పదకొండేళ్లుగా పరిగెడుతున్న పురోగతి
ABN, Publish Date - Jun 11 , 2025 | 06:14 AM
మన దేశ ఆర్థిక వ్యవస్థ 2014కి ముందు నత్తనడక నడిచేది. సరైన విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకపోయేవి. ఎక్కడ చూసినా అవినీతి, దిగజారిన శాంతిభద్రతలు, నిర్భయ వంటి ఘటనలు, నక్సల్స్ విధ్వంసం, కశ్మీర్‌లో...
మన దేశ ఆర్థిక వ్యవస్థ 2014కి ముందు నత్తనడక నడిచేది. సరైన విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకపోయేవి. ఎక్కడ చూసినా అవినీతి, దిగజారిన శాంతిభద్రతలు, నిర్భయ వంటి ఘటనలు, నక్సల్స్ విధ్వంసం, కశ్మీర్‌లో రాళ్ల దాడులు, తెలుగు రాష్ట్రాల్లో విభజన చిచ్చుతో మంటలు. 2025 నాటికి– మన దేశం ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది. ఆరోగ్య, సాంకేతిక విద్యలో ప్రపంచస్థాయి ఇన్‌స్టిట్యూట్స్ వెలిశాయి. పరిశ్రమలు, పెట్టుబడులు వెల్లువలా వచ్చిపడ్డాయి. అవినీతి తగ్గిపోయింది. దేశవ్యాప్తంగా అద్భుతమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి జరిగింది. కశ్మీర్ సమస్య, అయోధ్య సమస్యలు పరిష్కారమయ్యాయి. నక్సల్ ఉద్యమం చివరి దశకు చేరింది. విభజిత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా వేగంగా పయనిస్తున్నది. ఆశల్లేని స్థితి నుంచి జీవం పోసి పరుగులు పెట్టించే శక్తి వల్లనే గత పదకొండేళ్ళలో ఈ మార్పు సాధ్యమైంది. ఆ శక్తి ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ). దేశంలో ఎన్డీఏ పాలనకు 11 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2014–18 మధ్య ఎన్డీఏ పాలనలో పోలవరం ప్రాజెక్టు ఊహించని పురోగతి సాధించింది. 2019 నాటికి పోలవరం పనులు 72 శాతం పూర్తయ్యాయి. దీనికి కారణం డబుల్ ఇంజిన్ సర్కార్. తర్వాత ఐదేళ్ళ వైసీపీ పాలనలో జరిగిన పనులు 3.84శాతం మాత్రమే. ఇప్పుడు గత ఏడాదిలో డబుల్ ఇంజిన్ పాలనలో జరిగిన పనులు 5.93శాతం. ఐదేళ్లలో జరిగిన పనుల కన్నా ఏడాదిలో జరిగింది చాలా ఎక్కువ. ఒక్క పోలవరం మాత్రమే కాదు, డబుల్ ఇంజిన్ పాలనలో అమరావతి నిర్మాణం పరుగులు పెట్టింది. మళ్లీ ఇప్పుడు ఆ వేగం కనిపిస్తోంది. పదకొండేళ్ల మోదీ పాలనలో భారత పురోగతి అంకెల్లో చెప్పుకుంటే ఇంత పురోగమించామా అని మనం ఆశ్చర్యపోతాం. 2014లో భారతదేశ నామినల్ జీడీపీ సుమారు 2.1 ట్రిలియన్ యూఎస్ డాలర్లు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో నామినల్ జీడీపీ సుమారు 4.3 ట్రిలియన్ యూఎస్ డాలర్లు. పదకొండేళ్లలో జీడీపీ రెట్టింపు అయింది. జపాన్‌ను అధిగమించి భారతదేశం ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది.
