ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Currency Depreciation: రూపాయి విల విల

ABN, Publish Date - Dec 31 , 2025 | 05:34 AM

రూపాయి పతనం కావడం ఇప్పుడు దేశంలో చాలా పాతవార్త. కొత్త సంవత్సరంలో మన రూపాయి సెంచరీమార్క్‌ దాటేయెచ్చు. రూపాయి శీఘ్రగతిన పతనం చెందుతూ ఇంతకుముందెన్నడు చూడని పల్లాలను...

రూపాయి పతనం కావడం ఇప్పుడు దేశంలో చాలా పాతవార్త. కొత్త సంవత్సరంలో మన రూపాయి సెంచరీమార్క్‌ దాటేయెచ్చు. రూపాయి శీఘ్రగతిన పతనం చెందుతూ ఇంతకుముందెన్నడు చూడని పల్లాలను, తాకని అగాథాలను అధిగమిస్తుంటే, కేంద్రం ఎందుకు నిర్లిప్తంగా, తనకేమీ పట్టనట్లు ఉదాసీనంగా వ్యవహరిస్తోంది? ఇదే ఇపుడు అందరి మస్తిష్కాలను తొలిచేస్తున్న ప్రశ్న.

రూపాయి పతనానికి ప్రధానంగా 3 కారణాలు పైకి కన్పిస్తున్నాయి. ఒకటి– అనూహ్యంగా పెరిగిపోతున్న ద్రవ్యలోటు. మన దేశం చేసే వస్తువుల ఎగుమతులు మందగించాయి. అదే సమయంలో దేశంలోకి దిగుమతుల రూపంలో అన్ని రకాల వస్తువులు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. ఇందువల్ల ద్రవ్యలోటు భారీగా పెరిగిపోయింది. తాజా గణాంకాల ప్రకారం వాణిజ్యలోటు 41 బిలియన్ల డాలర్ల మేర ఉంది. దీంతో డాలర్‌కు ఎక్కడాలేని డిమాండ్‌ ఏర్పడింది. రెండు– విదేశీ ఇన్వెస్టర్లు భారత స్టాక్‌ మార్కెట్ల నుంచి పెట్టుబడుల్ని ఉపసంహరించుకుంటున్నారు. లాభాలు స్వీకరించి, ఆకర్షణీయంగా కనిపించే విదేశీ మార్కెట్లవైపు మరలుతున్నారు. ఒక అంచనా ప్రకారం, గత 3–4 నెలల్లోనే 1 లక్ష 48 వేల కోట్ల రూపాయల మేర విదేశీ ఇన్వెస్టర్లు తమ స్టాక్స్‌ను అమ్మేశారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎమ్‌ఎఫ్‌) భారత ఆర్థిక వ్యవస్థ గ్రేడ్‌ను స్థిరమైన అనే వర్గీకరణ నుంచి కదులుతున్న (మూవింగ్‌) అనే జాబితాకు మార్చింది. దీనివల్ల అంతర్జాతీయంగా భారత ఆర్థిక వ్యవస్థ ప్రతిష్ఠ కొంతమేర తగ్గింది. విదేశీ ఇన్వెస్టర్లలో విశ్వాసం సన్నగిల్లడంతో వారు భారత స్టాక్‌మార్కెట్‌ నుంచి లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారు. దీంతోనే రూపాయి క్షీణించి డాలర్‌ బలపడింది. మూడు– సాధారణంగా రూపాయి విలువ క్షీణిస్తున్నప్పుడు ఆర్బీఐ జోక్యం చేసుకొని డాలర్లను కొంటుంది. కానీ ఇప్పుడు డాలర్లను కొనడం నిలిపివేసింది. ఫలితంగా.. రూపాయి పతనం నిరాఘాటంగా కొనసాగుతోంది.

రూపాయి పతనం కావడం ఇవాళ కొత్తేమీకాదు. గత దశాబ్దకాలంగా కొనసాగుతున్నదే. దిగుమతులను తగ్గించుకొని, స్వదేశీ వస్తువుల తయారీకోసం ప్రతిపాదించిన ‘మేకిన్‌ ఇండియా’ విజయం సాధించలేకపోయింది. దానివల్ల విదేశాల నుంచి అన్ని రకాల దిగుమతులు నానాటికీ పెరిగిపోతున్నాయి. చివరకు పప్పు ధాన్యాలు, నూనె గింజలు కూడా దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. దానికితోడు తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఏకపక్షంగా విధించిన టారిఫ్‌ల వల్ల దిగుమతుల విలువ మరింత పెరిగింది. ముఖ్యంగా 85శాతం మేర క్రూడ్‌ ఆయిల్‌ అవసరాలకు విదేశీ దిగుమతుల మీదనే ఆధారపడటం వల్ల విదేశీ మారకద్రవ్యం చెల్లింపులు ఎక్కువై ద్రవ్యలోటు పెరుగుతున్నది. భారత ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా అమెరికన్‌ డాలర్‌ చుట్టూ పరిభ్రమిస్తున్న కారణంగా.. డాలర్‌ ఆధారిత ఆర్థిక వ్యవస్థలతో మనదేశం అధిక మొత్తంలో లావాదేవీలు నిర్వహించడం వల్ల కూడా రూపాయి క్షీణతకు కారణమవుతోంది. అదే సమయంలో అమెరికాలో వడ్డీ రేట్లు సవరించినప్పుడల్లా డాలర్‌ బలపడుతోంది.

