ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Bihar Elections: బిహార్‌ను మోదీ మ్యాజిక్‌ ఆకట్టుకునేనా

ABN, Publish Date - Sep 17 , 2025 | 02:52 AM

‘బిహార్‌లో చొరబడిన ప్రతి ఒక్కరూ వెళ్లిపోవాల్సిందే..’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం బిహార్‌లో పూర్ణియా జిల్లాలో మాట్లాడుతూ అన్నారు. బిహార్‌లో గత జనవరి నుంచి మోదీ ఏడవ పర్యటన ఇది. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా...

‘బిహార్‌లో చొరబడిన ప్రతి ఒక్కరూ వెళ్లిపోవాల్సిందే..’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం బిహార్‌లో పూర్ణియా జిల్లాలో మాట్లాడుతూ అన్నారు. బిహార్‌లో గత జనవరి నుంచి మోదీ ఏడవ పర్యటన ఇది. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా మోదీ అక్కడి ప్రజలను దృష్టిలో ఉంచుకుని తన ఎన్నికల ప్రచారాస్త్రాలను సిద్ధం చేసుకుంటారు. బిహార్‌లో తన ప్రచారాన్ని ఏ దిశన మళ్లించబోతున్నారో ఇప్పటికే స్పష్టమైంది. బిహార్‌లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ పేరిట అనేక మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించేందుకు ఎన్నికల కమిషన్ ఉధృతంగా చేపట్టిన ప్రక్రియను ప్రతిపక్షాలు మాత్రమే కాదు, సుప్రీంకోర్టు కూడా తప్పుపట్టింది. మొత్తం ఎస్ఐఆర్‌నే నిలిపివేస్తాం జాగ్రత్త అని సుప్రీంకోర్టు సోమవారం హెచ్చరించింది.

ఎస్ఐఆర్‌ను వివాదరహితంగా నిర్వహించడంలో ఎన్నికల కమిషన్ పూర్తిగా విఫలమైంది. ఓట్ల చోరీ విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు కమిషన్ వద్ద స్పష్టమైన సమాధానాలు లేవు. నిజానికి ఎన్నికల కమిషన్ బీజేపీ ప్రభుత్వానికి ప్రయోజనం కన్నా నష్టం ఎక్కువ చేస్తుందనడంలో ఆశ్చర్యం లేదు. ఈ పరిస్థితి నుంచి బీజేపీని కాపాడాల్సిన బాధ్యతను మోదీయే పూర్తిగా తన భుజస్కంధాలపై వేసుకున్నారు. అక్రమ వలసదారుల వల్ల బిహార్, పశ్చిమ బెంగాల్, అస్సాం ప్రజలు తమ కూతుళ్లు, చెల్లెళ్ల భద్రత పట్ల ఆందోళనతో ఉన్నారని మోదీ ప్రకటించారు. అంటే అక్రమంగా వలసవచ్చిన వారు ఈ రాష్ట్రాల్లో చాలా అకృత్యాలకు పాల్పడుతున్నారని ఆయన ఆందోళన సారాంశం. పైగా ఇలాంటి వారిని కాపాడేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని, యాత్రలు కూడా చేస్తున్నాయని మోదీ ఆరోపించారు. ఓట్ చోరీకి వ్యతిరేకంగా రాహుల్‌గాంధీ చేపట్టిన ఓటర్ అధికార్‌ యాత్రను ఉద్దేశంలో ఉంచుకునే ఆయన ఈ విమర్శలు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.

