Declining Parliamentary Debates: పార్లమెంటులో తగ్గిపోతున్న చర్చలు
ABN, Publish Date - Dec 06 , 2025 | 05:02 AM
ఆయన మాటలలోని వ్యంగ్యాన్ని నేను అర్థం చేసుకున్నాను. నిజానికది ఎవరికైనా అవగతమవుతుంది. పార్లమెంటరీ సమావేశాలు ప్రారంభమవడానికి ముందు ఆనవాయితీగా నిర్వహించే అఖిలపక్ష సమావేశంలో ఉభయ సభల్లో చర్చలకు, చట్టాల నిర్మాణానికి సహకరించాలని ప్రతిపక్షాలకు.....
ఆయన మాటలలోని వ్యంగ్యాన్ని నేను అర్థం చేసుకున్నాను. నిజానికది ఎవరికైనా అవగతమవుతుంది. పార్లమెంటరీ సమావేశాలు ప్రారంభమవడానికి ముందు ఆనవాయితీగా నిర్వహించే అఖిలపక్ష సమావేశంలో ఉభయ సభల్లో చర్చలకు, చట్టాల నిర్మాణానికి సహకరించాలని ప్రతిపక్షాలకు ప్రభుత్వాధినేతలు విజ్ఞప్తి చేయడం పరిపాటి. ఆ ప్రకారమే డిసెంబర్ 1, 2025న పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యే ముందు పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ సందేశంలో ‘సత్ఫలితాలను సాధించే నిర్మాణాత్మక చర్చలు వేదికగా పార్లమెంటు భాసించాలే కానీ, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం నాటకీయ ప్రవర్తనలకు తావు కాకూడద’ని నొక్కి చెప్పారు. పార్లమెంటు సమస్త సభ్యులు, ప్రత్యేకించి ఒకటి రెండు పార్టీల నుద్దేశించి ఆయన ఈ విజ్ఞప్తి చేశారు. శీతాకాల సమావేశాల ఆరంభానికి ఇదొక అశుభ సూచకమేనని చెప్పాలి. మోదీ వ్యాఖ్యలను మరింత వివరంగా ఉటంకించవలసిన అవసరమున్నది: ‘దురదృష్టవశాత్తు ఎన్నికలలో తమ ఓటమిని జీర్ణించుకోలేని పార్టీలు ఒకటి రెండు ఉన్నాయి. బిహార్ ఎన్నికల ఫలితాలు వెలువడి చాలా రోజులు అయిందని, పరాజితులు తమ పరాభవ భారం నుంచి కోలుకుని ఉంటారని నేను భావించాను. అయితే తాజాగా ఆ పార్టీల ప్రకటనలు విన్న తరువాత బిహార్ ఓటమి వారిని ఇప్పటికీ కలచివేస్తోందని అర్థమయింది... నినాదాలు చేసేందుకు దేశంలో చాలా ప్రదేశాలు ఉన్నాయి. మీరు ఇప్పటికే ఓడిపోయిన చోట పెద్ద పెట్టున నినాదాలు చేశారు. సమీప భవిష్యత్తులో ఓడిపోనున్న రాష్ట్రాలలో కూడా మీరు పెద్ద పెట్టున నినాదాలు చేయవచ్చు. అయితే ఇక్కడ, పార్లమెంటులో నినాదాలకు కాకుండా విధానాలపై చర్చలకు ప్రాధాన్యమివ్వాలి’. ప్రాంతీయ పార్టీలపై కూడా మోదీ వ్యంగ్య విమర్శనాస్త్రాలను సంధించారు. ‘కొన్ని రాష్ట్రాలలో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉన్నది. అక్కడ సుదీర్ఘకాలంగా అధికారంలో ఉన్న నాయకులు ప్రజల మధ్యకు వెళ్లలేకున్నారు. అయితే వారు పార్లమెంటుకు వచ్చి తమ ఆగ్రహాన్ని ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు’.
పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యే ప్రతిసారీ తాము దేనికీ భయపడమని, దేనినీ గోప్యంగా ఉంచవలసిన అవసరం తమకు లేదని, పార్లమెంటులో ఏ అంశంమీదనైనా చర్చించడానికి సంసిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం ఉద్ఘోషిస్తుంది. అయితే ఈ నిర్నిబంధ స్వేచ్ఛకు ఒక అవరోధం ఉన్నది. అది ‘నియమాలకు లోబడి చర్చ జరపాలనే’ షరతు.
పార్లమెంటరీ కార్యక్రమాల నిర్వహణకు ఒక స్పష్టమైన, కచ్చితమైన నియమావళి ఉన్నది. ఆ నియమాలకు భాష్యం చెప్పడం, వాటిని అనువర్తింపచేయడమనేది ఆయా పార్లమెంటరీ రాజకీయ పక్షాల నాయకులతో సంప్రదించి సభాపతులు (లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్) తరచు ఆయా పార్లమెంటరీ పక్షాల నాయకులను సంప్రదించి తీసుకునే నిర్ణయాల మేరకు ఉంటుంది.
బిల్లులు, బడ్జెట్ ప్రవేశపెట్టడం ప్రభుత్వ అజెండా. ప్రశ్నోత్తరాల సమయం (క్వశ్చన్ అవర్)లో చర్చను అనుమతించరు. ప్రతిపక్షాల అభ్యర్థన మేరకు నిజమైన, స్వేచ్ఛాయుత చర్చ వాయిదా తీర్మానం ద్వారా మాత్రమే జరుగుతుంది లేదా స్వల్ప వ్యవధి చర్చ ద్వారానో లేక సావధాన తీర్మానం ద్వారానో జరుగుతుంది. ఇవి సువ్యవస్థితమైన, మొదటి నుంచీ అనుసరిస్తున్న పార్లమెంటరీ పద్ధతులు, సంప్రదాయాలు.
వాయిదా తీర్మానాన్ని, కొన్ని కారణాల వల్ల, ప్రభుత్వానికి అభిశంసనగా పరిగణిస్తున్నారు. దీనికి సంబంధించిన నియమం స్పష్టంగా ఉన్నది. లోక్‌సభ కార్యక్రమాల నియమావళిలో 57వ నియమం ఇలా ఉన్నది: భారత ప్రభుత్వ బాధ్యతతో ముడివడి ఉన్న, ఇటీవల సంభవించిన నిర్దిష్ట సంఘటనలపై వాయిదా తీర్మానం ద్వారా చర్చకు తొలుత నోటీసు ఇవ్వాలి. రాజ్యసభలో తక్షణ ప్రాధాన్యమున్న వ్యవహారంపై చర్చకు ముందుగా నిర్ణయించిన సభా కార్యక్రమాలను నిలిపివేసేందుకు ఎగువ సభ కార్యక్రమ నియమావళిలోని 267వ నియమం అనుమతిస్తుంది. స్వల్ప వ్యవధి చర్చ లోక్‌సభలో నియమం 193 ప్రకారం, రాజ్యసభలో నియమం 176 ప్రకారం జరుగుతుంది. తక్షణ ప్రజా ప్రాధాన్యమున్న అంశాలపై స్వల్ప వ్యవధి చర్చ జరుగుతుంది. సావధాన తీర్మాన నోటీసు చాలా నిరపాయకరమైనది. తక్షణ ప్రజా ప్రాధాన్యమున్న అంశాన్ని సంబంధిత మంత్రి దృష్టికి తీసుకువెళ్లేందుకు లోక్‌సభ కార్యక్రమాల నియమాళిలో 197వ నియమం, రాజ్యసభ కార్యక్రమాల నియమావళిలో 180వ నియమం సభ్యులను అనుమతిస్తుంది. సభ్యులు తన దృష్టికి తీసుకువచ్చిన విషయమై మంత్రి ప్రకటన చేయవలసి ఉంటుంది.