దేశ తయారీ రంగంలో ఉత్పత్తి అయ్యే వస్తువులకు అంతర్జాతీయ ప్రమాణాలు లేకపోవడం వల్ల దేశీయ వినియోగదారులు విదేశీ వస్తువుల పట్ల మొగ్గుచూపుతున్నారు. ముఖ్యంగా.. దేశంలో బంగారు వస్తువులను వినియోగించేవారి సంఖ్య పెరగడంతో బంగారాన్ని, విలాస వస్తువుల్ని పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. వీటికోసం విదేశీ మారకద్రవ్యాన్ని చెల్లించడం వల్ల కరెంట్‌ ఖాతాలోటు పూడ్చలేని విధంగా తయారయింది. ఇంకోపక్క దేశ కార్పొరేట్‌ రంగ సంస్థలకు విదేశీ రుణాలు, ఈక్విటీలు పెంచుకోవడానికి అనుమతులు ఇవ్వడంతో తక్కువ వడ్డీరేట్లకు భారీగా విదేశీ రుణాలు పొందుతున్నారు. నల్లధనాన్ని సమర్థంగా అరికట్టలేకపోవడం వల్ల దేశంలో చలామణి కావాల్సిన నగదును స్విస్‌ బ్యాంకుల్లో అక్రమంగా దాచుకుంటున్నారు. ఇవన్నీ దేశ ఆర్థిక ప్రగతికి గొడ్డలిపెట్టుగా పరిణమించడమే కాకుండా రూపాయి క్షీణతకు కారణం అవుతున్నాయి.

అంతర్జాతీయ పరిణామాలను తక్షణం అదుపు చేయడం సాధ్యం కాకపోవచ్చు. కానీ, సహేతుకమైన విధాన నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం అసాధ్యం కాదు. వైవిధ్యమైన రంగాలపై దృష్టి పెట్టి, నాణ్యమైన ఉత్పత్తులను తయారుచేసి, వాటిని ఎగుమతి చేయాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు చైనాతో ఏర్పడిన వాణిజ్య వైరం కారణంగా అమెరికా.. ఆ దేశం నుంచి పత్తిని దిగుమతి చేసుకోవడం నిలిపివేసి, భారత్‌ నుంచి దిగుమతి చేసుకోవడానికి సిద్ధం అయింది. అయితే, భారతదేశంలో పత్తికి నాణ్యతా సమస్యలు ఎక్కువగా ఉండటం వల్ల ఎగుమతులు నిలిచిపోయాయి. పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యతను పెంచడం, ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగుపర్చడం తదితర చర్యల ద్వారా ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయొచ్చు. విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను స్టాక్‌ మార్కెట్‌లో కాకుండా ఉత్పాదక రంగంలో పెట్టేటట్లు కేంద్రం వారికి తగిన ప్రోత్సాహకాలు ఇవ్వాలి. స్థిరమైన పెట్టుబడులు మాత్రమే ఆర్థికరంగాన్ని బలోపేతం చేస్తాయి. ఈ వాస్తవాన్ని విస్మరించి వ్యవస్థ మూలాలను దెబ్బతీసే పెట్టుబడులకు ఎర్రతివాచీ పరచడం మన ఆర్థిక వ్యవస్థ సంస్థాగత బలహీనత. ఈ బలహీనతలను తొలగించుకోకుండా వ్యసనంగా మార్చుకున్నట్లయితే.. అది మరింత ప్రమాదకర స్థితికి దారితీస్తుంది. ఉదాహరణకు పారిశ్రామిక రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఎక్కువగా ఆహ్వానించాలి. అలాకాకుండా స్టాక్‌ మార్కెట్‌లోకి ఎఫ్‌ఐఐలను ప్రోత్సహించడం వల్ల తాత్కాలిక లాభాలు ఉంటాయేతప్ప దీర్ఘకాలంలో ఉపయోగం ఉండదు. ప్రస్తుతం భారత స్టాక్‌మార్కెట్‌ల నుంచి రివర్స్‌ఫ్లో రూపంలో పెట్టుబడులు వెనక్కుపోవడమే ఇందుకు ఉదాహరణ.

రూపాయి క్షీణించి డాలర్‌ విలువ పెరగడంతో దేశంలో అన్ని వర్గాలవారిపై ఆర్థిక భారం పెరిగింది. విదేశీ విద్యా రుణాలు, విదేశీ యాత్రలు మొదలుకొని చమురుతో సహా దిగుమతి అయ్యే అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగిపోతాయి. అయితే, కేంద్రం మాత్రం రూపాయి విలువ తగ్గితే ఎగుమతులు పెరిగి, ద్రవ్యలోటు తగ్గుతుందనే ధీమాలో ఉన్నట్లు కనిపిస్తోంది. డాలర్లు కొని విదేశీ మారకద్రవ్య నిల్వలను తగ్గించుకోవడం పట్ల కేంద్రం సుముఖంగా లేదు. ఈ నేపథ్యంలో రూపాయి పతనానికి దోహదం చేస్తున్న అంశాలన్నింటిపై బహుముఖంగా పోరాడితే తప్ప క్షీణిస్తున్న రూపాయిని కాపాడుకోలేం.

- సి.రామచంద్రయ్య

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు

Updated Date - Dec 31 , 2025 | 05:36 AM