ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Visakhapatnams AI Data Hub: గూగుల్ హబ్‌తో గ్లోబల్ మ్యాప్‌పై విశాఖ!

ABN, Publish Date - Nov 11 , 2025 | 12:50 AM

విశాఖపట్నంలో ఒక గిగావాట్‌ సామర్థ్యంతో దేశంలో తొలి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ డేటా హబ్‌ను స్థాపించడానికి 15 బిలియన్‌ డాలర్ల పెట్టుబడిని ప్రకటించిన తరుణంలో సర్వత్రా హర్షాతిరేకాలతోపాటు కొన్ని సహజమైన సందేహాలు వ్యక్తమయ్యాయి.....

విశాఖపట్నంలో ఒక గిగావాట్‌ సామర్థ్యంతో దేశంలో తొలి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ డేటా హబ్‌ను స్థాపించడానికి 15 బిలియన్‌ డాలర్ల పెట్టుబడిని ప్రకటించిన తరుణంలో సర్వత్రా హర్షాతిరేకాలతోపాటు కొన్ని సహజమైన సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇంతటి భారీ సౌకర్యం స్థానిక పవర్‌ గ్రిడ్‌పై భారం మోపదా? నీటి వనరులను హరించివేయదా? అసలు ఈ స్థాయి పెట్టుబడికి తగినన్ని ఉద్యోగాలను సృష్టించగలదా? వంటి ప్రశ్నలు సామాన్యులలోనూ నిపుణులలోనూ రేకెత్తాయి. కానీ వాస్తవాలను, సాంకేతిక అంశాలను, అంతర్జాతీయ నమూనాలను నిశితంగా పరిశీలిస్తే ఈ ఏఐ హబ్‌ ఒక భారం కాదనీ భవిష్యత్‌ తరాలకు మార్గనిర్దేశం చేసే ఒక సుస్థిర ప్రగతి నమూనా అనీ స్పష్టమవుతుంది. అందరి మదిలో మెదిలే తొలి ప్రశ్న విద్యుత్‌. కానీ ఈ ప్రాజెక్టు రూపకల్పనే ‘స్వయం సమృద్ధి’ లక్ష్యంగా జరిగింది. గూగూల్‌ సంస్థ ఈ హబ్‌ కోసం అవసరమైన విద్యుత్‌లో 80శాతాన్ని సహజ ఇంధన వనరుల ద్వారా సమకూర్చుకోనున్నది. దీనికోసం ప్రత్యేకంగా ఒక గిగావాట్‌ సామర్థ్యంతో ఒక సోలార్‌ పార్క్‌ను నిర్మిస్తోంది. ఇది మామూలు విషయం కాదు. ప్రజల అవసరాలకోసం ఉద్దేశించిన గ్రిడ్‌పై భారం మోపకుండా, ఒక పారిశ్రామిక దిగ్గజం తన సొంత హరిత ఇంధన వనరులను సృష్టించుకోవడం ఇదే ప్రప్రథమం. దీని వల్ల ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ గ్రిడ్‌పై ఈ ప్రాజెక్టు కారణంగా పడే భారం సున్న! ఇక సాంకేతిక సామర్థ్యం విషయానికి వస్తే గూగుల్‌ డేటా సెంటర్లు అద్భుతమైన పనితీరుకు మారుపేరు. విద్యుత్‌ వినియోగ సామర్థ్యానికి కొలమానమైన ‘పవర్‌ యూసేజ్‌ ఎఫెక్టివ్‌నెస్‌’ (పీయూఈ) గూగుల్‌ సెంటర్లలో సగటున 1.10శాతం. అంటే కంప్యూటింగ్‌ శక్తికి 10శాతం మాత్రమే అదనపు విద్యుత్‌ అవసరం. అదే సగటు పరిశ్రమ పీయూఈ 1.58గా ఉంది. అంటే అక్కడ కంప్యూటింగ్‌కు వాడినంత శక్తిలో 58శాతం అదనంగా వృథా అవుతోందన్నమాట. గూగుల్‌ సాంకేతికత ఎంత శక్తిని ఆదా చేస్తుందో, ఎంత పర్యావరణ భారాన్ని తగ్గిస్తోందో దీనినిబట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ 1 గిగావాట్‌ సోలార్‌ పార్క్‌ డేటా సెంటర్‌కు మాత్రమే కాదు. రాష్ట్ర రెన్యూవబుల్‌ ఎనర్జీ లక్ష్యాలకు కూడా భారీ ఊతం ఇస్తున్నది. పారిశ్రామిక ప్రగతి, పర్యావరణ బాధ్యత కలిసే సాగగలవని నిరూపిస్తోంది. నీటి వినియోగంపై కూడా ఆందోళనలు సహజం.

