ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Air Pollution: పర్యావరణ స్వచ్ఛత ధార్మిక కర్తవ్యం

ABN, Publish Date - Oct 25 , 2025 | 04:13 AM

నింగిలో కాంతి పుంజాలు, ఆకాశాన్ని బద్దలు కొట్టే శబ్దరావాలు... దీపావళి నడి రేయి.. అయినా ఎడతెగని టపాసుల మోతలు... నిద్ర పట్టడం లేదు, విసుగు కమ్మేస్తోంది. సమీపంలో ఉన్న ఒక పోలీస్‌ స్టేషన్‌కు ఫోన్‌ చేశాను.....

నింగిలో కాంతి పుంజాలు, ఆకాశాన్ని బద్దలు కొట్టే శబ్దరావాలు... దీపావళి నడి రేయి.. అయినా ఎడతెగని టపాసుల మోతలు... నిద్ర పట్టడం లేదు, విసుగు కమ్మేస్తోంది. సమీపంలో ఉన్న ఒక పోలీస్‌ స్టేషన్‌కు ఫోన్‌ చేశాను. ‘అర్ధరాత్రి దాటిపోయింది. టపాకాయలు ఇంకా పేలుతూనే ఉన్నాయి. సుప్రీం కోర్టు నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్య తీసుకుంటారా?’ ఆవలివైపు నుంచి అలసట ధ్వనిస్తున్న గొంతు వినిపించింది: ‘మా ప్రయత్నం మేము చేస్తున్నాం, అయితే ప్రజలు మా మాట వినడం లేదు’. ఆ రాత్రి డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌ పట్ల జాలి కలిగింది. పౌరులు లెక్క చేయనప్పుడు, రాత్రి పది తరువాత టపాసులు కాల్చకూడదన్న కోర్టు ఆదేశాన్ని వారు ఎలా అమలుపరచగలరు? మరుసటి ఉదయం యథావిధిగా, చెంతనే ఉన్న ఒక ఉద్యానవనంలో వ్యాహ్యాళికి వెళ్లాను. చల్లనిగాలి, కాదు, విషతుల్య వాయువును శ్వాసిస్తూ నడుస్తున్నాను. శరదృతువు ఉదయం సూర్యకాంతి స్థానంలో దట్టమైన, నల్లని పొగమంచు! క్రితం రాత్రి కొంత మంది ఆనందోత్సాహాల అనివార్య పర్యవసానమది, ఎంతో మంది ఇతరులకు భరింపరాని యాతన, సందేహం లేదు. భారతదేశ రాజధాని, ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాలలో ఒకటిగా ఉన్నది! ఇందుకు జవాబుదారీ ఎవరు? అక్టోబర్‌ నుంచి జనవరి మధ్యనాళ్ల దాకా న్యూఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయి దాటడం కద్దు. అందునా దీపావళి పండుగ రోజుల్లో గాలి నాణ్యత మరింత అధ్వానమైపోతోంది. శ్వాసకోశ వ్యాధులు మరింత తీవ్రమవుతాయి.

