అణుశాస్త్రవేత్త అపర ధన్వంతరి
ABN, Publish Date - Jul 06 , 2025 | 12:31 AM
క్యాన్సర్ వ్యాధి చికిత్సకు న్యూక్లియర్ పార్టికల్స్ పరిశోధన మరింత దోహదపడాలని అమెరికాలో శోధించి, తను పుట్టినగడ్డపై 30 ఏళ్లకు పైగా మహాత్మా గాంధీ మెమోరియల్ మెడికల్ (ఎంజీఎం) ట్రస్టు ద్వారా సేవ చేసిన గాంధేయవాది డాక్టర్ ముదుండి రామకృష్ణంరాజు...
క్యాన్సర్ వ్యాధి చికిత్సకు న్యూక్లియర్ పార్టికల్స్ పరిశోధన మరింత దోహదపడాలని అమెరికాలో శోధించి, తను పుట్టినగడ్డపై 30 ఏళ్లకు పైగా మహాత్మా గాంధీ మెమోరియల్ మెడికల్ (ఎంజీఎం) ట్రస్టు ద్వారా సేవ చేసిన గాంధేయవాది డాక్టర్ ముదుండి రామకృష్ణంరాజు. ప్రఖ్యాత శాస్త్రవేత్త స్వామి జ్ఞానానంద దగ్గర ఏడు సంవత్సరాలు పరిశోధన చేసి డి.ఎస్సీ పట్టా పొందిన సాధకుడు. రాష్ట్రపతిగా రాణించిన శాస్త్రవేత్త ఎ.పి.జె. అబ్దుల్ కలాం క్లాస్‌మేట్. 2013 సంవత్సరంలో పద్మశ్రీ పురస్కార గ్రహీత అయిన డాక్టర్ ఎమ్.ఆర్ రాజు గత నెల 24న కన్నుమూయడం తెలుగు సమాజానికి తీరని లోటు. పరులకు ఉపయోగపడే పనులు మాత్రమే చేసే తండ్రిని చూసి స్ఫూర్తి పొందిన ఎమ్.ఆర్ రాజు తన 9౪ ఏళ్ల వయసులో భీమవరానికి దగ్గర ఉన్న పెద్ద అమిరం గ్రామంలోని ఎంజీఎం ట్రస్ట్ భవనంలో తృప్తిగా సేవలోనే కన్నుమూశారు. పదహారేళ్ళ వయసులో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించిన తన సహచరి సుభద్రారాజు... జీవితంలో, సేవాకార్యక్రమాలలో పెద్ద తోడుగా ఉండి మూడేళ్ల క్రితం మరణించడం డాక్టర్ రాజును తీవ్రంగా కలచి వేసింది.
1931 జూలై 15న జన్మించిన రామకృష్ణంరాజు మద్రాసులోని ప్రెసిడెన్సీ కళాశాలలో బి.ఎస్సీ, ఆ తర్వాత ఫిజిక్స్‌లో ఎం.ఎస్సీ చేశారు. పిమ్మట ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రముఖ శాస్త్రవేత్త బి.ఆర్.రావు వద్ద ఎం.ఎస్సీ (బై రీసెర్చ్) పూర్తిచేసిన తర్వాత, ప్రఖ్యాత న్యూక్లియర్ సైంటిస్ట్ స్వామి జ్ఞానానంద (1896–1969) వద్ద డాక్టర్ ఆఫ్ సైన్స్ పూర్తి చేశారు. తొలుత యోగిగా జీవితాన్ని కొనసాగించి, ఐన్‌స్టీన్ సాపేక్షతాసిద్ధాంతం కారణంగా న్యూక్లియర్ సైంటిస్ట్‌గా మారిన జ్ఞానానంద ప్రపంచ విజ్ఞాన చరిత్రలోనే చాలా ప్రత్యేకమైన వ్యక్తి. తండ్రి తర్వాత ఈ పరిశోధక గురువు ప్రభావం రాజు మీద చాలా ఉంది. కాబట్టే 1961లో క్యాన్సర్ చికిత్సకు న్యూక్లియర్ పార్టికల్స్ ఏ రకంగా తోడ్పడగలవని పరిశోధన కోసం డాక్టర్ రాజు అమెరికా వెళ్లారు. ప్రఖ్యాత మసాచుసెట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జనరల్ హాస్పిటల్, ఇంకా హార్వర్డ్‌లలో మరింత పరిశోధన చేసి, తొలుత పదేళ్లు బర్కిలీలోని లారెన్స్ రేడియేషన్ లేబరేటరీలో జి.హెచ్ లారెన్స్‌తో కలిసి శ్రమించారు. తర్వాత 1971లో లాస్ ఆల్మోస్ నేషనల్ లాబోరేటరీలో బయోఫిజిస్ట్‌గా 23 ఏళ్ల పరిశోధనాజీవితం గడిపారు. 1981లో 3000 మంది శాస్త్రవేత్తలు, ఇంజినీర్లలో ఎంపిక చేయబడిన 25 మందిలో ఒకరుగా గుర్తింపు పొందారు. దాదాపు అదే సమయంలో తను ఉద్యోగం చేసే పరిశోధనాశాలలో ‘విజ్ఞాన శాస్త్రంలో సృజనాత్మకత’ గురించి ప్రఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తితో ప్రసంగం; అటు తర్వాత శాస్త్రవేత్తలతో వారి ముఖాముఖీ సంభాషణ ఏర్పాటు చేసి, విభిన్నమైన చరిత్రకు శ్రీకారం చుట్టారు. రామకృష్ణంరాజు దంపతులు 1994లో భారతదేశం తిరిగి వచ్చారు.
