ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Christian Persecution: క్రైస్తవులకూ తప్పని వేధింపులు

ABN, Publish Date - Aug 15 , 2025 | 02:19 AM

నరేంద్ర మోదీ 2014లో దేశ ప్రధానమంత్రి అయిన నాటి నుంచీ భారతీయ ముస్లింల పట్ల వ్యవహరిస్తున్న తీరుతెన్నులను పలువురు ఆక్షేపిస్తున్నారు. మోదీ సర్కార్‌ను 2002 గుజరాత్‌ మతోన్మాద హింసాకాండ వెన్నాడుతూనే...

నరేంద్ర మోదీ 2014లో దేశ ప్రధానమంత్రి అయిన నాటి నుంచీ భారతీయ ముస్లింల పట్ల వ్యవహరిస్తున్న తీరుతెన్నులను పలువురు ఆక్షేపిస్తున్నారు. మోదీ సర్కార్‌ను 2002 గుజరాత్‌ మతోన్మాద హింసాకాండ వెన్నాడుతూనే ఉన్నది, హిందూత్వ భావజాల మెజారిటీవాద ప్రపంచ దృక్పథమే ప్రభావితం చేస్తూనే ఉన్నది. భారతీయ ముస్లింలు ‘పరాయివారు, ప్రమాదకారులు’గా ఆయన ప్రభుత్వం పరిగణిస్తుందన్న భావనను ప్రజల మనసు నుంచి రూపుమాపలేకపోతున్నారు. సంఘ్‌ పరివార్‌లోని కరడుగట్టిన తీవ్రవాదుల మూలంగా మోదీ ప్రభుత్వం తనపై ఉన్న ముస్లిం వ్యతిరేకతా ముద్రను వదిలించుకోలేకపోతోంది. హిందూత్వ ఉన్మాదులు తమ మాటలు, చేతల్లోను ముస్లింలకు వ్యతిరేకంగా అమానుష నేరాలకు పాల్పడుతున్నారు. ఇటీవల కర్ణాటకలోని బెల్గావి నియోజకవర్గంలో శ్రీరామ సేన నాయకుడు ఒకరిని అరెస్ట్‌ చేశారు. ముస్లిం ప్రధానోపాధ్యాయుడు ఒకరిని అపఖ్యాతిపాలు చేసేందుకు ఒక ప్రభుత్వ పాఠశాలలోని తాగునీటిని విషపూరితం చేసాడని ఆరోపిస్తూ ఆ హెడ్‌మాస్టర్‌ను బదిలీ చేయించాడన్నది శ్రీరామ సేన నాయకుడిపై నమోదైన అభియోగం.

భారతీయ ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేష ప్రసంగాలు పెచ్చరిల్లిపోవడం ఒక సాధారణ విషయమైపోయింది. అయితే అల్పసంఖ్యాకులలో అల్పసంఖ్యాకులు అయిన భారతీయ క్రైస్తవులతో భారతీయ జనతా పార్టీ సంక్లిష్ట సంబంధాల గురించిన మాటా మంతీ దేశ ప్రజలలో తక్కువే. జూలై 26న బీజేపీ పాలనలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌ పోలీస్‌ స్షేషన్‌లో కేరళకు చెందిన ఇద్దరు క్రైస్తవ సన్యాసినులను నిర్బంధించారు. అమ్మాయిల అక్రమ రవాణా, బలవంతంగా మత మార్పిడులకు పాల్పడ్డారన్నది ఆ నన్స్‌పై నమోదైన ఆరోపణ. ఆ గిరిజన ప్రాంతానికి చెందిన స్థానిక బజరంగ్‌దళ్‌ నేతలు అరెస్టయిన క్రైస్తవ సన్యాసినులపై ఆ తప్పుడు ఆరోపణలు చేశారు. అక్రమ రవాణాకు గురయ్యారని చెప్పుతున్న అమ్మాయిలు తాము స్వచ్ఛందంగానే కేరళ నన్స్‌ వెంట వెళ్లామని, నర్సింగ్‌ వృత్తిలో శిక్షణ పొందాలని తాము ఆకాంక్షించామని కూడా వారు స్పష్టం చేశారు. మెరుగైన ఉద్యోగావకాశాలను అన్వేషించుకునేందుకు తమ కుమార్తెలకు అనుమతినిచ్చామని ఆ అమ్మాయిల తల్లిదండ్రులు కూడా చెప్పినట్టు నమోదయింది. అయినప్పటికీ దుర్గ్‌ గిరిజన ప్రాంత పోలీసులు ఈ వాస్తవాలను ఉద్దేశపూర్వకంగా ఉపేక్షించారు. స్థానిక బజరంగ్‌దళ్‌ నాయకుడి ఫిర్యాదు మేరకే ఆ క్రైస్తవ సన్యాసినులను అరెస్ట్‌ చేశారు. ఆ నన్స్‌కు మద్దతు తెలుపుతున్న వ్యక్తులను బజరంగ్‌దళ్‌ నేత జ్యోతిశర్మ బెదిరించినట్టు, కొంత మందిపై చేయి చేసుకున్నట్టు కూడా పూర్తి సాక్ష్యాధారాలతో వార్తలు వెలువడ్డాయి. అయినప్పటికీ పోలీసులు, బజరంగ్‌దళ్‌నే ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌ సాయి సమర్థించారు.

