Madhunapantula Satyanarayana Sastry: మధునాపంతుల స్ఫూర్తి చిహ్నం ఆంధ్రీ కుటీరం
ABN, Publish Date - Sep 22 , 2025 | 02:53 AM
ఫ్రెంచి యానాం పట్టణ గ్రామానికి అతి సమీపంలో ఉన్న కుగ్రామం పల్లిపాలెం. ఇక్కడి నుంచే ఆంధ్ర పురాణం కావ్యకర్త మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు తన సాహిత్య ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆయనే దాదాపు ఏడున్నర దశాబ్దాల క్రితం...
ఫ్రెంచి యానాం పట్టణ గ్రామానికి అతి సమీపంలో ఉన్న కుగ్రామం పల్లిపాలెం. ఇక్కడి నుంచే ఆంధ్ర పురాణం కావ్యకర్త మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు తన సాహిత్య ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆయనే దాదాపు ఏడున్నర దశాబ్దాల క్రితం ఈ ఊరిలో ‘ఆంధ్రీ కుటీరం’ను ప్రారంభించారు. ప్రాంతాలతో సంబంధం లేకుండా అన్ని ప్రాంతాలకు చెందిన కవులు, రచయితలు ఈ గ్రామం వచ్చి, ఆంధ్రీ కుటీరంలో తమ సాహిత్య సంపదను పంచుకున్నారు. ఈ కుటీరాన్ని, దాని తరఫున జరిగిన సాహిత్య సేవని ఇప్పుడు మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారి తమ్ముడి కుమారుడు మధునాపంతుల సత్యనారాయణ నేటికీ కొనసాగిస్తున్నారు. ఆంధ్రీ కుటీరం నిర్వహణ గురించి, దాని ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ కార్యక్రమాల గురించి సత్యనారాయణ గారితో జరిపిన సంభాషణ ఇది.
కోనసీమ జిల్లాలో మారుమూల ఉన్న ఈ పల్లిపాలెంలో ఆంధ్రీ కుటీరం గురించి, ఇక్కడికి వచ్చిన గొప్ప సాహితీవేత్తల గురించి, మీరు ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాల గురించి చెప్పండి?
కాకినాడ జిల్లా, కాజులూరు మండలం, పల్లిపాలెం మా స్వగ్రామం. శతాబ్దాల క్రితం ఇక్కడకు వచ్చి మా కుటుంబాలు స్థిరపడ్డాయి. భిషగ్రత్న మధునాపంతుల సత్య నారాయణ మూర్తి – లక్ష్మమ్మల ప్రథమ సంతానం కళా ప్రపూర్ణ మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రిగారు. ఆయన తమ్ముడు మధునాపంతుల సూరయ్య శాస్త్రి. సత్యనారాయణ శాస్త్రి గారు తన 14వ ఏట ఈ ఆంధ్రీకుటీరం స్థాపించారు. ఆంధ్రీ కుటీర లక్ష్యాలు– గ్రామంలో సాహిత్య చైతన్యం తీసుకురావడం, యువత దారి తప్పకుండా వారిని పఠనం వైపు, రచనల వైపు మళ్ళించడం, దళితులకు సంస్కృత విద్యాబోధన, అలాగే ఒక గ్రంథాలయ స్థాపన. ఆంధ్రీకుటీరం 1939లో ‘ఆంధ్రి’ అనే మాసపత్రికను ప్రారంభించింది. దీనికి పిఠాపురం ఆస్థాన కవి ఓలేటి వేంకట రామ శాస్త్రి సర్వాధ్యక్షులు. ‘ఆంధ్రి’ పత్రికకు చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి మొదలుకొని గుర్రం జాషువా వంటివారు తమ రచనలు పంపి ప్రోత్సహించారు. అయితే 42 సంచికలు మాత్రమే వచ్చాయి. రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా పేపర్ కొరత మొదలైన సమస్యల వల్ల పత్రిక ఆగిపోయింది. ‘ఆంధ్రి’ పత్రిక ద్వారా ప్రసిద్ధులైన రచయితలను పరిచయం చేస్తూ మధునాపంతుల సంపాదక వ్యాసాలు రాశారు. అవి అనంతర కాలంలో శతాధిక రచయితల సమాచారంతో ‘ఆంధ్ర రచయితలు’ అనే ప్రామాణిక గ్రంథంగా విడుదలయ్యింది.
మీ పెద్దనాన్నగారికి మీరు సాహిత్య వారసులు అనుకోవాలా? మీ కుటుంబంలో మరెవరైనా సాహిత్య సృజన చేసినవారున్నారా?
ఆస్తికైతే ప్రత్యకించి వారసులు ఉంటారు. కానీ సాహిత్యకారులకు ఆ రంగంలో విశేష కృషి చేస్తున్న వారంతా వారసులే. నా వరకు నేను భాషా ప్రవీణ చదువుకుని పండిత శిక్షణ పొంది తెలుగు ఎంఏ చేసి మూడు దశాబ్దాలు తెలుగు పండితుడుగా పనిచేసిన వాడినే. కుటుంబ వాతావరణం, సంస్కృతాంధ్రాలు చదివి ఉండడం నన్ను సాహిత్యంవైపు, తెలుగు పండితుడిగా ఉద్యోగం వైపు ప్రోత్సహించాయి. పద్యం రాయడం మొదలుపెట్టిన రోజుల్లో పెద నాన్నగారి ‘ఆంధ్ర పురాణం’ చేతికొచ్చింది. రాస్తే పెద్దనాన్నగారిలా పద్యం రాయాలి. లేకపోతే ఊరుకోవాలి. కానీ ఊరుకోలేకపోయాను. వచన కవిత్వం వైపు మళ్లాను. 70–80 దశకాలలో కాకినాడలో గొప్ప సాహిత్య వాతావరణం ఉండేది. సోమ సుందర్, అద్దేపల్లి వంటి వారు ఉత్సాహభరితంగా సాహిత్య కార్యక్రమాలు చేసేవారు. వాటిలో పాల్గొనడం నాకు మరింత స్ఫూర్తినిచ్చింది. అప్పుడప్పుడు నేను రాసిన వచన కవిత్వం పత్రికల్లోనూ, ప్రత్యేక సంచికల్లోనూ ప్రచురణ కావడం మరింత ప్రోత్సాహాన్ని అందించింది.
