌టెల్ సమకూరుస్తుంది. నిజానికి యూఎస్ఏలోని 50 రాష్ట్రాలలో 5,426 డేటా సెంటర్లు, చైనా, యూరోప్, సింగపూర్ తదితర దేశాలలో వందలాది డేటా సెంటర్లు ఉన్నాయి. భారతదేశంలో ప్రభుత్వ డిజిటల్ ఇండియా కార్యక్రమం, డేటా లోకలైజేషన్ విధానాలు, ఇంటర్నెట్ విస్తరణ, స్మార్ట్‌ఫోన్లు, ఈ–కామర్స్, డిజిటల్ సేవల విస్తరణ వల్ల డేటా ఉత్పత్తి పరిమాణం విపరీతంగా పెరిగి డేటా సెంటర్ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచ డేటాలో భారత్ 20శాతం ఉత్పత్తి చేస్తున్నా, ప్రపంచ డేటా సెంటర్ సామర్థ్యంలో దాని వాటా కేవలం మూడు శాతం మాత్రమే. మన డేటా వేరే దేశాల్లో ఉండకూడదని ఇటీవల ప్రభుత్వం విధించిన నిబంధన వల్ల మన దేశంలో డేటా సెంటర్ల ఏర్పాటు అనివార్యం అయ్యింది.

గూగుల్ అమెరికా వెలుపల ఇంత భారీ స్థాయి పెట్టుబడులతో భారతదేశంలో తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ హబ్ విశాఖలో ఏర్పాటు చేయడం సామాన్య విషయం కాదు. కేవలం డేటా సెంటర్ ఏర్పాటే కాకుండా సబ్ సీ కేబుల్, కేబుల్ లాండింగ్ స్టేషన్ ఏర్పాట్లపై దృష్టి పెట్టిన గూగుల్, కొత్త గ్లోబల్ సబ్ సీ కేబుల్ వ్యవస్థను విశాఖ డేటా సెంటర్‌తో అనుసంధానించడం ద్వారా విశాఖను గ్లోబల్ కనెక్టివిటీకి గేట్‌వేగా మార్చబోతోంది. ఇందువల్ల ఈ డేటా సెంటర్‌లో ప్రాసెస్ అయిన డేటా మొత్తం సబ్ సీ కేబుల్ ద్వారా నేరుగా సింగపూర్, మలేసియా, ఆస్ట్రేలియాతో సహా మరో 12 దేశాలకు లింక్ అవుతుంది.

డేటా సెంటర్లలో విద్యుత్, నీటి వినియోగం అధికంగా ఉంటుందనేది నిజం. అయితే గూగుల్ డేటా సెంటర్‌కు అవసరమయ్యే నీరు, విద్యుత్ సరఫరా చేయడం వల్ల విశాఖ నగరంపై ప్రభావం పడుతుందనేది పూర్తిగా అపోహే. డేటా సెంటర్ కోసం విశాఖపట్టణం మొత్తానికి రోజుకు అవసరమైన నీటిలో 11శాతం కావాలన్న వ్యాసకర్త అభిప్రాయం సత్యదూరం. పోలవరం నుంచి ప్రధాన ఎడమ కాలువ ద్వారా 2027 డిసెంబర్ నాటికి 24 టీఎంసీల నీరు విశాఖకు ఇవ్వాలని ప్రభుత్వ సంకల్పం. ఈ దిశలో పోలవరం పనులు వేగంగా జరుగుతుంటే, ఎడమ ప్రధాన కాలువ పనులు రెండు నెలల్లో పూర్తవుతాయి. కాబట్టి డేటా సెంటర్ నిర్మాణం పూర్తయ్యేనాటికి (2028) పోలవరం నీళ్లు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం వినియోగిస్తున్న సంప్రదాయ విధానాల్లో గూగుల్ డేటా సెంటర్ కోసం అత్యధికంగా 0.5 టీఎంసీల నీరు అవసరం అవుతుందని అంచనా. కానీ గూగుల్ ప్రస్తుతం అనుసరిస్తున్న నీటి స్ప్రేయింగ్ విధానాలు కాకుండా అత్యంత సమర్థమైన, ఆధునిక లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ వినియోగించడం వల్ల నీటి వినియోగం తగ్గడంతో పాటు విద్యుత్ వినియోగం కూడా 20శాతం తగ్గుతుంది. పోలవరం నుంచి మనం ఇవ్వబోయేది, గూగుల్ వాడుకునేది అర టీఎంసీ కన్నా తక్కువ నీరు మాత్రమే. ఎక్కువ నీరు అవసరమైతే డీశాలినేషన్ విధానం ద్వారా సముద్రపు నీటిని శుద్ధి చేసి వాడుకుంటారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారు. కాబట్టి ఏ విధంగా చూసినా నీటి లభ్యత పెద్ద సమస్య కానేకాదు.