సరే, నరేంద్ర మోదీ ప్రభుత్వం పదకొండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన తరువాత పార్లమెంటరీ చర్చలు ఎలా జరుగుతున్నాయో చూద్దాం. ప్రతిపక్షాలకు ప్రతి ద్వారమూ, ప్రతి గవాక్షమూ క్రమంగా మూసుకుపోయాయని నిశ్చయంగా చెప్పక తప్పదు. మోదీ సర్కార్ అంతకంతకూ మొండిగా వ్యవహరిస్తుండడంతో పార్లమెంటరీ చర్చల పరిస్థితి దిగజారిపోయింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం మొదటి పర్యాయం అధికారంలోకి వచ్చినప్పుడు వాయిదా తీర్మానం ద్వారా చర్చకు భయపడింది. అటువంటి తీర్మానం ద్వారా చర్చవల్ల తన ప్రతిష్ఠకు కళంకం ఏర్పడుతుందని భావించడమే అందుకు కారణం. స్వల్ప వ్యవధి చర్చలు లేదా సావధాన తీర్మానం నోటీసులకు అభ్యంతరం చెప్పలేదు. అయితే ద్వితీయ పర్యాయం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ రెండు రకాల చర్చల పట్ల కూడా మోదీ సర్కార్ అసహనం ప్రదర్శించింది. ద్వారం మూసివేసినా, కిటికీలను తెరిచే ఉంచింది. మూడోసారి కనీస మెజారిటీ కంటే తక్కువ సీట్లు మాత్రమే సాధించుకుని, మిత్రపక్షాల మద్దతుతో అధికారంలోకి వచ్చిన తరువాత గవాక్షాలను సైతం మూసివేసింది. దీన్నెలా అర్థం చేసుకోవాలి? చర్చకు యోగ్యమైన తక్షణ ప్రజా ప్రాధాన్యమున్న సంఘటనలు, పరిణామాలు ఏవీ సంభవించలేదని భావించాలా?
విషాదమేమిటంటే లోక్‌సభలో కంటే రాజ్యసభలో చర్చలు చాలా తక్కువగా జరుగుతున్నాయి. అసలు జరగని సందర్భాలు కూడా ఉన్నాయి. నాటి సభాపతే అందుకు కారణమని పలువురు సభ్యులు భావిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో రాజ్యసభకు కొత్త చైర్మన్ ఎన్నికయ్యారు. రాజ్యసభ చైర్మన్ విధులు, బాధ్యతలు ఆయనకు కొత్త కనుక వాటి నిర్వహణ పద్ధతులు, మెళకువలను సమగ్రంగా అవగాహన చేసుకునే దశలో ఉన్నారు. అంతేకాకుండా కొత్త చైర్మన్ అధ్యక్షత వహిస్తున్న ఈ శీతాకాల సమావేశాల కాల పరిధి చాలా తక్కువ కనుక ఆయన సభా నిర్వహణ సామర్థ్యంపై అప్పుడే ఒక అభిప్రాయానికి రావడం సాధ్యం కాదు.
పార్లమెంటరీ చర్చల ప్రమాణాలు అంతకంతకూ పడిపోతున్న దృష్ట్యా ఒక వాస్తవాన్ని నిక్కచ్చిగా చెప్పదలుచుకున్నాను. దేశ సమస్యలపై సమగ్ర అవగాహనతో, సామాన్య పౌరుల శ్రేయస్సే లక్ష్యంగా చర్చలు జరిగే పార్లమెంటు, ప్రజాస్వామ్యాన్ని శక్తిమంతం చేస్తుందనే సత్యాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం విశ్వసించడం లేదు. సంభాషణలు, సంవాదాలు, సాధికార చర్చలను మోదీ సర్కార్ వ్యతిరేకిస్తోంది. శీతాకాల సమావేశాలు ఆరంభమవడానికి ముందు ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలలోని వ్యంగ్యాన్ని విస్మరించలేము.
-పి. చిదంబరం
Updated Date - Dec 06 , 2025 | 05:02 AM