Exposing the Creamy Layer Conspiracy: క్రీమీలేయర్ కుట్రని ఛేదిద్దాం
ABN, Publish Date - Nov 30 , 2025 | 05:26 AM
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్ గవాయి ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో క్రీమీలేయర్ వర్తింపజేయాలనే అభిప్రాయాన్ని అదేపనిగా వ్యక్తపరుస్తున్నారు. గత ఏడాది దేవేందర్‌సింగ్ వర్సెస్...
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్ గవాయి ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో క్రీమీలేయర్ వర్తింపజేయాలనే అభిప్రాయాన్ని అదేపనిగా వ్యక్తపరుస్తున్నారు. గత ఏడాది దేవేందర్‌సింగ్ వర్సెస్ పంజాబ్ స్టేట్ గవర్నమెంటు కేసులో, ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో ఉన్న జస్టిస్ గవాయి ఎస్సీ, ఎస్టీ క్రీమీలేయర్ అమలు చేయాలని తీర్పు కూడా రాశారు. బీజేపీకి చెందిన ఎస్సీ, ఎస్టీ ఎంపీలు ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి ఎస్సీ, ఎస్టీలలో వర్గీకరణను అమలు చేయాలని, క్రీమీలేయర్ వద్దని విన్నవించారు. వర్గీకరణ అంశంలో క్రీమీలేయర్ అమలు కాదని ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. దీంతో, తీర్పులో క్రీమీలేయర్ అంశం మోదీ హామీతో కనుమరుగయింది. ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు చేసిన ఎస్సీ వర్గీకరణ చట్టంలో క్రీమీలేయర్ లేకుండా రెండు ప్రభుత్వాలు జాగ్రత్తపడ్డాయి. అయినా గవాయి పట్టువదలని విక్రమార్కుడిలాగా ప్రతివేదిక మీద క్రీమిలేయర్ మంత్రాన్ని జపిస్తున్నారు. రాజ్యాంగం అమలులోకి వచ్చిన 75 ఏళ్ళ తరువాత కూడా ఎస్సీ, ఎస్టీ, ఇతర ఉన్నతోద్యోగుల కుమారులకు రిజర్వేషన్లు అవసరం లేదని, వారినీ ఒక వ్యవసాయ కూలీ కుమారుడినీ ఒకేలా చూడటం సమంజసం కాదని, తరతరాలుగా కొన్ని కుటుంబాలవారే రిజర్వేషన్ల ఫలాలను అనుభవిస్తున్నారని అభియోగాలు మోపుతున్నారు. భారత పౌరసమాజం, రిజర్వేషన్ల వ్యతిరేకులు ఈ అభియోగాలకు మూక మద్దతు ఇస్తున్నారు.
న్యాయమూర్తిగా విశేష అనుభవం ఉన్న జస్టిస్ గవాయికి ‘క్రీమీలేయర్’’ విధానం అశాస్త్రీయం, రాజ్యాంగ వ్యతిరేకం అనే విషయం తెలియదనుకోవటం భ్రమ. ‘కోర్టు ముందున్న పత్రాల ఆధారంగా మా తీర్పులు ఉంటాయి’ అని చెప్పిన గవాయి, రాజ్యాంగ వ్యతిరేక క్రీమిలేయర్ గురించి ఎవరి ప్రయోజనాల కొరకు తన తీర్పులో రాశారు? ఇక్కడ ప్రామాణికం రాజ్యాంగ పత్రమా, స్వీయ అభిప్రాయమా? ఆలోచనలు, ఆశయాలు చెప్పటానికి పనికి వస్తాయి. వాస్తవ పరిస్థితులను అనుసరించే ఆచరణ ఉంటుంది. ఎస్సీ ఉద్యోగి తన సంతానాన్ని ఎలాంటి ప్రభుత్వ సహాయం లేకుండా తన జీతం డబ్బులతో చదివిస్తాడు. ఉద్యోగం లేని ఎస్సీ, ఎస్టీల సంతతికి ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూళ్ళు, ఉచితవిద్య, హాస్టళ్ళు, స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంటు, పోటీపరీక్షలకు ఉచితశిక్షణ అందిస్తుంది. రాజ్యాంగంలోని 16వ అధికరణ భారత పౌరులందరకూ ప్రభుత్వ ఉద్యోగాలలో నియామకాలకు సమాన అవకాశాలు కల్పించింది. ప్రభుత్వ ఉద్యోగానికి పోటీపడే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు విధిగా తమ సమూహంలో ప్రతిభను నిరూపించుకోవాల్సిందే. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు తమ సంతానాన్ని చదివించి పెళ్ళి చేసేంతవరకే పోషిస్తారు. వివాహం అనంతరం తన కుటుంబ భారం సదరు క్రీమిలేయర్ ఉద్యోగి కుమారుడే మోయాలి. తండ్రి ‘క్రీమీలేయర్’ అనే సాకుతో కుమారులకు జన్మతః లభించిన రిజర్వేషన్ హక్కును తొలగించటం సహజ న్యాయసూత్రాలకు, రాజ్యాంగ మూలసూత్రాలకు విరుద్ధం. క్రీమీలేయర్ ఐఏఎస్ అధికారులకు పదవీ విరమణ అనంతరం 80 వేల రూపాయల వరకూ పెన్షన్ లభిస్తుంది. క్రీమీలేయర్ కుమారులు రిజర్వేషన్ హక్కు కోల్పోయి, ఓపెన్ కేటగిరీలో ఉద్యోగం పొందే పరిస్థితి లేనప్పుడు వీరంతా 80 వేల పెన్షన్‌తో బతకటం సాధ్యమా?
