Gurajada Apparao:: ఇది దిద్దుబాటుకు వొల్లగాని దేశం బావూ
ABN, Publish Date - Nov 30 , 2025 | 05:29 AM
నా చిన్నపుడు మా ఊరిలో ఎడ్ల పోతినాయుడు అనే పెద్దాయన ఉండేవాడు. నెత్తి మీద జుట్టు నుంచి మూతి మీద మీసం దాక తెల్లగా పండిపోయినాయి. మనిసీ తెల్లగా ఉండీవోడు. తెల్లటి లాల్చీ, పంచే కట్టుకునేవోడు....
నా చిన్నపుడు మా ఊరిలో ఎడ్ల పోతినాయుడు అనే పెద్దాయన ఉండేవాడు. నెత్తి మీద జుట్టు నుంచి మూతి మీద మీసం దాక తెల్లగా పండిపోయినాయి. మనిసీ తెల్లగా ఉండీవోడు. తెల్లటి లాల్చీ, పంచే కట్టుకునేవోడు. ‘బాపనోళ్ళ ఇంటిల పుట్టవొలసినోడు, కాపోడి ఇంటిల పుట్టినాడు’ అని మా ఊరి జెనాలు నొచ్చుకునేవోరు. పోతినాయుడు అదేటీ పట్టించుకునేవాడు కాదు, ఊరి జెనాలకి యేవేవో దిద్దుబాట్లు చెప్పేవాడు. మొగుడూ, పెళ్ళాలను జగడాలు ఆడొద్దని, వయసు మాయకు కుర్రకారుని లోబడొద్దని, రైతుల్ని పొలాలు వొదిలేసి, మార్కెట్లంట తిరగొద్దని, ఎవురికీ అపకారం సెయ్యొద్దని, కుదిరితే ఉపకారం సెయ్యమని... సుద్దులు సెప్పీవోడు. ఎందరు అతగాని సుద్దులు యిని, బతుకులు దిద్దుబాటులు చేసుకున్నారో నేను లెక్కెయ్యలేదు, అంత వొయసు కాదు నాది.
ఇపుడు మా ఊరిల పోతినాయుడు లేడు. చిన్న నాటి ఊరు మారిపోనాది. పూరిల్ల వాసాలు, ప్రహరీల గేట్లతోటి డాబాలయినాయి. కట్టు, బొట్టు మారింది. భూమ్మీద పంటకి ధర తగ్గి, భూమికి ధర పెరిగింది. ఊరి చుట్టూ, ఉరిలోకీ ఆఫీసులు, కంపెనీలు, కాన్వెంట్లు కొత్తవేవేవో రాక! ఉపిరి ఆడక ఎందరో ఎక్కడెక్కడికో వలస పోక! చెప్పొచ్చేదేటంటే– ఒక మారుమూల పల్లెలోని ప్రజలకే... జీవితానుభవం పండిన ఒక పెద్దమనిసి చెప్పిన దిద్దుబాటు సుద్దులు జీర్ణం కాకపొతే, లోకం మొత్తానికి దిద్దుబాటు సుద్దులు చెపితే జీర్ణమవుతాయా... అప్పారావు బావూ? పోతినాయుడు కంటే నీకు మీసాలు పెద్దవి ఉండొచ్చు. నువ్వు పెద్ద చదువులు చదివి ఉండొచ్చు. నువ్వు పెద్ద ఇంటిల పుట్టి ఉండొచ్చు. పెద్ద కోటల కొలువు చేసుండొచ్చు గానీ, గురువా గురజాడా! లోకం సేనా పెద్డ్డది. నీ దిద్దుబాటు సుద్దులు దానికి అజీర్ణం.