మధునాపంతుల కుటుంబంలో సత్యనారాయణశాస్త్రి గారి మూడవ కుమారుడు మధునామూర్తి జర్నలిస్టుగా ఉద్యోగం చేస్తున్నాడు. వ్యాస రచనలు చేశాడు. మా చిన్నమ్మాయి మధునాపంతుల (ఆకొండి) రత్న కళిక కవిత్వం రాయడమే కాక ‘ఆంధ్రి’ పత్రికలపై పరిశోధన చేసి యంఫిల్ పట్టా పొందింది. మా తండ్రి ‘మూక పంచశతి’ని అనువాదం చేసి ‘దేవీ నవతి’ పేరుతో ప్రకటించారు. మా తాతగారు 1927 లోనే ఆ కొండి రామమూర్తి గారి ఆయుర్వేద జీవితం మీద పెద్ద పుస్తకం రాశారు. ఆ విధంగా సత్యనారాయణ శాస్త్రి గారికి పూర్వమే సాహిత్య సృజన దిశగా అడుగులు వేసిన కుటుంబం మాది.
ప్రతి ఏటా ఒక సీనియర్ రచయితకి, ఇద్దరు కొత్త వారికి మీరు కథా గౌరవ పురస్కారం ఇస్తున్నారు. దీని నేపథ్యం ఏమిటి? ఎంపిక బాధ్యత ఎవరిది? అలాగే ఆంధ్రీకుటీరం ఇస్తున్న ఇతర పురస్కారాల గురించి చెప్పండి?
మా కుటుంబాలకే చెందిన మధునాపంతుల వెంకటేశ్వర్లు మధుశ్రీలు పేరుతో కవితలు, కథలు రాసేవారు. ఆయన కుమారుడు కిరణ్ మధునాపంతుల సాఫ్ట్వేర్ రంగానికి చెందిన పారిశ్రామికవేత్త. ఆయన తన తండ్రి మరణానంతరం ఏటా ‘కథా గౌరవం’ అనే పేరుతో ఇద్దరు సీనియర్లకు రూ.20,000 చొప్పున ఒక కొత్త కథా రచయితకు రూ.10,000 చొప్పున నగదు బహుమతి ఇచ్చి సన్మానిస్తున్నారు. ఇక ఆంధ్రీకుటీరం పురస్కారాల మాటకొస్తే ఏటా మధునాపంతుల వారి జయంతులు, వర్ధంతులు జరుపుతాం. కవి పండితులను గౌరవిస్తాం. అలాగే రామకృష్ణ కవుల సాహిత్య సమాలోచన సభలు జరుపుతాం. అవధాన రంగానికి చెందిన వారిని గౌరవిస్తాం. ఆచార్య బేతవోలు రామబ్రహ్మం (పద్యకవిత్వం), దర్భశయనం శ్రీనివాస ఆచార్య (వచన కవిత్వం) మొదటి పురస్కారాలను అందుకున్నారు. ఇక పురస్కారాల ఎంపికకు ప్రత్యేకమైన జ్యూరీ అంటూ ఏమీ ఉండదు. మా కుటుంబాలలో చాలామంది మంచి చదువరులు ఉన్నారు. మేమే వీలైనప్పుడల్లా సేకరించి చదువుకొని ఒకరి అభిప్రాయాలు ఒకరు పంచుకొని నలుగురు ఐదుగురిని ఎంపిక చేస్తాం. కిరణ్ మధునాపంతుల, నేను ఒక నిర్ణయానికి వచ్చాక ప్రకటిస్తాం. కొందరు మిత్రులు ‘ఫలానా రచయితలు మీ దృష్టికి వచ్చారా’ అని అడిగినప్పుడు ఆ పుస్తకాలు మా దగ్గర లేకపోతే డబ్బు పంపి తెప్పించుకుని, చర్చించుకుని ఒక నిర్ణయానికి వస్తాం.
ఈ మధ్య మీరు ఈ ఆంధ్రీ కుటీరంలో ప్రారంభించి ‘రత్నప్రభ’ గ్రంథాలయం గురించి చెప్పండి?
రత్న ప్రభా గ్రంథాలయం 2024 జనవరిలో ప్రారంభించాం. కవి, రచయిత మిత్రులు కొందరు వదాన్యులు ఇప్పటికీ 12 వేలకు పైగా పుస్తకాలు వితరణ చేశారు. ఈ గ్రంథాలన్నీ సంరంక్షించడానికి ఒక సువిశాలమైన గదిని, లైబ్రేరియన్‌ను ఏర్పాటు చేశాం. పరిశోధకులు, కవులు వస్తే వారు ఉండడానికి మంచి గది ఏర్పాటు చేశాం.
ఇంటర్వ్యూ : ముక్కామల చక్రధర్
ఇవి కూడా చదవండి..
దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్.. సిద్ధంగా ఉండాలని పోల్ అధికారులకు ఈసీ ఆదేశం
అరుణాచల్ ప్రదేశ్, త్రిపురలో మోదీ పర్యటన
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Sep 22 , 2025 | 02:53 AM