ఆ రోగాలు లేనివారు సైతం విషపూరిత గాలిని పీల్చి అనారోగ్యం కోరల్లో చిక్కుకోవడం పరిపాటి. దీపావళి పండుగ సందర్భంలో టపాసులపై నిషేధాన్ని ఎత్తివేయాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఎందుకు నిర్ణయం తీసుకున్నది? ‘విరుద్ధ ఆసక్తుల’ మధ్య సమతుల్యతకు గౌరవనీయ న్యాయమూర్తులు చిత్తశుద్ధితో ప్రయత్నించారా? లేక బాణసంచాపై ఆంక్షలు ‘హిందూ మనోభావాల’ను వ్యతిరేకించడమేనని వాదిస్తున్న వారిని అనునయించేందుకే సర్వోన్నత న్యాయస్థానం ఆ నిర్ణయం తీసుకున్నదా? తనపై గర్హనీయమైన బూటుదాడికి కారణమైన (విష్ణువు ప్రతిమపై) స్వీయ వ్యాఖ్యలకు సీజేఐ ఇప్పటికే హిందుత్వవాదుల నుంచి తీవ్ర విమర్శల నెదుర్కొంటున్నారు. తన శత్రువులతో శాంతి పడేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారా? ‘గ్రీన్‌ క్రాకర్స్‌’ (ఈ పదం ఒక విరోధాభాసాలంకారం)ను ఆమోదించడం సమర్థనీయమేనా? దీపావళి వేడుకలు, పర్యావరణ పరిరక్షణకు అదొక మధ్యేదారి అని భావించారా? న్యాయమూర్తుల ఉద్దేశం ఏమైనప్పటికీ మరింత బాణసంచాకు అనుమతినివ్వడం టపాసులను మరింత నిర్భయంగా కాల్చేందుకే పౌరులను పురిగొల్పింది. టపాకాయల తయారీదారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్న ఢిల్లీ ప్రభుత్వం తాము నిర్దేశించిన నిబంధనలను అమలు పరచగలదని సర్వోన్నత న్యాయమూర్తులు ఆశించారా? ఢిల్లీ ప్రభుత్వం తన పక్షపాత వైఖరిని నిస్సిగ్గుగా బయటపెట్టుకున్నది. 27 ఏళ్ల ‘వనవాసం’ అనంతరం బీజేపీ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతంలో అధికారంలోకి వచ్చింది. టపాకాయల ఆనందోత్సాహాలను ఢిల్లీ వాసులకు మళ్లీ ఇస్తామనేది బీజేపీ ఇచ్చిన హామీలలో ఒకటి. మురుగునీటి పారుదల సదుపాయాలను మెరుగుపరచడం, రోడ్లపై కొండలుగా పేరుకు పోతున్న చెత్తా చెదారాన్ని తొలగించడం మొదలైన తక్షణ కర్తవ్యాలను నిర్వహించడానికి బదులు ‘దీపావళి’ టపాసుల వేడుక సంప్రదాయాన్ని పునరుద్ధరించేందుకు అధికారంలో ఉన్నవారు దృఢంగా నిర్ణయించుకున్నారు. దీపావళి పండుగ రోజుల్లో టపాసులు పేల్చడం ‘ఒక సాంస్కృతిక వేడుక’ అని ముఖ్యమంత్రి రేఖా గుప్తా అభివర్ణించారు. మంచిదే. అయితే ప్రజల ఆరోగ్యానికి వాటిల్లే హాని విషయమేమిటి? బాణసంచాను నిషేధించడం ద్వారా ఆప్‌ ప్రభుత్వం హిందువులకు వ్యతిరేకంగా వ్యవహరించిందని బీజేపీ పదే పదే ఆరోపించింది. ఇదొక ప్రమాదకరమైన వాదన. అత్యంత ప్రధానమైన ప్రజారోగ్యం అంశాన్ని మతంతో ముడిపెట్టేందుకు ఉద్దేశించిన వాదన అది. మొరటు మెజారిటేరియన్‌ రాజకీయాలకు అదొక తార్కాణం. ఇటువంటి అహేతుక జనాకర్షక కథనాల కారణంగా ప్రతిపక్షాలు ఆత్మరక్షణలో పడిపోయాయి.

