Todays Criticism Without Standards:ప్రమాణాల్లేని నేటి విమర్శ
ABN, Publish Date - Nov 03 , 2025 | 04:38 AM
కవి లేదా రచయిత తీసుకున్న వస్తువు అందరిచేత ఆమోదం పొందాలని భావించి రచనకు పూనుకుంటాడు. ఎక్కువమంది పాఠకులు దాన్ని ఆమోదించినప్పుడు ఆ రచన విలువ పెరుగుతుంది...
కవి లేదా రచయిత తీసుకున్న వస్తువు అందరిచేత ఆమోదం పొందాలని భావించి రచనకు పూనుకుంటాడు. ఎక్కువమంది పాఠకులు దాన్ని ఆమోదించినప్పుడు ఆ రచన విలువ పెరుగుతుంది. ఆ విలువను ఖరారు చేయగలిగిన వాడు విమర్శకుడు. విమర్శకుడు ఒక రచనను అంచనా వేయడంలో సాహిత్య విలువలను, సామాజిక విలువలను దృష్టిలో ఉంచుకోవాలి. ఒక రచనను విమర్శ చేసే సందర్భంలో విమర్శకుడు ఏ ప్రలోభాలకు లొంగని న్యాయమూర్తి పాత్ర పోషించాలి. రచనని ఆకాశానికి ఎత్తేస్తూ వ్యాసం రాయడం విమర్శ కాదు. రచనను పాతాళానికి తోసేస్తూ మాట్లాడటమూ విమర్శ కాదు. ప్రతి రచనా ప్రభావవంతంగా ఉండాలని రచయితలు ఆశిస్తారు. కొన్ని సందర్భాల్లో రచన ప్రభావంతంగా లేనప్పుడు, రచయిత ఉన్నతిని కోరుకునే విధంగా విమర్శకుడి భాష ఉండాలి. గత పదిహేను సంవత్సరాలుగా తెలుగు విమర్శను పరిశీలించినప్పుడు సరికొత్త సిద్ధాంతాల ప్రకటనలు ఏమీ లేవని అర్థమవుతుంది. కేవలం మార్క్సిస్టు విమర్శ, ద్రవాధునికత, పోస్ట్ మోడర్నిజం ప్రాతిపదిక మీదగా మాత్రమే చాలామంది విమర్శకులు వ్యాసాలు రాస్తున్నారు. ఆ వస్తున్న వ్యాసాల్లోనూ సారం తక్కువ. ఈ కాలపు సాహిత్య విమర్శలో కేవలం విశ్లేషణ మాత్రమే మనం చూస్తున్నాం. మరి కొంతమంది కేవలం లోపాలు చెప్పడం మాత్రం విమర్శ అనే భ్రమలో ఉన్నారు. ఏదైనా ఒక విమర్శను చేసినప్పుడు అందులో విమర్శకుడు తన పరికరాలు ఏమిటో, నిరూపణలు ఏమిటో చెప్పాలి. సాహిత్య విమర్శలలో వివరణలు ఉండవచ్చు. విశ్లేషణ ఉండవచ్చు. వివేచన ఉంటుంది. సమన్వయం ఉంటుంది. మూల్యాంకనము ఉంటుంది. ఇట్లాంటి లక్షణాలు కలిగిన విమర్శకులు రావాలి. సాహిత్య వికాసంలో విమర్శ ఒక భాగం. ఒక కవిత సంపుటిని లేదా కవిత్వాన్ని విలువ కట్టడానికి ఇవాళ విమర్శకులు కొత్త ప్రమాణాలను రూపొందించినట్లు కనబడదు.