ఈ ఏడాది మే నెలలో విడుదల చేసిన ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్’ గణాంకాల ప్రకారం దేశంలో ఎస్సీ ఐఏఎస్ అధికారులు 7.65శాతం, ఎస్టీ అధికారులు 3.80శాతం మాత్రమే ఉన్నారు. సెక్రటరీ హోదాలో 4.9శాతం మాత్రమే కొనసాగుతున్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగుల సంఖ్య 2 కోట్ల 15 లక్షలని గణాంకాలు తెలుపుతున్నాయి. దాని ప్రకారం ఎస్సీ ఉద్యోగులు 30 లక్షలమంది ఉండాలి. కానీ, 5 లక్షల 47 వేలమంది మాత్రమే ఉన్నారు. ఎస్సీల పట్ల పాలకవర్గాల వివక్షకు ఈ గణాంకాలు నిదర్శనం.
బీసీలలో మాదిరిగా ఎస్సీలలో కూడా ఎ, బి, సి, డి వర్గీకరణ అమలు చేయాలనే డిమాండ్‌తో సుప్రీంకోర్టు ఏకీభవించి తీర్పు ఇచ్చిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు వర్గీకరణను అమలు చేస్తున్నాయి. వర్గీకరణ వాదులు, వారి మద్దతుదారులు ఆశించినట్లుగా ఏ మేరకు అట్టడుగు వర్గాలకు రిజర్వేషన్ ఫలాలు అందుతాయో భవిష్యత్ తెలుపుతుంది. అయితే బీసీలలో 1992 నుంచి వర్గీకరణ, క్రీమీలేయర్ అమలవుతోంది. అనధికారిక సమాచారం ప్రకారం కేంద్ర జాబితాలలో 2,639 బీసీ కులాలున్నాయి. వీటిలో కేవలం 40 కులాలు మొత్తం రిజర్వేషన్‌లో 50 శాతం అవకాశాలు దక్కించుకున్నాయి. 994 కులాలు ఒక్క ఉద్యోగాన్ని, ఒక్క విద్యాసీటునూ పొందలేదు. 1400 కులాలకు ఒక శాతం కంటే తక్కువ ప్రాతినిధ్యం లభించింది. ఎస్సీ కులాలలో కూడా వర్గీకరణ, క్రీమీలేయర్ అమలు వలన మరింత దిగజారుడు ఫలితాలు మాత్రమే లభిస్తాయి. షెడ్యూలు కులాల పురోగతి అడ్డుకోవడానికి, అందుతున్న ఆ అరకొర అవకాశాలు కూడా దక్కకుండా చేయడానికి పాలకవర్గాలు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాయి. అందులో భాగంగా 1965 లోకూర్ కమిటీ మొదలు, నేటి వరకూ ఎస్సీల రిజర్వేషన్లు విచ్ఛిన్నం చేయటానికి వివిధ రాష్ట్రాలలో 11 కమిషన్లు వేశారు. 1951లో చంపకమ్ దొరైరాజన్ కేసు నుంచి నేటి వరకు 28 కేసులు వ్యతిరేకంగా నడిచాయి. షెడ్యూల్డు కులాల ప్రజల, విద్య, ఉద్యోగ, సంక్షేమ, రక్షణ చట్టం, పదోన్నతులలో ఉన్న రాజ్యాంగ అవకాశాలను అణచివేయటానికి సహోదర భారతీయ హిందూ అగ్రకులాల వాళ్ళు అవిశ్రాంతంగా పోరాడుతున్నారు. ఎస్సీ, ఎస్టీలకు అసలు రిజర్వేషన్లే ఉండకూడదనే ఆలోచన హిందూ పౌర సమాజంలో నెలకొంది. దానికి నాందీ ప్రస్తావనగా జస్టిస్ గవాయి తీర్పు వ్యాఖ్యలు పరిగణించవచ్చు. రానున్న కాలంలో రిజర్వేషన్ వ్యతిరేక వాదనలు మరింత విస్తృతమవుతాయి. ఎస్సీ, ఎస్టీలు తమ రాజ్యాంగ హక్కులు కాపాడుకోవడం కోసం, అంబేడ్కర్ బాటలో మరింత చైతన్యం, మరింత పోరాటం, మరింత ఐక్యతతో ముందుకు సాగాలి.
మల్లెల వెంకట్రావు
వ్యవస్థాపకులు, మాల మహాసభ
ఈ వార్తలు కూడా చదవండి..
టీటీడీ కల్తీ నెయ్యి కేసులో మరో కీలక పరిణామం
భూములు అమ్ముకునేందుకు ప్లాన్ చేశారు.. సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు షాకింగ్ కామెంట్స్
Read Latest Telangana News And Telugu News
Updated Date - Nov 30 , 2025 | 05:26 AM