ఇవేవీ ఆశ్చర్యకరమైన విషయాలు కాదు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నేను ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించాను. నారాయణపూర్‌ జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో గిరిజనుల బృందం నొకదానితో మాట్లాడాను. హిందూత్వవాదులు తమను సామాజికంగా బహిష్కరించారని, తదాది తాము భయంతో బతుకుతున్నామని ఆ గిరిజనులు చెప్పారు. చివరకు తమ కుటుంబాలలో చనిపోయిన వారిని ఖననం చేసేందుకు కూడా అనుమతినివ్వడం లేదని వారు వాపోయారు. తిరిగి హిందూ మతంలోకి మారేంతవరకు తమను సామాజికంగా బహిష్కరిస్తామని హిందూత్వవాదులు అంటున్నారని వారు చెప్పారు. క్రైస్తవ గిరిజనుల ‘ఘర్‌–వాప్సి’ కార్యక్రమాన్ని సంఘ్‌ పరివార్‌ చాలా సంవత్సరాలుగా సువ్యవస్థితంగా నిర్వహిస్తోంది. మిషనరీలు ప్రలోభాలతో గిరిజనులను బలవంతంగా క్రైస్తవంలోకి మార్చుతున్నందుకు వ్యతిరేకంగా క్రైస్తవ గిరిజనులను సామాజిక బహిష్కరణతో తిరిగి హిందూ మతంలోకి తీసుకువచ్చేందుకు సంఘ్‌ పరివార్ అనుబంధ సంస్థ వనవాసి కల్యాణ్‌ కేంద్రాలు కృషి చేస్తున్నాయి.

భారత పౌరులకు మత స్వేచ్ఛ రాజ్యాంగబద్ధమైన హక్కు. తమకు ఇష్టమైన మతంలోకి మారే స్వేచ్ఛ అందులో భాగమే. బాబాసాహెబ్‌, ఆయన అనుయాయులు బౌద్ధ మతంలోకి మారారన్న విషయాన్ని మనం విస్మరించకూడదు. అయితే రాజ్యాంగ హక్కులు సంపూర్ణమైనవి కావు. ఇతర కారణాల దృష్ట్యా వాటిని ఎంపిక చేసి తగ్గించవచ్చు. ఈ దృష్ట్యా క్రైస్తవానికి మార్పిడిని బలవంతంగా జరిగినదిగా, అదొక నేరపూరిత చర్యగా పరిగణిస్తున్నారు. అయితే హిందూ మతంలోకి మళ్లీ మారడాన్ని స్వచ్ఛంద చర్యగా కొత్త జీవితానికి ఆశీర్వాదంగా భావిస్తున్నారు. అధికారంలో ఉన్న ప్రభుత్వాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తున్న కారణంగానే బజరంగ్‌దళ్‌, విశ్వహిందూ పరిషత్‌ కార్యకర్తలు తమ ఇష్టారాజ్యంగా, నిర్భీతితో వ్యవహరించడం మామూలైపోయింది. భయపూరిత వాతావరణాన్ని సృష్టించి పోలీసుల మద్దతుతో ఘర్‌–వాప్సి కార్యక్రమాన్ని అమలుపరుస్తున్నారు.