రాష్ట్రంలో 2025 ఏప్రిల్ నాటికి స్థాపిత విద్యుత్ సామర్థ్యం 18,552.9 మె.వా (పునరుత్పాదక విద్యుత్ 9,419 మె.వా, థర్మల్ విద్యుత్ 7,655.50 మె.వా, జల విద్యుత్ 1,672.60 మె.వా) కాగా 2030 నాటికి 31,000 మె.వాట్లకు చేరుతాం. కాబట్టి డేటా సెంటర్‌కు అవసరమైన విద్యుత్ సరఫరా చేయడం సమస్య కాదు. అయితే గూగుల్ ‘‘మా డేటా సెంటర్ నిర్వహణకు కావలసిన విద్యుత్ అదానీ నిర్మించబోతున్న సొంత సౌరశక్తి ప్లాంట్ల ద్వారా తయారు చేసి గ్రిడ్‌కు అనుసంధానించుకుని వాడుకుంటాం, మీ విద్యుత్ అవసరం లేదు’’ అంటోంది. కాబట్టి రాష్ట్రానికి విద్యుత్ భారం దాదాపు ఉండదు.

ఐటీ కంపెనీల కంటే తక్కువ మంది ఉద్యోగులను డేటా సెంటర్లు నియమించుకున్నప్పటికీ సాధారణంగా అధిక వేతనాలు ఇస్తాయి. వర్జీనియా రాష్ట్ర ‘జాయింట్ లెజిస్లేటివ్ ఆడిట్, రివ్యూ కమిషన్ రిపోర్ట్’ డేటా సెంటర్ పరిశ్రమ వర్జీనియా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వార్షికంగా సుమారు 74,000 ఉద్యోగాలు, 5.5 బిలియన్ డాలర్ల శ్రామిక ఆదాయం, 9.1 బిలియన్ డాలర్ల స్థూల దేశీయ ఉత్పత్తి(జీడీపీ)ని అందిస్తున్నదని తెలియజేసింది. ఈ ఆర్థిక లాభాలలో చాలా భాగం డేటా సెంటర్ల నిరంతర కార్యకలాపాల కంటే ముందే నిర్మాణ దశ నుంచే వస్తాయి. కాబట్టి డేటా సెంటర్ వల్ల కేవలం వందల ఉద్యోగాలు వస్తాయనే వ్యాసకర్త భావన అసంబద్ధం. విశాఖ గూగుల్ హబ్‌ అత్యాధునిక ఏఐ మౌలిక సదుపాయాలు, డేటా సెంటర్‌ సామర్థ్యం, భారీ స్థాయి ఇంధన వనరులు, ఫైబర్‌ ఆప్టిక్‌ నెట్‌వర్క్‌లను ఒకేచోట సమన్వయపరచి విశాఖను కృత్రిమ మేధ పరివర్తన కేంద్రంగా నిలబెడుతుంది. డేటా సెంటర్లు సాధారణ కంప్యూటింగ్ నుంచి ఏఐ, మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్) వైపు మారడం వల్ల ఏఐ పరిశోధనలు, నిర్వహణ, అనుభవం ఉన్న టెక్ నిపుణుల అవసరం చాలా ఎక్కువ. ఏఐ ఇంజినీరింగ్, సైబర్ భద్రత, క్లౌడ్ ఆర్కిటెక్చర్, డేటా మానిటరింగ్, జీపీయూ క్లస్టర్ నిర్వహణ, సబ్ సీ కేబుల్ లాండింగ్ స్టేషన్ కూడా ఉండటం వల్ల కేబుల్ నిర్వహణ కోసం కూడా ఉద్యోగుల అవసరం ఉంటుంది. అలాగే ఏఐ ఆధారిత స్టార్టప్స్, పరిశ్రమలకు విశాఖ కేంద్రంగా మారుతుంది.

పీఐబీ నివేదిక ప్రకారం గూగుల్ డేటా సెంటర్ వల్ల రాష్ట్రానికి అన్ని పన్నులు, ఇతరత్రా కలుపుకుని ఏటా రూ.10,588 కోట్ల ఆదాయం వస్తుంది. అంటే రాష్ట్ర ప్రస్తుత ఆదాయాన్ని అనుసరించి రాష్ట్రానికి గూగుల్ ‘ఒక నెల’ ఆదాయాన్ని ఇవ్వబోతోంది. గూగుల్ రాకతో కృత్రిమ మేధ కేంద్రంగా, ఆంధ్రప్రదేశ్‌లో విదేశీ పెట్టుబడులకు ముఖద్వారంగా విశాఖ నిస్సందేహంగా అభివృద్ధి చెందుతుంది.

-లింగమనేని శివరామప్రసాద్

సామాజిక విశ్లేషకులు

Updated Date - Dec 02 , 2025 | 03:56 AM