‘పర్చేసింగ్ పవర్ పారిటీ’ (PPP) ఆధారంగా, భారతదేశం ప్రపంచంలో చైనా, అమెరికాల తర్వాత మూడవ స్థానంలో ఉంది. అదే పదకొండేళ్ల కిందట భారత్ స్థానం 20! భారత్ విదేశాంగ విధానం ఎంత బలంగా ఉందో పాకిస్తాన్‌పై ఆపరేషన్ సిందూర్ నిరూపించింది. పాకిస్థాన్‌కు చైనా, టర్కీ మద్దతు తెలిపాయి. అంతమాత్రానికే ఆ దేశానికి ప్రపంచమంతా అండగా ఉందని మన దేశంలో ఉంటూ మన దేశానికే వ్యతిరేకంగా మాట్లాడేవారు చెబుతూ ఉంటారు. కానీ భారత్ సూపర్ పవర్‌గా ఎదిగితే తమ ఆధిపత్యానికి భంగం కలుగుతుందని భయపడే దేశాలు, మతమౌఢ్యం ఎక్కువగా గల దేశాలు మాత్రమే పాకిస్థాన్‌కు మద్దతు పలికాయి. మిగతా ప్రపంచం అంతా పహల్గాం దాడిని ఖండించింది. ఆపరేషన్ సిందూర్‌ను అభినందించింది. అంతర్జాతీయంగా భారత్ ఇమేజ్ పెరగడానికి ముఖ్య కారణం అంతర్గత అభివృద్ధి. అన్ని రాష్ట్రాలు కలిస్తేనే భారతదేశమనే స్ఫూర్తిని టీమ్ ఇండియాగా భావించిన ప్రధానమంత్రి మోదీ అన్ని రాష్ట్రాలు సమానంగా అభివృద్ధి చెందేలా పదకొండేళ్లుగా సమర్థవంతమైన పాలన అందిస్తున్నారు. ఈ పదకొండేళ్ల కాలంలో దేశంలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందాయి. భారత్‌మాల పరియోజన ద్వారా సుమారు 50వేల కిలోమీటర్ల జాతీయ రహదారులు నిర్మించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా 550 జిల్లా కేంద్రాలను నాలుగు–లేన్ హైవేల ద్వారా అనుసంధానించారు. భారతదేశ తీరప్రాంత మౌలిక సదుపాయాల ఆధునీకరణ, కొత్త ఓడరేవుల నిర్మాణం, తీర ఆర్థిక మండళ్ల అభివృద్ధి కోసం లక్షల కోట్లు ఖర్చు చేశారు. 1,386కి.మీ పొడవైన ఢిల్లీ, ముంబై ఎక్స్‌ప్రెస్ హైవేను లక్ష కోట్లతో పూర్తి చేస్తున్నారు. ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్, చినాబ్ బ్రిడ్జి వంటి ఇంజనీరింగ్ అద్భుతాలు ఇందులో ఉన్నాయి. దేశం పురోగతికి అభివృద్ధి ఎంత ముఖ్యమో ప్రజా సంక్షేమం కూడా అంతే ముఖ్యం. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 2025 నాటికి 3 కోట్ల అదనపు ఇళ్లను నిర్మిస్తోంది. 25 కోట్ల మంది పేదలకు గృహభద్రతను అందిస్తుంది. స్వచ్ఛ భారత్ అభియాన్ ద్వారా 2024 నాటికి దేశవ్యాప్తంగా 10 కోట్లకు పైగా గృహాలకు టాయిలెట్లు నిర్మించారు.
ఆయుష్మాన్ భారత్ యోజన ద్వారా 2024 నాటికి 10 కోట్లకు పైగా కుటుంబాలు లబ్ధి పొందాయి. ఆరోగ్య ప్రమాణాలు పెంచుకున్నాయి. ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన పథకం ద్వారా 2024 నాటికి 10 కోట్లకు పైగా ఎల్‌పీజీ కనెక్షన్‌లు అందించారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 2024 నాటికి 12 కోట్లకు పైగా రైతులకు రూ.2.5లక్షల కోట్లకు పైగా నేరుగా బదిలీ చేశారు. ‘నేషన్ ఫస్ట్’ నినాదంతో దేశాన్ని ప్రపంచం స్థాయి శక్తిగా మార్చే లక్ష్యంతో పాలన సాగిస్తే ఎన్ని అద్భుతాలు చేయవచ్చో ఈ పదకొండేళ్ల ప్రధాని మోదీ పాలనలో ఋజువైంది. ఇదే వేగంతో, దార్శనికతతో ముందుకు సాగితే వచ్చే దశాబ్దంలో భారత్ ప్రపంచాన్ని శాసిస్తుంది.
ఎస్. విష్ణువర్థన్ రెడ్డి
బీజేపీ ఉపాధ్యక్షుడు, ఏపీ
ఇవి కూడా చదవండి
ఎమ్మెల్యే రాజా సింగ్ మళ్లీ హాట్ కామెంట్స్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్
Read latest AP News And Telugu News
Updated Date - Jun 11 , 2025 | 06:14 AM