నిర్మల పర్యావరణం కంటే మతపరమైన బుజ్జగింపే ఎక్కువ ఓట్లు తీసుకువస్తుంది మరి. బాణాసంచా కాల్చడమనేది దీపావళి వేడుకల్లో అంతర్భాగమని చెప్పేందుకు చారిత్రక సాక్ష్యాధారాలు లేవు. మన పెద్దలు, పూర్వీకులు దీపావళిని వెలుగుల పండుగగా చూశారేగానీ చెవులు చిల్లులు పడే శబ్దహేలగా ఎవరూ పరిగణించలేదు. దీపకాంతుల దృశ్యం భవిష్యత్తుకు భరోసానిచ్చే ఆశాజ్యోతిగా భావించడం పరిపాటి. బాణసంచా తయారీ ఇటీవలి కాలంలోనే వందల కోట్ల వ్యాపారమై పోయింది. వినియోగదారు మతతత్వం ఆ వ్యాపారానికి తోడయింది. దీంతో మతపరమైన ప్రతి సందర్భమూ ఒక మహావేడుకగా పరిణమించింది. వ్యాపారానికి అతీతమైనది ఏదీ లేకుండా పోయింది. సరే, ఓటు బ్యాంకు రాజకీయాలు మతపరమైన భావోద్వేగాలను సంతృప్తి పరచడానికి ప్రాధాన్యమివ్వసాగాయి. బక్రీద్‌ పండుగనాడు మేకలను వధించేందుకు ముస్లింలకు అనుమతినిస్తున్నప్పుడు, దీపావళి రోజుల్లో హిందువులకు తమ ఇష్టానుసారం బాణసంచాను కాల్చేందుకు అనుమతి ఎందుకు ఇవ్వకూడదు? ఇదొక అతార్కిక వాదన. తార్కికతపై భావోద్వేగాలు గెలిచినప్పుడు ఇటువంటి అర్థం పర్థం లేని వాదనలు వస్తాయి. ఇది, మనకు మనమే హాని చేసుకోవడమే. సర్వోన్నతన్యాయస్థానం ఆదేశాలను అమలుపరిచేందుకు ప్రభుత్వం నిజంగా నిబద్ధమైతే ఆ విషయాన్ని పోలీసులకు స్పష్టంగా తెలియజేసి ఉండవల్సింది. కోర్టు ఉత్తర్వును కచ్చితంగా అమలుపరచాలని, నిబంధనలను ఉల్లంఘించిన వారిని లాంఛనప్రాయమైన జరిమానాలతో వదిలివేయకూడదని పోలీసులకు గట్టిగా చెప్పి ఉండవల్సింది. ఈ విషయమై పై స్థాయిలో రాజకీయ సంకల్పం కొరవడింది. అయినా నానా బాధ్యతల బరువుతో కుంగిపోతున్న కానిస్టేబుల్స్‌ ప్రతి మొహల్లాలోనూ తిరుగుతూ బాణసంచా పేలుళ్లను నిబంధనల మేరకు అదుపుచేయడం ఎలా సాధ్యం? అది ఆచరణ సాధ్యం కాని విషయం. ‘హరిత టపాసు’ ఏదో, నిషిద్ధ టపాసు ఏదో చెప్పగల అవగాహన బీట్‌ కానిస్టేబుల్‌కు ఉండాలని న్యాయమూర్తులు, నాయకులు భావిస్తున్నారా? చట్టోల్లంఘనకు పాల్పడిన వారిపై పోలీసులు చర్య తీసుకోవాలని వారు ఆశిస్తున్నారా? సామాన్య ప్రజలు స్వచ్ఛందంగా నిబంధనలను పాటించని పక్షంలో బాణసంచాపై నిషేధంకాని, నియంత్రణకాని పనిచేయవనే సత్యాన్ని ఎలా విస్మరిస్తున్నారు? అసలు ఏ చట్టాన్ని అయినా పాటించడమనేది మన దేశంలో ఒక పెద్ద సవాల్‌గా ఉన్నది. 2023లో దేశవ్యాప్తంగా వివిధ నియమాలను ఉల్లంఘించినందుకు దాదాపు 8 కోట్ల ట్రాఫిక్‌ చలాన్లు జారీ చేశారు. చాలా మంది తాము చేసిన తప్పును పదే పదే చేసినవారే కావడం గమనార్హం.