కేవలం వస్తువు, భాష, అభివ్యక్తి, శిల్పం ఈ నాలుగు మాటలతో వ్యాసం రాస్తే అది విమర్శ అని సాహిత్య లోకంలో ఇప్పుడు చెలామణిలో ఉంది. గతంలో విమర్శకులు ఒక రచనను అంచనా వేసే క్రమంలో కొన్ని ప్రమాణాలను, సిద్ధాంతాలను పాటించే వారు. కట్టమంచి రామలింగారెడ్డి దగ్గర నుంచి త్రిపురనేని మధుసూదన రావు వరకు విమర్శ పద్ధతిగా సాగింది. ఆ తర్వాత వచ్చిన అనేకమంది విమర్శకులు ఆ పునాదిగా మాట్లాడారు కానీ కొత్త సిద్ధాంతాలను ప్రకటించడం లేదా సరికొత్త పరికరాలను అన్వేషించడం చేయలేదు. ప్రాచీన సాహిత్యాన్ని అంచనా వేయడానికి అనేకమంది తెలుగు విమర్శకులు పూనుకుని ప్రణాళిక ఇచ్చారు. ఆ తర్వాత అభ్యుదయ సాహిత్య విమర్శ, దళితవాద విమర్శ, స్త్రీవాదవిమర్శ, ప్రాంతీయవాదం వీటిల్లో కూడా కొంతమేర కృషి జరిగింది. ప్రపంచీకరణ ప్రభావం కూడా విమర్శలో కనిపించింది. జి. లక్ష్మీనరసయ్య దళిత కళాతత్వ విమర్శ లోనూ దేశీయ మార్క్సిజం ఆలోచన చేశారు. మేడిపల్లి రవికుమార్ తనదైన కోణాల నుంచి విమర్శ చేశారు కానీ ఆయన ఎక్కడ దాన్ని సమగ్రంగా రాత రూపంలో తీసుకు రాలేదు. పాపినేని శివశంకర్ ద్రవాధునికత మీద మాట్లాడారు. రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి మార్క్సిస్ట్ పునాదుల మీద మాట్లాడారు. తిరుపతి రావు ఆధునికోత్తరవాదం గురించి చర్చించారు. సీతారాం పర్యావరణ కోణంలో సాహిత్య విమర్శకు కృషి చేస్తున్నారు. అయితే ఈ కాలంలో విమర్శ పరిస్థితి ఏంటి? విమర్శకుడు అనే భ్రమలో వ్యాసాలు రాస్తున్న వాళ్ళ పరికరాలు ఏమిటి? తమవైన సిద్ధాంతాల ప్రాతిపదిక ఏమైనా ఉందా? సాహిత్య విమర్శకి సిద్ధాంత భూమిక వుండి తీరాలి. అప్పుడే కళకి సంబంధించిన లోతులనీ ఎత్తులనీ విశ్లేషణ చేయగలం. ఇందుకు భిన్నంగా తక్షణ స్పందన కోసం విమర్శ పేరుతో సామాజిక మాధ్యమాలలో వ్యాసాలు రాయడం చూస్తున్నాం. ఒక రచన మీద స్పందన విమర్శ రూపంలో తెలపడం తప్పు కాదు గానీ, మాట్లాడుతున్న వారి భూమిక ఏంటో స్పష్టంగా తెలియాలి. తీవ్రమైన అధ్యయనం తర్వాత మాత్రమే విమర్శ రంగంలోకి అడుగు పెట్టాలి. మారుతున్న సమాజంలో సామాజిక మాధ్యమాల్లో వస్తున్న విమర్శను కూడా మనం స్వీకరించాలి. ఐతే అది విమర్శ అయి ఉండాలి. కువిమర్శ కాకూడదు. సమీక్ష పాఠకుడిని రచన దగ్గరకు తీసుకెళ్లగలదు. కానీ విమర్శ రచనని పాఠకుల లోపలికి తీసుకెళ్లగలగాలి. మారుతున్న సామాజిక విలువలను, మానవ సంబంధాల్లోని అసమతుల్యతను మన సాహిత్యం కళాత్మకంగా చిత్రీకరించగలుగుతుందా లేదా వంటి పరిణామాల మీద విమర్శకుడు దృష్టి పెట్టాలి. విమర్శకుడు రచన కంటే ముందుండాలి. గత పదిహేను సంవత్సరాలుగా దేశంలో రాష్ట్రంలో జరిగిన అనేక పరిణామాలను సాహిత్యం చిత్రీకరించగలిగిందా? కేవలం సాహిత్య విలువలు కలిగిన రచనలు మాత్రమే వచ్చాయా? సాహిత్యంలో సమాజం ఎట్లా ప్రతిబింబించింది? సౌందర్యాత్మక రచనల ప్రతిఫలనాలు ఏమిటి? ఈ కాలపు విమర్శకులు ఎట్లాంటి సాధనాలతో అంచనా వేయగలిగారో, వేయగలరో చూడాలి. సృజన ఉంటేనే విమర్శ. ఒక కాలపు సృజన లేదా ఒక రచయిత సృజన ఆధారంగానే విమర్శ పరికరాలను సిద్ధం చేసుకోవాలి.
సుంకర గోపాలయ్య & 94926 38547
Updated Date - Nov 03 , 2025 | 04:38 AM