ఉత్తరాదిన అత్యంత కీలక ప్రభావం చూపే బిహార్‌లో మాత్రం బీజేపీ గత కొన్ని దశాబ్దాలుగా విశ్వయత్నాలు చేస్తున్నప్పటికీ స్వంతంగా అధికారంలోకి రాలేని స్థితి ఉన్నది. మండల్ రాజకీయాలు ప్రవేశించిన తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ ఆవిర్భావంతో ఓబీసీలు, మైనారిటీలు సంఘటితమయ్యారు. 1995లో జార్జి ఫెర్నాండెజ్, నితీశ్‌కుమార్‌తో కలిసి లాలూతో వేరుపడ్డ తర్వాత కూడా 2005 వరకు లాలూ ఆధిపత్యాన్ని తగ్గించలేకపోయారు. 1998, 1999 లోక్‌సభ ఎన్నికల్లో, 2000లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఫెర్నాండెజ్, నితీశ్‌కుమార్‌లు ఇద్దరూ బీజేపీతో చేతులు కలిపారు. అప్పటికి లాలూ పశుగ్రాసం కుంభకోణంలో చిక్కుకుని తన భార్య రబ్రీదేవిని ముఖ్యమంత్రి చేయాల్సి వచ్చింది. 2000లో నితీశ్‌కుమార్ ముఖ్యమంత్రి అయినప్పటికీ మెజారిటీ నిరూపించుకోలేకపోవడంతో మళ్లీ రబ్రీదేవి ముఖ్యమంత్రి అయి 2005 వరకు అధికారంలో కొనసాగారు. ఆ తర్వాత ఎన్డీఏలో నితీశ్‌కుమార్ తిరుగులేని నాయకుడయ్యారు. 2010లో నితీశ్‌కుమార్ నాయకత్వంలోని జేడీ(యు) 115 సీట్లు సాధించగా, బీజేపీ 91 సీట్లు సాధించింది.

కానీ బీజేపీలో క్రమక్రమంగా ఒక ప్రత్యామ్నాయ నాయకుడుగా నరేంద్రమోదీ అవతరిస్తున్న క్రమంలో నితీశ్‌కుమార్ మొదట్లో ఆయనను సరిగా అంచనా వేయలేకపోయారు. 2005, 2010లో మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉంటూనే బీజేపీకి దేశమంతా స్టార్ క్యాంపెనియర్‌గా అవతరిస్తున్నప్పుడు నితీశ్‌ ఆయనను విస్మరించారు. 2010లో ఘన విజయం తర్వాత ఆయనలో జాతీయ స్థాయిలో ఆకాంక్షను రేకెత్తించింది. మోదీని వ్యతిరేకిస్తే లాలూ ముస్లిం ఓట్ బ్యాంకును కూడా ఆకట్టుకోగలననుకున్నాడు. తొలుత బిహార్‌లో మోదీని ప్రచారానికి పంపవద్దని బీజేపీ నాయకత్వాన్ని అడ్డుకున్న నితీశ్‌కుమార్... మోదీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించడంతో ఎన్డీఏ నుంచి తప్పుకున్నాడు. కానీ 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మోదీ ప్రభంజనంలో బిహార్‌లో బీజేపీకి 22 సీట్లు రాగా 40 సీట్లకు పోటీ చేసిన జేడీ(యు) 2 సీట్లకు పరిమితమైంది. దీనితో 2015లో అతడు మళ్లీ లాలూతో చేతులు కలిపి ముఖ్యమంత్రి పదవికోసం రాజీపడాల్సి వచ్చింది.