సవరించిన మోటార్‌ వెహికల్స్‌ చట్టం కింద భారీ జరిమానాలు విధించినప్పటికీ అనేక మందిని చట్టానికి కట్టుబడి ఉండేలా చేయడంలో ఆ శిక్ష విఫలమయింది! ఆ జరిమానా మరింత పెద్ద మొత్తంలో విధించినప్పటికీ వారు నిబంధనలను కచ్చితంగా పాటిస్తారనేందుకు హామీ ఉన్నదా? కొద్ది రోజుల క్రితం మహారాష్ట్ర మంత్రి కాన్వాయ్‌ ఒకటి ట్రాఫిక్‌ రద్దీని తప్పించుకునేందుకు నిబంధనలను ఉల్లంఘించింది. ఏ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ కూడా మంత్రిని శిక్షించడం కాదు కదా, కనీసం మందలించ లేదు. చట్టాన్ని కచ్చితంగా పాటించేలా చేయడం ఎలా సాధ్యమవుతుంది? శిక్ష పడుతుందనే భయం ఉండాలి. దానితో పాటు చట్టాన్ని పాటించాలన్న అంతః ప్రేరణ ఉండాలి. స్వచ్ఛంద ప్రవర్తనే సత్ప్రవర్తన. టపాసులు కాల్చడంలో నిబంధనలు ఉల్లంఘించిన వారిలో ఒక డజన్‌ మందికి కఠిన శిక్ష విధించడంతో పాటు నగుబాటుకు గురిచేయండి. అప్పుడు అది తప్పక ఒక గట్టి నేర నిరోధక చర్యగా పరిణమిస్తుంది. పాఠశాలలు, కార్యాలయాలలో అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలి. ఈ ప్రజాహిత విషయంలో మీడియా సంస్థల బాధ్యతను ప్రత్యేకంగా చెప్పాలా? విచారకరమైన విషయమేమిటంటే బాణసంచాను కాల్చడమనేది తమ మత స్వేచ్ఛ హక్కును ఉపయోగించుకోవడమేనని లక్షలాది ప్రజలకు రాజకీయులు నూరిపోశారు. ఈ హక్కును నిరాకరించే అధికారం ఏ ప్రభుత్వానికీ లేదని కూడా ప్రజల మెదళ్లలోకి ఎక్కించారు. ప్రజాహిత స్ఫూర్తిగల పౌరులు బాణసంచాకు వ్యతిరేకంగా తమ గళం విప్పితే వారిని ‘హిందూ వ్యతిరేక’ కులీనులు అనే ముద్ర వేస్తున్నారు. అంతేనా? వారిపై ‘జాతి–వ్యతిరేకులు’ అనే నింద కూడా మోపుతున్నారు! పర్యావరణ పరిరక్షణ హిందూధర్మ స్వతస్సిద్ధ సత్యం. ఈ పురాతన ధర్మం ప్రకృతిని భగవత్‌ సృష్టిగా గౌరవిస్తుంది; వృక్షాలను పూజిస్తుంది; నదుల పట్ల నిత్యం భక్తిప్రపత్తులు ప్రదర్శిస్తుంది. అదే సమయంలో పర్యావరణ సుస్థిరతకు నిరంతరం ప్రయత్నిస్తుంది. పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని డిమాండ్‌ చేయడం సంపన్నులు, పలుకుబడి కలవారు, అధికార ప్రాభవం ఉన్నవారు అభిలషిస్తున్న విషయంగా మాత్రమే చూడకూడదు. అది సమస్త పౌరుల ధర్మబద్ధమైన విధి. హమాలీల నుంచి అందమైన హర్మ్యాలలో నివసించే ఆస్తిపరుల దాకా ప్రతి భారతీయుడినీ వాయు కాలుష్యం బాధిస్తోంది. గాలి నాణ్యత అధ్వానంగా ఉండడమనే సమస్యకు సులభ పరిష్కారాలు లేవు. పంట వ్యర్థాల దగ్ధం, పారిశ్రామిక కాలుష్యం, టపాకాయల కాంతులు, శబ్దాలతో వాటిల్లే ప్రతి సంభావ్య పర్యావరణ ప్రమాదాన్ని సంబాళించేందుకై ఏడాది పొడుగునా అమలుపరిచే ఒక సమగ్ర కార్యాచరణ పథకాన్ని రూపొందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. ప్రజలకు ఆరోగ్యవంతమైన భవిష్యత్తును సమకూర్చేందుకు ఈ కర్తవ్య పాలన తప్పనిసరి.

-రాజ్‌దీప్‌ సర్దేశాయ

Updated Date - Oct 25 , 2025 | 04:13 AM