అనూహ్యంగా కేరళ క్రైస్తవ సన్యాసినులకు బెయిల్‌ మంజూరయింది. కేరళ ఎంపీలు కొంతమంది హోం మంత్రి అమిత్‌ షాను కలుసుకుని ఆ వ్యవహారంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరడంతో ఆ బెయిల్ మంజూరు సుసాధ్యమయింది. కేంద్ర హోం శాఖ చాలా వేగంగా ప్రతిస్పందించింది, సందేహం లేదు. ఆ క్రైస్తవ సన్యాసినుల అరెస్ట్‌ కేరళలో రాజకీయ ఉద్రిక్తతలకు కారణం కావడం వల్లే అమిత్‌ షా ఎంపీలు అడిగిన వెన్వెంటనే జోక్యం చేసుకున్నారు. కేరళలో క్రైస్తవ జనాభా అధికంగా ఉన్నది. అందునా ఆ రాష్ట్రంలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగ నున్నాయి. కేరళలో ఎలాగైనా అధికారంలోకి రావడానికి బీజేపీ ఆరాటపడుతోంది. క్రైస్తవులను ఆకట్టుకోవడం ద్వారా హిందూ–క్రైస్తవ రాజకీయ ఒప్పందంతో అధికారాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ సంకల్పించుకున్నది. ఛత్తీస్‌గఢ్‌ పోలీసుల చెర నుంచి విడుదలై కేరళకు తిరిగి వచ్చిన క్రైస్తవ సన్యాసినులకు విమానాశ్రయంలో స్వాగతం పలికిన వారిలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాజీవ్‌ చంద్రశేఖర్‌ ఉండడంలో ఆశ్చర్యమేమీ లేదు. గోవాలో సొంత బలంతోను, మేఘాలయ, నాగాలాండ్‌లలో సంకీర్ణ ప్రభుత్వ భాగస్వామిగాను బీజేపీ అధికారంలో ఉన్నది. ఇవన్నీ క్రైస్తవులు అధికంగా ఉన్న రాష్ట్రాలే. ముస్లింలకు వ్యతిరేకంగా వ్యవహరించడం, ఆ మతస్తులు అత్యధికంగా ఉన్న జమ్మూ–కశ్మీర్‌ను రాత్రికి రాత్రే కేంద్ర పాలిత ప్రాంతాలుగా కుదించివేయడం తమ రాజకీయ ప్రయోజనాలకు దోహదం చేకూరగలదని బీజేపీ భావిస్తుండవచ్చు. అయితే క్రైస్తవులను తరచు విమర్శలకు లక్ష్యం చేసుకోలేదు. దానివల్ల దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా తనపై విమర్శలు వెల్లువెత్తగలవన్న వాస్తవాన్ని బీజేపీ విస్మరించలేదు.

ఈద్‌ పర్వదినం సందర్భంగా ముస్లిం మత పెద్దలు నిర్వహించే కార్యక్రమాలలో ఎన్నడూ పాల్గొనని ప్రధాని మోదీ గత డిసెంబర్‌లో క్రిస్మస్‌ వేడుకల సందర్భంగా కేథలిక్‌ బిషప్స్‌ కాన్ఫరెన్స్‌ గ్రూప్‌ ఇండియా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని జీసస్‌ బోధనలను ప్రస్తుతించారు. ఆ దైవ పురుషుని సామరస్యం, సౌభ్రాతృత్వ సందేశాలు మానవాళికి మార్గదర్శకమైనవని పేర్కొన్నారు. అంతేకాదు, క్రిస్మస్‌ పర్వదినం నాడు ప్రధానమంత్రి తన నివాసంలో క్రైస్తవ మత పెద్దలకు తేనీటి విందు ఇచ్చారు. జీసస్‌ ప్రబోధించిన విలువలను ఔదలదాల్చాలని సూచించారు. ఏ విధంగా చూసినా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్నేహపూర్వకమైన, ఆకర్షణీయమైన ఆతిథేయి, సందేహం లేదు.

