ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Caste Discrimination: దళిత రాజకీయ సాధికారిత ఏదీ?

ABN, Publish Date - Aug 17 , 2025 | 02:32 AM

దేశవ్యాప్తంగా రాజకీయ వేదికలలో దళితుల ఉనికి పెరిగింది. కానీ ఈ కనిపించే ఉనికి, దళిత రాజకీయ అధికార గొంతుగా మారలేదు. చాలా మటుకు రాజకీయ పార్టీలు దళిత నాయకులను నామమాత్ర ప్రాతినిధ్యానికే పరిమితం...

దేశవ్యాప్తంగా రాజకీయ వేదికలలో దళితుల ఉనికి పెరిగింది. కానీ ఈ కనిపించే ఉనికి, దళిత రాజకీయ అధికార గొంతుగా మారలేదు. చాలా మటుకు రాజకీయ పార్టీలు దళిత నాయకులను నామమాత్ర ప్రాతినిధ్యానికే పరిమితం చేశాయి. ఇంకా చేస్తూనే ఉన్నాయి. ఏ పార్టీలోనూ దళితులు నిర్ణయాత్మక స్థానాల్లో లేరు. ఒకటి అర పార్టీలలో ఉన్నప్పటికీ వారికి నిర్ణయాధికారం ఉండదు, గౌరవం ఉండదు. ఒకవేళ ఏదైనా ప్రత్యేక పరిస్థితిలో ఏదైనా రాజకీయ పార్టీలో దళితుడు నిర్ణయాధికారం కలిగి నిర్ణయాత్మక స్థానంలోకి చేరుకుంటే ఆ నాయకుడికి దళిత స్పృహ కంటే దొరల స్పృహ అధికంగా ఉంటుంది. ఈ పరిస్థితి పార్టీలకే పరిమితం కాకుండా, ఆయా పార్టీలచే ఏర్పడిన ప్రభుత్వాలలో కూడా కొనసాగుతుంది. దళిత అభ్యర్థులు ఎన్నికల్లో సీటు పొందాలన్నా, ఆ తర్వాత గెలవాలన్నా అగ్రకులాల దయాదాక్షిణ్యాలు కావాలి. దీనికి ప్రధాన కారణం దళిత నాయకులను దళితులే ఎన్నుకొనే అవకాశం కోల్పోవటమే, పైగా దళిత నాయకులు ఇతరుల స్వార్థాలకు అనుగుణంగా ఎంపిక చేయబడటమే. దీనివల్ల దళిత సమాజ అభివృద్ధి కోసం పనిచేయాల్సిన దళిత నాయకులు అగ్రకుల నాయకుల ఆశీర్వాదాల కోసం ఆరాటపడాల్సి వస్తున్నది. ఈ పరిస్థితి నిజాయితీగల దళిత నాయకులను అయోమయ స్థితిలోకి నెట్టివేస్తున్నది. ఇది ప్రస్తుత దళిత రాజకీయ చైతన్యానికి ఒక ముఖ్యమైన పార్శ్వం.

ఇప్పటి దళిత ఉద్యమాలు అంతర్గతంగా, బాహ్యంగా అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. దళిత విముక్తి, కుల వ్యవస్థ అణచివేతలకు వ్యతిరేకంగా పోరాటం వంటి విస్తృత లక్ష్యాలు నేడు చీలికల వల్ల, అంతర్గత విభేదాల వల్ల మరుగునపడిపోయాయి. ఉద్యమంలోని విభజనలు అనేక రకాల పెడధోరణులను ముందుకు తెచ్చింది. పరస్పర విరుద్ధమైన లక్ష్యాలతో, వ్యూహాలతో దళిత ఉద్యమం దాని విప్లవాత్మక తేజస్సును కోల్పోయింది. రాజకీయ అధికార ఆకాంక్షలు కూడా చీలికలకు దారితీశాయి. పార్టీలు పెట్టే ప్రలోభాలతో దళిత నాయకుల మధ్య పోటీ తీవ్రమైంది. ఈ పరిస్థితిలో దళితులు పార్టీలవారీగా వేరైపోయారు.

దళితుల మధ్య ఈ చీలికలు ఒక లోతైన వైరుధ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి. రాజకీయ పార్టీల సిద్ధాంతాలకు, అగ్రకుల నాయకత్వానికి అంకితమై వ్యక్తిగత అభివృద్ధికి, అవకాశాల కోసం ఎదురు చూడటం ఒక వైపు కనిపిస్తుంది. మరోవైపు అశేష దళిత సమాజాలు తాము ఎదుర్కొంటున్న దౌర్భాగ్యం, అన్యాయం, ఆకలి, హింసలపై వ్యక్తం చేస్తున్న నిస్సహాయత, ఆందోళన కనిపిస్తాయి. రిజర్వేషన్ల లబ్ధిదారులైన మధ్యతరగతి దళితులు, దళిత మేధావులు కుల వ్యవస్థ అణచివేతను విస్మరించారు. ప్రాథమిక స్థాయి దళిత జనంలో మార్పును తేవడానికి దీర్ఘకాలిక వ్యూహాలను రూపొందించటానికి బదులు– రిజర్వేషన్లు, ఉద్యోగాల వంటి పరిమిత లాభాలపై వీరు దృష్టి కేంద్రీకరించారు.