కానీ వాస్తవ గణాంకాలను పరిశీలిస్తే ఈ భయాలు నిరాధరమైనవని అర్థమవుతుంది. ఉదాహరణకు విశాఖ ఉక్కు కర్మాగారం రోజువారీ నీటి వినియోగం సుమారు 38 మిలియన్‌ గ్యాలన్‌లు (ఎంజీడీ). దీనితో పోల్చినప్పుడు, ఈ భారీ ఒక గిగావాట్‌ డేటా సెంటర్‌ మొత్తం వినియోగ అంచనా కేవలం 5 ఎంజీడీ మాత్రమే. అంటే ఇది స్టీల్‌ ప్లాంట్‌ వాడకంలో 15శాతం కంటే తక్కువ. ఇది కూడా గరిష్ఠ అంచనా మాత్రమే. అంతేకాకుండా విశాఖకు ఉన్న తీరప్రాంతం ఒక సహజవరంగా ఉపయోగపడనున్నది. ఈ ప్రాజెక్టులో మంచినీటి వాడకాన్ని దాదాపు సున్నాకు తగ్గించే సాంకేతికత అందుబాటులో ఉంది. ఆధునిక సముద్రపు నీటి ఆధారిత శీతలీకరణ వ్యవస్థ (సీ వాటర్‌ కూలింగ్‌)ను ఇక్కడ వినియోగిస్తారు. సముద్రపు నీటిని నేరుగా కాకుండా హీట్‌ ఎక్స్‌చేంజర్‌ల ద్వారా వేడిని చల్లార్చడానికి ఉపయోగిస్తారు. దీనివల్ల అమూల్యమైన మంచినీటి వనరులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. హైదరాబాద్‌ లేదా బెంగళూరు వంటి లోతట్టు నగరాలలో ఇలాంటి ప్రాజెక్టు వస్తే వారు ఖచ్చితంగా తాగునీటి వనరులపైనే ఆధారపడాల్సి వచ్చేది. కానీ విశాఖతీరం మనకు వ్యూహాత్మక ప్రయోజనాన్ని ఇచ్చింది. ఇవి క్లోజ్డ్‌ లూప్‌ వ్యవస్థలు, అంటే నీటిని ఒకసారివాడి వదిలేయకుండా దాన్నే శుద్ధి చేసి చల్లార్చి పదే పదే అంతర్గతంగా వినియోగిస్తారు. దీనివల్ల నీటి వృథాకు ఆస్కారం ఉండదు. ఇది స్థానిక జలవనరులపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపని ప్రణాళిక. కేవలం నిర్మాణ సమయంలోనే ఉద్యోగాలు లభిస్తాయనేది ఒక అపోహ మాత్రమే. అమెరికా డేటా సెంటర్‌ పరిశ్రమపై 2025 పీడబ్ల్యూసీ అధ్యయనం దీనికి సంబంధించిన వాస్తవాలను కళ్లకు కట్టేలా చూపింది. ఈ అధ్యయనం ప్రకారం ప్రత్యక్ష ఉపాధి 2017లో 4,00,100 నుంచి 2023 నాటికి 6,03,900 ఉద్యోగాలకు పెరిగింది. కానీ అసలు కథ ఇక్కడే ఉంది. పరోక్ష, ఉపాధిని కూడా కలిపితే ఈ పరిశ్రమ ద్వారా పొందిన ఉద్యోగాలు అదే కాలంలో 2.9 మిలియన్ల నుంచి 4.7 మిలియన్లకు పెరిగాయి. ఇది ఏడు రెట్ల ప్రభావాన్ని సూచిస్తుంది. ఈ లెక్కన విజన్‌ ఏఐ హబ్‌ ద్వారా లభించే 25వేల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు మొత్తం ఉపాధి వ్యవస్థపై చూపే ప్రభావం 2లక్షలకు పైమాటే. అతిముఖ్యమైన విషయం ఏమిటంటే– ఈ ఉద్యోగాలు తాత్కాలికం కావు. ఇక్కడ లభించే నైపుణ్యాలు (హైటెక్‌ నిర్మాణం, ఫైబర్‌ ఆప్టిక్స్‌, నెట్‌వర్క్‌ నిర్వహణ) కేవలం ఒక ప్రాజెక్టుకే పరిమితం కావు. ఇవి మొత్తం డిజిటల్‌ పరిశ్రమలకు అవసరం. 2030 నాటికి భారతదేశ డేటా సెంటర్‌ సామర్థ్యం 5–6 గిగా వాట్‌లకు చేరనుంది. ఈ దూకుడుగల పైప్‌లైన్‌కు, ఇక్కడ శిక్షణ పొందిన నిపుణులకు నిరంతరంగా జాతీయ డిమాండ్‌ ఉంటుంది. ఇక ఒక ప్రాజెక్టు కాదు.