సహనం, శాంతి సామరస్యాల సందేశం సామాన్య క్రైస్తవులకు చేరనప్పుడు మోదీ వ్యూహాత్మకంగా, ఆ అల్పసంఖ్యాకులను మొత్తంగా ఆకట్టుకునేందుకు చేస్తున్న ప్రయత్నాల వల్ల ప్రయోజనమేముంది? క్రైస్తవ సన్యాసినులు, మిషనరీలు బలవంతంగా మత మార్పిడులు చేయిస్తున్నారని బజరంగ్‌దళ్‌ ఆరోపిస్తోంది. ఈ క్రైస్తవులు ‘జాతి–వ్యతిరేకులు’, నేరస్థులు, ఇంకా అంతకంటే ఘోరమైనవారని కూడా ఆ హిందూత్వ సంస్థ దుయ్య బడుతోంది. 1999లో ఒడిషాలో మిషనరీ గ్రాహమ్‌ స్టెయిన్‌, బాలురు అయిన ఆయన కుమారులు ఇరువురూ బజరంగ్‌దళ్‌ నాయకుడు దారాసింగ్‌ పైశాచిక ఘాతుకానికి సజీవంగా దహనమయ్యారు. ఆ ఘటన, భారతీయ మత సామరస్య మహోదాత్త సంప్రదాయానికి ఒక మచ్చలా మిగిలిపోయింది. అలాగే, ఇటీవలి కాలంలో అష్టపదుల వయసులో ఉన్న ఫాదర్‌ స్టాన్‌స్వామి నక్సలైట్ల సానుభూతిపరుడు అనే నెపంతో, ‘ఉపా’ కింద అరెస్ట్‌ చేశారు. జైలులో ఉండగా ఆయనకు అత్యవసర వైద్య సదుపాయాలు సైతం ఆయనకు నిరాకరించారు. కోర్టు జోక్యం చేసుకునే దాకా ఆ వృద్ధుడిని జైలులోనే నిర్బంధించారు. అంతిమంగా ఆయన ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. గత జూన్‌లో సంగ్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే గోపీచంద్‌ పదాల్కర్‌ రూ.3 నుంచి రూ. 11 లక్షల బహుమానాన్ని ప్రకటించారు. ఎందుకు? ‘బలవంతంగా మత మార్పిడులకు పాల్పడున్న క్రైస్తవ పూజారులపై హింసాత్మక దాడులను ప్రోత్సహించేందుకే సుమా. గ్లోబల్‌ వాచ్‌డాగ్‌ గ్రూప్‌ ‘ఓపెన్‌ డోర్స్‌ గ్రూప్‌ రూపొందించిన 2024లో క్రైస్తవులను వేధించిన ‘ప్రత్యేక ఆందోళనకరమైన దేశాలు’ జాబితాలో భారత్‌ 11వ స్థానంలో ఉన్నది.

క్రైస్తవ మిషనరీలు పెద్ద ఎత్తున సామూహిక మత మార్పిడిలు చేయిస్తున్నారనే ఆరోపణ ఒకటి నిత్యం వినిపిస్తుండడం కద్దు. వాస్తవమేమిటి? దేశ జనాభాలో క్రైస్తవులు కేవలం 2.3 శాతం మంది మాత్రమే. ఆసక్తికరమైన విషయమేమిటంటే 1971 జనాభా గణనలో ఆ మతస్థులు 2.6 శాతంగా ఉన్నారు. క్రైస్తవ జనాభా తగ్గిపోతున్నప్పటికీ వారికి వ్యతిరేకంగా ఒక కపట ప్రచారం జరుగుతోంది. క్రైస్తవ మిషనరీలు బలవంతంగా, మోసంతో, నానా ప్రలోభాలతో సామూహిక మత మార్పిడులు చేయిస్తున్నారన్నదే ఆ తప్పుడు ప్రచారం. అల్పసంఖ్యాకులలో అల్పసంఖ్యాకులు అయిన క్రైస్తవుల పట్ల ఈ నిరాధార వ్యతిరేకతలు, విద్వేషాలను ముగింపునకు తీసుకురావడం ఎలా? ఈ ఏడాది క్రిస్మస్‌ పండుగ రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్రైస్తవ మత పెద్దలకు తేనీటి విందు ఇచ్చి జీసస్‌ మానవతను మెచ్చుకోవడం కాకుండా తమ క్రైస్తవ మత వ్యతిరేక కార్యకలాపాలకు స్వస్తి చెప్పి తీరాలని బజరంగ్‌దళ్‌ను సరళంగా, కఠినంగా హెచ్చరించాలి. భారతీయ నాగరికతా విలువలను కళంకపరిచే చర్యలకు పాల్పడకూడదని స్పష్టం చేయాలి. ఇది మాత్రమే మోదీని, బీజేపీని భారతీయ క్రైస్తవులకు ప్రేమాస్పదులను చేస్తుంది. అంతేగానీ వ్యూహాత్మక భేటీలు, విందులు, మరే ఇతర ప్రచార ఆర్భాటాలు ఆ మతస్తుల నుంచి గౌరవాదరాలను మీకు సమకూర్చలేవు.

రాజ్‌దీప్‌ సర్దేశాయి

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌)

ఈ వార్తలు కూడా చదవండి..

పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్..

సీఎంపై ప్రశంసలు.. ఎమ్మెల్యేను బహిష్కరించిన పార్టీ

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Aug 15 , 2025 | 02:19 AM