ఒకప్పుడు నితీశ్‌కుమార్ తనను తీవ్రంగా వ్యతిరేకించి, తనను రాష్ట్రంలో అడుగుపెట్టనీయకుండా చేసినప్పటికీ అతడినే చేరదీసి బిహార్‌లో ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేయగలగడం మోదీ ప్రత్యేకత. నిజానికి జేడీ(యు)–ఆర్‌జేడీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మోదీ ఢిల్లీ నుంచి కొన్ని వ్యూహాత్మక చర్యలు తీసుకున్నారు. మాఫియా డాన్, ఆర్‌జేడీ ఎంపీ షాహబుద్దీన్‌ 2016 సెప్టెంబర్‌లో వ్యూహాత్మకంగా విడుదల కావడం అందులో భాగం. అతడు బయటకు వచ్చీ రాగానే పెద్ద ఎత్తున ర్యాలీని నిర్వహించి నితీశ్‌కుమార్‌ను అసమర్థ ముఖ్యమంత్రిగా దూషించడం మొదలుపెట్టాడు. అదే సమయంలో లాలూ, తేజస్వి నివాసాలపై సీబీఐ దాడులు తీవ్రతరం కావడం మరో వ్యూహం. తన ప్రభుత్వ విశ్వసనీయత పడిపోతుండడం, ఆర్‌జేడీ నుంచి ఒత్తిళ్లను, అవమానాలను తట్టుకోలేకపోవడంతో నితీశ్ ఆర్‌జేడీతో తన స్నేహం పొసగదని గ్రహించి రాజీనామా చేశాడు. ఈ అదనుకోసమే ఎదురు చూసిన మోదీ, నితీశ్‌ రాజీనామా చేసిన మూడు గంటల్లోనే ఆయనకు మద్దతునిచ్చేందుకు బీజేపీ నాయకత్వాన్ని ఒప్పించారు. కేవలం 14 గంటల వ్యవధిలో బీజేపీ ఒక ముఖ్యమైన రాష్ట్రాన్ని చేజిక్కించుకోగలగడం మోదీ మాస్టర్ స్ట్రోక్ అని చెప్పక తప్పదు. అంతే కాదు, 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ–జేడీ(యు) కూటమి 40 సీట్లలో 39 సీట్లు గెలుచుకోవడమే కాదు, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్‌కుమార్ కంటే ఎక్కువ సీట్లు సాధించినా బీజేపీ ఆయనకే ముఖ్యమంత్రి పట్టాన్ని కట్టబెట్టింది.

ఈ నేపథ్యంలో మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న బిహార్‌లో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? గత రెండు దశాబ్దాలుగా అధికారంలో ఉన్న నితీశ్‌ ఆరోగ్య పరిస్థితి అంత బాగా లేదు. ఆయన నాయకత్వ ప్రభావం క్షీణిస్తోంది. బిహార్‌లో బీజేపీకి సారథ్యం వహించదగిన సమర్థులైన స్థానిక నాయకత్వం లేదు. మరోవైపు ప్రతిపక్షాలు కలిసికట్టుగా కార్యాచరణకు పూనుకుంటున్నాయి. కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ చేపట్టిన ఓటర్ అధికార్‌ యాత్ర ఆ పార్టీ పుంజుకునేందుకు తోడ్పడే అవకాశాలను కల్పించింది. ఈ పరిస్థితుల్లో బిహార్‌లో బీజేపీని ఆదుకోగలిగిన నాయకుడు మోదీ తప్ప మరెవరూ కనిపించడం లేదు. కానీ మోదీ ఒక్కరే బిహార్‌లో బీజేపీకి అత్యధిక సీట్లు సాధించి పెట్టగలరా అన్నది ఇప్పుడు రాజకీయ పరిశీలకుల ముందున్న ప్రశ్న. బీజేపీకి బలమైన సంస్థాగత సామర్థ్యం, క్రమశిక్షణ గల కేడర్, సైద్ధాంతిక స్పష్టత ఉన్నప్పటికీ నితీశ్‌తో చేతులు కలపకుండా స్వంతంగా అధికారంలోకి రాగలమనే ధైర్యం ఆ పార్టీకి లేదు. అంతేగాక, బిహార్ ఇంకా ఓబీసీ ఆధిపత్య రాష్ట్రం. బీజేపీ ఆ రాష్ట్రంలో ఇంకా అగ్రవర్ణాల పార్టీ అన్న ముద్ర పోగొట్టుకోలేదు. నితీశ్‌ వంటి నేతను స్వంతంగా సృష్టించుకోలేదు. ఆ రాష్ట్రంలో పట్టణ జనాభా ఇప్పటికీ 15 శాతం దాటలేదు. మరి బీజేపీ ఆ రాష్ట్రంలో పూర్తిగా ఎలా చొచ్చుకుపోగలదు?

మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ సగటున ప్రతి ఏడాదీ బిహార్‌కు పెద్ద ఎత్తున ప్యాకేజీ ప్రకటిస్తూనే ఉన్నది. 2015లో రూ.1.25 లక్షల కోట్ల నుంచి, తాజాగా ప్రకటించిన రూ. 40 వేల కోట్ల వరకు లెక్క తీస్తే బిహార్‌కు రూ.2 లక్షల కోట్లకు పైగా కేంద్రం విడుదల చేసే ఉండాలి. ఇంత మొత్తం విడుదల జరిగితే బిహార్ రూపురేఖలు మారి ఉండాలి. కానీ బిహార్ ఇప్పటికీ వెనుకబడిన రాష్ట్రమే. అత్యధికశాతం మంది నిరక్షరాస్యులు. నిరుద్యోగులు. నీతీ ఆయోగ్ నివేదిక ప్రకారమే సహస్రాబ్ది లక్ష్యాల విషయంలో బిహార్‌ అట్టడుగు స్థానంలో ఉన్నది. దేశంలో వివిధ రాష్ట్రాలకు నైపుణ్యం లేని శ్రమజీవులను పంపించడంలో బిహార్ అగ్రస్థానంలో ఉన్నది. బిహార్ కార్మికులు లేని నగరం అంటూ కనపడదు.

ఈ పరిస్థితుల్లో అభివృద్ధి గురించి, తాము విడుదల చేసిన లక్షల కోట్ల గురించి చెప్పి ఓట్లు అడగడం సరైంది కాదని మోదీకి తెలియనిది కాదు. అందుకే అక్రమ వలసదారుల సమస్యను తీవ్ర స్థాయిలో లేవనెత్తడం ప్రారంభించారు. అయితే బిహార్‌లో నిజంగా అక్రమ వలసదారుల సమస్య ఉన్నదా? ఉంటే ఎంతవరకు అది ఎన్నికలను ప్రభావితం చేస్తుంది? కుల సమీకరణలు ఎక్కువగా ఉన్న బిహార్‌లో మత సమీకరణలు ఎంతవరకు పనిచేస్తాయి? చెప్పడం కష్టం.

నిజానికి బిహార్ నుంచే అనేక మంది పెద్ద ఎత్తున పొట్ట చేతపట్టుకుని దేశంలో నలుమూలలకు పనికోసం వలస వెళుతుంటే, బంగ్లాదేశీయులు బిహార్‌లో దేని కోసం వలస వస్తారు? వారు ఎంత శాతం మంది ఉంటారు? ఎన్నికల రాజకీయాల్లో వారి ప్రభావం ఎంత మేరకు ఉంటుంది? ఒకవేళ వచ్చినా గత 11 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, బిహార్‌లో 20 సంవత్సరాల్లో 14 సంవత్సరాలు అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఈ అక్రమ వలసల్ని ఎందుకు అరికట్టలేకపోయింది? ఎన్నికల కమిషన్ పనితీరుపై సుప్రీంకోర్టు కూడా అనేక ప్రశ్నలు వేసింది. ఎన్నికల కమిషన్ బీజేపీ తరఫున పనిచేస్తోందని ప్రతిపక్షాలు కూడా తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బిహార్‌లో ఇండియా కూటమికి, ఎన్డీఏకు మధ్య జరిగే పోటీ దేశ రాజకీయాల్లో తీవ్ర ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రస్తుతం దేశం దృష్టి అంతా బీజేపీపై ఉన్నది. మోదీ నాయకత్వానికి ఈ ఎన్నికలు ఒక అగ్నిపరీక్ష.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

ఇవి కూడా చదవండి..

ఆపరేషన్ సిందూర్‌లో మసూద్ అజార్ కుటుంబం ముక్కచెక్కలు.. వెల్లడించిన జైషే కమాండర్

భారత్‌తో మా బంధాన్ని తెంచేందుకు చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి: రష్యా విదేశాంగ శాఖ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయం

Updated Date - Sep 17 , 2025 | 02:52 AM