స్వాతంత్రోద్యమంలో పాల్గొనడమే కాకుండా, 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం సిద్ధించిన ఘడియలను దుర్గాబాయి దేశముఖ్‌తో కలిసి పంచుకున్న అదృష్టం సుభద్రది. గ్రామీణ ఆరోగ్యం కోసం సుభద్ర 1976లో ఎంజీఎంను పెద్ద అమిరంలో ప్రారంభించి కంటి చూపు, మహిళల సాధారణ ఆరోగ్యం, సర్వికల్ క్యాన్సర్ వంటి సమస్యల పరిష్కారాల పట్ల దృష్టి పెట్టారు. 1994లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని భీమవరానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్ద అమిరం గ్రామంలో ఉన్న ఎంజీఎం ట్రస్టు కార్యక్రమాలను గ్రామీణారోగ్యం, గ్రామీణ విద్య, పల్లె ప్రాంతాల్లో క్యాన్సర్ సమస్య నివారణ వైపుగా మరింత విస్తృత పరిచారు ఎం.ఆర్.రాజు దంపతులు. తన పరిశోధనతో ముడిపడి ఉన్న సంస్థలు, శాస్త్రవేత్తల సహకారంతో వీరు ‘రూరల్ క్యాన్సర్ సెంటర్’ను 2006 జనవరి 9న అప్పటి రాష్ట్రపతి, ఎ.పి.జె కలామ్‌తో ప్రారంభింపజేశారు. గ్రామీణ ప్రాంతాలకు రేడియేషన్ చికిత్స, సైన్స్ అండ్ సోషల్ సర్వీస్ వంటి అంశాలపై శాస్త్రవేత్తలకు అవగాహన కల్పించే రీతిలో ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసిన సదస్సులలో ఆటమిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్లు అనిల్ కకోద్కర్, కుమార్ బెనర్జీ పాల్గొనడం విశేషం. రూరల్ క్యాన్సర్ సెంటర్‌లో నమోదైన 3200 మంది పేషంట్లలో 1400 మంది రేడియేషన్ థెరపీ పొందారు. స్థానిక అధికారులతో, తనతో పని చేసిన శాస్త్రవేత్తల సహకారంతో ఎంజీఎం ట్రస్ట్ చాలా రకాల సేవలు మూడు దశాబ్దాలుగా చేస్తోంది.
వాస్తవాలను ఖాతరు చేయకుండా ఇతరులు చేసిన విమర్శలు, పొగడ్తలు వంటి ట్రాష్‌ను గుర్తుపెట్టుకోవడానికి మన మెమరీని వాడుతున్నామని డాక్టర్ ఎమ్.ఆర్ రాజు భావించేవారు. న్యూక్లియర్ పార్టికల్స్ ఉపయోగాలకు సంబంధించిన రేడియేషన్ ఫిజిక్స్, రేడియో బయాలజీ విభాగాలలో 140 పరిశోధనా పత్రాలతో పాటు ఎన్నో సమీక్షావ్యాసాలు, అధ్యయనాంశాలు రాసిన డాక్టర్ రాజు ‘హెవీ పార్టికల్ రేడియో థెరపీ’ అనే పుస్తకం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అలాగే క్యాన్సర్‌కు సంబంధించి మంచి అవగాహన కలిగించే పుస్తకం ఇంగ్లీషు, తెలుగు భాషల్లో వెలువడి ప్రాచుర్యం పొందింది.
డా. నాగసూరి వేణుగోపాల్
ఆకాశవాణి పూర్వ సంచాలకులు
ఈ వార్తలు కూడా చదవండి.
రాష్ట్రంలో.. ఇక స్మార్ట్ రేషన్ కార్డులు
కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా పీఎస్‌కు మాజీ మంత్రి
Read Latest Telangana News and National News
Updated Date - Jul 06 , 2025 | 12:31 AM