తప్పుదోవల నడిచే పురుషుడ్ని నువ్వు దిద్దుబాటు చేసుకోమన్నావు. ఇపుడసలు రెండు దోవలు లేవు, ఉన్నదొకటే దోవ. అది తప్పుడు దోవ. ఆడోరిని అర్దరేతిరి తిరగొద్దని, అందమైన బట్ట్లేసుకోవొద్దని, వొంట గది దాటవొద్దని శాసిస్తున్నాడు. శాసనాలను దిద్దుబాటు కాదు, చెరిపేయాల. అప్పుడు గానీ నీ సుద్దులు అమలు కావు. ‘మతములన్నియు మాసిపోవున్, జ్ఞానమొక్కటి నిలిచి వెలుగున’ని అన్నావుగానీ, అగ్యానం రాజ్యమేలతాంది బావూ. ఒక ఊరిలోని దేవుని మాన్యానికీ, దద్దోజినం, పులిహోరలకే శరబయ్యలు, ఆచార్లూ అంతలేసి అగ్గిగుండాలు లేపారని రాసినావే... ఇపుడు దేశమంతా దేవుడి మాన్యమే. పీరుసాయిబులూ, నాంచారమ్మలూ నిప్పులగుండం చేసారు దేశాన్ని. ఆ దేవుళ్ళని పీనుగులన్నావు గానీ ఇపుడు మనుషుల్ని పీనుగులు చేస్తన్నారు. తగలేసే దారి చెప్పు బావూ.
కళలు అన్నీ నేర్చుకొని దేశీ సరుకులు నింపమన్నావు... అన్ని కళలు నేర్చుకొని బతుకులేక జెనం ఎన్నో దేశాల దిమ్మరులయితే, నేతలేమో విదేశీ సరుకులు నింపమని ప్రెపంచకమంతా తిరగతన్నారు. దేశమనేది పాత మాట. విశ్వం అనేది నేటి మాట. విశ్వవిపణిలో మాయలఫకీరు చేతిలో పక్షి దేశమిపుడు. విశ్వవిపణికి విరుగుడు కావాలి తండ్రీ. దేశమంటే మట్టికాదోయ్... దేశమంటే మనుషులోయ్ అని ఎవురి మీద కోపంతో అన్నావో గానీ, నీ మాట విని యెంత నష్టపోయామో గదా అని నొచ్చుకుంటన్నారు నేతలు. కొండలు, కోనలు, అడవులు, పొలాలు, ఆటిలోని ఔషధాలు, పంటలు, గనులు, ఖనిజాలు... సముద్రాలు ఆటి జలాలు... ఇసక దానిలోని ఖనిజాల గురించి ఎందుకు చెప్పలేదని, అవేవీ ముఖ్యం కావని, మనుషులే ముఖ్యమని అన్నందుకు నువ్వు లేవుగానీ, ఇపుడు గానీ వుంటే రాజద్రోహం కాదు, దేశద్రోహం కేసు ఎడుదురు నేతలు. సౌజన్యారావు వకీలయినా నిన్ను కాపాడలేడు. తిండి తినమని, ఈసురోమని ఉండొద్దని ఎన్నెన్నో సుద్దులు చెప్పావు గానీ, దిద్దుబాటుకు వొల్లగాని దేశమిది. బుచ్చెమ్మను గిరీశాలు దేశదేశాలు తిప్పతన్నారు. సౌజన్యారావు చాలడు, మధురవాణి మంత్రాంగం చెల్లదు. గురజాడా– నీ పాత్రలేవీ ఈ మాయను ఛేదించలేవు. నీ కలానికి అందని రైతులు, కూలీలు, కార్మికులు, ఆదివాసులు, దళితులూ కలగలసిన బహుజన ప్రస్థానం సాగాల, అది ఈ దేశాన్ని దిద్దుబాటు సెయ్యాల. ఏటంటావు అప్పారావు బావూ?
అట్టాడ అప్పల్నాయుడు
(నేడు గురజాడ వర్ధంతి)
ఈ వార్తలు కూడా చదవండి..
టీటీడీ కల్తీ నెయ్యి కేసులో మరో కీలక పరిణామం
భూములు అమ్ముకునేందుకు ప్లాన్ చేశారు.. సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు షాకింగ్ కామెంట్స్
Read Latest Telangana News And Telugu News
Updated Date - Nov 30 , 2025 | 05:29 AM