దళిత సమూహాలకి సంయుక్త ప్రతీకలు, భాషాయాసలు, విలువలు లేకపోవడం వివిధ దళిత సమాజాల మధ్య విభేదాలను తీవ్రతరం చేస్తోంది. పార్లమెంటరీ రాజకీయాలు వ్యక్తిగత గుర్తింపునకు ప్రాధాన్యతనిస్తూ, దళిత జాతి ఉపకులాల మధ్య విభేదాలను ప్రోత్సహించాయి. ఫలితంగా దళితులు తమ పోరాటాల నుంచి వేరై రాజకీయ పార్టీలపై ఆధారపడే స్థితికి చేరుకున్నారు. ఈ పరిణామం దళిత ఉన్నత వర్గాలకు అనుకూలంగా మారి, వ్యక్తిగత స్థాయిలో వారు అధికారాన్ని, సౌకర్యాన్ని పొందే వీలు కల్పించింది. అందువల్ల వారు దళిత సమాజంపై కొనసాగుతున్న వ్యవస్థాపిత అన్యాయాలను ప్రశ్నించటం మానేశారు. అంబేడ్కర్‌ను ఒక చిహ్నంగా మారుస్తున్న తీరూ సమస్యాత్మకమే. ఆయన పోరాట చైతన్యాన్ని ఒక విగ్రహంగా మార్చి వేశారు. ఆయన కుల నిర్మూలనా సిద్ధాంతానికున్న విప్లవాత్మక లక్షణాన్ని విగ్రహారాధనగా మార్చివేసారు.

దళిత నాయకత్వ సామర్థ్యాన్ని నిర్మాణంలోని పరిమితులు నిరోధిస్తున్నాయి. ప్రధాన రాజకీయ వ్యవస్థ దళిత నాయకత్వంలోని కొన్ని వర్గాలను తనలో కలుపుకొని, దళిత ఉద్యమ విప్లవాత్మక లక్ష్యాలను నీరుగార్చుతూ, ఉద్యమ స్వతంత్ర పోరాట లక్ష్యాలకన్నా పార్టీ రాజకీయాల మీద ఆధారపడే పరిస్థితిని సృష్టించింది. ఎన్నికల పరిమితులు, పార్టీలతో అనుబంధాలు ఉద్యమాన్ని విభజించి, కలిసికట్టుగా పనిచేసే శక్తిని దెబ్బతీస్తున్నాయి. అంతేగాక, దళిత నాయకత్వం ఎక్కువగా రిజర్వేషన్లు, సంక్షేమ పథకాల రాజకీయాలకు పరిమితమై, వ్యవస్థాపిత అసమానతలను ఎదుర్కొనేలా, విస్తృతమైన సామాజిక–ఆర్థిక మార్పును సాధించేలా దృష్టిని మళ్లించడంలో విఫలమవుతోంది. అణగారిన వర్గాల అభివృద్ధికి అనుకూలంగా రిజర్వేషన్ల వల్ల లబ్ధి పొందిన మధ్య తరగతి దళిత సముదాయం తరచుగా ప్రాథమిక స్థాయి దళిత జన ఉద్యమాలకు ప్రోత్సాహం ఇవ్వడంలో విఫలమవుతున్నది. ఇది దళిత నాయకత్వానికీ అశేష సామూహిక దళిత జనాభాకి మధ్య విబేధాన్ని పెంచుతున్నది.

దళితులు రాజకీయంగా లెక్కలోకి రావాలంటే, దళిత నాయకత్వం శక్తిమంతమైన రాజకీయ చర్యగా నిలవాలంటే, అది ఎన్నికల పరిమితులను అధిగమించి, ప్రాథమిక స్థాయి దళిత జన ఉద్యమాలను బలోపేతం చేయడం, భావజాల ఐక్యతను పెంపొందించడం, కుల ఆధిపత్యాన్ని సవాలు చేసే ప్రత్యామ్నాయ రాజకీయ, ఆర్థిక వ్యవస్థలను నిర్మించడం అవసరం. అంతేకాక, దళిత కులాల మధ్య – దళిత ఉద్యమాల మధ్య ఐక్యతను పెంపొందించడం, యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడం, అంబేడ్కర్ విప్లవాత్మక దృష్టిని కేవలం ప్రతీకాత్మక గుర్తింపుగా కాకుండా ఒక కార్యాచరణ మార్గంగా మార్చుకోవడం కీలకం. ఈ మార్గంలో మాత్రమే మరింత బలమైన, దృఢమైన దళిత రాజకీయ ఉద్యమాన్ని నిర్మించవచ్చు. ఒక సమగ్ర ప్రణాళిక ద్వారా మాత్రమే దళిత నాయకత్వం వ్యవస్థాపిత అణచివేతను పూర్తిగా విచ్ఛిన్నం చేసి, దీర్ఘకాలిక సామాజిక, రాజకీయ మార్పును సాధించగలదు.

n లెల్లే సురేష్

దళిత కవి, సాంస్కృతిక కార్యకర్త

ఈ వార్తలు కూడా చదవండి..

తృటిలో తప్పిన ప్రమాదం.. విమాన ప్రయాణికులు సురక్షితం

రాహుల్ గాంధీ ఆరోపణలు.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

మరిన్ని తెలంగాణ వార్తలు, తెలుగు వార్తలు చదవండి..

Updated Date - Aug 17 , 2025 | 02:32 AM