ఒక నైపుణ్యభరిత పారిశ్రామిక శక్తికి పునాది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించిన రూ.22వేల కోట్ల ప్రోత్సాహకాలను కొందరు ఉచితాలుగా తప్పుగా అన్వయించుకుంటున్నారు. ఇది ఉచితం కాదు. రాష్ట్ర భవిష్యత్తుపై పెట్టిన వ్యూహాత్మక పెట్టుబడి. దీని ద్వారా రాబోయే ప్రతిఫలం అపారమైనది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అంచనాల ప్రకారమే ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తికి (జీఎస్‌డీపీ) ఏటా రూ.10,518 కోట్లు అదనంగా సమకూరనుంది. అంటే కొన్ని సంవత్సరాలలోనే ప్రోత్సాహకాల విలువ తిరిగి రాబడుతుంది. ఇది కేవలం సిద్ధాంతం కాదు. ప్రపంచవ్యాప్తంగా నిరూపితమైన నమూనా. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు వ్యూహాత్మక ప్రోత్సాహకాలను ఇచ్చి దీర్ఘకాలిక, అధిక విలువగల రాబడిని పొందుతున్నాయి. మన రాష్ట్రం అనుసరిస్తున్నదీ అదే విజయవంతమైన మార్గం. డేటా సెంటర్ల రాక కేవలం సాంకేతిక పెట్టుబడి కాదు. అది ఒక సంపూర్ణ ప్రాంతీయ పరివర్తనకు నాంది పలుకుతుంది. ప్రపంచవ్యాప్త ఉదాహరణలే ఇందుకు సాక్ష్యం. అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో యాష్‌బర్న్‌ పట్టణం చుట్టుపక్కల ప్రాంతాల్ని డేటా సెంటర్‌ అల్లీ (డేటా సెంటర్ల వీధి) అని పిలుస్తారు. యూరప్‌లోని డబ్లిన్‌ (ఐర్లాండ్‌) వంటి ప్రాంతాలలో ఈ హైపర్‌స్కేల్‌ సౌకర్యాలు వచ్చిన ఐదేళ్లలోనే రియల్‌ఎస్టేట్‌ విలువ 25శాతం నుంచి 40శాతం వరకు పెరిగాయి. ఇది కేవలం నివాస గృహాలకు పరిమితం కాదు. దానికి అనుబంధంగా కొత్త లాజిస్టిక్‌ పార్క్‌లు, సేవారంగ సంస్థలు, హాస్పిటాలిటీ (హోటళ్ళు), మౌలిక సదుపాయాలు వేగంగా విస్తరించాయి. విశాఖపట్నం కూడా ఇదే తరహా పరివర్తనకు సిద్ధమవుతోంది. ఈ ఏఐ హబ్‌, దానికి అనుబంధంగా వస్తున్న సబ్‌ సీ కేబుల్‌ ల్యాండింగ్‌ స్టేషన్‌తో కలిసి వాణిజ్య, నివాస విస్తరణకు, పర్యాటక రంగానికి, మౌలిక సదుపాయాల ఆధునికీకరణకు భారీ ఊతం లభిస్తుంది. ఇది తీరప్రాంత ఆంధ్రప్రదేశ్‌కు పూర్తిస్థాయిలో పట్టణ, ఆర్థిక ఉన్నతిని అందిస్తుంది. 80శాతం సంప్రదాయేతర ఇంధనం (రెన్యూవబుల్‌ ఎనర్జీ), ఉక్కు కర్మాగారం వాడకంలో 15శాతంకన్నా తక్కువ నీటి వినియోగం, ఏటా రూ.10,500 కోట్లకుపైగా జీఎస్‌డీపీకి ఆదాయం, లక్షలాదిమందికి నిరంతర నైపుణ్య ఉపాధి, పూర్తిస్థాయిలో రియల్‌ ఎస్టేట్‌ పరివర్తన... ఇవన్నీ చూశాక కూడా ఇది వనరుల హరణం అని చెప్పగలమా? దీనిని విజయవంతంగా అమలుచేస్తే విశాఖపట్నం కేవలం ఒక డేటా సెంటర్‌కు ఆతిథ్యం ఇవ్వడమే కాదు, ప్రపంచానికి భారతదేశ డిజిటల్‌ ముఖద్వారంగా సగర్వంగా నిలుస్తుందని చెప్పవచ్చు.

-రవికుమార్‌ ఈటంశెట్టి సీఈఓ, టైర్‌ ఎక్స్‌ డేటా సెంటర్‌ సొల్యూషన్స్‌, బెంగళూరు

Updated Date - Nov 11 , 2025 | 12:50 AM